2, మార్చి 2022, బుధవారం

క్షీర సాగర మథనము.

 MAAGHA PURANAM -- 29


29 అధ్యాయము 


మాఘమాసమందు ఏకాదశీ మహాత్మ్యము – క్షీర సాగర మథనము.


మాఘమాసమునందు నదీస్నానము చేసి, మాఘమాస వ్రతము ఆచరించిన వారికి అశ్వమేథ యాగము చేసిన ఫలము కలుగుతుంది. ఈ మాఘమాసములో ఏకాదశీ వ్రతము చేసి ఉపవాసము ఉన్నవారు వైకుంఠప్రాప్తి పొందగలరు. మాఘమాసమందు ఏకాదశీ వ్రతము చేసి సత్ఫలితము పొందిన దేవతలకథలు వినండి. 

పూర్వకాలమందు దేవతలు, రాక్షసులు క్షీర సాగరమును మధించి అమృతమును పొందవలెనని అభిప్రాయమ కలిగి మంధర పర్వతమును కవ్వముగా, వాసుకి అను సర్పమును త్రాడుగా చేసుకొని క్షీరసాగరమును  మధించసాగారు. తలవైపు రాక్షసులు, తోక వైపు దేవతలు ఉండి మధిస్తు ఉండగా మొదట పుట్టిన లక్ష్మీదేవిని  విష్ణుమూర్తి భార్యగా స్వీకరించాడు.  తరవాత ఉచ్చైశ్రవము అనే గుఱ్ఱము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించగా  వాటిని విష్ణుమూర్తి ఆదేశముపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరల పాలసముద్రమును మధించగా లోకభీకరమై ఘనమైనతేజస్సుతో ఉండే అగ్ని తుల్యమైన హాలాహలము పుట్టింది. ఆ హాలాహల విష జ్వాలలతో సమస్త లోకములు కాలిపోతున్నాయి. దేవతలు, రాక్షసులు భయపడి పారిపోయి సర్వేశ్వరుని శరణుకోరగా  భోళాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషమును తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువల్లనే శివుని కంఠము నీలముగా మారి ఆనాటినుండి నీలకంఠుడని పేరు వచ్చింది. మళ్ళీ దేవ దానవులు అమృతం కోసం పాలసముద్రమును మధించగా అమృతము పుట్టింది. ఆ అమృతము కొరకు వారిరువురు తగవులాడుకొన సాగారు. శ్రీమహావిష్ణువు మాయామోహిని అవతారము ధరించి వారి తగవును పరిష్కరించాలి అనుకున్నాడు. 

మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవరూ లేరు. జగన్మోహిని యైన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయా మోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్యరాశి. ఆమె వారిరువురి మధ్యకు వచ్చి అమృతమును ఇరువురికీ సమానముగా పంచెదను. ఎందుకీ తెగని తగవులాట? మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతము  పంచుతాను మీకు ఇష్టమేనా? అన్నది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడలేదు. దేవతలందరూ ఒక వరుసలోనూ, రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడ్డారు. జగన్మోహిని రెండు భాండములను తీసుకొని ఒక భాండమునందు సురను, మరొక దానియందు అమృతమును నింపి నర్తిస్తూ, మురిపిస్తూ, మైమరపిస్తూ, తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు, అమృతమును దేవతలకు పోయసాగింది. మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింప సాగారు. ఈవిధంగా రాక్షసులను తన వలపు వయ్యారములతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది. ఈ విషయము గమనించిన రాహుకేతువులు మాయాదేవతలుగా మారి దేవతల పంక్తిలో కూర్చొని అమృతాన్ని పానం చేశారు. రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని రూపములో ఉన్న శ్రీమహావిష్ణువు కోపించి తన చక్రాయుధంతో వారి తలను నరికివేసాడు.  మిగిలిన అమృతము దేవేంద్రుడికి ఇచ్చాడు. త్రిమూర్తులు అదృశ్యమయ్యారు. దేవేంద్రుడు అమృత భాండమును  భద్రపరుస్తూ ఉండగా రెండు చుక్కలు విధివశాత్తూ నేలరాలాయి. అవి పడిన చోట రెండు దివ్యమైన మొక్కలు పెరిగాయి. అవే పారిజాత, తులసి మొక్కలు. సత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరుపోసి పెంచసాగాడు. కొంత కాలమునకు పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనలను వెదజల్లసాగింది. ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళ్తూ పారిజాత పుష్ప వాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్యయైన శచీదేవికి ఇచ్చాడు. మిగిలిన దేవతలు కోరగా మళ్ళీ వచ్చి రహస్యముగా పువ్వులను కోయాలని  తోటలో ప్రవేశించాడు. అప్పటికే తన తోటలోని పువ్వులను ఎవరో అపహరిస్తున్నారని అనుమానము వచ్చిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి మంత్రించిన అక్షతలను పువ్వులపైన, వనమంతా చల్లాడు. దేవేంద్రుడు పారజాత పువ్వును తుంచబోడగా అక్షతల ప్రభావం వల్లనో, విష్ణు మహిమ వల్లనో మూర్ఛపోయాడు. ఈవార్త తెలిసిన దేవతలందరూ నారదుణ్ణి బ్రతిమలాడగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయము వివరించాడు. కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు. అమోఘమైన శక్తి కల సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పరాయణుడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమున కనిపించాడు. సత్రాజిత్తుకి చెప్పి అమృత తుల్యమగు పారిజాత వృక్షమును దానికి అర్హుడైన దేవేంద్రునికి ఇప్పించి తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పాడు. ఆనాటి నుంచి తులసి శ్రీమహావిష్ణువు సాన్నిధ్యములో ఆయనతో సమానముగా పూజలు అందుకుంటున్నది. అందుచేత తులసిని పూజించిన సకల సౌభాగ్యములు సిద్ధిస్తాయి. 


ఫలశ్రుతి: 


సూతమహర్షి శౌనకాది మునులతో మహర్షులారా! వశిష్ఠుల వారు దిలీపునకు తెలియచేసిన మాఘమాస మహత్యము, మాఘస్నాన మహిమ మీకు వివరించాను. మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞం కూడా పూర్తి కావచ్చింది.  అందరు మాఘమాస వ్రతమును, నదీ స్నానమును నియమ నిష్ఠలతో చేసి ఆ శ్రీహరి కృప పొందగలరని దీవించాడు. మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందుండగా సూర్యోదయము అయిన తర్వాత నదిలో స్నానము చేయాలి. ఆదిత్యుని పూజించి విష్ణ్వాలయమును దర్శించి శ్రీమన్నారాయణునకు పూజలు చేయాలి. మాఘమాసం ముప్పది రోజులు క్రమం తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ, ఏకాగ్రతతోనూ, చిత్తశుద్ధితోనూ శ్రీమహావిష్ణువును మనసారా పూజించిన సకలైశ్వర్య ప్రాప్తి, పుత్రపౌత్రాభివృద్ధి, వైకుంఠప్రాప్తి పొందుతారు. 


సర్వేజనాః సుఖినోభవన్తు!!


మాఘపురాణము సంపూర్ణమ్ !!

గొప్ప సందేశం

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఒక్కొక్క అక్షరం వదలకుండా చదవ వలసిన అతి గొప్ప సందేశం*


*ఉక్రెయిన్ ఉదంతం ప్రపంచ ప్రజలకో గుణపాఠం*


ఉక్రెయిన్ పై రష్యా స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ జరుపుతోంది. ఒళ్ళు గగుర్పొడిచే భయానక దృశ్యాలు మనకు కనబడుతున్నాయ్. కేవలం 48 గంటల్లోనే ప్రశాంతంగా ఉండే ఉక్రెయిన్ దేశం చిన్నాభిన్నమైపోయింది. ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ ఎక్కడో బంకర్లో తలదాచుకుని ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. దేశాధ్యక్షుల పరిస్థితి దేవుడెరుగు. సాధారణ జనజీవనం మాత్రం అల్లకల్లోలమైపోయింది. జనం ప్రాణభయంతో పరాయి దేశాలకు చేరుకుంటున్నారు. 


ఇంతటి విధ్వంసానికి, వినాశనానికి, జన హననానికి ముమ్మాటికీ ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీయే కారణం. ఇంతటి నష్టం జరుగుతుందని ఒక దేశాధ్యక్షుడిగా జెలెన్ స్కీకి తెలీదా? తన శక్తి సామర్ధ్యాలేవిటో, తాను కయ్యానికి కాలు దువ్వుతున్న రష్యా శక్తిసామర్థ్యాలేవిటో ఆయనకు తెలీదా? తనపై తనకు అతి విశ్వాసమా? నాటో దేశాల మద్దతు లభిస్తుందన్న అత్యాశా? ఏది ఆయనను యుద్ధం దిశగా నడిపించి ఉంటుంది?


*నిజానికి ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ మొదట రాజకీయవేత్త కాదు, ఆయనకు నటనలోనే అనుభవం ఉంది. అది జనజీవన స్రవంతిలో ఎందుకూ పనికి రాదు. అది ఒక రంగుల ప్రపంచము. వ్యాపార సరళి అందులో నటులది చాలా చిన్న పాత్ర అదే నటన. ఆ నటన వలన మహా అయితే వ్యాపార పరంగా మహా అయితే కొన్ని వందలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపయోగం. మిగతా లోకంలో అందరికి కధ, టైం పాస్ మాత్రమే. ఆయన ఒక సినిమా నటుడు. అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక కమెడియన్. ఒక దేశాన్ని పాలించడం అంటే సినిమాల్లో కామెడీ చేసినట్టు కాదు కదా? రాజకీయాలలో, దేశ పాలనలో, ప్రపంచ పరిస్థితుల్లో ఎన్నో విషయాలను అనుక్షణం గమనిస్తూ, బేరీజు వేసుకుంటూ, గతాన్ని పరిశీలించుకుంటూ, వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ, భవిష్యత్తును అంచనా వేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది*. ఎందరితోనో, ఎన్నో విధాలుగా డీల్ చేయాల్సి ఉంటుంది. అవగానా రాహిత్యమో, అతి విశ్వాసమో, వారిపై వల్లమాలిన అభిమానమో తెలీదుగానీ *ఏమాత్రం పాలనానుభావం లేని సినీ పరిశ్రమకు చెందిన వారినే ఆయన తన సలహాదారులుగా, మంత్రివర్గ సభ్యులుగా పెట్టుకున్నారు*.ఇది మరీ ప్రపంచ విడ్డురం కదా.అందరూ నటులతో ప్రజా పాలన కూడా ఒక నటనే అవుతుంది. *కుంకుడు గింజలను భూమిలో నాటి, నాకు బంగిన పల్లి మామిడి పళ్లు కావాలంటే వస్తాయా, చచ్చినా రావు అనేది నిర్వివాదాంశం. ఇకనైనా కళ్ళు తెచ్చుకోండి.* 


అందునా ఉక్రెయిన్, శక్తిమంతమైన ఈయూ, రష్యాల మధ్యన ఉన్నది. ఇరు పక్షాలతోనూ సయోధ్యతో మెలగడమే సరియైన విదేశాంగ విధానం. ఏ ఒక్క పక్షాన చేరినా రెండవ పక్షానికి విరోధులవుతాం కదా? ఇద్దరు బలవంతుల మధ్య ఒక బలహీనుడు ఇద్దరితో అణకువగా మసలుకుంటేనే కదా? లేకపోతే ఏదో ఒకనాడు ఎవరో ఒకరి చేతిలో తన్నులు తినక తప్పదు కదా? ఇది సహజమైన జీవన నియమమే కదా? మరి అంతటి దేశాధ్యక్షుడు ఇంత చిన్న లాజిక్ మిస్సయితే ఎలా?


సరే పోనీ... ఎవరి బలాన్నో నమ్ముకుని ఈయన హద్దులు మరచి రంకెలు వేశాడనుకుందాం.... మరి వారెవరైనా ప్రత్యక్షంగా రంగంలోకి దిగారా? అండగా నిలిచి ఆదుకున్నారా? ఒక బలమైన వాడితో ప్రత్యక్ష వైరం పెట్టుకోవాలంటే అవతలి వాడు కూడాఎంతటి శక్తిమంతుడైనా ఎంతో కొంత ఆలోచిస్తాడు కదా? 


నిజానికి రష్యా వంటి శక్తివంతమైన దేశాన్ని ఢీకొట్టే స్థితిలో ప్రస్తుతం అమెరికా కూడా లేనట్టే. అమెరికా కూడా పైపైన పటాటోపం ప్రదర్శించడం మినహా ఎప్పుడూ ఎక్కడా తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించిన పాపాన పోలేదు.  సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్ వంటి వారి ఆచూకీ తెలుసుకుని వారిని మట్టుబెట్టడానికే అమెరికా ఎంతో సమయాన్ని, శక్తిసామర్ధ్యాలను, ధనాన్ని వెచ్చించవలసి వచ్చింది. వియత్నాం, సిరియా, లిబియా, ఇరాక్ లలో పరిస్థితులు చక్కబెడతానంటూ వెళ్లి మరింత సంక్లిష్టం చేసొచ్చింది. ఇక ఆఫ్ఘనిస్థాన్లో అమెరికా చేసిన నిర్వాకం మనందరికీ తెలిసిందే. ఏడు సముద్రాలు ఈది ఏటి కాలువలో మునిగిన చందాన దశాబ్దాలపాటు ఆఫ్ఘనిస్థాన్లో తిష్ట వేసుకు కూర్చుని చివరికి ఆ తాలిబన్ల చేతికే ఆఫ్ఘన్ ను అప్పగించి వచ్చిన ఘన చరిత్ర అమెరికాది. అమెరికా ఇప్పుడు ఆర్థికంగా కూడా రష్యాను ఢీకొట్టే స్థితిలో లేదు. మరి అలాంటి అమెరికా తనకు యుద్ధంలో తోడుగా నిలుస్తుందని జెలెన్ స్కీ ఆశలు పెట్టుకుని ఉంటే... అంతకంటే అమాయకత్వం మరొకటి లేదనే చెప్పాలి. ఇప్పుడు అమెరికా అయుధాలందిస్తానన్నా *ఉక్రెయిన్ అందుకునే స్థితిలో లేదే? అందుకోడానికి ఉక్రెయిన్ చేతిలో సైనికులే లేరే? . దాన్ని నడిపే వారు అందరూ నటీనటులే కావటం ఇందుకు ప్రధమ కారణం.*


ఉక్రెయిన్ ను నాటో దేశాల సరసన కూర్చుండబెడితే రష్యా దూకుడుగా స్పందిస్తుందని ఫ్రాన్స్, జర్మనీలతో సహా ఐక్యరాజ్యసమితిలోని దేశాలన్నీ ఆది నుంచి అమెరికాను హెచ్చరిస్తూనే ఉన్నాయ్. అయినా ఆ హెచ్చరికలన్నిటినీ తోసిరాజని అమెరికా ఉక్రెయిన్ ను నాటో అక్కున చేర్చే ప్రయత్నం చేసింది. అదే ఇప్పుడు ఇంతటి విధ్వంసానికి కారణం అయ్యింది.


ఉదాహరణకు చైనా తన మిలిటరీ బేస్ ను అమెరికా పొరుగునున్న కెనడాలోనో, మెక్సికోలోనో పెడతానంటే అమెరికా సైతం ఆ దేశాలపైకి యుద్ధానికి వెళ్లకుండా ఉంటుందా?  ఏ దేశానికైనా తమ దేశ భవిష్యత్తు, భద్రత, సంక్షేమమే కదా ప్రధానం? ఇప్పుడు రష్యా కూడా సరిగ్గా అదే చేసింది. తనకు గిట్టని దేశాలతో స్నేహం కొనసాగిస్తూ తనకు పక్కలో బల్లెంలా మారిన ఉక్రెయిన్ పై ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తోంది.


అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ వ్యవహరించిన తీరే అత్యంత అవగాహనా రహితమైనది, బాధ్యతారహితమైనది, విచారకరమైనది. జెలెన్ స్కీ తలచుకుంటే.... యుద్ధం జరుగకుండా ఆపే అవకాశం ఆయనకు చివరి క్షణం వరకూ ఉండింది. చర్చలు జరిపే అవకాశం ఉండింది. కానీ ఆయన ఆ దిశగా ప్రయత్నమే చెయ్యలేదు. *సినిమాల్లోలాగా హీరోయిజం ప్రదర్శించాలని, ప్రజలలో తనకున్న జనాకర్షణను మరింతగా ఇనుమడింపజేసుకోవాలని భావించాడో ఏమిటో తెలీదు. ఇంత చేస్తాం, అంత చేస్తాం, అంతు చూస్తాం అంటూ ప్రగల్భాలు పలికాడు*. ఇప్పుడు రష్యాను ఏదో విధంగా చర్చలకు ఒప్పించాల్సిందిగా అందరినీ ప్రాధేయపడుతున్నాడు. ఈ జ్ఞానమేదో మొదటే ఉండుంటే ఇంత అనర్థం జరుగకపోను కదా? అది కూడా ఓసారి చర్చలకు సిద్దమనీ, మరోసారి కాదనీ ఇలా పూటకోమాట మాట్లాడుతున్నారు. 


తెలివైన రాజకీయవేత్త ఎవరూ ఇలా ప్రవర్తించరు. ఈయూలోనో, రష్యాలోనో చేరే విషయమై మేం మరో పదేళ్ళ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పి సమస్యను ఓ దశాబ్దం పాటు వాయిదా వేసుండేవారు. అసలు విషయం ఏంటంటే..... ఇంతకముందు ఉన్న అధ్యక్షుడితో ఈ విషయంలోనే విభేదించి, ఈయూలో కలుద్దామనుకుంటున్న ప్రజల అభీష్టానికి విరుద్ధంగా అధ్యక్షుడు వ్యవహరిస్తున్నాడంటూ ప్రజలను రెచ్చగొట్టి, తాను వారి కలలను నిజం చేస్తానంటూ ఓ పిచ్చి హామీ ఇచ్చి ఈయన అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఆ హామీలను నిలబెట్టుకునే వెఱ్ఱి ప్రయత్నంలో ఇలా దేశాన్ని కష్టాల కొలిమిలోకి నెట్టేశాడు. ఇది ఆయన అపరిపక్వతకు నిదర్శనం.

 

అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఉక్రెయిన్ దేశ ప్రజలతో పాటుగా, ప్రపంచ దేశాల ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.... దేశాన్ని నడిపించే నాయకులకు కావాల్సింది గ్లామరో, గ్రామరో, హ్యూమరో కాదు. తన దేశం పట్ల అపారమైన ప్రేమ, తన దేశ ప్రయోజనాల పట్ల రాజీ లేని తత్వం, ప్రపంచ పరిస్థితుల పట్ల అవగాహన. ఎవరితో ఎలా మెలిగితే తన దేశానికి ప్రయోజనమో తెలిసిన నేర్పు, ఓర్పు, పట్టువిడుపు ఉన్నవాడు, పరిస్థితులకు తగ్గట్టుగా జనాన్ని కన్విన్స్ చెయ్యగలిగినవాడే నిజమైన నాయకుడు అవగలుగుతాడు. వ్యక్తిగతమైన భేషజానికో, ప్రతిష్ఠకో ప్రాకులాడి దేశ రక్షణను, ప్రయోజనాలను ఫణంగా పెట్టేవాడు కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంయమనం కోల్పోకుండా తన దేశ హితమే పరమార్థంగా పనిచేసేవాడు, ఎక్కడ నెగ్గాలో.... ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు (ఇది కూడా తెలుగు సినిమా డైలాగే)  మాత్రమే ఏ దేశాన్నైనా ప్రగతి పథంలో నడుపగలుగుతాడు. 


*ప్రజలు కూడా సినీ, క్రీడా గ్లామర్ కో, కులానికో, వర్గానికో, ప్రాంతానికో, భాషకో, మతానికో ప్రాధాన్యం ఇవ్వక దేశ హితమే పరమ లక్ష్యంగా భావించి, ఆలోచించి తమ నేతను ఎన్నుకున్నప్పుడే ప్రజాస్వామ్యం సఫలమవుతుంది*. పునరాలోచించించండి మహాశయా.

అందరూ ఒకే మార్గాన్ని అనుసరించాల

 *నేటి మాట*


అందరూ ఒకే మార్గాన్ని అనుసరించాలని దైవము పట్టుబట్టడు...

అతని భవనానికి అనేక తలుపులు ఉన్నాయి. 

అయితే ప్రధాన ద్వారం మాత్రం మోహక్షయమే!. (అటాచ్‌మెంట్‌ను అధిగమించడం), ఇదే అర్జునుడిని సాధించాలని కృష్ణుడు సూచించాడు. 

మహా భారత యుద్ధంలో అర్జునుడు బంధు ప్రేమతో తన హృదయాన్ని కోల్పోయి మాయలో మునిగిపోయాడు. 

అపుడు కృష్ణుడు' అర్జునా! నీవు చంపడానికి భయపడే నీ బంధువులు, గురువులు ఇంకా నీవు ప్రేమించే, ద్వేషించే వారందరూ నా చేతితో తోలుబొమ్మలు...

వారి కర్మానుసారం మరణమే తప్ప నీవు కారణం కాదు అని బోధించాడు, ఇది అర్జునుని అనుబంధాన్ని, అఙ్ఞానాన్ని నాశనం చేసింది...

పర్యవసానాలతో ఎలాంటి అనుబంధం లేకుండా అతను తన పనిని ముగించాడు...

అది అర్జునుడిని చరిత్రలో గొప్ప పాఠం. ఈ పాఠం మనందరికీ విలువైనది. 

ఎందుకంటే మనం బంధాలతో అటాచ్‌మెంట్ కలిగి ఉంటుంటాము, ఈ బంధాలను విడిస్తే తప్ప జ్ఞానం పొందలేము. జ్ఞానము రానిదే దైవమును గాంచలేము. 

దైవమును గాంచలేనివాడు మోక్షమునకు అనర్హుడు, దీని నిమిత్తమే మోహక్షయమే మోక్షమునకు మార్గం అని చెప్పబడింది...


                  *_🌺శుభమస్తు🌺_*

       🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

మృగశృంగుని కథ*

 _*మాఘ పురాణం - 29 వ అధ్యాయము*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



*మృగశృంగుని కథ*



☘☘☘☘☘☘☘☘☘



వశిష్ట మహర్షి దిలీపునితో నిట్లనెను. దిలీపమహారాజా వినుము. పూర్వము కుత్సుడను పేరుగల బ్రాహ్మణుడు కలడు. అతడు కర్దమ ముని కుమార్తెను వివాహమాడెను. వారికొక కుమారుడు కలిగెను. ఆ కుమారుడు విద్యావంతుడై దేశాటనము చేయవలెనని తల్లిదండ్రుల అనుమతి నొంది  ఇంటి నుండి బయలుదేరెను. మాఘమాసము ప్రారంభమగునాటికి అతడు కావేరి తీరమును చేరెను. మాఘమాసమంతయు కావేరీ నదిలో స్నానము చేయవలెనని తలచెను. అతడచట కావేరీనదిలో ప్రతి దినము స్నానము చేయుచు మూడు సంవత్సరములుండెను. శ్రీమన్నారాయణుని దయను పొందుటకై స్నానము చేయవలేనను సంకల్పము కలిగెను. అతడు శ్రీమన్నారాయణుని ఉద్దేశించి తపము చేయనారంభించెను. కుత్సుని పుత్రుడగుటచే వానికి మృగశృంగుడను పేరు వచ్చెను. వాని తపమునకు మెచ్చి శ్రీమన్నారాయణ మూర్తి వానికి ప్రత్యక్షమయ్యెను. మృగశృంగుడు శ్రీహరిని జూచి ఆనందపరవశుడై పెక్కు రీతుల స్తుతించెను. శ్రీహరియు వాని తపమునకు స్తుతులకు మెచ్చియిట్లనెను. *"నాయనా ! నీవు అనేక పర్యాయములు మాఘమాసస్నానమును విడువక చేసి అఖండమైన పుణ్యమును , నా ప్రేమను సాధించితివి. నీయీ తపముచే మరింతగా నీపై ప్రేమ కలిగినది. వరమును కోరుకొమ్మనెను".* మృగశృంగుడును *"స్వామీ ! నీ దివ్యదర్శనమును కలిగించినందులకు కృతజ్ఞుడను , ఇట్టి నీయనుగ్రహము పొందిన తరువాత నాకు మరే విధమైన కోరికయు కలుగుటలేదు. కావున యీ ప్రదేశమున నీవు భక్తులకు దర్శనమిచ్చు చుండవలయునని కోరెను".* శ్రీమన్నారాయణుడును వాని ప్రార్థనకంగీకరించి అంతర్థానము నందెను.


కౌత్సుడు ఇంటికి తిరిగివచ్చెను. వాని తల్లిదండ్రులు వానికి వివాహము చేయదలచిరి. కౌత్సుడును వారి అభిప్రాయమును అంగీకరించెను. అనుకూలతకల యువతి భార్యగా లభించినచో గృహస్థ ధర్మమును చక్కగ పాటించి , ధర్మార్థకామ మోక్షములను పురుషార్థములు నాల్గిటిని సాధింపవచ్చును. ఇందువలన కన్యను పరిశీలించి వివాహమాడవలయునని భార్యకుండవలసిన లక్షణములను వారికి వివరించెను. వారును అతని ఆలోచనను మెచ్చిరి.


భోగాపురమున సదాచారుడను ఉత్తమ బ్రాహ్మణుడు నివసించుచుండేను. వానికొక కుమార్తె కలదు. ఆమె పేరు సుశీల , ఆమె పేరుకు తగిన ఉత్తమురాలు , గుణవంతురాలు. కౌత్సుడామెను వివాహము చేసికొనవలయునని తలచెను. సుశీల యొకనాడు తన ఇద్దరు స్నేహితురాండ్రతో కలిసి నదీస్నానమునకు బయలు దేరినది. ఆ సమయమున మదించిన అడవియేనుగు వారిని తరిమెను. అప్పుడు సుశీల , ఆమె మిత్రురాండ్రును బెదిరిపారిపోవుచు గట్టులేని నేల బారునూతిలో పడి మరణించిరి. కౌత్సుడు వారి మరణవార్తను విని దుఃఖించెను , చనిపోయిన ముగ్గురిని బ్రదికింపవలయునని నిశ్చయించుకొనెను. వారి తల్లిదండ్రులకు ఆ శరీరములను రక్షింపుడని చెప్పెను. సమీపమున నున్న నదిలోస్నానము చేసి ధ్యానమగ్నుడై యుండేను. మదించిన ఆ యేనుగు వానికెదురుగ నిలిచి వానిని కొంతసేపుచూచెను. తటాలున వానియెదుట తలవంచి వానిని తోండముతో తన మీదకు యెక్కించుకొన్నది. కౌత్సుడును శ్రీమన్నారాయణుని స్మరించుచు దానిపై నీటిని చల్లెను. రెండు చేతులతో దానిని స్పృశించెను. వెంటనే ఆ యేనుగు తన రూపమును విడిచి దివ్యరూపమునందెను. శాప విమోచనమును కల్గించిన మృగశృంగునకు కృతజ్ఞతలను తెలిపి నమస్కరించి తన లోకమునకు బోయెను.


కౌత్సుడును చనిపోయినవారిని బ్రతికింపవలయునని మరల నదిలో మునిగి యమధర్మరాజు నుద్దేశించి తపము చేయసాగెను, యముడును వానికి ప్రత్యక్షమయ్యెను. వరము నిత్తును కోరుకొమ్మనెను. మృగశృంగుడును(కౌత్సుడు) యమునికి నమస్కరించి స్తుతించెను. దుర్మరణము చెందిన ముగ్గురు కన్యలను బ్రతికింపుమని కోరెను. యముడును వాని పరోపకార బుద్దికి మెచ్చుకొనెను అడిగిన వరమునిచ్చి యంతర్థానము చెందెను. మృగశృంగుడు పట్టుదలతో చేసిన తపముచేతను , యముని దయవలన , సుశీల ఆమె ఇద్దరు మిత్రురాండ్రు బ్రతికిరి. వారిని జూచి అందరును ఆశ్చర్యపడిరి. సుశీల మున్నగువారు నిద్రనుండి లేచినట్లుగ లేచికూర్చుండిరి. వారు యమలోకమున జూచిన విశేషములను యిట్లు చెప్పిరి. జీవిచేసిన పాపముననుసరించి శిక్షింపబడును. భయంకరములైన పాపములను చేసినవారు కఠినముగ శిక్షింపబడుదురు. పాపము చేసిన వాడు యెఱ్ఱగాకాలిన ఇనుపస్తంభమును కౌగిలించు కొనవలయును. మరుగుచున్న నూనెలో , పాపముచేసిన వానిని పడవేయుదురు. తలక్రిందుగ వ్రేలాడదీసి క్రిందమంటలను పెట్టుదురు. ఎఱ్ఱగా కాల్చివానితో వాతలు పెట్టుదురు. భయంకరములైన సర్పాదులున్న చోట పడవేయుదురు అని వారు వివరించిరి.


వారు చెప్పిన మాటలను మిగిలిన వారందరును భయపడిరి. అప్పుడు సుశీల మున్నగువారు భయపడకుడు. మాఘమాసస్నానము చేసి , ఇష్టదైవమును పూజించి , యధాశక్తి దానము , జపము మున్నగునవి చేయుట యొక్కటే సర్వ సులభమైన ఉపాయము మాఘస్నానము వలన చేసిన పాపములు నశించి పుణ్యములు కలిగి జీవుల శుభలాభము ఆనందవచ్చును అని మిగిలిన వారికి ధైర్యము చెప్పిరి. ఇట్లు పలుకుచున్న వశిష్టమహర్షిని దిలీపుడు గురువర్యా ! భూలోకమునకు యమలోకమునకు గల దూరమెంత ? చనిపొయిన వారు మరల బ్రతుకుటకు వీలగునా యని ప్రశ్నించెను. అప్పుడు వశిష్టమహర్షి నాయనా ! భక్తికి పుణ్యమునకు సాధ్యముకానిది లేదు. పుణ్యమును కలిగించు మాఘస్నానమును , సుశీల మున్నగువారు అనేకమార్లు చేయుటవలన వారు సంపాదించిన పుణ్యము , కౌత్సుడు చేసిన తపఃప్రభావము వారిని యీ విధముగా కాపాడినది సమాధానము చెప్పి నాయనా ఇట్టిదే మరొక్క విషయము కలదు వినుము. పుష్కరుడను జ్ఞానవంతుడొకడు కలడు. అతడు సద్గుణములు భక్తి కలిగినవాడు. మాఘస్నానము మొదలగు పుణ్యప్రదములగు కార్యములనెన్నిటినో చేసినవాడు.


యముడొకనాడు తన భటులను చూచి పుష్కరుని తీసుకొని రండని పలుకగా యమభటులు పుష్కరుని తీసికొని వచ్చిరి. యముడు తీసికొని రమ్మన్నది ఇతనిని కాదు పుష్కరుడను పేరు గల మరియొకనిని భటులు పాపాత్ముడగు పుష్కరుని తీసికొని వచ్చుటకు బదులు పొరబాటున పుణ్యాత్ముడగు పుష్కరుని తీసుకొనివచ్చిరి. యముడును తన భటులు చేసిన పొరబాటునకు భటులను మందలించెను. క్షమింపుడని పుష్కరుని ప్రార్థించెను. పుష్కరుని భూలోకమున దించి రండని భటులకు ఆజ్ఞనిచ్చెను. పుష్కరుడును యమలోకమును చూచుటకు యముని అనుమతిని కోరెను. యముడందులకంగీకరించెను. భయంకరములగు శిక్షలననుభవించువారిని చూచి ఇతడు భయపడెను. భయముపోవుటకై హరినామ భజనమును చేసెను. ఇట్టి భజనమును వినుటచే పాపాత్ములపాపములు తగ్గి వారి శిక్షలును తగ్గసాగినవి. పుష్కరుడు నరకమును చూచుటచే మరింత జ్ఞావంతుడయ్యెను. దిలీపా ! యమ లోకమునకు పోయి వెనుకకు తిరిగి వచ్చిన వారింకను యెందరో ఉన్నారని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించెను.


*☘️మృగశృంగుని వివాహములు☘️*


వశిష్ఠ మహర్షి దిలీపునితో మరల నిట్లనెను. మృగశృంగుని విద్యాభ్యాసము పూర్తి అయినది. అతడు ప్రజ్ఞుడై దేశాటనము చేసెను , మాఘమాసస్నానములు తపము చేసి శ్రీహరియనుగ్రహమును పొందెను. దుర్మరణము చెందిన సుశీల మున్నగువారిని యముని అనుగ్రహము నంది బ్రదికించెను. ప్రయోజకుడని నలుగురును మెచ్చిరి. ఇట్టి కుమారునికి వివాహము చేయవలయునని వాని తల్లిదండ్రులు తలచిరి. మృగశృంగుడు తాను సుశీలనే వివాహమాడుదునని తల్లిదండ్రులతో చెప్పెను. వారును సంతోషముతో నంగీకరించిరి. శుభముహూర్తమున సుశీలామృగశృంగులకు వివాహము మహావైభవముగ జరుప నిశ్చయింపబడినది. సుశీల స్నేహితురాండ్రులిద్దరును మృగశృంగుని చేరి తమ ఇద్దరిని కూడ ఆ ముహూర్థముననే వివాహము చేసికొనవలసినదిగ కోరిరి. మృగశృంగుడు అంగీకరింపలేదు. వారు పురుషుడు యెక్కువ మంది యువతులను పెండ్లాడుట శాస్త్ర విరుద్దము , ధర్మవిరుద్దము కాదు దశరధునకు భార్యలు ముగ్గురు లేరా ? శ్రీకృష్ణునకుయెనిమిది మంది పట్టపు రాణులు లేరా ? ఆది దేవుడైన పరమేశ్వరునకు గౌరీ , గంగ ఇద్దరు లేరా ? వారికి లేని అభ్యంతరము నీకెందులకు ? అని వాదించిరి. ప్రాణదానము చేసినవానికి భార్యలమై కృతజ్ఞతను చూపు అవకాశమునిమ్మని నిర్భందపరచిరి. పెద్దలును వారి అభిప్రాయమునే బలపరచిరి. చివరకు మృగశృంగుడు సుశీలతో బాటు వారిద్దరిని వివాహమాడెను.


కథను వినుచున్న దిలీపుడు మహర్షీ వివాహమెన్ని విధములో వివరింపుడని కోరెను. అప్పుడు వశిష్టుడు *బ్రాహ్మణకన్యను అలంకరించి వరునకిచ్చి చేయు వివాహము బ్రహ్మవివాహము , యజ్ఞము చేయునప్పుడు యజమానికి యజ్ఞ సమయమున భార్యగానుండుటకై కన్యనిచ్చి చేయు వివాహమును దైవ వివాహమందురు. పెండ్లికుమారుని నుండి గోవులను తీసికొని కన్యనిచ్చి చేయువివాహమును ఆర్ష వివాహమందురు. ధర్మము కోరకు కలసియుండునని చేయు వివాహమునకు ప్రజాపత్య వివాహమని పేరు. ధనమును తీసికొని కన్యనిచ్చి చేయు వివాహమునకు అసురరమని పేరు , ఒకరినొకరు ప్రేమించుకొని తమంతతాముగా చేసికొను వివాహమును గాంధర్వమని యందురు. బలవంతముగ కన్యనెత్తుకొని పోయి చేసికొను వివాహము రాక్షస వివాహము మోసగించి చేసికొను వివాహము పైశాచికము అని వశిష్ఠుడు దిలీపునకు చెప్పెను.* గృహస్థ ధర్మములను పతివ్రతా లక్షణములను దిలీపుడు కోరగా వారికి వాటిని గూడ వివరించెను.


దిలీపుడు కోరగా వశిష్టుడు మరల నిట్లు కథను కొనసాగించెను. మృగశృంగుడు నలుగురు భార్యలతో గలసి సుఖముగనుండెను. గృహస్థుని ధర్మములను పాటించుచు ధర్మమును తప్పక అందరి మన్ననలను పొందెను. మృగశృంగుడు సుశీలయందు పుత్రుని పొందెను. ఉత్తమ లక్షణములు కలవానికి మృకండుడని పేరు పెట్టెను. మృకండుడును బందువుల కానందమును కలిగించుచు సద్గుణశాలియై పెరుగుచుండెను. మృగశృంగుడు మృకండునకు ఉపనయనము కావించి గురుకులమునకు పంపెను. మృకండుడును శ్రద్ధాసక్తులతో వినయ విధేయతలతో తెలివితేటలతో గురుకులమున అందరికి ఇష్టుడై అందరిలోను అన్నిటమిన్నయై విద్యలన్నిటిని నేర్చెను , మృగశృంగుడు ఉత్తమలక్షణములు కల మరుద్వతియను కన్యతో వానికి వివాహము కావించెను.


మృగశృంగుని మిగిలిన ఇద్దరు భార్యలును పుత్రులను కనిరి వారును మృకండుని వలె విద్యలనుగ్రహించిరి. మృగశృంగుడు వారికిని వివాహములు చేసెను. ఇన్ని జరిగినను అతడు మాఘమాసస్నానములను మానలేదు. ఇష్టదేవతార్చనను వీడలేదు. దానములను మానవయధాశక్తిగ చేయుచుండెను. తన కుటుంబ సభ్యుల చేతను చేయించుచుండెను. మాఘమాస స్నాన మహిమ వలన సర్వసౌఖ్యములను , సర్వలాభములను పొందెను , మనుమలను గూడ పొందెను. ఈ విధముగనున్న తన వృద్ధికి సంతృప్తినంది గృహమును విడిచి తపోవనమునకు పోయి తపమాచరించి విష్ణు సాన్నిధ్యమునందెను. ఇక , అతని జ్యేష్ఠకుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతమును చెప్పెదను ఆలకింపుము అని వశిష్టులవారు దిలీపమహారాజునకు ఇట్లు వివరించినారు. మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడగు మృకండుడే పరివార భారమంతయు మోపి గృహమునందు యే అశాంతియు లేకుండ చూచుచుండెను. అయిననూ ఒక విచారము పీడించుచుండెను. అదెట్టిదనగా తాను వివాహమాడి చాలకాలము గడిచిననూ సంతానము కలుగలేదు. అందుచేత అతడు లోలోన కుమిలిపోవుచుండెను. అతడొకనాడు యీ విధముగా తలపోసెను. *"కాశీ మహా పుణ్యక్షేత్రము , సాంబశివునకు ప్రత్యక్ష నిలయము అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హరించుటయేగాక , మనస్సునందలి కోరికలు నెరవేరెను , అనేకమంది కాశీ విశ్వనాధుని దర్శనము చేసికొని , వారి అభీష్టములను పొందగలిగిరి గాన మేను నా కుటుంబ సమేతముగా కాశీ వెళ్ళుదును అని మనస్సులో నిశ్చయించుకొని ప్రయాణసన్నద్ధుడై బయలదేరును. మార్గమధ్యమున అనేక క్రూరమృగముల బారినుండి క్రిమికీటకాల ప్రమాదముల నుండి అతికష్టము మీద తప్పించుకొని , కుటుంబసహితముగా కాశీక్షేత్రము చేరినాడు.


కాశీపట్టణము నానుకొని పవిత్రగంగానది తన విశాలబాహువులను చాచి , ప్రశాంతముగా ప్రవహించు చున్నది. మృకండుడు  పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్య స్నానాదికవిధులు నెరవేర్చుకొని , విశ్వనాధుని మందిరమునకు వెళ్ళెను. ఆలయావలలోనికి రాగానే మృకండునకు యెక్కడలేని ఆనందము కలిగెను. తన జన్మ తరించెననియు , తాను కైలాసమందున్నట్లును తలచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్దలతో ప్రార్థించెను. ఈ విధముగా సకుటుంబముగా మృకండుడు కాశీవిశ్వేశ్వరుని ధ్యానించి , ఒక లింగమును ప్రతిష్టించి , దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణము చేసి దాని కెదురుగా తన భార్యపేర మరొక లింగమును ప్రతిష్ఠించెను. ఆ విధముగా ఒక సంవత్సరము వరకును విశ్వేశ్వరుని సన్నిధానమందు గడపనెంచెను. ఒక దినము మృకండుని మువ్వురు తల్లులను పవిత్రంగా నదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని ధ్యానించుచునే ప్రాణములు విడిచిరి. మృకండుడు చాల దుఃఖించెను. విధిని యెవ్వరూ తప్పించలేరు గదా ! అయినను వారు ముగ్గురును ఈశ్వరుని ధ్యానించుచునే ప్రాణములు విడిచిరి. చనిపోయిన ముగ్గురు తల్లులకు మృకండుడు యధావిధిగా దహన సంస్కారములు గావించి మాతృ ఋణమును దీర్చుకున్నాడు. మృకండుడు యెంతకాలమునకునూ సంతానము కలుగనందుననే కాశీక్షేత్రము వచ్చినాడు గదా ! సంతానము కొరకు భార్యాసమేతుడై విశ్వనాధుని గూర్చి తపస్సు చేసినాడు. అతని తపస్సునకు మెచ్చి పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమైరి. మృకండునకు అతని భార్య మరుద్వతికి అమితానందము కలిగి , ప్రమేశ్వరుని అనేక విధముల స్తుతించగా పరమేశ్వరుడు. *"మహామునీ ! మీ భక్తికి యెంతయో సంతసించినారము. మీరు చేయు తపస్సుమమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కళంగ భక్తికి మెచ్చి మీ కోర్కెలను దీర్చగా వచ్చి నారము. కాన మీ యభీష్టమెరిగినపుడు"* డని పలికెను. అంత మృకండుడు నమస్కరించి *"తండ్రి ! మహాదేవా ! తల్లి అనంపూర్ణా ! ఇవే మా నమస్కృతులు , లోకరక్షకా ! మీదయవలన నాకు సులక్షణవతి , సౌందర్యవతి , సుకుమారవతియగు పత్ని లభించినందువలన నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సుఖసంసారము అనుభవించుచున్నాము. కాని యెంతకాలమైననూ మాకు సంతానము కలుగనందున కృంగి కృశించుచున్నాము. సంతానము లేనివారికి నుత్తమగతులు లేవు గదా ! కావున మాకు పుత్రసంతానము ప్రసాదింప వేడుకొనుచున్నాను"* అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించినాడు. మృకండుని దీనాలాపము లాలకించిన త్రినేత్రుడు *"మునిసత్తమా ! నీ యభీష్టము నెరవేరగలదు. కానీ ఒకా నియమమున్నది. బ్రతికియున్నంతవరకు వైధవ్యముతో నుండు పుత్రిక కావలయునా ? లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలయునా ?"*

అని ప్రశ్నించెను. మృకండునకు ఆశ్చర్యము కలిగెను. పరమశివుని మాటలకు ఆలోచనలోపడవలసి వచ్చెను. కొంత తడబడి *"హే శశిధరా ! నన్ను పరీక్షింప నెంచితివా ? నాకు జ్ఞానోదయమయినది మొదలు నేటివరకును మీ ధ్యానమునే పలుకుచు సేవించుచున్న నాకు యేమి చెప్పవలయునో తోచకున్నది. అయినను కలకాలము వైధవ్యముతో కృంగి కృశించు పుత్రిక కన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమే ప్రసాధింపుమని"* అడిగెను. *"అటులనే అగునుగాక !"* అని వరమిచ్చి త్రిశూలధారి పార్వతీ సమేతముగా అంతర్ధానమయ్యెను. పరమేశ్వరానుగ్రహము వలన మృకండుని భార్యయగు మరుద్వతి ఒక శుభ ముహూర్తమున పుత్రునిగనెను. మృకండూనకు పుత్ర సంతానము కలిగెనని అనేక మంది ఋషిసత్తములు బాలుని చూడవచ్చిరి. వ్యాస మహర్షి కూడావచ్చి ఆ బిడ్డకు జాతకర్మవేసి వెడలెను. ఓ దిలీపమహారాజా ! పరమపూజ్యుడును , ఋషిసత్తముడునూ యగు మృకండుడు పరమేశ్వరుని మెప్పించి , వారి దయకు పాత్రుడయి పుణ్యమును బడసిన యీ పుత్రుడే పరమ భాగతోత్తముడగు మార్కండేయుడు.

శివమానసపూజ

 శ్లోకం:☝️

    *రత్నైః కల్పితమాసనం*

*హిమజలైః స్నానం చ దివ్యాంబరం*

    *నానారత్నవిభూషితం*

*మృగమదామోదాంకితం చందనం l*

    *జాతీచంపకబిల్వపత్ర-*

*రచితం పుష్పం చ ధూపం తథా*

    *దీపం దేవ దయానిధే*

*పశుపతే హృత్కల్పితం గృహ్యతాం ll*

    - శివమానసపూజ - 1


భావం: ఓ దయానిధి! పశుపతి! నేను మానసికంగా సమర్పిస్తున్న - రత్న సింహాసనం, చల్లని నీటితో స్నానం, దివ్యమైన వస్త్రాలు, రకరకాల రత్నాలతోను, చందనం సుగంధ ద్రవ్యాలతోను జాజి, చంపక పుష్పాలు, బిల్వపత్రాల మాలతోను అలంకారం, ధూపం, దీపం మొదలగు ఉపచారాలను  స్వీకరించుము.🙏

శివుడికి ప్రీతికరమైన పుష్పాలు

 శివుడికి ప్రీతికరమైన పుష్పాలు


శివుడికి ప్రీతికరమైన పుష్పాలు :


పరమశివుడికి ఏ పుష్పాలతో అర్చన ఇష్టమంటే - 1. కరవీరార్క మన్దార | శమీ వకుళ కింశుకమ్ |


మధూక బృహతీ బిల్వ ! మపామార్గం చ పాటలమ్ ॥ 2. అశోకా గస్త్య దత్తూర కర్ణికార కదమ్బకమ్ |


బాణ పున్నాగ తిలకం | కోవిదారం చ చమకమ్ ॥ 3. మల్లికా మాధవీ జాతిః | ద్రోణం చ శతపత్రకమ్ | కమలం కైరవం చైవ | తథా నీలోత్పలాని చ ॥


4. తమాలం తులసీపత్ర | మిత్యేతాని శివార్చనే !! Sri Sai Jyotisha Kendram Ph:-99,9621214. పుష్ప పత్రాణి శస్తాని। సర్వపాప హరాణీ చ ॥


(శివతత్త్వ సార సంగ్రహే)


'శివార్చనకు కరవీరం (గన్నేరు), అర్కం (జిల్లేడు), మందారం, శమీ (జమ్మి), బొగడ, మోదుగ, ఇప్ప, వెంపలి, బిల్వం (మారేడు), అపామార్గం (ఉత్తరేణి), కలిగొట్టు, అశోకం, అవిసె, ఉమ్మెత్త, కొండగోగు, కడిమి, నల్ల గోరింట, సురపొన్న, ఎర్ర గోరింట, ఎర్ర దేవకాంచనం, సంపెంగ, మల్లి, పండు గురివెంద, జాజి, తుమ్మి, నూరు రేకుల పద్మం, వెయ్యి రేకుల పద్మం, తెల్ల కలువ, నల్ల కలువ, తాపింఛం, తులసి - వీటికి సంబంధించిన పుష్ప పత్రాలు సర్వదా శ్రేష్టాలు. వీటితో పరమ శివుణ్ణి పూజిస్తే. సమస్త పాపాలు నశిస్తాయి.

స్కాందపురాణం...బ్రహ్మోత్తర ఖండం

 స్కాందపురాణం...బ్రహ్మోత్తర ఖండం లోనిది ఈ విశేషం. దీని భావం ఏమంటే..."శివుని స్తోత్రం చేసేదే..నాలుక. శివుని ధ్యానించేది మనస్సు.శివుని కథలను వినడానికి ఉత్సాహ పడేవి చెవులు.శివార్చన చేసేవి చేతులు.శివ పూజ చూసేవి కన్నులు. శివునికి నమస్కరించేది శిరస్సు.శివ క్షేత్రాలకు భక్తితో వెళ్ళేవి పాదాలు""అని అర్థం. శివ భక్తి గొప్పతనాన్ని తెలియజెప్పేందుకు ఇంతకంటే వేరే మాటలు ఉండేవేమో!!.సకల చరాచర జగత్తుకు ఆధారభూతమైన సచ్చిదానంద స్వరూపమే శివుడు.."శివ"అనే మాటకు మంగళం,క్షేమం,భద్రం, శాంతి,సౌఖ్యం,శుభం,శుద్ధత అను అనేక అర్థాలున్నాయి.ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికీ అవసరమే.అందరూ కోరుకునేవే. భక్తితో శివారాధన చేస్తే ఇవన్నీ సిద్ధిస్తాయి..అందరమూ భక్తితో పరమ శివుని కొలిచి మన జీవితాలను సార్థకం చేసుకుందాము. స్వామి అనుగ్రహంతో మన జీవన గమనాన్ని సుఖమయం చేసుకుందాము... ఓం నమః శివాయ. శివోహం...శివోహం.శివోహం.హర హర మహా దేవా...శంభో శంకరా. 

అతివేడిని తగ్గించుటకు

 శరీరంలో అతివేడిని తగ్గించుటకు నేను ప్రయోగించిన సులభ యోగం - 


      రాత్రిసమయంలో ఒక మూడు కప్పుల అన్నమును ఒక గిన్నెలో వేసి ఆ అన్నము మునిగే విధముగా వేడిపాలు పోసి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచం పెరుగు వేసి తోడుపెట్టాలి.ఉదయాన్నే తోడుకున్న ఆ అన్నము పెరుగుల మిశ్రమానికి కొంచం ఉప్పు కలిపి ఎర్ర ఉల్లిగడ్డ చిన్నటి ముక్కలుగా కోసి కలుపుకుని తినవలెను . 


              ఇది తీసుకున్న గంటన్నర తరువాత 40ml అలోవెరా జ్యూస్ కి 120 ml నీరు కలిపి లొపలికి తీసికొనవలెను . మరలా సాయంత్రం 6 గంటల సమయంలో మరొకసారి తీసికొనవలెను. పైన చెప్పిన పెరుగుతో కూడిన అన్నం ఉదయం పూట మాత్రమే చాలు 


 గమనిక  - 


    మసాలా పదార్థాలు , కారం , పులుపు , వంకాయ , గొంగూర , టీ , కాఫీ , మద్యం , సిగిరెట్ నిషేధం . 


     ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  గమనిక  -


           నేను రచించిన నా మూడొవ గ్రంథం అయిన " సర్వమూలికా చింతామణి " యందు అనేక రకాల మొక్కల గురించి అత్యంత విపులముగా , వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . మా వంశపారంపర్య రహస్యయోగాలు మాత్రమే కాకుండా అత్యంత పురాతన , అరుదైన గ్రంథాలు మరియు కొన్ని తాళపత్రాల నుంచి తీసుకోబడిన ఎన్నొ విలువైన యోగాలు అన్ని ఎంతో పరిశోధించి మీకు ఇవ్వడం జరిగింది . ఒకటి మాత్రం ఖచ్చితముగా చెప్పగలను . ఈ గ్రంథములో లభ్యమయ్యే సంపూర్ణ సమాచారం మరియు అత్యంత సులభయోగాలు మరే గ్రంథములో మీకు దొరకవు . ఈ ఒక్క గ్రంథం రచించుటకు సుమారు సంవత్సన్నర సమయం కేటాయించడం జరిగింది . 50 రకాల మొక్కల గురించి ఈ ప్రథమ భాగములో ఇవ్వడం జరిగింది . కేవలం మొక్కల గురించియే కాకుండా యే వ్యాధికి ఏమి పథ్యం చేయవలెనో కూడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . 


        ఈ గ్రంథం ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు కుట్టించి ఇవ్వడంతోపాటు 90gsm పేపర్ వాడటం జరిగింది . మొక్కల యొక్క రంగుల ఫొటోస్ తో పాటు సంపూర్ణ సమాచారం ఇందులో మీకు లభ్యం అగును . దీని ఖరీదు  550 రూపాయలు ( ఆంధ్ర మరియు తెలంగాణ ) మరియు వేరే రాష్ట్రమునకు పంపుటకు మరొక్క 50 రూపాయలు అదనంగా ఖర్చు అగును . 


      ఈ గ్రంథము కావలసిన వారు 9885030034 నంబర్ కి phoneపే , google pay or paytm చేసి ఇదే నంబర్ కి whatsup నందు screenshot పెట్టి మీ Adreass  pincode and landmark తో సహా ఇవ్వగలరు . 


             కాళహస్తి వేంకటేశ్వరరావు . 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034