17, నవంబర్ 2021, బుధవారం

శివుడు లయకారుడు

 శివుడు లయకారుడు.. 

    ఎందుకంటే జన్మించిన ప్రాణి మరణించక తప్పదు. మరణించిన తర్వాత జన్మించక తప్పదు’ ఇది ప్రకృతి ధర్మం. ఈ ధర్మానికి ప్రధాన రక్షకులు ముగ్గురు. వారే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వీరు ముగ్గురు సర్వ స్వతంత్రులు అయినప్పటికీ.., ఒకరి విధి నిర్వహణలో మరొకరు తల దూర్చరు. ‘బ్రహ్మ’...సృష్టి ధర్మానికి రక్షకుడు. ప్రాణికోటిని సృష్టించడమే ఈయన ధర్మం. ‘విష్ణువు’...సృష్టిని పోషించి, రక్షించడమే ఈయన ధర్మం. ఈ ధర్మరక్షణ కాస్త కష్టంతో కూడుకున్న వ్యవహారం. ఒక కుటుంబాన్ని పోషించి, రక్షించడానికి.., యజమాని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది., మోసాలు చేయాల్సి వస్తుంది. 


కేవలం ఒక్క కుటుంబ రక్షణే ఇంత కష్టతరం అయినప్పుడు.., మరి ఈ మాయాజగత్తును పోషించి, రక్షించడమంటే మాటలా! ఈ ధర్మరక్షణ కోసమే ‘శ్రీ మహావిష్ణువు’ ఎన్నో అవతారాలు ఎత్తాడు..,ఎన్నో మాయలు పన్నాడు.., మరెన్నో మోసాలు చేసాడు. ఎలా రక్షించాడు అన్నది అప్రస్తుతం. ఇక్కడ రక్షణే ప్రధానాంశం. ‘మహేశ్వరుడు’...లయకారకత్వం ఈయన ధర్మం. ‘లయం’ అంటే ‘ నాశనం’ అని ఓ తప్పుడు అర్ధాన్ని చెప్పేస్తారు. ఇంగ్లీషు భాషలో ‘destroyer’ అనే పదాన్ని వాడతారు. అది తప్పు. ‘absorber’ అనే పదాన్ని వాడాలి. ‘శివుడు’ నాశనకారుడా? ఎంత తప్పు భావన అది. ‘లయం’ అంటే లీనం చేసుకోవడం, లేదా తనలో కలుపుకోవడం. ఈ సృష్టిచైతన్యాన్ని లయం చేసుకోవడం అంటే మాటలా? ధానికి ఎంతో తపశ్శక్తి కావాలి. అందుకే శివుడు ఎప్పుడూ తపస్సమాధి స్థితిలో ఉంటాడు. సృష్టికి, రక్షణకు నాశనం ఉంది. ‘లయం’కు నాశనం లేదు. అది శాశ్వతం. భౌతికంగా కనిపించేది ప్రతీదీ నాశనం అయ్యేవే. అభౌతికమైనవే శాశ్వతంగా ఉండేవి.


ఏది అభౌతికమైనది అంటే..‘ఆత్మే’ అభౌతికమైనది. దీనికి చావు పుట్టుకలు ఉండవు. ఈ ఆత్మ దేహధారణ చేస్తే ‘జీవాత్మ’ అవుతుంది. ‘జీవాత్మ’ దేహత్యాగం చేస్తే ‘ఆత్మ’గా మిగిలిపోతుంది.పాంచభౌతికమైన శరీరం మరణించిన తర్వాత భూతత్వం..భూమిలోను., అగ్నితత్వం.. అగ్నిలోను., జలతత్వం., జలములోను., వాయుతత్వం..వాయువులోను., శబ్దతత్వం.. ఆకాశంలోను., లయమౌతాయి. ఇక మిగిలివున్న ‘ఆత్మ’ను శివుడు లయం చేసుకుంటాడు. ఎలా? ఉదాహరణకు..., ఒక దీపాన్ని ఊదేస్తే ఏమవుతుంది? ఆరిపోతుంది. ఆరి.. ఎక్కడకు పోతుంది? తన ఉత్పత్తి స్ధానమైన దీపంలోకే వెళ్లి లయమైపోతుంది. తిరిగి దీపాన్ని వెలిగించాలంటే.. దీపం నుంచే దీపాన్ని వెలిగించాలి. అలాగే ఒక మనిషి మరణిస్తే.. ‘చనిపోయాడు’ అంటాం. ‘చని’ అంటే ‘వెళ్లుట’ అని అర్థం. ఎక్కడకు వెళ్లాడు..అంటే..తను వచ్చినచోటుకే వెళ్లాడు. తిరిగి రావాలంటే.. అక్కడనుంచే రావాలి.అంటే.. లయంనుంచే సృష్టి ప్రారంభమౌతున్నదన్నమాట. దీనిని బట్టి మనకు ఏమర్థమౌతోంది? 


దేహం నుంచి విడివడిన ‘ఆత్మ’ తన ఉత్పత్తిస్ధానమైన శివునిలో లయమైపోతుంది. కనుకనే ఆయనను లయకారుడన్నారు. వ్యామోహం లేనివాడే విరాగి. మమకారం ఉన్నచోట స్వార్ధం ఉంటుంది. స్వార్దం ఉన్నచోట లయానికి తావులేదు. కష్ట సుఖాలయందు సమదృష్టి కలవాడే విరాగి. అట్టి విరాగే సర్వాన్ని సమానంగా తనలో లీనం చేసుకోగలుగుతాడు. శివునకు తన దేహంమీదే మమకారంలేదు. చితాభస్మాన్ని పూసుకుంటాడు.. దిగంబరంగా తిరుగుతాడు..భిక్షాటన చేస్తాడు. పుర్రెలో భుజిస్తాడు. రుద్రాక్షలు, పాములు ధరిస్తాడు. శ్మశానంలో నివసిస్తాడు. ఇంతటి విరాగి కనుకనే ఆయన లయకారుడయ్యాడు. సృష్టి, స్ధితులకు ఆద్యుడయ్యాడు. సర్వజగత్తుకు ఆరాధ్య దైవమయ్యాడు.


#హారహారమహాదేవ్ #ఓంనమఃశివాయ 


       ॐ సర్వం శివమయం జగత్ ॐ


           ॐ ఓం నమఃశివాయ ॐ


🚩🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏🚩

భారతీయత ఔన్నత్యం*

   *భారతీయత ఔన్నత్యం*


🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


కారుమేఘాలు కమ్ముతుఃన్నాయి 

ఏక్షణంలో అయినా... 

వర్షం విపరీతంగా కురుస్తుంది...! 

వేసే ముగ్గు..వర్షంలో కలుస్తుంది !అయినా..ఆమె ముగ్గువేస్తోంది... !

      *అదీ..సంప్రదాయం!* 🙏

             ....................


అంతర్జాతీయ ఖ్యాతినార్జించి

అమెరికాలో ఉంటున్న వైద్యుడు. సొంతూరు వచ్చినప్పుడల్లా 

పాఠాలు చెప్పిన పంతులుకు 

పాదాభివందనం చేస్తాడు…! 

        *అదీ .. సంస్కారం !* 🙏

              .....................


ఖగోళ శాస్త్రాన్ని 

నమిలి మింగిన నిష్ణాతుడు.  

నిష్టగా ఉంటూ

గ్రహణం విడిస్తేగానీ... 

ఆహారం గ్రహించడు…! 

       *అదీ .. నమ్మకం !* 🙏

             ....................


పరమాణు శాస్త్రాన్ని 

పిండి పిప్పిచేసిన పండితుడు. 

మనవడి పుట్టు వెంట్రుకలు 

పుణ్యక్షేత్రంలో తీయాలని 

పరదేశం నుండి పయనమై వస్తాడు…! 

        *అదీ .. ఆచారం !* 🙏

            ..............................


అంతరిక్ష విజ్ఞానాన్ని

అరచేతబట్టిన అతిరధుడు. 

 అకుంఠిత నిష్ఠతో

పితృదేవతలకు 

పిండ ప్రదానం చేస్తాడు…!

 *అదీ .. సనాతన ధర్మం!* 🙏

           ........................


అత్తింటికి వెళ్లేముందు 

ఇంటి ఆడబడుచు 

పెద్దలందరికీ 

పాదాభివందనం చేసి 

పయనమవుతుంది…! 

       *అదీ .. పద్ధతి !* 🙏

         ........................


పెద్ద చదువులు చదివినా 

పెద్ద కొలువు చేస్తున్నా 

పేరు ప్రఖ్యాతులున్నా 

పెళ్లి పీటలమీద .. వధువు

పొందికగా ఉంటుంది…!

     *అదీ .. సంస్కృతి!*🙏

       ..............


భార్య పక్షవాతానికి లోనయ్యింది. 

మంచం దిగలేని పరిస్థితి 

తనంతట తానుగా.. 

తనువీడ్చలేని స్థితి.

భర్త భరోసాగా నిలచి..భారమంతా మోస్తాడు-అన్నీతానై .. అలిని సాకుతాడు…!

       *అదీ .. దాంపత్యం!* 🙏

             .....................


బ్రతికే అవకాశం తక్కువ

వెంటిలేటర్ పై వేచిచూస్తే

బ్రతికితే బ్రతకొచ్చు!

లక్షల ఖర్చు భరిస్తూ

వెంటిలేటర్ పై పెడతారు… !

          *అదీ .. అనుబంధం!* 🙏


 

*ఇవి భారతీయుల తరతరాల ఆచారాలు, సంప్రదాయలు, విలువలు, ఔన్నత్యం కొన్ని మాత్రమే* 


*ఇది భారతీయల ఆత్మ తత్త్వం* 


*సమస్త లోక సుఖినోభవంతు*


‌🙏🙏🙏🙏🙏

విజయం అంటే

 *_ ఒక ప్రొఫెసర్ అడిగిన ప్రశ్న... విజయం అంటే ఏమిటి ???....._*


*మన దేశం నుండి ఒక ప్రొఫెసర్ అమెరికా వెళ్లారు. అక్కడ ఒక కాలేజీ లో విద్యార్థులతో మాట్లాడుతూ '' విజయం అంటే ఏమిటి? '' అని అడిగితే ఒక యువతి '' విజయం అంటే దండిగా డబ్బు* *సంపాదించడం , '' అంది*. 

*అపుడు ఆ ప్రొఫెసర్ '' అయితే ఇరవైఏళ్ళక్రితం ప్రపంచంలో అత్యంత ధనవుంతుడు ఎవరో చెప్పండి? '' అంటే ఎవరూ చెప్పలేదు. [ఎందుకటే ప్రతి ఏడాదికీ అది మారిపోతూవుంటుంది కాబట్టి] బ్రతకడానికి కొంత డబ్బు కావాలి కానీ , డబ్బే బ్రతుకు కాదు*. *అంటే విజయమంటే డబ్బు సంపాదన కాదు అన్నమాట.*   

*మరో యువకుడు లేచి '' విజయం అంటే బలం / శక్తి '' అన్నాడు. అలా అయితే అలెగ్జాండర్ ,* *నెపోలియన్ ,ముస్సొలిని ,హిట్లర్ , స్టాలిన్ , బిన్ లాదెన్ ... వీళ్ళంతా బలవంతులు , ప్రపంచాన్ని గెలవాలని అనుకొన్నవారే కదా , వీళ్ళు జీవితం లో సంతోషంగా వుండగలిగారా ? వీళ్ళ జీవితాలు ఎలా గడిచి , ముగిశాయో చరిత్ర చెపుతున్నది కదా! తన బలంతో , తన* *ముష్టిఘాతాలతో మహా* *బలవంతులను* *మట్టికరిపించిన మహమ్మద్ అలీ అనే ప్రపంచ చాంపియన్ బాక్సర్ , తరువాత కొన్నేళ్ళకు పార్కిన్ సన్ వ్యాధి వల్ల కాఫీకప్పును కూడా పట్టుకోలేక పోయాడు. అయితే* *విజయమంటే బలం / శక్తి సంపాదన కాదు అన్నమాట.* 

*మరో యువతి '' విజయమంటే ప్రఖ్యాతి , అందం ,'' అనింది. అయితే కేట్ మోస్ , జీన్ ష్రింప్టన్ , సోఫియాలారెన్ , మార్లిన్ మన్రో ...లాంటి అతిలోక సౌందర్యవతుల జీవితాలు ఎంత బాధాకరంగా వుండేవో చాలామందికి తెలియదు. భారత్ విషయానికొస్తే , పర్విన్ బాబీ అనే ఒక హిందీ హీరోయిన్ వుండేది. ఆమె ఎంత అందగత్తే అంటే , అమితాబ్ బచ్చన్ తో సహా , ఆమెను పెళ్ళి చేసుకోవాలి అని అనుకొనని హిందీ సినిమా హీరో నే లేడు. డానీ, కబీర్ బేడీ , మహేష్ భట్ లతో ఆమె ప్రేమ , పెళ్ళి నడిచి అవన్నీ విఫమయ్యాయి. ధర్మేంద్ర , రాజేష్ ఖన్నా , అమితాబ్ బచ్చన్ .. ఇలా అందరూ ఆమె వెంట పడ్డవారే. కొద్దిరోజులకు ఆమెకు జీవితం అంటే శూన్యం అని తెలిసిపోయి , నమ్మిన వాళ్ళు మోసం చేస్తే , తాగుడుకు బానిస అయ్యి , ఒక దశలో కాలికి కురుపు లేచి , అది ఒళ్ళంతా ప్రాకి , ఏ శరీరం కోసం అయితే అంతమంది మగ వాళ్ళు పిచ్చిక్కెపోయారో , అదే శరీరమే కంపు వాసన కొడుతూవుంటే , ఆమెకు ఏదో వింతవ్యాధి వచ్చిందని , జనం ఆమెను తాళ్ళతో కట్టి , ముంబాయి వీధుల్లో లాగుకొంటూ తీసుకెళ్ళి ఆమె ఇంట్లో పడేస్తే ఆఖరుకు పక్కింటి వాళ్ళు ఆమె ఇంట్లోనుండి భరించలేనంత కంపు వస్తోందని కంప్లైంట్ చేస్తే , కార్పొరేషన్ వాళ్ళు వచ్చి 3 రోజులక్రితమే చనిపోయిన ఆమెను చూసి తీసుకెళ్ళి పూడ్చేసారు.* *అయితే అందం , ప్రఖ్యాతి అనేవి విజయం కావన్నమాట.* 


*మరోసారి మరొకరు ''* *విజయమంటే అధికారం '' అని అన్నారు. అయితే '' కాగితం మీద ఈ దేశాన్ని పాలించిన ప్రధానమంత్రుల పేర్లు అన్నీ వ్రాయండి '' అని అంటే వున్న 50 మందిలో 39 మంది అందరు ప్రధానుల పేర్లూ వ్రాయలేకపోయారు. మా అనంతపురంలో ఒకప్పుడు రాష్ట్రపతి గా వెలిగిన సంజీవరెడ్డి గారి ఇంటిదగ్గర ఇపుడు పిచ్చిమొక్కలు పెరుగుతున్నాయి , పందులు దొర్లుతున్నాయి*. *విజయం అంటే అధికారం కాదు అన్న మాట.* 


*చివరగా ఆదే ప్రొఫెసర్ భారత్ లో మరో యూనివర్సిటీ లో యువతీ యువకులను ఇదే ప్రశ్న వేసారు - '' విజయం అంటే ఏమిటి ? '' అందరూ మౌనంగా వుంటే అపుడు ఆయన అన్నారు , '' మీ అవ్వ తాతల పేర్లు మీకు తెలుసా ? '' అందరూ '' తెలుసు '' అన్నారు. '' వాళ్ళ అవ్వ , తాతల పేర్లు తెలుసా ? ''అని అడిగితే అయిదారుమంది ''తెలుసు ''* *అన్నారు. '' వాళ్ళ అవ్వ తాతల పేర్లు తెలుసా ? '' '' తెలియదు '' అన్నారు.* 

*అపుడు ప్రొఫెసర్ గారు ''* *శ్రీరాముడు , శ్రీకృష్ణుడు ,* *బుద్ధుడు , ఆదిశంకరుడు ,* *అందరూ '' ఓ , తెలుసు '' అని ముక్తకంఠం తో బదులిచ్చారు. ''* *మీకు మీ స్వంత అవ్వ తాతలు గుర్తుకులేరు కానీ మీరు ఎన్నడూ చూడని వీళ్లంతా ఎలా గుర్తుకున్నారు ? ''* 

*అని అడిగినపుడు పద్మిని అనే ఒక యువతి , ప్రొఫెసర్ గారు అంతదాకా చేసిన గొప్ప ఉపన్యాసానికి చాలా ఎమోషనల్ అయ్యి కళ్లలో నీరు తిరుగుతుండగా ఇలా అనింది : '' సార్ , మీ ప్రశ్నకు నేను జవాబు చెపుతాను. మాకు మా పూర్వీకుల పేర్లు తెలియకపోవడం , రాముడు , కృష్ణుడు , బుద్ధుడి పేర్లు ఇంకా గుర్తువుండటానికి కారణం ఇదే : '*

 *తమ కోసం, తమ కుటుంబం కోసం మాత్రమే జీవించేవారిని ఈ లోకం మరచిపోతుంది, ఇతరులకోసం జీవించేవారిని ఈ లోకం ఎప్పటికీ గుర్తుకుపెట్టుకొనేవుంటుంది. ఇదే విజయం అంటే ! ''* 


*''నా గురించి నేను దు:ఖించకపోవడమే నా ఆనందానికి కారణం '' అని 2600 ఏళ్ళ క్రితం బుద్ధుడు చెప్పిన మాట , '' ఇతరులకోసం జీవించేవారే నిజంగా జీవించినట్టు , అలా చేయని ఇతరులు జీవించివున్నా మరణించినట్టే లెక్క''* 


*[ Only They Live Who Live For Others , The Others Are More Dead Than Alive ]* 

*అని వివేకానంద 1896 లో అన్న మాట ఇదే కదా.*

పొడుపు కథ.!

 అచ్చమైన పొడుపు కథ.!


ఇది ప్రౌఢరాయల ఆస్థాన కవి ఎవరో రచించి ఉంటారు. ఎనిమిది ప్రశ్నలు?

వాటికి జవాబులు ఈ చాటువులో కవి పొందుపరచాడు.

ఈ సీస పద్యం అచ్చమైన పొడుపు కథ.

.

“ రాముడెవ్వానితో రావణు మర్దించె? 

పర వాసు దేవుని పట్నమేది ? 

రాజమన్నారుచే రంజిల్లు శరమేది ? 

వెలయ నిమ్మ పండు విత్తునేది? 

అల రంభ కొప్పులో అలరు పూదండేది? 

సభవారి నవ్వించు జాణ యెవడు? 

సీత పెండ్లికి ఓలిచేసిన విల్లేది? 

శ్రీ కృష్ణుడేయింట చెలగు చుండు? 

.

అన్నిటను జూడ ఐదేసి యక్షరములు 

ఈవ లావాల జూచిన నేక విధము 

చదువు నాతడు “ భావజ్ఞ చక్ర వర్తి” 

లక్షణోపేంద్ర ప్రౌఢరాయ క్షితీంద్ర !”

.

పై పద్యంలో మొదటి ఎనిమిది పాదాలు ప్రశ్నలు. 

తదుపరి రెండు పాదాలు వాటి జవాబులు తెలిపే సూచికలు.(క్లూస్) 

మూడవ పాదం ఎవరైతే జవాబులు చెపుతారో వారిని “ భావజ్ఞ చక్రవర్తి” అని పిలవాలని, 

నాల్గవ పాదం ప్రౌఢరాయల! సంబోధన.

ఇక జవాబుల సూచికలు-

ప్రతి జవాబుకి ఐదు అక్షరాలు ఉంటాయి,

ముందునుంచి వెనుక నుంచి చదివినా ఒకేలా ఉంటాయి. (ఉదా;- “ కిటికి”వలె ).

1.రాముడు ఎవరిసాహాయంతో రావణుని చంపాడు?

2.వాసుదేవుని పట్నం పేరు ఏమిటి?

3.రాజమన్నారు అనే రాజు చేతిలో బాణం ఎమిటి?(శరము=బాణము)

4. నిమ్మ పండు విత్తనం పేరు ఏది?

5.రంభ జడలో పెట్టుకొన్న పూలదండ పేరు?

6.సభలో నవ్వించే కవిపేరు ఏది?

7.సీత పెండ్లికి సుల్కంగా పెట్టిన విల్లు ఏది? ( ఓలి=శుల్కం)

8.శ్రీకృష్ణుడు ఎవరి యింట పెరిగేడు?

ఈ క్రింది జవాబులు చూడండి.

.

1.తోకమూకతో! ( వానరాలకి ఇంకొక పేరు.)

2.రంగనగరం! ( శ్రీరంగం )

3.లకోల కోల! ( కోల= బాణం)

4.జంబీర బీజం! ( జంబీరం=నిమ్మపండు. బీజం=విత్తనం)

5.మందార దామం! ( దామం అంటే దండ)

6.వికట కవి! ( హాస్యకవి తెనాలి రామ కృష్ణుడు)

7.పంచాస్య చాపం! ( శివుని విల్లు)

8.నంద సదనం! ( నందుని ఇల్లు)

-

పై జవాబులు ఐదు అక్షరాలతో, ఎటునుంచి చదివినా ఒకేలా ఉంటాయి. 

అదే ఈ చాటు పద్యంలోని చమత్కారం. ఇట్టి చాటువుల ద్వారా భాషా జ్ఞానం, పద జ్ఞానం వృద్ది చెందుతాయి. ఇలాంటివి ఇంకా చదవాలని కుతూహలం పెంచుతాయి.

పెద్దలు చదివి, పిల్లలకి కూడా తెలపగలరు.