1. చాలీసా" అంటే ఏమిటి?
జ. ఈస్తోత్రంలో 40 శ్లోకాలు ఉన్నాయి కనుక చాలీసా అని పేరు (చాలిస్ అంటే హిందీ లో 40 అని.)
2. హనుమాన్ అంటే అర్థం ఏమిటి?
జ. హనుమాన్ అంటే గట్టివైన దవడలు కలవాడు అనే కాక హను = జ్ఞానం కాబట్టి జ్ఞానవాన్ అని అర్థం. **అజ్ఞానమును* *హననము చేయునది కనుక* *జ్ఞానమునకు హనుమ అని పేరు.*
3. ఆంజనేయ - అర్థం?
జ. ఆంజనేయ అంటే .... సామాన్య కంటితో చూడలేని దానిని చూపించేదే అంజనం , జ్ఞానాంజనం వల్ల మాత్రమే దొరికే పరతత్వం కనుక ఆంజనేయుడు అని పేరు.
4. తులసీదాస్ అస్సలు పేరు ?
జ. *రామ్ బోల*. ఎప్పుడూ రామ నామం స్మరిస్తూ వుండడం వల్ల ఆ పేరు వచ్చింది.
5. హనుమoతుడు బ్రహ్మచారి అయితే మరి సువర్చల ఎవరు?
జ. దేవుళ్ళ భార్యలను, మానవ సంబంధాల దృష్ట్యా చూడరాదు. భార్య అంటే దేవుని యొక్క విడదీయరాని శక్తి, సూర్యుని వద్ద నేర్చుకున్న విద్య వల్ల వచ్చిన తేజో వర్చస్సు యే "సువర్చల".
ఆ విద్య సూర్యుని దగ్గర నేర్చుకోవడం మూలాన సువర్చల సూర్యుని పుత్రిక అంటారు.
6. హనుమంతుడు మనికిచ్చే అష్టసిద్ధులు ఏంటి ?
జ. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్.
హనుమంతుని స్మరించటం వలన మనం పొందే అష్టసిద్ధులు ఇవే.
7. సూర్యునితో పాటు తిరుగుతూ విద్య నేర్చుకున్నాడు హనుమ. అంటారు కదా అసలు సూర్యుడు తిరగడు కదామరి?
జ. తిరగడం అంటే ఇక్కడ, ఉదయించినప్పటి నుండి అస్తమించే వరకు, క్షణక్షణం సూర్యుని తేజస్సు మారుతూ ఉంటుంది దానిని నిరంతరం ఉపాసించడంగా అర్ధం చేసుకోవాలి.
8. హనుమంతుని పంచముఖములు ఏవి?
జ. హనుమ శివాంశ సంభూతుడు. శివుని పంచముఖములు,హనుమంతునిలో ఏ పేర్లతో చెప్పబడ్డాయో చూస్తే. .....
తూర్పున వానర ముఖం జన్మతః వచ్చినది అది సద్యోజాత శివవదనము.
దక్షిణం వైపు నార సింహం. అది శివుని వామదేవ ముఖం. రాక్షస సంహారం చేయడంలో చూపించాడు.
పశ్చిమం గరుడ ముఖం అది శివుని అఘోర రూపం. వేగ గమనము, సర్వరోగ నివారణ చేసి చూపాడు.
ఉత్తరం వరాహ ముఖం అది శివుని తత్పురుష రూపము. సంపత్ ప్రసాదం, ఉద్ధరణ.శోక సముద్రంలో ఉన్న సీతమ్మని ఉద్ధరించడం ద్వారా దానిని ప్రకటించాడు.
ఊర్ధ్వం హయగ్రీవ ముఖం. అది శివుని ఈశాన ముఖం . వేద పారంగతుడు, సకల విద్యా కోవిదుడు. ప్రతీ ముఖానికి మూడు కళ్ళు వుంటాయి. ఈ మూర్తి పది చేతులతో వుంటాడు. వేద విద్య ,త్రిమూర్తి స్వరూపం అని సీతమ్మ నమస్కరించిన హనుమత్ విరాట్ స్వరూపం ఇది🙏🙏🙏🙏
9. "జయ" హనుమాన్ అని హనుమకి జయం చెప్పడమేంటి?
జ. ఎవరైనా ఏది సాధించడానికి ( పురుషార్థాలను) పుట్టారో అది సాధించడమే జయం అంటే. జయం అంటే అన్నింటినీ మించిపోయి ఉండడం. దేవుళ్లకు మనం జయమగు గాక అంటూ ఉంటాము అంటే నా హృదయంలో నీవు అన్నింటినీ మించి ఉండు అని అర్థము.
10. తులసీదాస్ ఎంతకాలం (వయస్సు) జీవించాడు?
జ.126 సం.జీవించాడు.
11. హనుమ బలం హనుమకు ఎందుకు తెలియదు?
జ. మునుల శాప కారణంగా. ముని ఆశ్రమంలో వయస్సు మించిన శక్తి తో అల్లరి చేస్తున్న హనుమని కట్టడి చేయటానికై మునులు ఇచ్చిన శాపం అది.ఆ వయస్సుకి ఆయనకి ఆ శక్తి అవసరం లేదు కనుక అవసరం వచ్చినపుడు, ఎవరైనా గుర్తు చేస్తేహనుమకి గుర్తు వస్తుంది అని అనుగ్రహించారు.కనుక ఒక విధంగా ఇది శాపం అని అనుకో నక్కరలేదు. కట్టడి మాత్రమే.
12. రాక్షస సంహారానికై హనుమ సంగీతం పాడినది ఎప్పుడు?
జ. ఒకప్పుడురాక్షసుల అరాచకం అరికట్టడానికి కశ్యపుడు యజ్ఞం చేయ సంకల్పిస్తాడు..త్రిశూల రోముడనే రాక్షసుడు భూమికి నష్టం చేయడానికై, యజ్ఞ ధ్వంసం ద్వారా చేయాలని సంకల్పించుకుంటాడు. ఆ సంగతి నారదుని ద్వారా హనుమ తెలుసుకుంటాడు, వాడు యజ్ఞం ధ్వంసం చేయబోగా , హనుమ అడ్డగిస్తాడు. భీకర యుధ్ధం జరుగుతుంది. వాడు సూక్ష్మ రూపం దాల్చి గుహలో ప్రవేశించగా, దేవతలంతా ఇప్పుడు ఏం జరుగుతుందని ఆత్రుతతో ఎదురు చూస్తూండగా అప్పుడు హనుమ ఆ గుహ ముందు కూర్చుని ఎవరూ అప్పటివరకూ ఆలపించని ఒక సరికొత్త రాగం పాడగా, ఆ గుహయొక్క శిల కరిగి, వాడు బయటపడగానే వధిస్తాడు. అలా తన సంగీత చతురతతో వాడిని సంహరించాడు.
13 . రామకార్యం చేయడంలో ఆత్రుత ఎపుడు కనపరచాడు ?
జ. మైనాకుని ఆతిథ్యం స్వీకరించకుండా వెళ్ళడంలో.
14 . సీతారాములు పట్టాభిషేక అనంతరం హనుమ కిచ్చిన బహుమతులు ఏంటి?
జ. పుట్టింటివారు,అత్తింటి వారు కలిపి చేయించిన అపురూపమైన ముత్యాల హారం సీతమ్మ ఇస్తే, రాముడు ఆలింగనాన్ని బహుమతిగా ఇచ్చాడు.
15. కపీశ అంటే అర్థం ఏమిటి?
జ. కపీశ అంటే...
a) కపులకు ఈశుడు
b) కపి రూపంలో ఉన్న ఈశుడు
సి) కం(జలం) పిబతి (తాగడం) =కపి జలమును తాగేవాడు అంటే సూర్యుడు, సూర్యునిలా తేజస్వరూపుడు అని అర్థం.
16. హనుమ చిరంజీవి. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?
జ. రామ నామ స్మరణ జరిగే చోటుకి ఇప్పటికీ వస్తాడు.అంతే కాక గంధమాదన పర్వతం పై ఇప్పటికీ వున్నాడు, వుంటాడు🙏
17. హనుమ రామదూత ఎలా అయ్యాడు ?
జ. రాముని ఉంగరాన్ని దూతలా వెళ్ళి సీతమ్మ కు ఇచ్చాడు. వేదం అగ్నిని దూతగా చెప్పింది. ఏ దేవతను తృప్తి పరచాలన్నా అగ్ని ద్వారానే
అగ్ని ముఖావై దేవాః.
దేవతలు అనుగ్రహించాలి అంటే మంత్రము స్తోత్రము చెబుతాము. అంటే వాక్ రూపం. ఇక్కడ వాక్కు దూత అయింది. వాక్కుకు అధిదేవత అగ్ని. అయితే అగ్నికి , హనుమకి ఏమిటి సంబంధం అంటే సృష్టి క్రమంలో ఆకాశం నుండి వాయువు వచ్చింది. వాయువు నుండి అగ్ని వచ్చింది. వాయువు నుండి వచ్చింది అంటే అగ్ని వాయుపుత్రుడు అని కదా! కథ ప్రకారం వాయుపుత్రుడు హనుమ కదా! అందుకు అలా అగ్ని తో పోల్చారు. అగ్ని ఏవిధంగా అయితే ఆహూతులను దేవతలకు అందజేస్తుందో, అలానే, ఈ అగ్నిరూప హనుమ మనం చేసే అనుష్టానాలను పరబ్రహ్మ స్వరూపుడైన ఆ రామచంద్రమూర్తికి చేరవేసే దూత అయ్యాడు. అంతేకాక రాముడు లక్ష్మణునితో అంటాడు నేను యజ్ఞ స్వరూపునిగా వచ్చినపుడు హనుమని దూతలా స్వీకరిస్తాను అని- అలా దూత అయ్యాడు . కనుక దూత అంటే just messenger అని మాత్రమే కాదు.
18 . అతులిత బలధామా అంటే అర్థం ? ఒక ఉదాహరణ?
జ. ఎవ్వరితో పోల్చతగ్గ బలం లేని వాడు.అంటే పోల్చలేని బలం. అందుకే సీతాన్వేషణ కై హనుమని ఎంచుకోవడం.
19 . ఇంతకూ హనుమ కేసరి నందనుడా? వాయు పుత్రుడా?
జ. కేసరి క్షేత్రమైన అంజనీ దేవి యందు సూర్య నాడి ద్వారా వాయుదేవుడు సర్వ దేవతా తేజస్సు ప్రవేశ పెట్టాడు కాబట్టి ఇద్దరికీ.
20 . నామస్మరణ మహిమ ఏమిటి?
జ. కలియుగంలో తరించడానికై ఇచ్చిన సులువైన మార్గం.
21. మహాత్ముడు అంటే ఎవరు ?
జ. శౌర్యం, సౌమ్యం కలిసి ఉన్నవారు. తన ప్రతాపాన్ని తానే నిగ్రహించుకో గలవాడు అతనే మహాత్ముడు( ఇక్కడి సందర్భానుసారం ఇలా చెప్పబడింది.)
22 . ఆ రోజులలో ఉన్న వానరుల ప్రత్యేకత ఏమిటి?
జ. నరులతో సమానంగా వేదాధ్యయనం చేసిన జాతి.
23 . *వీర* లో ఎన్ని రకాలు అవి ఏవి?
జ. దానవీర, దయవీర, యుద్ధ వీర, ధర్మ వీర, ఇవన్నీ ఉన్న వారు మహావీర.
24 . విక్రమ అంటే అర్థం ఏమిటి?
జ. క్రమించుట అంటే నడచుట అనగా వివిధ విధాలుగా తన బలాన్ని బయటపెట్టిన వాడు విక్రముడు. ఎటువైపు అయినా వెళ్లగలిగినవాడు.
25. సూక్ష్మరూపం ఎప్పుడు ధరించాడు ?
జ. లంకా ప్రవేశ సమయంలో పిల్లి లా మారాడు . మరో సారి సీతమ్మ ముందుకు చెట్టు పై నుండి చిన్న ఆకారంలో దూకాడు .
26. వికటరూపం అంటే ఏమిటి ?
జ. వికట = హద్దు లేనిది అని అర్థం, వికట రూపం = భయంకర ఘోర రూపం - లంకా దహన సమయంలో చూపుతాడు.
27. హనుమ తత్వాన్ని ఏ కార్యంలో చూస్తాము?
జ. లంకా దహన సమయంలో హనుమ తత్వాన్ని చూస్తాము.
28. భీమరూపధారిగా ఎపుడు వున్నాడు?
జ. అసుర సంహారం లో , ఉగ్రమైనదే భీమ రూపం .
29. రామచంద్రుని కార్యం చక్కబెట్టడానికి ఏం చేసాడు ?
జ. తనదైన ముద్రతో దూతే ఇంత చేస్తే ఇంక రాజు ఎంత చేస్తాడో అని రావణుడు భయపడాలి అని భావించి లంకా దహనం చేసాడు.
30. అశోకవన నాశనానికి ప్రతిగా రావణుడు హనుమకి ఇచ్చిన దండన ఏది?
జ.వానరులకు వారి తోక అంటే ఇష్టం ఉంటుంది కనుక తోకకు నిప్పు పెట్టమన్నాడు.( హనుమని చంపమని ఆదేశిస్తున్న రావణునితో విభీషణుడు, దూతను చంపరాదు అంటాడు) .
31. రఘువీరుడు ఎందుకు సంతోషించాడు ?
జ. ఇంద్రజిత్తు అస్త్రం వల్ల వానర సైన్యం, రావణుని శక్తి అస్త్రం వల్ల లక్ష్మణుడు పడిపోతే సంజీవనీ పర్వతం (2సార్లు) తెచ్చి రామునికి ఆనందం కలిగించాడు హనుమ.
32. అపుడు రాముడు హనుమని ఎవరితో పోల్చాడు?
జ. నీవు నా తమ్ముడు భరతునితో సమానం అని అంటాడు.
33. భీముడు హనుమని కోరినదేమిటి (జెండా పై వుండమని కాకుండా) ?
జ. మహత్ రూపం చూపమని అడుగుతాడు.
34. హనుమ ఎన్ని సార్లు తన మహత్ రూపం చూపాడు? ఎపుడు ?
జ. మహేంద్ర పర్వతం పైన మొదటిసారి, వ్యాకరణం నేర్చుకున్నపుడు, అశోకవనంలో సీతమ్మ దగ్గర మొత్తం మూడు సార్లు తనమహత్ రూపాన్ని చూపాడు.
(సహస్ర వదన తుంహరో యశ గానై---1000 వదనముల హనుమంతుని మహత్ రూపాన్ని శ్రీపతి అనగా సీతారాములు పొగిడారు)🙏🙏
35. హనుమంతుని జన్మదినం రెండు మాసాలలో చెబుతారు ఏది సరి అయినది?
జ) చైత్ర పౌర్ణమి నాడు జన్మించాడు కాని ఇంద్రుని దెబ్బకు మూర్ఛిల్లిని హనుమ బ్రహ్మ స్పర్శద్వారా తిరిగి ఉత్తేజితుడు అయినది వైశాఖ బహుళ దశమి శనివారంనాడు. అందుకు అలా రెండు మాసాలలో చెబుతారు. ప్రాంతాన్ని బట్టి జరుపుతుంటారు.
36. హనుమ - ఓంకార స్వరూపుడు- ఎలా?
జ)` *హ* 'లో 'అ', *ను'* లో 'ఉ', ' *మ* ని మ గా తీసుకుంటే అకార, ఉకార, మకారాత్మకమే ఓంకారం కదా అదే హనుమ అంటే.
37. భజరంగీ అంటుంటాం - ఎందుకు?
జ) వజ్రం వంటి అంగములు అంటే అవయవములు కలవాడు. అదే వజ్రాంగీ కాస్తా భజరంగీ అయింది.
38. తుమ్హారో మంత్ర విభీషణ మానా .. విభీషణునికి మంత్రం ఇవ్వడం ఏమిటి?
జ) రావణాసురుని కొలువులో రావణునితో హనుమ అంటాడు- రాముని శరణు వేడమని చెబితే బాగుపడే లక్షణం లేక వినడు కానీ అక్కడే ఉండి విన్న విభీషణుడు పాటించాడు. మంత్రం- ఆలోచన, వ్యూహరచన.
39. అర్జునుడి జెండాపైన హనుమంతుడు ఎందుకు ఉంటారు?
జ. అర్జునుడు రాముడు అంతటి వాడిని అనిపించు కోవాలి అనుకుంటాడు. ఒకసారి కృష్ణునితో, రాముడు సేతువు రాళ్లతో కట్టడమెందుకు బాణాలతో కట్టవచ్చుకదా అని అంటే, సరే నీవు ప్రయత్నించు అంటాడు. కొంత మేర కట్టగానే హనుమంతుడు ఎక్కి కూల్చుతాడు. నీవు కూల్చలేని సేతువు నిర్మిస్తానని అంటాడు. అలా చేస్తే నీవు ఏం చెబితే అది చేస్తానని అంటాడు హనుమ. కట్టలేకపోతే గాండీవం వదిలేస్తా నంటాడు అర్జునుడు. అయితే హనుమ మళ్లీ కూల్చితే, అర్జునుడు గాండీవం వదలబోగా, ఈసారి ప్రయత్నించు అని కృష్ణుడు చెప్పగా, దానిని హనుమ కూల్చ లేకపోతాడు.( అర్జునుడు గాండీవం వదిలితే జరగవలసిన కార్యం జరగదు).నేను ఓడిపోయాను నువ్వు ఏం చెబితే అది చేస్తాను అంటాడు హనుమ. అప్పుడు అర్జునుడు, నిన్ను ఆజ్ఞాపించే వాడిని కాను అర్థిస్తున్నాను నా రథం పై వుండి నన్ను రక్షించు అంటాడు. అప్పుడు కృష్ణుడు హనుమతో నువ్వు ఓడలేదయ్యా అంటాడు ,మరి అర్జునుడు ? అని అడిగితే , అర్జునుడు గెలవలేదయ్యా అని కృష్ణుడు తన వీపు చూపగా, మొత్తం నెత్తుటి మరకలు వుంటాయి. సేతువు నిలవడానికి వీపు అడ్డుపెట్టాను అంటాడు. తనను శరణు పొందిన అర్జునుని విజయానికి అలా కారణమై నాడు.
యుద్ధసమయంలో అర్జునుడు కృష్ణునితో అంటాడు, నేను చంపాలనుకున్న వారిని నా కన్నా ముందే జటాధారియై త్రిశూలం పట్టుకొని ఒకరు చంపుతూ వుంటే, వారిపై నేను బాణాలు వేసి చంపిన కీర్తి తెచ్చుకుంటున్నాను అని అంటే రథ జెండా పై వున్నఆ శివాంశ సంభూతుడు అయిన హనుమనే అలా చేసినవాడు అని రహస్యం వెల్లడిస్తాడు కృష్ణుడు.🙏🙏🙏🙏
40 . హనుమ సంజీవనీ పర్వతం ఎప్పుడు తెచ్చాడు?
జ) రెండుసార్లు- వానరసైన్యం మూర్చిల్లినప్పుడు.
లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు.
41 . సుందర కాండకి ఆ పేరు ఎందుకు వచ్చింది ?
జ. సుందరకాండలో రామ కథ రెండు సార్లు చెప్పబడింది. అందుకు ఆ కాండకు ఆ పేరు.
పోయిన దాని యొక్క జాడ తెలుసుకొని ఆనందాన్ని ఇచ్చేవాడే సుందరుడు.ఆ సుందరుని గురించి చెప్పేదే సుందరాకాండ.
పోయిన వస్తువు అపురూపంగా సుందరంగా ఉంటుంది.అటువంటి సీత జాడ కనుక్కోవడమే సుందరాకాండ.
హృదయమనే అశోక వనంలో ఆత్మ వస్తువనే సీతను దొరక బుచ్చుకోడమే సుందరాకాండ.
పరబ్రహ్మ తత్వమే, *సత్యం శివం సుందరం.* అటువంటి పరబ్రహ్మ గురించి అసలయిన తత్వాన్ని వెల్లడించిన కాండ కనుక *సుందర* *కాండ* .
42. చూసి రమ్మంటే కాల్చి రావడమేమిటి?
జ. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని అంటే, మరి రాముని మాట జవదాటాడు అని అనుకుంటే హనుమ శివాంశ సంభూతుడు చూపులోనే అగ్ని ఉన్నవాడిని చూసి రమ్మంటే కాల్చి రావడమే కదా మరి.
43. రాబోయే కల్పానికి హనుమంతునికి రాముడిచ్చిన పదవి ఏంటి?
జ. *బ్రహ్మ పదవి.*
పట్టాభిషేక అనంతరం హనుమ గంధమాదన పర్వతం పై తపస్సుకు వెళితే ఒకసారి రాముడు రమ్మని కబురు చేస్తాడు. "బ్రహ్మ నా అంగుళీయాన్ని పూజించుకుంటాను అంటే ఇచ్చాను దానిని సీతమ్మ చూస్తానంటుంది బ్రహ్మలోకం వెళ్లి తీసుకు రమ్మంటాడు. యోగ మార్గం( సుషుమ్నా) ద్వారా బ్రహ్మ లోకం వెళ్లి బ్రహ్మ ను అడిగితే, ఇచ్చిన దానిని అడగరు అని అంటాడు. చర్చ అనవసరం ఇవ్వమంటాడు. ఇవ్వనంటాడు బ్రహ్మ .అప్పుడు బ్రహ్మ కి వింశతి (20) బాహువుల హనుమ దర్శనమిస్తాడు. దాంతో బ్రహ్మ నమస్కరించి, తాను పూజిస్తున్న పళ్ళెంలోని అంగుళీయాన్ని తీసుకో మన గా చూస్తే అందులో చాలా ముద్రికలు ఉన్నాయి . ఎన్నో కల్పాలు ఎందరో రాములు. నాకు 100 కల్పాల ఆయువు. కాబట్టి ఇప్పటి ముద్రిక ఏదో వెతికి తీసుకో అని అంటాడు బ్రహ్మ.హనుమ గుర్తించి తీసుకుంటాడు.
బ్రహ్మకు హనుమ గొప్పతనం తెలియజేయడానికే రాముడు అలా చేస్తాడు.
తిరిగి వచ్చిన హనుమతో బ్రహ్మలోకం ఎలా ఉంది అని రాముడు అడిగితే , బానే ఉంది కానీ కొన్ని లోపాలు ఉన్నాయి అని అంటాడు.అప్పుడు రాబోయే కల్పానికి నీవే బ్రహ్మవు, ఆ దోషాలను నువ్వు అప్పుడు సరిదిద్దు అని చెబుతాడు.
*వింశతి భుజ హనుమ అభీష్ట సిద్ధి రూపం.*
20 చేతులలో *ఖడ్గం* , **డాలు,మొనగలిగిన ఆయుధం,పరశువు,పాశం,* *త్రిశూలం,వృక్షం,చక్రం, శంఖం, గద, ఫలం,అంకుశం,అమృత పాత్ర, నాగలి,పర్వతం, టంకం (పార),పుస్తకం,ధనుస్సు,సర్పం* , **ఢమరుకం* ధరించి వున్నాడు .
.అటువంటి హనుమకు బ్రహ్మతో సహా మనందరo మానసికంగా దర్శించుకొని ప్రణమిల్లుదాం.🙏🙏
**రామ లక్ష్మణ జానకి జై బోలో* **హనుమాన్ కి* 🙏🙏
**జై హనుమాన్* ,
*జై హనుమాన్* ,*
*జై జై హనుమాన్.**
🙏🙏🙏🙏🙏🙏🙏