అంతా పరమాచార్య అనుగ్రహం
మా పాట్టి (బామ్మ) పరమాచార్య స్వామివారికి భక్తురాలు. మఠం అందరూ తనని ‘దేవకొట్టై ఆచి’ అని పిలిచేవారు. ఆమె గురించి తెలియని వారు ఎవరూలేరు. ఆవిడ మాకు ఒక మార్గదర్శిలా మమ్మల్ని నడిపింది. కేవలం ఆవిడ వల్లనే చాలా చిన్నతనం నుండే మాకు శ్రీమఠంతో సంబంధం ఉండేది. ఇది నాకు కలిగిన భాగ్యం అని తలుస్తాను. మా పాట్టిని నేను ఎప్పటికి మరచిపోను. పరమాచార్య స్వామివారు చెప్పేవారు, ‘మనకు ఎవరైనా మంచి చేస్తే లేదా సహాయం చేస్తే, మనం ఎప్పటికి కృతజ్ఞతను మరచిపోరాదు’. ఈ మాటలను స్వామివారు చెబుతున్నప్పుడు నేను విన్నాను. నాకు ఎనిమిది సంవత్సరాల వయస్సప్పటి నుండి నేను శంకర మఠంకి వస్తున్నాను. మా బామ్మ నన్ను అక్కడకు తీసుకునివెళ్ళేది.
పరమాచార్య స్వామివారు, జయేంద్ర సరస్వతి స్వామివారు ఇలయత్తాంగుడిలో మకాం చేస్తున్నప్పుడు, మా బామ్మ ప్రతీ శుక్రవారం ఒక బ్రాహ్మణ బాలుడిని కండకావేరి చెరువులోని కమలాలను కోయమని చెప్పి, వాటిని రెండు బుట్టలలో పెట్టుకుని, వాటిని తీసుకురమ్మని ఆ పిల్లాడికి చెప్పి, నన్ను మా పిన్ని కొడుకు అళగప్పన్ ని (ఇప్పుడు వాడిని బామ్మ దత్తత తీసుకుంది) వెంటబెట్టుకుని వెళ్లి, ఆ పూలను ఇలయత్తాంగుడిలో పూజలో సమర్పించి, పూజ తరువాత ఇద్దరు ఆచార్యుల దర్శనం చేసుకుని, తరువాత నైవేద్యం పెట్టిన చక్కర పొంగలిని మాకు పెట్టేది; అందులోనుండి నెయ్యి అలా కారుతూ ఉండేది. మేము చెరువు గట్టున ప్రసాదాన్ని ఆరగించి, చివరి బస్సు పట్టుకుని దేవకొట్టై వెళ్ళిపోయేవాళ్ళం.
ఆ రోజులని ఎప్పటికి మరచిపోలేను. అక్కడ శ్రీమఠం మకాం ఉన్నన్నిరోజులూ అక్కడి ప్రజలకు, మాకు మనస్సు నిండిపోయింది. అది పరిపూర్ణ ఆనందం. ఈ భువిపై అటువంటి నడిచే దైవం ఉండడం ఈ ప్రపంచ ప్రజలు చేసుకున్న అదృష్టం. ఈ భువిపై ఆ దైవం ఉన్నప్పుడు మేము కూడా ఉన్నామన్న భావన అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది.
మరొక సందర్భంలో ఇద్దరు ఆచార్యులు కార్వేటినగరంలో మకాం చేస్తున్నారు. అప్పటికి నాకు వివాహం అయ్యింది. నేను, నా భర్త, మా నాన్నగారు మరియు పాట్టి - మేమందరమూ అక్కడికి వెళ్లి వారంరోజులు ఉన్నాము. అక్కడ ఒక కొలను ఉంది. గట్టుపై ఒక పాక నిర్మించారు. పూజ అయిపోయిన తరువాత మహాస్వామివారు అక్కడకు వచ్చి దర్శనం ఇచ్చేవారు. ప్రశాంతమైన ప్రదేశం. అక్కడకు వచ్చిన భక్తులతో స్వామివార్లు మాట్లాడేవారు. మేము ఆ సంభాషణలను వింటుండేవాళ్ళం. (మేము అక్కడకు వెళ్ళినప్పుడు నా మనస్సు స్థిమితంగా లేదు). అక్కడ సమయం ఎలా గడిచిపోయేదో తెలిసేది కాదు. ఎన్నో మంచి విషయాలను మాట్లాడుతూ, వాటిని హాస్య సంభాషణలుగా మలచేవారు. వారంరోజుల పాటు వారి మాటలను విన్నాను; ఫలితంగా నా మనస్సుకు శాంతి కలిగింది.
మా బంధువులందరి ఇళ్ళల్లోని పూజ గదిలో స్వామివారికోసం ఒక ప్రత్యేక హుండి ఉండేది. ఇంటి ఖర్చులతో మొదలుకుని ప్రతి సందర్భంలోనూ స్వామివారిని తలచుకుని అందులో డబ్బులు వేసి, పని మొదలుపెట్టేవాళ్ళం. శ్రావణ మాసంలో ఆ హుండి డబ్బులను సేకరించి, భిక్షావందనానికి శంకర మఠానికి వెళ్ళినప్పుడు అక్కడ జమ చేసేవాళ్ళం. దాంతోపాటు మా బంధువులందరూ చిన్న మొత్తాల్లో ఇచ్చిన డబ్బుతో కలిపి మేమి భిక్షావందనం చేశాము. తరువాత బామ్మకు వయసైపోయింది. తను అందరి వద్ద హుండి డబ్బులు సేకరించి, అదనంగా ఇచ్చే డబ్బును చేర్చి దాంతో భిక్షావందనం నిర్వహించేది.
బామ్మ ఒక వారం ముందరే అక్కడకు వెళ్లి ఏర్పాట్లు చేసేది. తనకు చాలా వయసైపోయిన తరువాత, మహాస్వామివారితో, “నేను ముసలిదాన్నైపోయాను. నేను కొద్దిగా ధనం సేకరించి మఠంలో జమ చేస్తాను. ఇందులోకి దేవకొట్టై నగరత్తార్ లను కూడా చేర్చుకోవచ్చా?” అని అడిగింది. స్వామివారు అందుకు అంగీకరించారు. తరువాత బామ్మ ధనాన్ని సేకరించి మఠంలో సమర్పించింది. అప్పటినుండి క్రమం తప్పకుండా ఆగష్టు 30న ‘దేవకొట్టై నగరత్తార్ భిక్షా వందనం’ జరుగుతోంది. మా బామ్మ వల్లనే మాకు ఈ అదృష్టం కలిగింది. ఇప్పుడు మా బామ్మ లేదు. కాని తను ఏర్పాటు చేసినవన్నీ ఇప్పటికీ జరుగుతున్నాయి. మా బామ్మ తన మనవళ్ళు మనవరాళ్ళను శ్రీమఠానికి దగ్గర చేయడం ఎప్పటికి మరచిపోలేని విషయం.
మా బామ్మ ఒకసారి మహాస్వామి వారి దర్శనం కోసం కాంచీపురానికి వెళ్ళింది. తను స్వామివారితో మాట్లాడేటప్పుడు, స్వామివారు మా పాట్టితో, “కాంచీపురంలో ఎన్నో శివలింగాలు ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నాయి. ఆ ఎండ వానల నుండి రక్షణగా వాటికి ఒక చిన్న దేవాలయం నిర్మించి, రోజుకు ఒక్కపూట నైవేద్యానికి ఏర్పాటు చెయ్యాలి; అవకాశం ఉన్నవారు దీన్ని చెయ్యాలి” అని చెప్పారని బామ్మ మాతో చెప్పింది. తరువాత స్వామివారు మా బామ్మను పిలిచి, “నువ్వు ఒక దేవాలయం నిర్మించు” అని ఆదేశించారు. అందుకు మా బామ్మ, “దేవాలయం నిర్మించమని నా మనవరాలిని అడుగుతాను. బహుశా మూడువేల రూపాయలు అవ్వొచ్చు” అని చెప్పింది. తరువాత కాంచీపురం నుండి చేన్నిలోని మా ఇంటికి వచ్చి, స్వామివారు చెప్పిన విషయాలను మాకు తెలిపింది.
నేను అందుకు సరే అని చెప్పి ఆ విషయాన్ని పూర్తిగా మరచిపోయాను. రెండేళ్ళు గడిచిపోయాయి. బామ్మ తరచుగా కాంచీపురం వెళ్తోంది. అలా ఒకసారి స్వామివారి దర్శనం చేసుకుని, పూజ అయిపోయిన తరువాత ఫలహారం కోసమని దగ్గరలోని హోటలుకు వెళ్ళింది. స్వామివారు దగ్గర ఉన్న ఒక సేవకుడితో, “ఆచి ఎక్కడ ఉంది? ఆమెను పిలువు” అని తెలిపారు. ఫలహారం చెయ్యడానికి ఆచి హోటలుకు వెళ్లిందని చెప్పి, అక్కడకు వెళ్లి ఆచితో, “ఆచి అమ్మ, పరమాచార్య స్వామివారు పిలుస్తున్నారు” అని చెప్పాడు. ‘నన్ను ఎందుకు పిలిచారబ్బా’ అని పాట్టి పరుగుపరుగున వచ్చింది.
తను వచ్చి స్వామివారిని కలవగానే, “దేవాలయం నిర్మిస్తానని తెలిపావు కదా! అది ఏమైంది?” అని అడిగారు స్వామివారు. రెండేళ్ళు గడిచిపోవడంతో బామ్మకు వెంటనే గుర్తుకురాలేదు. కాస్త తీవ్రంగా ఆలోచించి, విషయం గుర్తుకు వచ్చి, “నా మనవరాలు నిర్మిస్తానని తెలిపింది. నేను చెన్నై వెళ్లి తనని స్వామివారిని దర్శించమని చెబుతాను” అని చెప్పింది. తరువాత మా బామ్మ చెన్నై రాకుండా దేవకొట్టై వెళ్లి అక్కడినుండి నాకు ఫోను చేసింది. నేను స్వామివారిని కలుస్తానని చెప్పాను.
“అళగప్పన్ కూడా అక్కడకు వస్తాడు; ఇద్దరూ వెళ్లి స్వామివారిని కలవండి” తను నాకు చెప్పింది. మరుసటిరోజు అళగప్పన్ మా ఇంటికి వచ్చాడు. మేమిద్దరమూ కాంచీపురం వెళ్లి, స్వామివారిని కలవడానికి వచ్చామని అక్కడున్నవారితో చెప్పాము. “దేవకొట్టై ఆచి మనవడు, మనవరాలు వచ్చారు” అని వారు స్వామివారికి తెలిపారు.
మా రాకకు కారణం తెలుసుకోవాలని “ఏమిటి?” అని అడిగారు స్వామివారు.
“ఒక శివలింగానికి దేవాలయం నిర్మించాలని అనుకున్నాము. ఆ విషయమై పరమాచార్య స్వామివారిని కలవమని పాట్టి చెప్పింది. అందుకు వచ్చాము” అని తెలిపాము స్వామివారికి.
మంగళా తీర్థం వద్ద నిర్మాణంలో ఉన్న ఆలయాన్ని మాకు చూపమని ఒక అయ్యర్ ను మాకు తోడుగా పంపారు స్వామివారు. కేవలం ఇక ప్లాస్టరింగ్ పని మాత్రమే మిగులుంది. అక్కడున్నవారు మాతో, “ఈ ఆలయాన్ని నిర్మిస్తున్న ఇంజనీయరు చెన్నై వెళ్ళాడు, ఇప్పుడు ఇక్కడ లేడు. అతను వచ్చిన తరువాత మిగతా విషయాలు కనుక్కోండి” అని తెలిపారు.
అంతేకాక ఇప్పటి దాకా ఎనభై వేల రూపాయలు అయ్యిందని, దాదాపు లక్షదాకా అవుతుందని చెప్పారు. నేను అళగప్పన్ ని, “దీనికి మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అని మన ఆచి చెప్పింది కదా! మీ బావకు ఈ ఇవన్నీ తెలియవు. మా చిన్న మావగారిని సంప్రదించిన తరువాతనే నేను ఏమైనా చెయ్యగలను. స్వామివారు ఏమి చెబుతారో? ఏమి చేద్దాం ఇప్పుడు?” అని అడిగాను.
“ఈ స్థలం సరిగ్గా మఠానికి ఎదురుగా ఉంది. మహాస్వామివారు తరచుగా అక్కడకు వెళ్తుంటారు. ఇది చాలా మంచి అవకాశం. ఎలాగోలా నువ్వే కట్టించు. ఈ అవకాశం మరలా రాదు” అన్నాడు అళగప్పన్.
తరువాత మేము స్వామివారితో, “ఇంజనీయరు చెన్నై వెళ్ళాడుట” అని చెప్పి, “పాట్టి మాతో మూడు వేల రూపాయలు అవుతుంది అని చెప్పింది. కాని వారు ఇప్పుడు లక్ష దాకా అవుతుంది అని అంటున్నారు” అని అడిగాను. స్వామివారు ఏమనుకున్నారో తెలియదు కాని, “ఆ ఇంజనీయరు చెన్నై నుండి వచ్చిన తరువాత మీకు విషయం తెలుపుతాము. ఇప్పుడు మీరు వెళ్ళండి” అన్నారు స్వామివారు.
నాకు ఏమీ అర్థం కాలేదు. నేను నా తమ్ముడు అళగప్పన్ తో, “నాకు మనస్సులో చాలా దిగులుగా ఉంది. మనం అలా చెప్పకుండా ఉండాల్సింది. సరే, నా వద్ద పది సవర్ల బంగారు గొలుసు ఉంది. దాన్ని అమ్మి, మిగిలిన డబ్బు కూడా ఎలాగో అలా ఏర్పాటు చేసి, నేనే ఆ దేవాలయాన్ని నిర్మిస్తాను” అని అన్నాను. స్వామివారితో కూడా, “ఖర్చు ఎంతైనా ఈ దేవాలయాన్ని నేనే నిర్మిస్తాను” అని చెప్పాను. “మేము తెలియజేస్తాము. ప్రభుత్వమే నిర్మిస్తుందని అంటున్నారు. అలా కాకపొతే, నువ్వే నిర్మించవచ్చు” అన్నారు స్వామివారు.
నేను చెన్నై తిరిగొచ్చాను; అళగప్పన్ కూడా తన ఊరికి వెళ్ళిపోయాడు. మఠం నుండి ఎటువంటి సమాచారం రాలేదు. అళగప్పన్ అన్ని విషయాలు చెప్పడంతో బామ్మ మా ఇంటికి వచ్చింది. “దిగులు పడకు. మనవాళ్ళని డబ్బు అడుగుదాము” అని ధైర్యం చెప్పింది. పదివేల రూపాయలు తీసుకుని నేను, బామ్మ కాంచీపురం వెళ్లి, మా ప్రణాళిక స్వామివారికి తెలిపాము. “అవకాశం రాని, చూద్దాం” అన్నారు స్వామివారు.
తరువాత బామ్మ స్వామివారితో, “శివునికోసం పది వేలు తీసుకుని వచ్చాను. దీన్ని ఇంటికి తీసుకునివెళ్ళలేను. మఠంలో జమ చేస్తాను” అని చెప్పిడంతో స్వామివారు సరే అన్నారు. ఆ డబ్బు నేను మఠంలో జమ చేశాను.
అయినా నా మనసుకు శాంతి లేదు. ఏడుస్తూనే ఉన్నాను. నా బాధను పోగొట్టాలని పాట్టి నాతో, “స్వామివారికి మన ఆర్తి తెలుసు, తప్పక పరిగణిస్తారు. ఆ దేవాలయాన్ని నిన్నే నిర్మించమని చెబుతారు, అలా దిగులు పడకు. నేను కాంచీపురం వెళ్లి దేవకొట్టై వెళ్తాను” అని చెప్పింది. బామ్మ వెళ్తూ ఒక మాట చెప్పింది, “ముందు వొద్దన్న ఒకామెకు కూడా రెండు దేవాలయాలు నిర్మించడానికి అనుమతిచ్చారు స్వామివారు. మంచి అనుకో; మనకు అనుకూలంగానే జరుగుతుంది”.
కలత చెందిన మనసుతో సోఫాలో వాలుకుని నిద్రలోకి జారుకున్నాను. బహుశా మధ్యాహ్నం పన్నెండు గంటలు అనుకుంటా. మా బామ్మ వచ్చి తలుపు కొడుతోంది. నాకు తలుపు కొట్టిన చప్పుడుతో పాటు మాటలు కూడా వినబడుతున్నాయి. “లక్ష్మీ తలుపు తెరువు. దేవాలయ నిర్మాణం నువ్వే చెయ్యమన్నారు మహాస్వామివారు”. హఠాత్తుగా మెలకువ వచ్చింది. ఏమి అద్భుతం! బామ్మ నిజంగానే తలుపు కొడుతోంది.
అది తలుచుకుంటే ఇప్పటికి నాకు పారవశ్యం కలుగుతుంది. ఈ సంఘటనని నేను ఎన్నటికి మరచిపోలేను. వెంటనే నేను తలుపు తీశాను. బయట బామ్మా నిలబడి ఉంది. “ఊరికి వెళ్ళలేదా?” అని అడిగాను. “లేదు. పరమాచార్య స్వామివారు నిన్నే దేవాలయం నిర్మించమన్నారు. వచ్చేయ్, ఇప్పుడే కాంచీపురం వెళ్దాము” అని చెప్పింది. వెంటనే స్వామివారి దర్శనానికి బయలుదేరాము. మేము స్వామివారి దర్శనం చేసుకుంటున్నప్పుడు, “నీవే దేవాలయం నిర్మించు” అని ఆదేశించారు. నాకు చాలా సంతోషం కలిగింది. “నేను మా ఊరికి వెళ్లి, మా మావగారికి విషయం తెలిపి డబ్బుకు ఏర్పాట్లు చేస్తాను” అని స్వామివారికి తెలిపాను. అదనుకు స్వామివారు సరే అన్నారు.
నేను మా ఊరికి వెళ్లి మా నాన్నగారికి, చిన్న మామగారికి విషయం తెలిపాను. వాళ్ళు ‘సరే చూద్దాం’ అన్నారు. నాన్న ఒక్కరే ఏమీ చెయ్యలేరు. అవకాశం రానివ్వు అన్నారు ఇద్దరూ. నాకు కొద్దిగా కోపం వచ్చింది. ఒక నిర్ణయానికి వచ్చి చెన్నై చేరుకొని నాకు తెలిసిన వారితో మాట్లాడాను. వారు ఆహృదయులు; “మాకు తెలిసిన వారిని సంప్రదించి అవసరమైన ధనాన్ని ఏర్పాటు చేస్తాము” అని అన్నారు. నేను సరే అన్నాను; వెంటనే వారు ముప్పైవేల రూపాయల చెక్కును ఇచ్చారు. దాన్ని డబ్బుగా మార్చుకుని మరుసటిరోజే కాంచీపురం బయలుదేరాను. “ఏమిటి, మీ ఊరికి వెళ్లి, మీవాళ్ళను అడిగావా?” అని అడిగారు స్వామివారు. జరిగిన విషయం మొత్తం స్వామివారికి తెలిపాను. “సరే ఈ డబ్బుని మేనేజరు నీలకంఠ అయ్యర్ కు ఇచ్చి రశీదు తీసుకో. రాతిపై నీ భర్త పేరు వేయించాల్సి ఉంటుంది కనుక పేరు విలాసము ఇచ్చి వెళ్ళు” అని ఆదేశించారు. స్వామివారు చ్పెపినట్టు చేశాను.
ఇదంతా జరిగేటప్పటికి రాత్రి పది గంటలు అయ్యింది. దేవాలయ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది అన్న నా ప్రశ్నకు, బహుశా నలుగు నెలలు పట్టవచ్చు అని చెప్పారు. దాదాపు రెండు నెలలు గడచినా తరువాత బామ్మ ఫోను చేసింది. “కుంభాభిషేకానికి ఏర్పాటు చేశారు. మీ మనవరాలికి చెప్పు; మీ బంధువులని తీసుకునిరా” అని స్వామివారు బామ్మతో చెప్పారు. నా భర్త మలేషియాలో ఉండడం వల్ల నాకు ఏమి చెయ్యాలో పాలుపోలేదు. ఇక్కడ లేకుండా చెయ్యడం ఎలా? నేను వెంటనే స్వామివారిని కలిసి విషయం తెలిపాను.
“అంతా సజావుగా జరుగుతుంది. ఓక ఫోను చేసి విషయం చెప్పు. అలాగే మీ బంధువులకు కూడా తెలుపు” అన్నారు స్వామివారు. వంటనే నేను చెన్నై వచ్చాను. అప్పటికే మలేషియా వెళ్ళడానికి మా చిన్న మామగారి అమ్మాయి వచ్చింది. నా భర్తను ఇక్కడకు త్వరగా పంపమని తనకు తెలిపి మా ఊరికి వచ్చేశాను. సమయం లేకపోవడంతో అందరికి విషయం చెప్పలేక, మా చిన్న మామగారికి మాత్రం కుంభాభిషేకం విషయం తెలిపాను.
నేను ఇక్కడకు రాగానే తెలిసిన విషయం ఏమిటంటే, మలేషియా నుండి నా భర్త నేరుగా కాంచీపురం వచ్చారని, వెంటనే నన్ను కూడా అక్కడకు రమ్మన్నారని.
ఆరోజు అక్కడకు ఆర్.యం. వీరప్పన్ కూడా వచ్చారు. మంగళా తీర్థం కొలను స్వామివారు స్నానం చేశారు. ప్రభుత్వం తరుపున మంగళా తీర్థం కొలనును జీర్ణోద్ధరణ చెయ్యడానికి ఆర్.యం. వీరప్పన్ గారు ఏర్పాట్లు చేశారు. స్నానం తరువాత స్వామివారు మంగళేశ్వరర్ దర్శనం చేసుకున్నారు. అక్కడి నుండి నేరుగా మఠానికి వచ్చారు. మా అమ్మాయి ముత్తు కరుప్పితో పాటుగా నేను స్వామివారి దర్శనం చేసుకునాను. అప్పుడు అక్కడ ఆర్.యం. వీరప్పన్ కూడా ఉన్నారు. స్వామివారు మమ్మల్ని ఆయనకు పరిచయం చేశారు. తరువాత స్వామివారు కట్టిన పూల ఉండను మా అమ్మాయి చేతిలో వేసి మమ్మల్ని ఆశీర్వదించారు. దాంతోపాటు ఏకామ్రేశ్వర కామాక్షి అమ్మవార్ల పెళ్లి పట్టు చీరను కూడా ఇచ్చారు. అది ఇప్పటికి నా వద్ద భద్రంగా ఉంది.
అక్కడున్నవారు అందరూ ఆ పట్టు వస్త్రాన్ని ఎంతో భక్తిగా తాకి కళ్ళకద్దుకుని, “అంతటి పవిత్రమైన వస్తువు ఎవరికీ లభించలేదు. మీకు లభించింది. ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉందిమంచి భర్త లభిస్తాడు” అని మాతో అన్నారు. వారు అన్నట్టుగానే తరువాత తనకు ఒక మంచి డాక్టరు భర్తగా లభించాడు. తనకు ఇప్పుడు ఒక కూతురు, కొడుకు. ఆరోజు కామాక్షి అమ్మవారి కల్యాణోత్సవం. తరువాత నేను స్వామివారిని, “మా బంధువులు వస్తారు. వారికి ఆహారం పెట్టాలి. వంట చేసేవారు ఎవరూ లేరు. అందుకు అవసరమైన సరుకులు కొనాలి. మాకు ఒక మండపం కూడా కావాలి. ఏమి చెయ్యాలి?” అని అడిగాను.
“దేని గురించి నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు; అంతా సవ్యంగా జరుగుతుంది” అన్నారు స్వామివారు. మాకు బాలాజీ కళ్యాణ మండపాన్ని ఇచ్చారు; మఠం నుండి కావాల్సిన కిరాణా వస్తువులను ఇచ్చారు. మరుసటి రోజు ఉదయమే ఆలయ కుంభాభిషేకం. కుంభకోణం నుండి వంట బ్రాహ్మణుడు ఒకరు స్వామివారి దర్శనానికి వచ్చాడు. స్వామివారు అతనితో, “నువ్వు వెళ్లి ఆచి అమ్మ కోసం వంట చెయ్యి” అని ఆదేశించగా అతను సరేనన్నాడు.
“ఈ నగరత్తారులకి మంచిగా వడలు, పాయసము తయారు చెయ్యి” అని అతనికి చెప్పారు స్వామివారు. అలాగే అతను కూడా చాలా గొప్పగా వంట చేశాడు. స్థానికంగా ఉన్నవారు కూడా వచ్చి ఆహారం స్వీకరించారు. మాకు ఎంతో సంతృప్తి కలిగింది. కుంభాభిషేకం ఆహ్వాన పత్రికతో సహా అన్నీ స్వామివారే చూసుకున్నారు.
కుంభాభిషేకానికి ముందు స్వామివారిని పూర్ణ కుంభంతో స్వాగతించాము. స్వామివారు యాగశాలలో ఉంది కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తరువాత కుంభాభిషేకం కూడా నిర్విహించారు.
ఎలా ఎన్నో సంఘటనలను చెప్పవచ్చు. నా జీవితంలో ఇలా ఎన్నో జరిగాయి. వాటిని వ్రాస్తూ జీవితాంతం గడపవచ్చు. అటువంటి నడిచే దైవం ఉన్న సమయంలో మనం ఉన్నాము అన్న భావనే మనస్సుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.
--- లక్ష్మి, మంగలేశ్వరర్ కోవిల్, దేవకొట్టై ఆచి మనవరాలు. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/KPDSTrust
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి