29, ఏప్రిల్ 2023, శనివారం

హాస్యానందం

 ఆలు -మగల హాస్యానందం!


"ఏఁవోయ్ .... "


"ఆఁ .... "


"పులుసులో చిలగడ దుంపలు వేసావా, ఘుమఘుమలాడుతోంది?"


"కళ్ళు మూసుకుని పూజ్జేసుకుంటూ మళ్ళీ లౌకికాలు ఎందుకు?"


"కళ్ళు మూసుకున్నాను గానీ ముక్కు మూసుకోలేదుగా?"


"బానే ఉంది. ముందు పూజ కానివ్వండి".


"నైవేద్యానికి ముక్కల పులుసు బ్రహ్మాండంగా ఉంటుందనుకో. భగవంతుడికి ప్రీతికరమైనది".


"మరే .... మీకు కలలోకొచ్చి చెప్పాడాయన!"


"కలలోకే రావాలేఁవిటే ఆది లక్ష్మీ కామేశ్వరీ? మనకు ఇష్టమైనవన్నీ ఆ భగవంతుడికి నైవేద్యాలే. అలా నైవేద్య రూపంలో పెడితే మనం తినేవి పూర్తిగా వంటబడతాయ్ .... భక్తిగా తింటాం కాబట్టి".


"ఓహో .... అలాగా?"


"ఆంజనేయ స్వామికి అప్పాలు, వెంకన్నకు దధ్యోజనం, చక్ర పొంగలి, శివుడికి పాయసం, విఘ్నేశ్వరుడికి లడ్లు, కుమారస్వామికి తేనె, పాలు .."


"ఇంకా ....?"


"అసలు మహా నైవేద్యం అంటేనే మనకు ఇష్టమైనవి మనఃస్పూర్తిగా తినడానికేనే .... ఆ భగవంతుడి పేరు చెప్పి కళ్ళకద్దుకుని ఆరగించడఁవే".


"మరి అమ్మ వారికి ఇష్టమైనవి చెప్పలేదెందుకో?"


"దుర్గమ్మకు పులిహోర, శ్రీ మహా లక్ష్మీకి పూర్ణాలు ...."


"అవేఁవీ కావు .... "


"మరి .... ?"


"అమ్మ వారికి వడ్రాణ్ణం, గాజులు, కమ్మలు, వంకీలు, బుట్టలు, చంద్రహారం, జడలో చామంతి బిళ్ళ  ...."


"ఆపుతావా దండకం? నీకిష్టమైనవాటన్నిటికీ అమ్మవారి పేరు చెబుతావా?"


"మీకిష్టమైన వాటికి భగవంతుడి పేరు చెప్పుకోవడం లేదేంటి మరి?"


"నన్ను కాసేపు పూజ్జేసుకోనిస్తావా? అసలు నిన్ను కదిలించడం నాదీ బుధ్ధి తక్కువ".


"మీరా, నేనా కదిలించింది?"


🤫🤫🤫🤫🤫🤫🤫

దండం_దశగుణం_భవేత్

 *దండం_దశగుణం_భవేత్*

 అన్న వాక్యానికి, నేడర్ధాన్ని  మార్చేశారు.


దండిస్తేకాని పనిజరగదు అనే సందర్భంలో *"దండం దశగుణం భవేత్"* అంటారు నేటి సమాజంలో - కానీ ఆ వాక్యం అసలు అర్థం అదికాదు...


అసలు అర్థాన్ని *అర్చకగ్రంధనిధి* లోని ఈ క్రింది శ్లోకం తెలియ జేస్తుంది.


శ్లోll విశ్వామిత్రాహి  పశుషు

కర్దమేషు జలేషు చ

అంధే తమసి వార్ధక్యే

దండం దశగుణం భవేత్


ఇది శ్లోకం మరి దీనిలోని అర్థం -


1. వి - పక్షులు,

2. శ్వా - కుక్కలు,

3. అమిత్ర - మిత్రులుకానివారు (శత్రువులు),

4. అహి - పాములు,

5. పశు - పశువులు,

6. కర్దమేషు - బురదలో,

7. జలేషు - నీటిలో,

8. అంధే - గుడ్డితనంలో,

9.తమసి - చీకటిలో,

10. వార్ధక్యే - ముసలితవనంలో


దండం - కర్ర,

దశగుణం - 10 గుణాలను, భవేత్ - కలిగిస్తుంది.


అంటే

కర్ర పక్షులను, కుక్కలను, శత్రువులను, పాములను, పశువులను అదుపు చేయడానికి,

బురదలోను, నీటిలోను, గ్రుడ్డితనంలోను, చీకటిలోను, ముసలితనంలోను ఆసరాగా ఉంటుంది.

కావున కర్ర ఈ పది రకాలుగా ఉపయోగపడుతుంది - అని భావం

           .

డొక్కాసీతమ్మ

 అర్థరాత్రి రెండుగంటల సమయంలో వర్షంలో తడిసిన వ్యక్తి "అమ్మా సీతమ్మ తల్లి... ఆకలేస్తుందమ్మా" అని పిలవగానే ఎంతో ఆప్యాయంగా వంటచేసి అన్నం పెట్టి, దుప్పటి, వస్త్రాలు ఇవ్వగలిగిన ఔదార్యవతి *డొక్కాసీతమ్మ* తల్లి *వర్ధంతి ఏప్రియల్ 28.* 


శ్రీ మతి డొక్కా సీతమ్మ గారు తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలుకా, మండపేట గ్రామంలో 1841, అక్టోబరు రెండోవారంలో జన్మించారు. ఈమె తండ్రి అనుపిండి భవానీశంకరం, తల్లి నరసమ్మ గార్లు. సీతమ్మ గారి తండ్రి శంకరం గారిని గ్రామస్తులు 'బువ్వన్న' గారనే పేరుతో పిలుస్తుండేవారు. దానికి కారణం ఆయన అడిగిన వారందరికీ 'బువ్వ' (అన్నం) పెట్టటమే!


అటువంటి తండ్రికి కూతురిగా జన్మించిన సీతమ్మ గారు అన్నార్తుల ఆకలిని తీర్చిన మహా ఇల్లాలు. విద్యావాసనలు లేని సాధారణ గృహిణి ఆమె. బాల్యంలో సీతమ్మ గారికి తల్లితండ్రులు కథలు, పాటలు, పద్యాలు అన్నింటినీ నేర్పారు. ఆ రోజుల్లో స్త్రీలు విద్య నేర్చుకునే అవకాశాలు సరిగా లేకపోవడంతో ప్రాచీన సంప్రదాయాలకు తలవంచి పెద్దబాలశిక్ష వంటి గ్రంధాన్ని కూడా పూర్తిగా అధ్యయనం చెయ్యకుండా నే పెళ్ళికి సిద్ధపడాల్సి వచ్చింది. సీతమ్మ గారి బాల్యంలోనే ఆమె తల్లి నరసమ్మ గారు మరణిస్తే, ఇంటిని చక్కదిద్దే భారం సీతమ్మ గారి మీద పడింది. దానిని ఒక పవిత్రమైన బాధ్యతగా ఆమె స్వీకరించింది. 


గోదావరినదీ పరీవాహక ప్రాంతంలోని కొన్ని గ్రామాలను లంక గ్రామాలని అంటారు. అటువంటి ఒక లంక గ్రామం లంకగన్నవరం. ఆ గ్రామంలో డొక్కాజోగన్న పంతులు గారనే పెద్ద ధనవంతుడు ఉండేవాడు. ఆయన ధనవంతుడే కాకుండా పెద్ద రైతు కూడా. వీటన్నిటినీ మించి మంచి వేదపండితుడు. బువ్వన్నగారు సీతమ్మను డొక్కా జోగన్న గారికిచ్చి అతి వైభవంగా వివాహాన్ని జరిపించారు. సీతమ్మగారు అత్తవారింట్లో అడుగు పెట్టగానే ఆమె ఇంటి పేరు 'డొక్కా' గా మారింది. ఆమెలో సహజంగా ఉన్న ఉదారగుణం, దాతృత్వం రోజు రోజుకూ పెరగసాగాయి. జోగన్న, సీతమ్మ గార్ల దాంపత్యం అన్యోన్యమైనది. ఆ పుణ్య దంపతులను చూసి చుట్టుపక్కల గ్రామాల వారందరూ గొప్పగా చెప్పుకునే వారు. ఆప్యాయతా, ఆదరణలకు నిలయంగా వారి ఇంటిని గురించి ఆచుట్టుపక్కల గ్రామస్తులందరూ ఆ రోజుల్లో గొప్పగా చెప్పుకునేవారు. 


లంక గ్రామాలకు చేరుకోవాలంటే, నేటికీ కూడా పడవే ముఖ్యమైన ప్రయాణ సాధనం. జోగన్నగారి గ్రామమైన లంకగన్నవరం త్రోవలో ఉండటంచేత, చాలామంది ప్రయాణీకులు వారి ఇంటనే భోజనాలు చేసేవారు. ఏ వేళ అతిధులు వచ్చినా వారికి అన్నపానాదులు లేవని చెప్పకుండా వారికి సకల మర్యాదాలు చెయ్యటం ఒక పవిత్రకార్యంగా ఆ దంపతులు స్వీకరించారు.


అచిరకాలంలోనే ఉభయ గోదావరి జిల్లాలలో 'అపర అన్నపూర్ణ' గా శ్రీమతి సీతమ్మ గారు పేరుపొందారు. లంక గ్రామాలకు తరచుగా వరదల వల్ల ప్రమాదాలు ఏర్పడేవి. నిలువ నీడలేని బాధితులను ఆదుకొని వారికి వసతి, భోజన సదుపాయాలను నిరాటంకంగా ఏర్పాటు చేసే ఉదాత్త గుణశీల సీతమ్మగారు. మగవాడు సంపాదించి ఎంత తెచ్చినా, ఔదార్యం లేని స్త్రీ ఉంటే ఆ సంపాదనకు అర్ధం, పరమార్ధం ఉండవు. అన్నదానం చేసి మానవతకు అర్ధం చెప్పిన మహిళాశిరోమణి సీతమ్మగారు. అలా అచిరకాలంలోనే ఆమె ఖ్యాతి భారతదేశమంతా వ్యాపించటమే కాకుండా, ఆంద్ర దేశపు కీర్తిని ఇంగ్లండు వరకు వ్యాపింపజేసిన మహా ఇల్లాలు సీతమ్మ గారు. అన్నం పెట్టేటప్పుడు ఆమె చూపే మాతృప్రేమ మరువరానిది.


ఆవిడ జీవితమంతా మాతృప్రేమను పంచిన మహనీయురాలు గొప్ప నిరతాన్నదాత. వచ్చిన వాళ్లకి లేదనకుండా అన్నం పెట్టేవారు. ఆవిడ ధృతి, దీక్ష ఎంత గోప్పవంటే - ఆవిడ జీవితములో ఒకే ఒక్కసారి అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామి దర్శనానికని బయలుదేరారు. బయలుదేరి, గోదావరి వంతెన వద్ద పల్లకి ఆపారు. ఆవిడ పల్లకిలో కూర్చునారు, బోయీలు అలసిపోయి గట్టు మీద కూర్చున్నారు. అటుగా పి.గన్నవరం వైపు వెళ్ళిపోతున్న ఒక బృందంలో పిల్లలు ఆకలి అని ఏడుస్తుంటే, పెద్దవాళ్ళు "ఒక్క అరగంట లో గన్నవరం వెళ్లీపోతాం... అక్కడ సీతమ్మ గారు మనకు అన్నం పెడతారు" అని మాట్లాడుకోవటం విన్నారు సీతమ్మగారు. వెంటనే ఆవిడ అంతర్వేది వెళ్ళటం మానేసి, పల్లకి వెనక్కి తిప్పెయ్యండి... వీళ్ళకి అన్నం పెట్టాలి అని వెనుకకు వెళ్ళిపోయారు. ఇది ఆమె ఔదార్యానికి ఓ మచ్చుతునక.


నిరంతర అన్నదానంతో 

ఆఖరికి ఆవిడ పరిస్థితి ఎక్కడికి వెళ్లిపోయిందంటే, అందరికీ పెట్టి పెట్టి, ఆ దంపతులకి తినటానికి ఏమీ లేకుండా పోయింది.


ఒకానొకప్పుడు ఆవిడ భార్తగారు "ఎందుకు ఇంకా ఈ అన్నదానం? మనకి కూడా తినటానికి ఏమీ లేదు. వచ్చి ఎవరైనా తలుపుకొడితే సిగ్గేస్తోంది! పెట్టడమా మానవు! ఇంత అన్నం పప్పైనా పెడతావు..." అన్నారు. దానికి ఆవిడ "నేను నిస్వార్థముగా పెట్టేటప్పుడు, వచ్చిన వారు తింటున్నప్పుడూ వచ్చినదీ, తింటున్నదీ శ్రీ మహా విష్ణువని నమ్మి పెట్టాను. ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టే చేతిని ఎందుకు నరికేస్తాడు? మనకీ వాడే పెడతాడు" అని చెప్పింది. తరువాత ఒక రోజు సాయంకాలం  ఇన్నాళ్ళ నుంచీ దున్నుతున్న అదే పొలానికి వెళ్లి సీతమ్మ గారి భర్త గునపంతో తవ్వుతున్నారు. గునపానికి ఏదో తగిలి ఖంగుమంది. ఆయన మట్టి తీసి చూస్తే ఒక బిందె కనపడింది. బిందె మూత తీస్తే, దాని నిండా బంగారు నాణాలే. ఆ బంగారు కాసుల రాశులతో మళ్లీ రొజూ కొన్ని వందల మందికి అన్నదానం చేసారు.


ఆశ్చర్యం ఏమిటంటే బ్రిటిష్ చక్రవర్తి తూర్పు గోదావరి జిల్లా కలక్టరుకి డొక్కా సీతమ్మ గారి ఫోటో తీసి పంపించమని ఉత్తరం వ్రాసాడు. దేనికి అంటే "నాకు పట్టాభిషేకము జరిగేటప్పుడు ఆవిడకు నమస్కారం పెట్టాలి. కానీ ఆవిడ సముద్రము దాటి రారు కాబట్టి, ఆ సమయములో ఒక సోఫా వేసి, ఆవిడ ఫోటో అందులో పెట్టి, ఆవిడకు నమస్కారము పెట్టి అప్పుడు పట్టాభిషేకము చేసుకుంటా" అని వ్రాసాడు. తూర్పు గోదావరి జిల్లా కలక్టరు గారు ఫోటోగ్రాఫర్ ని తీసుకుని ఆవిడ దగ్గరకు వెళ్తే, "నేను ఈ సన్మానాల కోసం, ఫోటోల కోసం, నమస్కారాల కోసం అన్నదానం చెయ్యలేదు. విష్ణు మూర్తికి అన్నం పెడుతున్నాని పెట్టాను. దీనికి ఫోటోలు పట్టభిషేకలు ఎందుకు, వద్దు" అన్నారు ఆవిడ. "అమ్మ ఇది బ్రిటిష్ ప్రభువుల ఉత్తరం. మీరు తీయించుకోకపోతే నా ఉద్యోగం తీసేస్తారు" అని ఆ కలక్టరు గారు చెబితే, "నీ ఉద్యోగం పోతుంది అంటే, తీయించుకుంటా, నువ్వు అన్నం తినాలి" అని ఆమె ఫోటో తీయించుకున్నారు . 


బ్రిటిష్ చక్రవర్తి నిజంగానే ఒక సోఫాలో ఆవిడ ఫోటో పెట్టి, నమస్కరించి, పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆవిడకి పంపించిన పత్రం కూడా ఇప్పటికీ ఉంది. 


ఒక మనిషి నిస్వార్థముగా, ధృతితో, పట్టుదలతో లక్ష్య సిద్ది కోసం పాటుపడితే, వారు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు, వారిని దైవం కూడా నిరంతరం కాపాడుతారు. దీనికి డొక్కా సీతమ్మ గారి జీవితమే  నిదర్శనం.


అన్నదానాన్ని మించిన దానంలేదని చెప్పటమే కాకుండా నిస్వార్ధంగా జాతి, కుల, మత విచక్షణ చూపించకుండా అన్నార్తులందరికీ మాతృప్రేమను పంచి జీవితాన్ని చరితార్ధం చేసుకున్న 'అపర అన్నపూర్ణమ్మ' మన డొక్కా సీతమ్మ గారు!  ఈ జాతిరత్నం 1909 ఏప్రియల్ 28న శివైక్యం చెందారు.


ఈమె జీవిత చరిత్రను గురించి నేటి తరానికి తెలియచేయటం, ఆమె చేసిన నిస్స్వార్ధ సేవలను గుర్తుచేసి ఆమె చరిత్ర నుండి స్ఫూర్తివంతుల ను చేయటమే ఆమహానీయురాలికి మనం ఇవ్వగలిగే ఘనమైన నివాళి!.🌹🙏🌹

 *గంగా పుష్కరాలకు కాశీకి పోలేని వాళ్ళు చింతించక్కరలేదు. శంకరాచార్యులు కాశీ పంచకంలో చెప్పిన ఈశ్లోకం మనస్పూర్తిగా స్మరించుకొంటే చాలు:*

 *"కాశీ క్షేత్రం శరీరం, త్రిభువనజననీ వ్యాపినీ జ్ఞాన గంగా|*

*భక్తిఃశ్రద్ధా గయేయం నిజగురుచరణధ్యానయోగః ప్రయాగః|*

*విశ్వేశోయం తురీయః సకలజనమనస్సాక్షిభూతోంతరాత్మా|*

*దేహే సర్వం మదీయే యది వసతి పునః తీర్థ మన్యత్ కిమస్తి|"*


*తాత్పర్యం:*

**మన శరీరమే కాశీ క్షేత్రం. జ్ఞానమే మూడు లోకాలలో వ్యాపించిన గంగానది. మన భక్తిశ్రద్ధలే గయాక్షేత్రం. మన గురు చరణ ధ్యాన యోగమే ప్రయాగాతీర్థం. సకల జనుల మనస్సాక్షి భూతంగా మనలోని సమాధ్యవస్థాతత్త్వమైఉన్న ఆత్మయే కాశీ విశ్వేశ్వరుడు. ఈ విధంగా మన శరీరంలోనే సర్వ తీర్థాలు నెలకొని ఉండగా ఇంకా వేరే సేవింపదగ్గ పుణ్య తీర్థాలు ఏముంటాయి.!🙏*

*శ్రీవారి జోడు పంచలు*......

 *శ్రీవారి జోడు పంచలు*......


: ఏడుకొండల వెంకన్న ధరించే ఏరువాడ జోడు పంచెలకు ఇంత విశేషం ఉందా?


కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి (Tirumala Tirupati) శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడమే మహా భాగ్యం.

మహా పుణ్యక్షేత్రంగా కీర్తికెక్కిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో ఆశ్చర్య గొలిపే విశేషాలు దాగున్నాయి. తిరుమలలో ప్రతి ఏటా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల (Srivari Brahmotsavala) సందర్భంగా స్వామి వారి మూలావిరాట్టు ధరించే ఏరువాడ జోడు పంచెలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 


గద్వాల సంస్థానం నుంచి 400 ఏళ్ల సంప్రదాయంగా ఈ ఏరువాడ జోడు పంచెలను స్వామివారికి బహుకరిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు ద్వజారోహణం సందర్భంగా మూలమూర్తికి ఈ జోడు పంచెలను (Jodu panche) అలంకరిస్తారు. 


అప్పటినుంచి ఈ జోడు పంచెలు ఏడాది పొడవున్న మూలవిరాట్టుకు ఉంటాయి. ప్రతి శుక్రవారం వీటిని తీసి శుభ్రం చేసి మళ్లీ స్వామి వారికీ అలంకారం చేస్తారు. బ్రహ్మోత్సవాల ముందు రోజున పాత వస్త్రాలను తొలగించి గద్వాల సంస్థానానికి ప్రసాదంగా పంపించి, తిరిగి కొత్త జోడు పంచెలను అలంకరిస్తారు. ఇది గద్వాల చేసుకున్న పుణ్యఫలం.


400 ఏళ్ల సాంప్రదాయంగా:


నవరాత్రి (Navaratri) బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజున తిరుమల శ్రీ వేంకటేశ్వరునికి గద్వాల నేత మగ్గంపై తయారు చేసే ఏరువాడ జోడు పంచెలను అలంకరించిన తర్వాతనే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. గద్వాల (Gadwal) సంస్థానం నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాల కానుకగా అందే ఏరువాడ జోడు పంచె ఎంతో ప్రాముఖ్యత ఉంది. 


400 ఏళ్ల కిందట గద్వాల సంస్థానాదీశులు సాంప్రదాయ బద్దంగా నేత మగ్గాలపై జోడు పంచెలను ఇక్కడి చేనేత కార్మికులచే తయారు చేయించి తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేశారు. ఆనాటి నుంచి ఇది ఆచారంగా కొనసాగిస్తున్నారు. కృష్ణారావు భూపాల్‌తో మొదలైన ఈ సాంప్రదాయం సంస్థానాదిశుల వారసులైన లతా భూపాల్ ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. 


ప్రతి ఏటా ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారి మూలవిగ్రహానికి ఏరువాడ జోడు పంచెలు అలంకరించి ప్రత్యేక పూజలు చేసి అనంతరం బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తారు.


శ్రీవారి చెవిలో చెప్పి:


పంచెలు తిరుమల క్షేత్రానికి చేరిన అనంతరం అక్కడ ప్రధాన పూజారులు "స్వామి...! ఏరువాడ జోడు పంచెలు అందాయి. మీ బ్రహ్మోత్సవాల రోజున నూతన పంచెలు అలంకరణ చేస్తాం" అంటూ శ్రీవారి చెవిలో చెప్పి జోడు పంచెలను భద్రపరుస్తారు. ఏరువాడ జోడు పంచెలను తయారు చేసేందుకు మండలం 45 రోజుల కాలం పడుతుంది.


నామాల మగ్గంపై నేత పనిని ప్రారంభించి, ముగ్గురు నేత కార్మికులు సాంప్రదాయ బద్దంగా నేస్తారు. మరో ఇద్దరు సహకారం అందించారు. ప్రస్తుతం ఈ జోడు పంచెలు నేసిన వారిలో భాగ్యం రమేష్, సాకి సత్యం, లక్ష్మణ్, షణ్ముఖరావు, గద్దె మురళి ఉన్నారు. మగ్గం నేసేటప్పుడు ఏ ఒక్కరు తప్పు చేసినా పని ముందుకు సాగదు. 


దైనందిన జీవితంలో తెలిసీతెలియక తప్పులు దొర్లితే మగ్గం దగ్గరికి వచ్చే సమయానికి ఆ విషయం తమకు పరోక్షంగా ప్రభావం చూపిస్తుందని నేతన్నలు చెబుతున్నారు.


జోడు పంచెలు తయారు మొదలు వాటిని తిరుమలలో అధికారులకు అందించేంత వరకు మగ్గం ఉన్నచోట ఇంట్లో నిత్యం పూజలు చేయడం, గోవిందా నామస్మరణం చేసుకుంటూ పనికి ఉపక్రమించడం వీరి నిత్యకృత్యం. గద్వాల సంస్థానాదిశుల తరుపున గత పది ఏళ్లుగా ఏరువాడ పంచెలను ప్రముఖ వ్యాపారి మహంకాళి కరుణాకర్ ఆధ్వర్యంలో నేస్తున్నారు. 


ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాసంతో ఈ పంచెలను నేతన్నలు నేస్తారు. శ్రావణమాసంలో పంచెల తయారీ ప్రారంభించి నెల రోజులకు పూర్తి చేశారు.


శ్రీవారికి ఇష్టమైన ఏరువాడ జోడు పంచలు;


దేశం నలుమూలల నుంచి శ్రీవారికి కానుకగా పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. వాటిని కేవలం అలంకార ప్రాయంగా మాత్రమే వేడుకలలో శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు అలంకరిస్తారు. గద్వాల చేనేత కార్మికులు తయారు చేసిన శ్రీవారి ఏరువాడ జోడు పంచెలు మాత్రం శ్రీవారి మూలవిగ్రహానికి అలంకరించే ఉంచడం విశేషం. 


11 గజాల పొడవు, 85 అంగుళాల వెడల్పు, ఇరువైపుల 12 అంగుళాల కంచుకోట కొమ్మునగిషీలతో ఏకకాలంలో ముగ్గురు ఒకేసారి నేయడం జోడు పంచెల తయారీలో దాగి ఉన్న సాంకేతిక పరమైన అంశం. సాంకేతికంగా నేత పనిలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినా అనాదిగా నూలు రేషన్ కలయికలతో జోడు పంచెలను సాంప్రదాయ బద్దంగా తయారు చేస్తున్నారు.


ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ఏరువాడ జోరు పంచెలు నేసే విధానం చూడడానికి వెళ్లాలంటే శుచీశుభ్రతను పాటించాల్సిందే. ఇక్కడి నుంచి జోడు పంచెలు అందజేయడం గద్వాల ఖ్యాతిని ఎంతో ఇనుమడింప చేస్తుందని జోడు పంచెల తయారీని పర్యవేక్షిస్తున్న మహంకాళి కరుణాకర్ తెలిపారు. 


ఏడుకొండల వెంకన్నకు పంచెలు నేయడం తమ అదృష్టమని నేతన్నలు గద్దె మురళి, రమేష్, సత్యంలు చెప్తున్నారు. ఏడాది పొడవునా మూలమూర్తికి ఈ జోడు పంచెలు అలంకరణ చేస్తారు.

ఈశ్వరారాధన


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀X65.



      ఏది నిజమైన ఈశ్వరారాధన?

                 ➖➖➖✍️


పురాతనకాలమునుండి పుణ్యక్షేత్రములందు 

ఈశ్వరుని అనేకవిధాల అర్చిస్తున్నాము. వేంకటేశ్వరస్వామి హుండీలో భక్తులర్పించే ధనం మరి యే స్వామికీ లేదు. భుజాలపై కావిళ్ళతో వెళ్ళి భక్తులు పళనిస్వామిని సేవించుకుంటారు. కాశీ నుండితెచ్చిన గంగాతీర్థముతో రామేశ్వరమున లింగాభిషేకం చేస్తారు. అంబళపురంలో స్వామికి పాయసం నివేదించి, భక్తులకా ప్రసాదాన్ని పంచిపెడతారు. వైకంలో మహాదేవునకు ప్రీతిగా అన్నసంతర్పణంచేస్తారు.


వైకాట్టుఅష్టమీ పుణ్యదినాన మలబారులో గృహస్థులందరూ మహాదేవ ప్రీతికై అన్నసంతర్పణలు జరుపుతారు. కేరళ భూమిలోనే మరియొక క్షేత్రములో స్వామికి తెప్పతిరునాళ్ళచే ప్రీతిఘటించుతారు. ఉప్పుటేటిలో అలా నౌకాలీల జరుపుతూ, తెడ్లువేయుటే తాళముగా స్వామిపై పాటలుపాడుతారు. తిరుపతిలోవలెనే ఎటుమానూరులోనూ స్వామికి కానుకలర్పిస్తారు. తిరుప్పలయారులో శ్రీరామునకు తుపాకీమందు ప్రేలుస్తామని భక్తులు మ్రొక్కుకుంటారు. భక్తులొక్కక్కరే ప్రేల్చే ప్రేల్పులతో ఆ పగలంతా ప్రతిధ్వనించిపోతుంది. తిరచూరులో శివలింగానికి చేసిన ఘృతాభిషేకం ఏండ్లతరబడి అలా పేరుకుపోతుంది. భాగవత పురాణాన్ని సంగ్రహిస్తూ నారాయణభట్టకవి రచించిన నారాయణీయమనే గ్రంథాన్ని గురువాయూరులో స్వామి చెంత పారాయణం చేస్తారు.


ఇన్ని విధాలజరిగే ఈశ్వరసేవవల్ల మనం గ్రహించవలసిందేమిటంటే మనకు ప్రీతికరమయిన పదార్థమును భక్తితో స్వామి పాదాలచెంత నివేదిస్తే ఈశ్వరాను గ్రహంవల్ల మనకు మేలు సమకూరుతుందని, స్వధర్మానుష్ఠానం చేస్తూ మనసారా తన్ను భజించేవారినీశ్వరుడు రక్షిస్తాడు. ''ఉద్యోగినం పురుష సింహ ముపైతి లక్ష్మీః'' అన్నారు గనుక, పురుష కారంఉండి తీరాలి. నిజమే కాని. భగవదనుగ్రహం దానికంటె గొప్పది. ఒక్కొక్క ఆలయమందు ఒక్కొక్క విధముగా ఈశ్వరాను గ్రహాన్ని అర్థిస్తాము. స్వభావస్వధర్మములందు కలిగే ప్రమాదమే మృత్యుహేతువని సనత్సుజాతీయం చెప్పుతున్నది.


కనుక స్వభావానుగుణమైన స్వధర్మాచరణమందుఏమరుపాటుతగదు. 'స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః' అని చెప్పబడింది కాబట్టి మానవుడు స్వధర్మాచరణంవల్లనే ఈశ్వరు నారాధించి కృతార్ధుడవుతాడని గ్రహించాలి. శ్రీ భగవత్పాదులు ఉపదేశపంచక మందు-


''వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం''


అన్నారు కనుక నిత్యం వేదాధ్యయనంచేస్తూ వేదవిహిత కర్మల నాచరించడం వల్లనే ఈశ్వరునకు ప్రీతి కలుగుతుంది.


''తేన ఈశస్య విధీయతా మపచితిః''


ఆచార్యులవారు అన్వయమార్గాన చెప్పిన విషయాన్నే అన్వయార్ ''వేదపారాయణము ఒక్కనాటికినీ మానకుము'' అని వ్యతిరేకమార్గాన బోధించారు.


ఈశ్వరారాధనమంటే స్వామిగుళ్ళో దీప ధూపాదులు సమర్పించుటే కాదు, స్వధర్మాన్ని ఆచరిస్తూ  దాని ఫలాన్ని ఈశ్వరునికి అర్పించడమే నిజమయిన ఆరాధనం. మనజీవితంలో ఒక్కొక్క దినం గడవగానే ఇలా ప్రశ్నించుకోవాలి. ఈశ్వరునకు నేడు నేనేమి అర్పించాను? స్వధర్మాన్ని ఈనాడు నే నాచరించానా? మనస్సు నివ్వాళ నిగ్రహించుకొన్నానా? నావల్ల నేడేమైనా ప్రమాదం జరిగిందా? ''నప్రమదితవ్యం'' అనే వేధవిధిని అనువర్తించానా? ''కామ్యేమతి స్త్యజ్యతాం'' అనే ఆచార్యులవారి ఉపదేశాన్ని పాటించానా? ఇలాఏనాటి కానాడు ఆత్మపరీక్ష చేసుకుంటూ క్రమంగా చిత్తశుద్ధిని సాధించాలి, అట్టి చిత్తశుద్ధితో మనం చేసే కర్మల ఫలమంతటినీ ఈశ్వర పాదాలచెంత నివేదించాలి. ఎన్ని క్షేత్రాలు సేవించినా, ఎన్ని శాస్త్రాలు పఠించినా ఇదేమనం తెలుసుకోవలసింది.


''విశ్వ ప్రేమకు బాహ్యరూపం అహింస''


తోటి మానవులనే కాదు. పశుపక్ష్యాదులను కూడా మనం ప్రేమించాలి. ప్రేమలేని బ్రతుకు ఎడారివంటిది. సర్వభూతములయందు ప్రేమచే నిండినవానిని దుఃఖములు బాధించవు. పసివాళ్ళలో ప్రేమ పొంగిపోర్లుతూవుంటుంది. వయస్సు వచ్చినకొద్దీ ఆ ప్రేమ తరిగిపోతుంది. ప్రేమఅంటే బిడ్డల ఎడ తల్లికుండే ప్రేమ ''కపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి'' అన్నారు భగవత్పాదులు. లోకంలో కుపుత్రులుంటారు గానీ, కుమాత ఉండదట. తన సౌఖ్యంకంటె బిడ్డసౌఖ్యమునే ప్రధానముగా ఎంచుకుంటుంది. తల్లి, భూతజాలముపట్ల అటువంటి ప్రేమతో వాటికి సౌకర్యం కల్పిస్తూ ఉండాలి మనం.


మొదలనేది ఉన్నప్పుడు తుది అనేది వుండనేవుంటుంది కనుక ఈప్రేమకుగూడా దుఃఖాంతం తప్పదు. మనం ప్రేమించిన జీవి మరణిస్తే మనకు దుఃఖంతప్పదు. అట్లని ప్రేమించటం మానుకుంటామా? ప్రేమను త్రుంచివేస్తామా! అలా చేయనక్కరలేదు. నాశములేని ప్రేమను అలవర్చుకోవాలి మనం. అది ఎలాగంటే అనంతుడు, అనశ్వరుడు అయిన భగవంతుని ప్రేమించాలి. భూమిపై పుట్టినవన్నీ గిట్టుతవి. ఈశ్వరుడొక్కడే శాశ్వతుడు. తక్కిన సమస్తము ఈశ్వరునివలన పుట్టి. జీవించి, మరణముచే ఈశ్వరునే పొందుచున్నవి. కనుక ఈశ్వరభక్తి యుక్తులమై, సమస్తమును ఈశ్వరునిగచూడగలిగితే వానిపై ఈశ్వర ప్రేమవంటిప్రేమయే కుదురుతుంది. భూతజాలమంతా ఈశ్వర స్వరూపమేననీ, అతని చిచ్ఛక్తులే అంతటా ఆవరించి యున్నవనీ, కానినాడే ప్రాణియు కదలలేదనీ మనం గురుతుంచుకుంటే సమస్తమును ఈశ్వర మయంగా తెలుసుకోగలుగుతాము.


ప్రకాశరహితమైన ఆకాశంపై సూర్యకాంతి పడినంతనే అది చీకటి కోనలకు వెలుగునిస్తుంది. అట్లే సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు అయిన భగవంతుని వల్లనే వస్తుజాతమునకు ఎరుక లభిస్తున్నది. కాబట్టి మనకు కనిపించే అన్నింటినీ, అవి అదృశ్యమైనప్పుడుగూడా ఈశ్వరుని గాంచి మనం ప్రేమింపగలిగితే, ఆ ప్రేమ మనహృదయములనుండి ఏనాటికీ చెరిగిపోదు.


మనోవాక్కాయములచే అహింస నాచరించుటే ఈ విశ్వప్రేమకు బాహ్యరూపమని చెప్పాలి. అవశ్యాచరణీయమయిన ఈ అహింస కూడా అన్ని వేళల, అన్నిచోట్ల, అన్నిటి యెడల పనికిరాదు. గాంధీజీవంటి అహింసావ్రతుడు గూడ ఆబెయ్యకు బాధావిముక్తి కొరకు హింస నవలంబింప వలసి వచ్చింది. గాంధీజీని చంపినవానికి గాంధి అనుయాయులు మరణదండనం విధించవలసివచ్చింది. కుడిచెంపపై కొట్టినవానికి ఎడమచెంపనుగూడ అందింపుడని ఏసుక్రీస్తు తమశిష్యుల కుపదేశించారు. పడమటి దేశాల్లో ఆమహనీయుని అనుయాయులే నేడు రెండు యుద్ధప్రళయములు తెచ్చిపెట్టి అంతటితో తృప్తి చెందక ఒండొరులతో పోటీలుపడి ఇంకా ఘోరతరమయిన మారణాస్త్రాలు సృష్టిస్తూ సర్వనాశనానికి ఆయత్తులవుతున్నారు. వైదికములయిన యజ్ఞాలలో పశుహింసకూడదని ధ్వజమెత్తిన బుద్ధదేవుని మతస్థులే నేడు మాంసాశనులై జీవహింస కొడిగట్టుతున్నారు. దీనినిబట్టి చూడగా, అహింస ఉత్తమ ధర్మమైనప్పటికీ సర్వేసర్వత్రా అది ఆచరణీయం కాదని తేలుతున్నది.


హిందువులలో పూర్వాచారపరులు శాకాహారులే అగుట ప్రశసింపదగింది. వంగీయులు సాధారణంగా మత్స్యభుక్త్కులయినప్పటికీ అచటి పూర్వసువాసినులు శాకభక్షణమే చేస్తారు. ఏకాదశినాడు వారు ఒక్క నీటిబొట్టుకూడా పుచ్చుకోరు. దక్షిణ దేశంలోచాలమంది శాకభక్షణానికేఅలపడ్డారు. ఇచట మాంసభక్షకులుకూడా పండుగ పబ్బములందు శాకభక్షణమే చేస్తారనేది గమనించదగినది. జంతువులను హింసివలసివస్తుంది. కనుక మాంసభక్షణం నిషిద్ధమయింది. మరిశాకములను తరగటంకూడా హింసయేకదా? గింజలను తినేవారు కూడా వాటికి గర్భదళనం చేస్తున్నారు. కాబట్టి అదీ హింస క్రిందికే వస్తుంది. కనుకనే జీవహింస తగదనేవారు పండిరాలిన ఆకులనూ, పండ్లనుమాత్రమే భుజించుట వ్రతంగా పెట్టుకున్నారు. పూర్వం మనఋషులు ఫలవర్ణములను, దూడ కుడువగా మిగిలిన ఆవు పాలను మాత్రమే భుజించేవారు. అట్టి సాత్వికాహారంవల్ల కామవిజయం సులభంగా లభిస్తుంది. నేడు కుటుంబనియంత్రణకొరకు చెప్పే ఉపాయాలలోకూడా ఏదో విధమైనహింసతప్పదు. కనుక, వీటికంటే కామవిజయంకోసం యత్నించటమే మేలు.


ఫలవర్ణభక్షణం ఎవరో నియమాత్ములకేతప్ప అందరికీ సాధ్యంకాదు. తక్కినవారు సాధ్యమైనంతవరకుతక్కువహింసతో గడుపుకోవాలి. అహింసకోసం అందరూ యత్నించవలసిందే కాని, కొందరుమాత్రమే అందు కృతకృత్యులు కాగలరు. బుద్ధుడు, ఏసుక్రీస్తు, గాంధి ఈ మువ్వురు అధికారభేదం పాటింపక, అందరికీ అహింస నుపదేశించారు. హిందూధర్మం అట్లుకాక, అధికారభేదాన్ని విచారించి, సంసారాది బంధములు త్రెంచుకొన్న సన్యాసులకే దాన్ని విధించింది. గృహస్తులకు సాంఘికములైన మరియాదలు, అవసరములు ఉంటవి కనుక వారికి అహింసావ్రతం పూర్తిగా చెల్లనేరదు. హిందూమతం వారి వారి స్థితిగతులను విచారించి ధర్మోపదేశం చేస్తుంది. కనుకనే కృష్ణభగవానులు అర్జునుణ్ణి ఒక అవసరమందుయుద్ధం చేయవలసిందన్నారు. మరియొక అవసరమందు అహింసనాచ రింపలసిందన్నారు. ధర్మాధికారిదోషులకు మరణదండనాదికం విధించేటప్పుడు అది హింసగా ఎంచుకొనడు. మనకు ప్రీతిపాత్రులైనవారికైనా పిచ్చియెత్తితే సంకేళ్ళు వేస్తాము. బుద్దుడు, క్రీస్తు, గాంధి, ఈ అధికార తారతమ్యం విచారింపక అందరికీ అహింస నుపదేసించుటవల్లనే వారి యత్నములు ఫలించినవి కావు. అధికారభేదము ననుసరించి ధర్మాచరణం చేస్తూవుంటే పరమధర్మానికి హాని కలుగదు. అనవసరమైన దోషములకు తావుండదు. అపరిహార్యములైన దోషములు కూడ చాలావరకు పరిహృతము లవుతవి.


--- “జగద్గురు బోధలు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం॥


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య

వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్

ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

https://t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam

# కంచి పరమాచర్య స్వామి వైభవం#

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*

నిద్ర నియమాలు

 ఆయుర్వేదం నందలి నిద్ర నియమాలు  - 


 *  ఆరోగ్యం , శరీరపుష్టి , రోగము , కృశత్వము , బలము , శరీర బలహీనత , పురుషత్వము , నపుంసకత్వం , జ్ఞానము , అజ్ఞానము , జీవితము , మరణము ఇవన్నియు నిద్రకు అధీనములై ఉన్నవి. అనగా నిద్రపైన ఆధారపడి ఉన్నవని అర్థం.


 *  నిద్రించుటకు రాత్రియే సరైన సమయము . రాత్రి సమయము నందు 6 లేక 9 గంటల కాలం నిద్రించవలెను. కాలాన్ని అతిక్రమించక నిద్రించవలెను. ఒకవేళ రాత్రి సమయము నందు జాగరణ చేయవలసి వచ్చినచో అట్టి జాగరణ ఎంత సమయం చేసినారో అందు సగం సమయం భోజనమునకు పూర్వము నందే ప్రాతఃకాలము నందే నిద్రించవలెను.


 *  రాత్రి సమయము నందు ఎక్కువ కాలం జాగరణ చేసినచో శరీరం నందు రూక్షగుణం ఎక్కువై వాతరోగములు కలుగును.


 *  వృద్దులు , బాలురు , బలహీనులు , ధాతుక్షయం కలవారు , శ్వాస , హిక్కా , అతిసారం , దెబ్బలు తగిలినవారు , శూల , దప్పి , అజీర్ణం , ఉన్మాదం రోగములు కలవారు , అధికంగా మాట్లాడుట , ఆయాసం కలిగించు పనులు , గుర్రము , ఒంటె మొదలగువానిపై స్వారి చేయుట , మార్గగమనము , మద్యములు తాగుట , సంభోగం చేసినవారు , భయం , కోపం , శోకములచే శ్రమ పొందినవారు , ప్రతిదినం మధ్యాహ్నం నిద్రించుట అలవాటుగా గలవారు పగలు నిద్రించవచ్చు. అందువలన దోష , ధాతు సమానత కలుగును.


 *  ఎక్కువైన మేథస్సు , కఫం కలిగినవారు , గట్టిగా ఉండు ఆహారం తీసుకున్నవారు ఎప్పుడూ పగలు నిద్రించకూడదు. ఇటువంటివారు గ్రీష్మకాలం నందు కూడా నిద్రించరాదు . విషపీడితుడు , కంటరోగం కలవాడు రాత్రులయందు కూడా నిద్రించరాదు .


 *  ఆకాలంలో నిద్రించుచున్న ఆరోగ్యమును , ఆయువును నశింపచేయుటయే గాక మోహము , జ్వరం , పీనస , శిరోరగము , వాపు , మూత్రబంధనం వంటిరోగాలు కలుగును.


 *  నిద్రయొక్క వేగమును ఆపుట వలన మోహము , తలబరువు , కండ్లునొప్పులు , సోమరితనం , ఆవలింతలు , శరీరం బరువు పెరగటం వంటివి కలుగును. ఇట్టి స్థితి యందు శరీరమర్ధనం , శరీర అంగములు పిసుకుట , నిద్రించుట చేయవలెను .


 *  రాత్రినిద్ర తక్కువైనచో అట్టికాలములో మరురోజు ఉదయమున భోజనం చేయకుండా నిద్రించవలెను . రాత్రియందు సక్రమముగా నిద్రపట్టనివారు క్షీరము , మద్యము , మాంసరసము , పెరుగు వీనిని తాగవలెను . అభ్యంగనం , స్నానం మొదలగునవి ఆచరించవలెను.


 *  నిద్రించునప్పుడు నిద్రాభంగము కలిగినచో బడలిక , సోమరితనం , తలబరువు , ఆవలింతలు , ఒళ్ళు నొప్పులు , బడలికగా ఉండటం , పనుల యందు ఇష్టం లేకుండా ఉండటం , భ్రమ , అజీర్ణం , వాతరోగములు కలుగును.


 *  కూర్చుండి నిద్రపోయినచో కఫవృద్ధి , ఆరోగ్యభంగం కలుగదు .


            పూర్తి వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


    

మంచిమనస్సుతో

 .

          _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*చక్షుఃపూతం న్యసేత్ పాదం* 

*వస్త్రపూతం జలం పిబేత్।*

*సత్యపూతాం వదేద్వాణీం* 

*మనఃపూతం సమాచరేత్॥*


తా𝕝𝕝 

*శుభదృష్టితో అడుగు వేయవలెను. అనగా ముందుచూపుతో అడుగు వేయవలెను. శుభ్రమైన గుడ్డతో వడగట్టిన నీటిని త్రాగవలెను. పవిత్రమైన సత్యంతో కూడిన వాక్కును పలుకవలెను. మంచిమనస్సుతో మెలగవలెను*."....