29, ఏప్రిల్ 2023, శనివారం

ఈశ్వరారాధన


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀X65.



      ఏది నిజమైన ఈశ్వరారాధన?

                 ➖➖➖✍️


పురాతనకాలమునుండి పుణ్యక్షేత్రములందు 

ఈశ్వరుని అనేకవిధాల అర్చిస్తున్నాము. వేంకటేశ్వరస్వామి హుండీలో భక్తులర్పించే ధనం మరి యే స్వామికీ లేదు. భుజాలపై కావిళ్ళతో వెళ్ళి భక్తులు పళనిస్వామిని సేవించుకుంటారు. కాశీ నుండితెచ్చిన గంగాతీర్థముతో రామేశ్వరమున లింగాభిషేకం చేస్తారు. అంబళపురంలో స్వామికి పాయసం నివేదించి, భక్తులకా ప్రసాదాన్ని పంచిపెడతారు. వైకంలో మహాదేవునకు ప్రీతిగా అన్నసంతర్పణంచేస్తారు.


వైకాట్టుఅష్టమీ పుణ్యదినాన మలబారులో గృహస్థులందరూ మహాదేవ ప్రీతికై అన్నసంతర్పణలు జరుపుతారు. కేరళ భూమిలోనే మరియొక క్షేత్రములో స్వామికి తెప్పతిరునాళ్ళచే ప్రీతిఘటించుతారు. ఉప్పుటేటిలో అలా నౌకాలీల జరుపుతూ, తెడ్లువేయుటే తాళముగా స్వామిపై పాటలుపాడుతారు. తిరుపతిలోవలెనే ఎటుమానూరులోనూ స్వామికి కానుకలర్పిస్తారు. తిరుప్పలయారులో శ్రీరామునకు తుపాకీమందు ప్రేలుస్తామని భక్తులు మ్రొక్కుకుంటారు. భక్తులొక్కక్కరే ప్రేల్చే ప్రేల్పులతో ఆ పగలంతా ప్రతిధ్వనించిపోతుంది. తిరచూరులో శివలింగానికి చేసిన ఘృతాభిషేకం ఏండ్లతరబడి అలా పేరుకుపోతుంది. భాగవత పురాణాన్ని సంగ్రహిస్తూ నారాయణభట్టకవి రచించిన నారాయణీయమనే గ్రంథాన్ని గురువాయూరులో స్వామి చెంత పారాయణం చేస్తారు.


ఇన్ని విధాలజరిగే ఈశ్వరసేవవల్ల మనం గ్రహించవలసిందేమిటంటే మనకు ప్రీతికరమయిన పదార్థమును భక్తితో స్వామి పాదాలచెంత నివేదిస్తే ఈశ్వరాను గ్రహంవల్ల మనకు మేలు సమకూరుతుందని, స్వధర్మానుష్ఠానం చేస్తూ మనసారా తన్ను భజించేవారినీశ్వరుడు రక్షిస్తాడు. ''ఉద్యోగినం పురుష సింహ ముపైతి లక్ష్మీః'' అన్నారు గనుక, పురుష కారంఉండి తీరాలి. నిజమే కాని. భగవదనుగ్రహం దానికంటె గొప్పది. ఒక్కొక్క ఆలయమందు ఒక్కొక్క విధముగా ఈశ్వరాను గ్రహాన్ని అర్థిస్తాము. స్వభావస్వధర్మములందు కలిగే ప్రమాదమే మృత్యుహేతువని సనత్సుజాతీయం చెప్పుతున్నది.


కనుక స్వభావానుగుణమైన స్వధర్మాచరణమందుఏమరుపాటుతగదు. 'స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః' అని చెప్పబడింది కాబట్టి మానవుడు స్వధర్మాచరణంవల్లనే ఈశ్వరు నారాధించి కృతార్ధుడవుతాడని గ్రహించాలి. శ్రీ భగవత్పాదులు ఉపదేశపంచక మందు-


''వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం''


అన్నారు కనుక నిత్యం వేదాధ్యయనంచేస్తూ వేదవిహిత కర్మల నాచరించడం వల్లనే ఈశ్వరునకు ప్రీతి కలుగుతుంది.


''తేన ఈశస్య విధీయతా మపచితిః''


ఆచార్యులవారు అన్వయమార్గాన చెప్పిన విషయాన్నే అన్వయార్ ''వేదపారాయణము ఒక్కనాటికినీ మానకుము'' అని వ్యతిరేకమార్గాన బోధించారు.


ఈశ్వరారాధనమంటే స్వామిగుళ్ళో దీప ధూపాదులు సమర్పించుటే కాదు, స్వధర్మాన్ని ఆచరిస్తూ  దాని ఫలాన్ని ఈశ్వరునికి అర్పించడమే నిజమయిన ఆరాధనం. మనజీవితంలో ఒక్కొక్క దినం గడవగానే ఇలా ప్రశ్నించుకోవాలి. ఈశ్వరునకు నేడు నేనేమి అర్పించాను? స్వధర్మాన్ని ఈనాడు నే నాచరించానా? మనస్సు నివ్వాళ నిగ్రహించుకొన్నానా? నావల్ల నేడేమైనా ప్రమాదం జరిగిందా? ''నప్రమదితవ్యం'' అనే వేధవిధిని అనువర్తించానా? ''కామ్యేమతి స్త్యజ్యతాం'' అనే ఆచార్యులవారి ఉపదేశాన్ని పాటించానా? ఇలాఏనాటి కానాడు ఆత్మపరీక్ష చేసుకుంటూ క్రమంగా చిత్తశుద్ధిని సాధించాలి, అట్టి చిత్తశుద్ధితో మనం చేసే కర్మల ఫలమంతటినీ ఈశ్వర పాదాలచెంత నివేదించాలి. ఎన్ని క్షేత్రాలు సేవించినా, ఎన్ని శాస్త్రాలు పఠించినా ఇదేమనం తెలుసుకోవలసింది.


''విశ్వ ప్రేమకు బాహ్యరూపం అహింస''


తోటి మానవులనే కాదు. పశుపక్ష్యాదులను కూడా మనం ప్రేమించాలి. ప్రేమలేని బ్రతుకు ఎడారివంటిది. సర్వభూతములయందు ప్రేమచే నిండినవానిని దుఃఖములు బాధించవు. పసివాళ్ళలో ప్రేమ పొంగిపోర్లుతూవుంటుంది. వయస్సు వచ్చినకొద్దీ ఆ ప్రేమ తరిగిపోతుంది. ప్రేమఅంటే బిడ్డల ఎడ తల్లికుండే ప్రేమ ''కపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి'' అన్నారు భగవత్పాదులు. లోకంలో కుపుత్రులుంటారు గానీ, కుమాత ఉండదట. తన సౌఖ్యంకంటె బిడ్డసౌఖ్యమునే ప్రధానముగా ఎంచుకుంటుంది. తల్లి, భూతజాలముపట్ల అటువంటి ప్రేమతో వాటికి సౌకర్యం కల్పిస్తూ ఉండాలి మనం.


మొదలనేది ఉన్నప్పుడు తుది అనేది వుండనేవుంటుంది కనుక ఈప్రేమకుగూడా దుఃఖాంతం తప్పదు. మనం ప్రేమించిన జీవి మరణిస్తే మనకు దుఃఖంతప్పదు. అట్లని ప్రేమించటం మానుకుంటామా? ప్రేమను త్రుంచివేస్తామా! అలా చేయనక్కరలేదు. నాశములేని ప్రేమను అలవర్చుకోవాలి మనం. అది ఎలాగంటే అనంతుడు, అనశ్వరుడు అయిన భగవంతుని ప్రేమించాలి. భూమిపై పుట్టినవన్నీ గిట్టుతవి. ఈశ్వరుడొక్కడే శాశ్వతుడు. తక్కిన సమస్తము ఈశ్వరునివలన పుట్టి. జీవించి, మరణముచే ఈశ్వరునే పొందుచున్నవి. కనుక ఈశ్వరభక్తి యుక్తులమై, సమస్తమును ఈశ్వరునిగచూడగలిగితే వానిపై ఈశ్వర ప్రేమవంటిప్రేమయే కుదురుతుంది. భూతజాలమంతా ఈశ్వర స్వరూపమేననీ, అతని చిచ్ఛక్తులే అంతటా ఆవరించి యున్నవనీ, కానినాడే ప్రాణియు కదలలేదనీ మనం గురుతుంచుకుంటే సమస్తమును ఈశ్వర మయంగా తెలుసుకోగలుగుతాము.


ప్రకాశరహితమైన ఆకాశంపై సూర్యకాంతి పడినంతనే అది చీకటి కోనలకు వెలుగునిస్తుంది. అట్లే సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు అయిన భగవంతుని వల్లనే వస్తుజాతమునకు ఎరుక లభిస్తున్నది. కాబట్టి మనకు కనిపించే అన్నింటినీ, అవి అదృశ్యమైనప్పుడుగూడా ఈశ్వరుని గాంచి మనం ప్రేమింపగలిగితే, ఆ ప్రేమ మనహృదయములనుండి ఏనాటికీ చెరిగిపోదు.


మనోవాక్కాయములచే అహింస నాచరించుటే ఈ విశ్వప్రేమకు బాహ్యరూపమని చెప్పాలి. అవశ్యాచరణీయమయిన ఈ అహింస కూడా అన్ని వేళల, అన్నిచోట్ల, అన్నిటి యెడల పనికిరాదు. గాంధీజీవంటి అహింసావ్రతుడు గూడ ఆబెయ్యకు బాధావిముక్తి కొరకు హింస నవలంబింప వలసి వచ్చింది. గాంధీజీని చంపినవానికి గాంధి అనుయాయులు మరణదండనం విధించవలసివచ్చింది. కుడిచెంపపై కొట్టినవానికి ఎడమచెంపనుగూడ అందింపుడని ఏసుక్రీస్తు తమశిష్యుల కుపదేశించారు. పడమటి దేశాల్లో ఆమహనీయుని అనుయాయులే నేడు రెండు యుద్ధప్రళయములు తెచ్చిపెట్టి అంతటితో తృప్తి చెందక ఒండొరులతో పోటీలుపడి ఇంకా ఘోరతరమయిన మారణాస్త్రాలు సృష్టిస్తూ సర్వనాశనానికి ఆయత్తులవుతున్నారు. వైదికములయిన యజ్ఞాలలో పశుహింసకూడదని ధ్వజమెత్తిన బుద్ధదేవుని మతస్థులే నేడు మాంసాశనులై జీవహింస కొడిగట్టుతున్నారు. దీనినిబట్టి చూడగా, అహింస ఉత్తమ ధర్మమైనప్పటికీ సర్వేసర్వత్రా అది ఆచరణీయం కాదని తేలుతున్నది.


హిందువులలో పూర్వాచారపరులు శాకాహారులే అగుట ప్రశసింపదగింది. వంగీయులు సాధారణంగా మత్స్యభుక్త్కులయినప్పటికీ అచటి పూర్వసువాసినులు శాకభక్షణమే చేస్తారు. ఏకాదశినాడు వారు ఒక్క నీటిబొట్టుకూడా పుచ్చుకోరు. దక్షిణ దేశంలోచాలమంది శాకభక్షణానికేఅలపడ్డారు. ఇచట మాంసభక్షకులుకూడా పండుగ పబ్బములందు శాకభక్షణమే చేస్తారనేది గమనించదగినది. జంతువులను హింసివలసివస్తుంది. కనుక మాంసభక్షణం నిషిద్ధమయింది. మరిశాకములను తరగటంకూడా హింసయేకదా? గింజలను తినేవారు కూడా వాటికి గర్భదళనం చేస్తున్నారు. కాబట్టి అదీ హింస క్రిందికే వస్తుంది. కనుకనే జీవహింస తగదనేవారు పండిరాలిన ఆకులనూ, పండ్లనుమాత్రమే భుజించుట వ్రతంగా పెట్టుకున్నారు. పూర్వం మనఋషులు ఫలవర్ణములను, దూడ కుడువగా మిగిలిన ఆవు పాలను మాత్రమే భుజించేవారు. అట్టి సాత్వికాహారంవల్ల కామవిజయం సులభంగా లభిస్తుంది. నేడు కుటుంబనియంత్రణకొరకు చెప్పే ఉపాయాలలోకూడా ఏదో విధమైనహింసతప్పదు. కనుక, వీటికంటే కామవిజయంకోసం యత్నించటమే మేలు.


ఫలవర్ణభక్షణం ఎవరో నియమాత్ములకేతప్ప అందరికీ సాధ్యంకాదు. తక్కినవారు సాధ్యమైనంతవరకుతక్కువహింసతో గడుపుకోవాలి. అహింసకోసం అందరూ యత్నించవలసిందే కాని, కొందరుమాత్రమే అందు కృతకృత్యులు కాగలరు. బుద్ధుడు, ఏసుక్రీస్తు, గాంధి ఈ మువ్వురు అధికారభేదం పాటింపక, అందరికీ అహింస నుపదేశించారు. హిందూధర్మం అట్లుకాక, అధికారభేదాన్ని విచారించి, సంసారాది బంధములు త్రెంచుకొన్న సన్యాసులకే దాన్ని విధించింది. గృహస్తులకు సాంఘికములైన మరియాదలు, అవసరములు ఉంటవి కనుక వారికి అహింసావ్రతం పూర్తిగా చెల్లనేరదు. హిందూమతం వారి వారి స్థితిగతులను విచారించి ధర్మోపదేశం చేస్తుంది. కనుకనే కృష్ణభగవానులు అర్జునుణ్ణి ఒక అవసరమందుయుద్ధం చేయవలసిందన్నారు. మరియొక అవసరమందు అహింసనాచ రింపలసిందన్నారు. ధర్మాధికారిదోషులకు మరణదండనాదికం విధించేటప్పుడు అది హింసగా ఎంచుకొనడు. మనకు ప్రీతిపాత్రులైనవారికైనా పిచ్చియెత్తితే సంకేళ్ళు వేస్తాము. బుద్దుడు, క్రీస్తు, గాంధి, ఈ అధికార తారతమ్యం విచారింపక అందరికీ అహింస నుపదేసించుటవల్లనే వారి యత్నములు ఫలించినవి కావు. అధికారభేదము ననుసరించి ధర్మాచరణం చేస్తూవుంటే పరమధర్మానికి హాని కలుగదు. అనవసరమైన దోషములకు తావుండదు. అపరిహార్యములైన దోషములు కూడ చాలావరకు పరిహృతము లవుతవి.


--- “జగద్గురు బోధలు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం॥


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య

వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్

ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

https://t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam

# కంచి పరమాచర్య స్వామి వైభవం#

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*

కామెంట్‌లు లేవు: