27, మార్చి 2022, ఆదివారం

అంతర్ముఖ సమారాధ్య*

 *అంతర్ముఖ సమారాధ్య*

*బహిర్ముఖ సుదుర్లభా*



సాధన లో *అంతర్ముఖత* ప్రాధాన్యత తెలుపుట కు వశిన్యాది వాగ్దేవతలు ఈ నామం తో స్తుతించారు. కొంత బహిర్ముఖ తంతు అవసరము. కాని బహిర్ముఖ సాధన తోనే పరిమితము అవుట వలన సాధకుడు సద్వస్తువు ను చేరలేడు. 


అందుకే *“అంతర్ముఖ సమారాధ్య-బహిర్ముఖ సుదుర్లభా”* అని ద్వంద్వము ను సూచించారు. 

అనగా సాధన బహిర్ముఖత వలన ఆత్మ ను చేరుకోవడము దుర్లభము. అనగా చాలా కష్టతర సాధ్యము. అంతర్ముఖత వలన సులభము గా సాధ్యతరము. 


మానవ జన్మ లభించడమే బహు దుర్లభము. విశేషంగా కలియుగము లో మానవుడి జీవితకాల పరిమాణమే చాలా తక్కువ. ఇక ఈ తక్కువ జీవిత కాలము లో బహిర్ముఖత కే పరిమితము అవడము అంటే సముద్రము ఊపరితలము లోనే ముత్యములు ను వెతుకడము వంటిది. బాహ్య సాధన కొంత జరిగిన పిమ్మట అంతర్ముఖ సాధన ని కొనసాగించాలి. 

మన నిత్య జీవితము లో చేసే ప్రతి కార్యము కు కావలసిన ప్రేరణ, శక్తి వచ్చేది లోపల నుంచే. సర్వవ్యాపి అయిన ఆత్మ మనలో ఉండుట వలనే జడమైన శరీరము లో కదలికలు,  మాట్లాడే ప్రతి దానిలో *నేను*, *నాది*.. అనే పదజాలం వాడడము సర్వసామాన్యము. అయతే మాట్లాడతున్నది ఎవరు..? శరీరము జడపదార్థము అవడము వలన, శరీరము మాట్లాడలేదు. శరీరమే మాట్లాడును అన్నప్పుడు నిద్రావస్థ లో ఏ మాటామంతి లేకపోవుట కు కారణం ఏమి..? ఇట్టి విచారము *సాంఖ్యము* కు దారి తీయును. దైవము ఉనికి గ్రహించుటకు ఉన్న అనేకమైన మార్గముల లో మంత్రమార్గము, అందులో ప్రత్యేకముగా *శ్రీవిద్య* మహోత్కృష్టమైనది, అతి ప్రాచీనమైనదిగా పేరు పొందెను. ఇక మంత్రమార్గము లో పయనించుటకు శ్రీగురువులు లభించిన తరువాత సాధన ను కొనసాగించగా మంత్రమే సాధకుడను లోన కు తీసుకుపోవును. బాహ్యతంతు ముగిసాక కొంత నియమపూర్వకముగా, ప్రయత్నపూర్వకముగా అంతర్ముఖత అవవలెను. ఈ నామము లో ఉన్న సంకేతము ఇదే. 

ఉదాహరణ కు బయట మనకు ప్రతి వస్తువు లభించును. కాని శాంతి లభించదు. పరిపూర్ణమైన శాంతి, దైవస్వరూపము అవుట వలన, శ్రీ చండి సప్తశతి లో *యా దేవి సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా…..* అని స్తుతింపబడింది. 


సముద్ర ఊపరిభాగము లోనే అలలు ఉండును. సముద్రగర్భము లో నీటి ప్రవాహము కూడా ఉండదు. కారణం కదలికలు లేని నిశ్చలమైన స్థితి. ఇక్కడే అమూల్యమైన సంపద నిక్షిప్తమై ఉండును. ఊపరిభాగము లో నావల వలన జరిగే వ్యాపారములు, గందరగోళము, తుఫాన్లు, కెరటములు, సూర్యరశ్మి వలన భాష్పీకృతము లాంటివే సంభవించును. ఇవన్ని ప్రకృతి మానవాళి కి ఇచ్చే సూచనలు, ఆదేశాలు. కాని ఇంద్రియ 

చాంచల్యము, పటుత్వము వలన మానవుడు  ఈ సూచనలు ను పట్చించుకోడు. ప్రకృతి అనగా శక్తి. గోచరమయే ప్రతి చరాచరము నుంచి మనకు నిత్యమూ ఏదో ఆధ్యాత్మిక సందేశము వస్తూనే ఉండును. ఇదే విషయము *అవధూతోపాఖ్యానము* లో వివరించబడింది. (శ్రీ సరస్వతి గంగాధర్ గారు రచించిన శ్రీ గురు చరిత్ర చివరి భాగము లో కలదు.)

అటులనే శ్రీమద్భగవద్గీత లో రెండవ అధ్యాయము *సాంఖ్య యోగము* లో కూడా ఆత్మ అన్వేషణ వివరణ కలదు. ఇదే విషయము ఋుగ్వేదప్రోక్త *శ్రీదేవీసూక్తము* యందు కూడా కలదు. ఇంకా లోతుగా పరిశీలించగలిగే సాధకబృందము కు 1.దశ ఉపనిషత్తులు (ముఖ్యము గా కఠోపనిషత్-ప్రశ్నోపనిషత్తలు), 2.అష్టావక్రగీత, 3. ఋుభుగీత, 4.గురుతంత్రము, 5.సాంఖ్యయోగము..లాంటివి చాలా సహాయపడును. కర్తృత్వభావన నశించును. కర్తృత్వభావన కు మూలము కూడా *నేను* యే. కాని ఇది *అహంకారము* రజో-తమోగుణ సంపన్నమైనది. కర్తృత్వభావన నశించిన తరువాత మిగిలినది కూడా *నేను* యే. కాని ఇది ప్రారంభమున సత్వగుణసంపన్నమై, చివరకు గుణరహితమైనదిగా మిగిలిపోవును. 


ఇక శ్రీవిద్య పరంగా విచారిస్తే మంత్రము లో ఇమిడి ఉన్న ధ్యానశ్లోకము నే ధ్యానవిషయము గా చేయడము వలన, ధ్యానము సులభమవును. ఇది ఇంద్రియములకు తిరుగు ప్రయాణం వంటిది. లోపల కు ప్రయాణము ప్రారంభము చేయగా చేయగా శూన్యము కు దారితీయును. గుణరహితమైన ఆత్మ గోచరమవును. ఇదియే *నేను*….

ఈ *నేను* యే  *పరదేవత/అమ్మ*..


*అహం రుద్రేభిర్వసుభిశ్చరామి…..* అని ఋుగ్వేదప్రోక్త శ్రీదేవిసూక్తము లో అమ్మ ఘోషిస్తున్న తన స్వరూపము. 


నిత్యము సాధన లో ధ్యానశ్లోకము ను ధ్యానించడము వలన గమ్యము చేరుట సులభము. 


*అమ్మ* ఒక తత్వము. ఈ తత్వమే ఆత్మ తత్వము. ఆత్మ సర్వవ్యాపి అయినా ప్రతి ప్రాణి హృదయగుహ లో స్థిరముగా ఉండుట చేత *అమ్మ* *అంతర్ముఖ సమారాధ్యా* అని స్తుతింపబడినది. 



సర్వం అస్మత్ 

శ్రీ గురుచరణారవిందార్పణమస్తు

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: