ఆలు -మగల హాస్యానందం!
"ఏఁవోయ్ .... "
"ఆఁ .... "
"పులుసులో చిలగడ దుంపలు వేసావా, ఘుమఘుమలాడుతోంది?"
"కళ్ళు మూసుకుని పూజ్జేసుకుంటూ మళ్ళీ లౌకికాలు ఎందుకు?"
"కళ్ళు మూసుకున్నాను గానీ ముక్కు మూసుకోలేదుగా?"
"బానే ఉంది. ముందు పూజ కానివ్వండి".
"నైవేద్యానికి ముక్కల పులుసు బ్రహ్మాండంగా ఉంటుందనుకో. భగవంతుడికి ప్రీతికరమైనది".
"మరే .... మీకు కలలోకొచ్చి చెప్పాడాయన!"
"కలలోకే రావాలేఁవిటే ఆది లక్ష్మీ కామేశ్వరీ? మనకు ఇష్టమైనవన్నీ ఆ భగవంతుడికి నైవేద్యాలే. అలా నైవేద్య రూపంలో పెడితే మనం తినేవి పూర్తిగా వంటబడతాయ్ .... భక్తిగా తింటాం కాబట్టి".
"ఓహో .... అలాగా?"
"ఆంజనేయ స్వామికి అప్పాలు, వెంకన్నకు దధ్యోజనం, చక్ర పొంగలి, శివుడికి పాయసం, విఘ్నేశ్వరుడికి లడ్లు, కుమారస్వామికి తేనె, పాలు .."
"ఇంకా ....?"
"అసలు మహా నైవేద్యం అంటేనే మనకు ఇష్టమైనవి మనఃస్పూర్తిగా తినడానికేనే .... ఆ భగవంతుడి పేరు చెప్పి కళ్ళకద్దుకుని ఆరగించడఁవే".
"మరి అమ్మ వారికి ఇష్టమైనవి చెప్పలేదెందుకో?"
"దుర్గమ్మకు పులిహోర, శ్రీ మహా లక్ష్మీకి పూర్ణాలు ...."
"అవేఁవీ కావు .... "
"మరి .... ?"
"అమ్మ వారికి వడ్రాణ్ణం, గాజులు, కమ్మలు, వంకీలు, బుట్టలు, చంద్రహారం, జడలో చామంతి బిళ్ళ ...."
"ఆపుతావా దండకం? నీకిష్టమైనవాటన్నిటికీ అమ్మవారి పేరు చెబుతావా?"
"మీకిష్టమైన వాటికి భగవంతుడి పేరు చెప్పుకోవడం లేదేంటి మరి?"
"నన్ను కాసేపు పూజ్జేసుకోనిస్తావా? అసలు నిన్ను కదిలించడం నాదీ బుధ్ధి తక్కువ".
"మీరా, నేనా కదిలించింది?"
🤫🤫🤫🤫🤫🤫🤫
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి