27, మార్చి 2022, ఆదివారం

చిన్ముద్ర

 *చిన్ముద్ర..... ఒక విశ్లేషణ*


మానవుని చేతికి ఐదు వ్రేళ్ళుంటాయి. నాలుగు కలిసే ఉంటాయి. ఒకటి మాత్రం దూరంగా ఉంటుంది. అది పరమాత్మ. మిగిలిన ఈ నాలుగు వ్రేళ్ళలో చూపుడు వ్రేలు జీవుడు. మిగిలిన మూడు వ్రేళ్ళు, మూడు గుణాలు.


జీవుడెప్పుడూ మూడు గుణాలతో కూడియే ఉంటాడు. అందుకే నాలుగు వ్రేళ్ళు ఎప్పుడూ కలిసే ఉంటాయి. అయితే ప్రయత్నంతో చూపుడు వ్రేలు అనబడే జీవుడు ని మిగిలిన మూడు వ్రేళ్ళు అనే మూడు గుణాలకు దూరంగా జరిపితే.. పరమాత్మ అనే బొటన వ్రేలితో కలసిపోతాడు.


ఇలా చూపుడు వ్రేలు, బొటన వ్రేలు కలిసి సున్నాగా ఏర్పచితే అదే "చిన్ముద్ర". ఆలయాల్లో దేవతా విగ్రహాలు చూపే చిన్ముద్ర లోని ఆంతర్యం ఇదే... మూడు గుణాలను వదిలించుకొని నాతో ఐక్యం కండి అని చెప్పటమే...


 ఓం

పరనింద ప్రమాదకరం

 (Copy. చాలా బాగుంది. చదవండి)


పరనింద ప్రమాదకరం. 


పరనింద ప్రమాదం.


ఇతరుల్ని కించపరిస్తే కల్గే నష్టాన్ని ఒక సంస్కృత కవి  ఎంత చక్కగా వివరించాడో స్వయంగా చూడండి.

ఒకరోజు లక్ష్మి వైకుంఠం నుంచి బయలుదేరి కైలాసంలో ఉన్న  పార్వతి ఇంటికి వెళ్లింది. పార్వతి ఇంటికి వచ్చిన అతిథిని సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టింది. లక్ష్మి ఆ పరిసరాలన్నీ పరికించింది. పార్వతికి లక్ష్మికున్నంత  ఐశ్వర్యం లేదు డాబు లేదు. పరిసరాలన్నీ సామాన్యంగా ఉన్నాయి.  లక్ష్మికి అనుకోకుండా పార్వతిని ఓ ఆట పట్టించాలనే ఆలోచన కల్గింది.

"భిక్షార్థీ స క్వ యాత:?” అని చిన్న ప్రశ్న వేసింది.  మీ ఆయన ఎక్కడికెళ్లాడమ్మా అంటే బాగుండేది.. కాని లక్ష్మి అలా అనలేదు. ఆ ముష్టివాడు ఎక్కడికెళ్లాడమ్మా? అంది.  శివుడు ఆది భిక్షువు కదా! లక్ష్మి ఆ విషయాన్ని ఎత్తిపొడుస్తూ వెటకారంగా మాట్లాడింది.  పార్వతికి ఈ  ప్రశ్న చాలా బాధ కల్గించింది . ఏ ఆడదైనా తనను ఎన్నన్నా సహిస్తుంది గాని తన భర్తను నిందిస్తే ఏమాత్రం  సహించలేదు కదా! కాని ఏంచేస్తుంది. ఇంటికి వచ్చిన అతిథిని మందలిస్తే బాగుండదు. అలాగని సరిపెట్టుకుని  ఊరుకోనూలేదు. ఏదో సమాధానం చెప్పాలి.  ఎంచెప్పాలి?  కొంచెం ఆలోచించింది.

"సుతను బలిమఖే "  అంది.

'బలి చక్రవర్తి చేస్తున్న యాగం దగ్గరకు వెళ్లారమ్మా! అని సమాధానం.  ఆ సమాధానం వినేసరికి లక్ష్మికి తల తిరిగి పోయింది. బలి దగ్గరకు వెళ్లిన ముష్టివాడు  తన భర్త శ్రీమహావిష్ణువు. వామనావతారంలో ఆయన బలిచక్రవర్తిని మూడడుగులు నేల అడగడం లోకవిదితమే.  'మా ఆయనకన్నా మీ ఆయనే దారుణం' అనే భావం పార్వతి మాటల్లో తొంగి చూసింది. లక్ష్మి కొంతసేపటికి ఎలాగో తేరుకుంది. మళ్లీ ఏదోవిధంగా పార్వతిని ఉడికించాలని సమాయత్తమయింది. రెండో ప్రశ్న వేసింది.

తాండవం క్వాద్య భద్రే! అనడిగింది. అమ్మా! మీ ఆయన ఈ రోజు నాట్యం ఎక్కడ చేస్తాడు? అని దానర్థం.   మీ ఆయన ఏ పని పాట లేకుండా దిగంబరంగా నాట్యం చేస్తుంటాడని  లక్ష్మి మాటల్లోని అంతరార్థం. అప్పటికే ఆరితేరిన పార్వతి వెంటనే అందుకుంది.

మన్యే బృందావనాంతే అంది. బృందావనంలో అనుకుంటున్నానమ్మా! అని ఆ మాటలకర్థం. బృందావనంలో నాట్యం చేసే ప్రబుద్ధుడు కృష్ణుడు, శివుడు కాదు. ' మా ఆయనే కాదు  మీఆయన కూడ నాట్యం చేస్తాడు.   ఎటొచ్చీ మా ఆయన ఒంటరిగా నాట్యం చేస్తాడు. అంతే గాని మీ ఆయన లాగ అందరి ఆడవాళ్లను వెంటేసుకుని నాట్యం చెయ్యడు' అని సమాధానం. పార్వతి సమాధానం ఇంత పదునుగా  ఉంటుందని లక్ష్మి ఊహించలేదు. ఆమెకు మతిపోయినంతపనయింది. ఏలాగో కుడగట్టుకుంది. ఈ సారి తనకు ఇబ్బంది లేనివిధంగా మాట్లాడాలనుకుంది.

క్వను చ మృగ శిశు: ? అని మరో ప్రశ్న వేసింది.  మీ ఏనుగు మొగంవాడు ఎక్కడమ్మా? అని అర్థం. లక్ష్మి  కొడుకు మన్మథుడు చాల అందగాడు. పార్వతి కొడుకు వినాయకుడు ఎంత అందగాడో వివరించి చెప్పనవసరం లేదు. 'మా అబ్బాయి చాల అందగాడు మీ అబ్బాయి మాత్రం కురూపి' అని లక్ష్మి ఆక్షేపణలోని  అభిప్రాయం .  పార్వతి చాల నొచ్చుకుంది.  కాకిపిల్ల కాకికి ముద్దన్నట్లు ఎవరిపిల్లలు వాళ్లకు ముద్దు. పార్వతి మెదడులో ఒక ఆలోచన తళుక్కుమని మెరిసింది. వెంటనే అంది.

' నైవ జానే వరాహం ' అంది

“ ఇక్కడేదో పంది  తిరుగుతూ ఉంటే దానివెంట వెళ్లాడమ్మా! ఎక్కడున్నాడో తెలీదు" అంది. మా అబ్బాయిది ఏనుగు ముఖమేగాని మీ ఆయన పూర్తిగా వరాహావతారమే సుమా!అని పార్వతి సమాధానం లోని చమత్కారం. ఇది లక్ష్మికి దిగ్భ్రాంతి కల్గించింది. కొంతసేపటికి  ఎలాగో తేరుకుంది. ఈసారి జాగ్రత్త్తగా తనకు ఎదురుదెబ్బ తగలని విధంగ పార్వతికి దెబ్బకొట్టాలనుకుంది. అటు ఇటు కాసేపు చూసింది.

బాలే! కచ్చిన్న దృష్ట :  జరఠ వృషపతి: ?  అనడిగింది. 'మీ వాహనం అదే ఆ  ముసలి ఎద్దు ఎక్కడా కనబడడం లేదేమిటమ్మా! అని ప్రశ్న. 'మాది గరుడ వాహనం విమానాల్లో  వలే ఆకాశంలో తిరుగుతాం.  మీరు నేల పై తిరుగుతారు. మీ వాహనం  ముసలి ఎద్దు.  అది కదల్లేదు మెదల్లేదు'  అని ఆక్షేపం. మేం పై స్థాయి వాళ్లం మీరు నేలబారు మనుషులు అని వెక్కిరింపు. ఆ వెక్కిరింపు అర్థం చేసుకోలేనంత అమాయకురాలు కాదు పార్వతి. అందుకే  వెంటనే అందుకుంది.

"గోప ఏవాస్య వేత్తా " అంది. 'ఆవులసంగతి ఎద్దులసంగతి గోవుల్ని కాసేవాణ్ణి అడిగితే తెలుస్తుంది గాని నన్నడిగితే ఏం లాభమమ్మా?  పో! పోయి, మీ ఆయన్నే అడుగు' అని చిన్న చురక అంటించింది.   మా ఆయన నడిపే వాహనాన్ని మీఆయన మేపుతాడు. మీకంటే మేమే ఎక్కువ అని పార్వతి మాటల్లోని ఆంతర్యం. ఈ సమాధానానికి లక్ష్మి పూర్తిగా అవాక్కయింది. తిన్నగా జారుకుంది.

నిజానికి ఇదంతా వారిద్దరి మధ్య వేళాకోళంగా జరిగిన సంభాషణ. ఇందులో నిందగాని వెక్కిరింపుగాని ఏమాత్రంలేవు. ఇతరులను అవమానపరిస్తే అది మనకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందనే సత్యాన్ని చెప్పడానికే ఒక కవి  లక్ష్మీపార్వతులను పాత్రలుగా చేసుకుని ఈ సన్నివేశాన్ని కల్పించాడు. ఇందులో నీతి ముఖ్యం గాని ప్రశ్నలు సమాధానాలు ముఖ్యం కాదు

వారిరువురి మధ్య జరిగిన ఈ సరసమైన  సంభాషణ మనందరిని రక్షించుగాక అని చమత్కరించాడో కవి. ఇంత సరసమైన భావాన్ని తనలో దాచుకున్న ఈ శ్లోకం చదవండి.


భిక్షార్థీ స క్వ యాత: ?సుతను బలిమఖే " తాండవం క్వాద్య భద్రే ?


మన్యే బృందావనాంతే క్వను చ మృగశిశు:? నైవ జానే వరాహం


బాలే కచ్చిన్న దృష్ట: జరఠవృష పతి:? గోప ఏవాస్య వేత్తా


లీలాసంలాపఇత్థం జలనిధిహిమవత్కన్యయో: త్రాయతాం న:


(శ్రీ అప్పయ్య దీక్షితులు)

అంతర్ముఖ సమారాధ్య*

 *అంతర్ముఖ సమారాధ్య*

*బహిర్ముఖ సుదుర్లభా*



సాధన లో *అంతర్ముఖత* ప్రాధాన్యత తెలుపుట కు వశిన్యాది వాగ్దేవతలు ఈ నామం తో స్తుతించారు. కొంత బహిర్ముఖ తంతు అవసరము. కాని బహిర్ముఖ సాధన తోనే పరిమితము అవుట వలన సాధకుడు సద్వస్తువు ను చేరలేడు. 


అందుకే *“అంతర్ముఖ సమారాధ్య-బహిర్ముఖ సుదుర్లభా”* అని ద్వంద్వము ను సూచించారు. 

అనగా సాధన బహిర్ముఖత వలన ఆత్మ ను చేరుకోవడము దుర్లభము. అనగా చాలా కష్టతర సాధ్యము. అంతర్ముఖత వలన సులభము గా సాధ్యతరము. 


మానవ జన్మ లభించడమే బహు దుర్లభము. విశేషంగా కలియుగము లో మానవుడి జీవితకాల పరిమాణమే చాలా తక్కువ. ఇక ఈ తక్కువ జీవిత కాలము లో బహిర్ముఖత కే పరిమితము అవడము అంటే సముద్రము ఊపరితలము లోనే ముత్యములు ను వెతుకడము వంటిది. బాహ్య సాధన కొంత జరిగిన పిమ్మట అంతర్ముఖ సాధన ని కొనసాగించాలి. 

మన నిత్య జీవితము లో చేసే ప్రతి కార్యము కు కావలసిన ప్రేరణ, శక్తి వచ్చేది లోపల నుంచే. సర్వవ్యాపి అయిన ఆత్మ మనలో ఉండుట వలనే జడమైన శరీరము లో కదలికలు,  మాట్లాడే ప్రతి దానిలో *నేను*, *నాది*.. అనే పదజాలం వాడడము సర్వసామాన్యము. అయతే మాట్లాడతున్నది ఎవరు..? శరీరము జడపదార్థము అవడము వలన, శరీరము మాట్లాడలేదు. శరీరమే మాట్లాడును అన్నప్పుడు నిద్రావస్థ లో ఏ మాటామంతి లేకపోవుట కు కారణం ఏమి..? ఇట్టి విచారము *సాంఖ్యము* కు దారి తీయును. దైవము ఉనికి గ్రహించుటకు ఉన్న అనేకమైన మార్గముల లో మంత్రమార్గము, అందులో ప్రత్యేకముగా *శ్రీవిద్య* మహోత్కృష్టమైనది, అతి ప్రాచీనమైనదిగా పేరు పొందెను. ఇక మంత్రమార్గము లో పయనించుటకు శ్రీగురువులు లభించిన తరువాత సాధన ను కొనసాగించగా మంత్రమే సాధకుడను లోన కు తీసుకుపోవును. బాహ్యతంతు ముగిసాక కొంత నియమపూర్వకముగా, ప్రయత్నపూర్వకముగా అంతర్ముఖత అవవలెను. ఈ నామము లో ఉన్న సంకేతము ఇదే. 

ఉదాహరణ కు బయట మనకు ప్రతి వస్తువు లభించును. కాని శాంతి లభించదు. పరిపూర్ణమైన శాంతి, దైవస్వరూపము అవుట వలన, శ్రీ చండి సప్తశతి లో *యా దేవి సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా…..* అని స్తుతింపబడింది. 


సముద్ర ఊపరిభాగము లోనే అలలు ఉండును. సముద్రగర్భము లో నీటి ప్రవాహము కూడా ఉండదు. కారణం కదలికలు లేని నిశ్చలమైన స్థితి. ఇక్కడే అమూల్యమైన సంపద నిక్షిప్తమై ఉండును. ఊపరిభాగము లో నావల వలన జరిగే వ్యాపారములు, గందరగోళము, తుఫాన్లు, కెరటములు, సూర్యరశ్మి వలన భాష్పీకృతము లాంటివే సంభవించును. ఇవన్ని ప్రకృతి మానవాళి కి ఇచ్చే సూచనలు, ఆదేశాలు. కాని ఇంద్రియ 

చాంచల్యము, పటుత్వము వలన మానవుడు  ఈ సూచనలు ను పట్చించుకోడు. ప్రకృతి అనగా శక్తి. గోచరమయే ప్రతి చరాచరము నుంచి మనకు నిత్యమూ ఏదో ఆధ్యాత్మిక సందేశము వస్తూనే ఉండును. ఇదే విషయము *అవధూతోపాఖ్యానము* లో వివరించబడింది. (శ్రీ సరస్వతి గంగాధర్ గారు రచించిన శ్రీ గురు చరిత్ర చివరి భాగము లో కలదు.)

అటులనే శ్రీమద్భగవద్గీత లో రెండవ అధ్యాయము *సాంఖ్య యోగము* లో కూడా ఆత్మ అన్వేషణ వివరణ కలదు. ఇదే విషయము ఋుగ్వేదప్రోక్త *శ్రీదేవీసూక్తము* యందు కూడా కలదు. ఇంకా లోతుగా పరిశీలించగలిగే సాధకబృందము కు 1.దశ ఉపనిషత్తులు (ముఖ్యము గా కఠోపనిషత్-ప్రశ్నోపనిషత్తలు), 2.అష్టావక్రగీత, 3. ఋుభుగీత, 4.గురుతంత్రము, 5.సాంఖ్యయోగము..లాంటివి చాలా సహాయపడును. కర్తృత్వభావన నశించును. కర్తృత్వభావన కు మూలము కూడా *నేను* యే. కాని ఇది *అహంకారము* రజో-తమోగుణ సంపన్నమైనది. కర్తృత్వభావన నశించిన తరువాత మిగిలినది కూడా *నేను* యే. కాని ఇది ప్రారంభమున సత్వగుణసంపన్నమై, చివరకు గుణరహితమైనదిగా మిగిలిపోవును. 


ఇక శ్రీవిద్య పరంగా విచారిస్తే మంత్రము లో ఇమిడి ఉన్న ధ్యానశ్లోకము నే ధ్యానవిషయము గా చేయడము వలన, ధ్యానము సులభమవును. ఇది ఇంద్రియములకు తిరుగు ప్రయాణం వంటిది. లోపల కు ప్రయాణము ప్రారంభము చేయగా చేయగా శూన్యము కు దారితీయును. గుణరహితమైన ఆత్మ గోచరమవును. ఇదియే *నేను*….

ఈ *నేను* యే  *పరదేవత/అమ్మ*..


*అహం రుద్రేభిర్వసుభిశ్చరామి…..* అని ఋుగ్వేదప్రోక్త శ్రీదేవిసూక్తము లో అమ్మ ఘోషిస్తున్న తన స్వరూపము. 


నిత్యము సాధన లో ధ్యానశ్లోకము ను ధ్యానించడము వలన గమ్యము చేరుట సులభము. 


*అమ్మ* ఒక తత్వము. ఈ తత్వమే ఆత్మ తత్వము. ఆత్మ సర్వవ్యాపి అయినా ప్రతి ప్రాణి హృదయగుహ లో స్థిరముగా ఉండుట చేత *అమ్మ* *అంతర్ముఖ సమారాధ్యా* అని స్తుతింపబడినది. 



సర్వం అస్మత్ 

శ్రీ గురుచరణారవిందార్పణమస్తు

🙏🙏🙏

విముక్తి

 🕉🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


        🌸  _*విముక్తి*_ 🌸


*_ప్రతి మనిషిలో ముఖ్యంగా మూడు కోరికలు ఉంటాయి._*

*_1. జీవించాలి... మరణం ఉండకూడదు._*

*_2. సంపాదించాలి... మితం ఉండకూడదు._*

*_3. ఆనందించాలి... హద్దులు ఉండకూడదు._*

*_ఎవరైతే వీటిని దూరంగా ఉంచగలుగుతారో వారిని మానవాతీతులుగా భావించాలి. మనిషి మొదటినుంచి తాను ఉన్న స్థితిలో రాజీ పడలేక ఇంకా దేనికోసమో తపనతోనే జీవిస్తున్నాడు. అనంతాన్ని జయించాలన్న కోరిక ఒక్క మనిషిలోనే కనిపిస్తుంది._*

*_‘మీరు ఇంకా ఒక్క గంట మాత్రమే బతుకుతారని ముందుగా తెలిస్తే, ఎలా ఉంటుందో... ఆ స్థితిలోనే జీవించాలి’ అంటారు జిడ్డు కృష్ణమూర్తి._*


*_ఆ రహస్యం తెలిసిన మరుక్షణమే తనకు సంబంధించినవన్నీ తనవారికి ధారాదత్తం చేయడానికి ఆ గంట వ్యవధి సరిపోదని బాధపడతాడు మనిషి. త్యజించాల్సిన శరీరాన్ని బతికించాలన్న తపనతోనే, విలువైన సమయాన్ని వృథా చేస్తాడు. కానీ తాను చేరుకోవాల్సిన సహజ స్థితి గురించి ఆలోచించడు._*


*_కర్మ ఫలాల్ని జన్మ జన్మలుగా అనుభవిస్తున్నాడు. అయినా దేహం ఉండగానే విముక్తి కోసం సాధన మార్గం సుగమం చేసుకోలేక పోతున్నాడు._*


*_రామకృష్ణ పరమహంస పొందిన నిర్వికల్ప సమాధి, రమణ మహర్షి పొందిన సహజస్థితి..... ఇవన్నీ వారు అంతఃకరణాన్ని, ఇంద్రియాలను, సమస్త భోగ సామగ్రిని త్యజించి సాధించారు. ఆశారహితులై శారీరక కర్మలను చేసినట్టు కనిపించినా, వాటి ఫలితం అంటకుండా జీవించబట్టే అవి సిద్ధించాయి._*


*_మనిషి సహజ స్థితిని పొందడానికి సన్యాసం అవసరం లేదంటారు జిడ్డు కృష్ణమూర్తి._*


*_మరణం తరవాతే సహజస్థితి సిద్ధిస్తుంది అనేది అపోహ. వాస్తవానికి మనిషి నశించేవాడు కాదు, స్వేచ్ఛారహితుడు అంతకంటే కాదు. నిజమైన మనిషి అంటే ఆత్మ. ఆత్మ నిజస్వరూపం సచ్చిదానందం. అనంత ఆకాశంలో సర్వవ్యాపకమైన సర్వస్వాన్ని ప్రకాశింపజేసేదే సత్‌, చిత్‌, ఆనందం. నిత్యమైన, మరణంలేని, పతనంలేని పరమాత్మతత్వం ఇదే._*


*_దాన్ని పొందడానికి చేసే సాధనలో అహం అడ్డు పడుతూ ఉంటుంది. అహం అనే ప్రవాహం మీద తేలుతూ సహజస్థితి చేరే సాధన చేయడం అసాధ్యం. అహం హద్దులు దాటి, దాని ఆద్యంతాలు తెలుసుకోవడానికి అంతఃచైతన్యమనే నిచ్చెన ఎక్కాలి. అప్పుడే స్పష్టత ఏర్పడుతుంది. చైతన్య ఉన్నత స్థితిని చేరుకోవడానికి చేసే ప్రయత్నమే నిజమైన సాధన._*


*_సూర్యుడి వేడికి సముద్ర జలాలు ఆవిరై, మేఘాలుగా మారతాయి. అవి హిమాలయాల ఎత్తుకు ఎగురుతాయి. ఆవిరి అణువుల నిజస్వరూపం సముద్రమే. తమ మూలస్థానమైన సముద్రాన్ని తిరిగి చేరడానికి ఆ అణువులు నిరంతరం తాపత్రయపడతాయి. ఆకాశంలో సంచరిస్తూ తిరుగుతుంటాయి. సమయం రాగానే వర్షించి, అనంత సాగరంలో ఐక్యమై సహజస్థితికి చేరుకుంటాయి._*


*_అన్ని నీటి బిందువులూ సముద్రాన్ని చేరనట్లే, ఎంత సాధన చేసినా కర్మఫల శేషం వీడిపోనిదే సహజస్థితి సిద్ధించదు. కర్మ బంధాలనుంచి విముక్తి పొంది, ఆత్మను గుర్తించి, ఇంద్రియాల పరిధిని అధిగమించడానికి చేసే ప్రయత్నం నిరంతరం కొనసాగాలి. ఎవరైతే సమస్త సృష్టిలో సర్వవ్యాపిని చూడగలుగుతారో, వారికే ఆత్మ దర్శనం కలుగుతుంది. ఆ స్థితిని నిలబెట్టుకోవడమే యోగం._*


*_భారతదేశంలో ఎన్నో వేల సంవత్సరాల క్రితమే, ఎంతో మంది తపోధనులు తమ యోగవిద్య ద్వారా, ఉన్నతమైన ఆధ్యాత్మిక చైతన్యంతో అస్తిత్వ సమస్యలకు పరిష్కారం కనుగొన్నారు. తమ ఆధ్యాత్మికతతో అహం తాలూకు వాస్తవ స్వరూపం తెలుసుకొని, భవబంధ విముక్తులు అయ్యారు !_*


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

సుభాషితం

 🕉️✡️  *సుభాషితం*  ✡️🕉️



శ్లో.

*విత్తం బంధుర్వయః కర్మ*

*విద్యాభవతి పంచమీ|*

*ఏతాని మాన్యస్థానాని*

*గరీయో యద్యదుత్తరమ్||*


ధనం,బాంధవ్యము, వయస్సు, చేసేవృత్తి, విద్య మొదలయినవి ఐదుకూడా గౌరవించదగినవే.వీటిలో కూడా వరసగా ఒకదానికన్నా ఒకటి అంటే ముందుదానికన్నా తర్వాతది గొప్పది.

అనగా ధనంకన్న బాంధవ్యం గొప్పది. ధనం, బాంధవ్యంకన్న వయస్సు గౌరవించదగ్గది. ఆ మూడింటికన్న - "చేసేవృత్తి” గొప్పది అవుతుంది. అన్నింటికన్నను

విద్య అధికంగా ఆదరణీయం అని మనకు విద్యయొక్క వైభవాన్ని పై శ్లోకం తెలుపుతుంది. ఇవి అన్నీ అందరికీ అవసరమైనవే.....


మీ

*~శ్రీశర్మద*