నా ప్రథమ దర్శనం : శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామి
నేను పరమాచార్య స్వామివారిని, పుదు పెరియవాను వారివురు సతారాలో మకాం చేస్తున్నప్పుడు చూశాను. ఒకరోజు సాయంత్రం దీపా నంస్కారం ఏర్పాటు చేశారు. పాదుకలకు ఒక ఏనుగు చామరం వీచింది. ఆ ఏనుగు నిలబడ్డ చోటు కాస్త వాలుగా ఉండడంతో, ఏనుగు వెనుక కాళ్ళు కాస్త జారడంతో అది పెద్ద ఎత్తున శబ్ధం చేసింది. అప్పప్పా! అందరూ భయకంపితులయ్యారు. నేను వొణికిపోయాను.
మరొకరోజు మహాసవామి వారు ఒక మూలన కూర్చున్నారు. పుదు పెరియవా హాలు మధ్యలో కూర్చుని ఉపన్యసిస్తున్నారు. హఠాత్తుగా ఉపన్యాసాన్ని ఆపి, లోపలకు వెళ్ళిపోయారు. అలా ఎందుకు వెళ్లిపోయారో నాకు అర్థం కాలేదు. కొద్దిసేపటి తరువాత మహాస్వామి వారి ఆజ్ఞమేరకు లోపలకు వెళ్లారు అని ఎవరో చెప్పగానే కారణం అర్థం అయ్యింది కాని, అది నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది.
పరమాచార్య స్వామివారు చంద్రమౌళీశ్వర పూజ చేసేటప్పుడు నేను దగ్గరగా కూర్చుని పూజ చూసేవాడిని. ఒక అబ్బాయి, స్వామి నైవేద్యానికి కొబ్బరికాయ కొట్టడం, దీపంలో నెయ్యి వెయ్యడం వంటివి చేస్తుండేవాడు. అతను చేస్తున్న పనులన్నీ నేను శ్రద్ధగా గమనించేవాణ్ణి.
తరువాత నాకు ఒకసారి అవకాశం వచ్చింది. గుల్బర్గలో మహాస్వామి వారిని దర్శించుకున్నాను. అంత పెద్ద వయస్సులో కూడా స్వామివారు అంత వేగంగా నడవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. గుల్బర్గా నుండి బ్రహ్మపురి పనప్పూరి అనే చోటుకు గుర్రపు బగ్గీలో వెళ్ళాను. అక్కడ ఉన్న శివాలయంలోని శివుని పేరు పాతాళేశ్వరుడు. పూజ సమయంలో అక్కడ నన్ను రెండురోజులు ఋగ్వేదం పఠించమని చెప్పారు. నేను పఠించాను, తరువాత అడుగగా తొట్టకాష్టకం కూడా చదివాను. ఒకరోజు కొందరు భక్తులు మహాస్వామి వారి వద్దకు వచ్చి వెల్లూరు జలకంఠేశ్వర స్వామి ఆలయ కుంభాభిషేక పనుల గురించి చర్చిస్తున్నారు.
అప్పట్లో నేను పరమాచార్య స్వామివారు చేసే దండ తర్పణాన్ని, అనుష్టానాన్ని సునిశితంగా గమనించేవాణ్ణి. ఆ సమయంలో స్వామివారు కొన్ని మంత్రాలు చదివేవారు. గంటసేపు కళ్లుమూసుకుని స్వామివారు చేసే జపం చూడడం నాకు చాలా అద్భుతంగా తోచేది. వేద పారాయణం చేసే వారికి ఎవరైనా ధనం ఇవ్వడం. ఇవన్నీ చూడడం నాకు చాలా కొత్తగా ఉండేది.
ఒకరోజు ముసలాయన ఒకరు వచ్చి పరమాచార్య స్వామివారు నన్ను పిలుస్తున్నారని చెప్పారు. అప్పుడు స్వామివారు ఒక ఫర్లాంగు దూరంలో ఉన్నారు. నేను అక్కడకు వెళ్ళాను. స్వామివారు నాకు ఒక పుస్తకాన్ని ఇచ్చారు. అది తైత్తరీయ మంత్రకోశం. తన పక్కన కొర్చోమని చెప్పారు. స్వామివారు పుస్తకంలో పేజీలను తిప్పుతున్నారు. తరువాత ఎడమవైపున ఉన్న ఒక పేజీలోని చివరి అయిదు లైన్లు చదవమన్నారు. తరువాత “శ్రియేజతం”తో మొదలయ్యి, “య ఏవం వేద”తో అంతమయ్యే మంత్రాన్ని అయిదు సార్లు చదవమన్నారు. నేను అలాగే చేశాను. “సమిత మిత మితత్రాన్” అని అంతమయ్యే భాగం ఆ పుస్తకంలో ఎక్కడ ఉందో చూడమన్నారు. నేను సరిగ్గా చెప్పగానే, స్వామివారు ఋగ్వేదము, ఐతరేయ బ్రాహ్మణము పుస్తకాలను అడిగారు. అవి రాలేదు. అప్పుడు నేను స్వామివారితో, “నేను విద్యారణ్య భాష్యం చదివానట్టుగా నాకు గుర్తు. తండలంలో ఒకరి వద్ద తెలుగు ప్రతి ఉండడంతో నాకు వీలు కుదిరినప్పుడల్లా వారి వద్ద నేర్చుకునేవాణ్ణి” అని చెప్పాను.
కొద్దిసేపటి తరువాత స్వామివారు నాతో, “ఈ మంత్రంలో “వశత్కృత్యమ్ సంతత్యం” లేదా “వశత్కృత్యాయి సంత్యాయి” అన్నదాంట్లో ఏది సరైనది?” అని అడిగారు. రెండవదే సరైనదని నేను చెప్పాను. తరువాత నన్ను తత్వశాస్త్రం చదవమని, తెలుగు భాష చదవడం, వ్రాయడం నేర్చుకొమ్మని కూడా చెప్పారు.
ఒకరోజు మ్హాస్వామివారు పాతేళేశ్వర దేవాలయంలో ఒక చిన్న స్థలంలో కూర్చున్నారు. ఋగ్వేద పరీక్షకోసం పదమూడు మంది విద్యార్థులు ఉన్నారు. నన్ను రమ్మనడంతో నేను అక్కడకు వెళ్ళాను. నాకు ఒక పుస్తకాన్ని ఇచ్చి చివరి పేజీలో ఒక మంత్రాన్ని వ్రాయమని చెప్పారు. ఏ మంత్రం రాయాలో నాకు తోచక నేను మిన్నకుండిపోయాను. పుదు పెరియవా తరచుగా నన్ను దీపారాధన మంత్రాన్ని చెప్పమని ఎన్నోసార్లు అడిగేవారు. నేను ఆ మంత్రాన్ని చెబుతున్నప్పుడు స్వామివారు నన్ను ఆసక్తిగా గమనించేవారు. ఇప్పుడు ఇలా దాన్ని చదివి వ్రాయమని చెప్పారు మహాస్వామి వారు. పుదు పెరియవా స్వామివారికి నా గురించి ఏమీ చెప్పలేదు. నేను తురీయాశ్రమంలోకి వచ్చిన తరువాతనే ఈ సంఘటన యొక్క ప్రాముఖ్యం నాకు అవగతమైంది.
1983 మేలో ఒకరోజు నన్ను పరమాచార్య స్వామివారి సన్నిధికి తీసుకునివెళ్లారు. అప్పుడు స్వామివారు మహబూబ్ నగర్ లోని ఒక కాటన్ మిల్లులో మకాం చేస్తున్నారు. నేను సన్యాసాశ్రమం తీసుకోవాల్సిన రోజు దగ్గర పడుతోంది. నన్ను అక్కడకు తీసుకునిరావడానికి గల కారణం తెలిసిన కొందరు అన్నీ సకల మర్యాదలతో స్వామివారి వద్దకు తీసుకునివెళ్లారు. అప్పుడు పరమాచార్య స్వామివారు, చుట్టూ ఉన్నవారితో ధర్మశాస్త్ర కోవిదులైన పోలగం సుందర శాస్త్రి గారి గురించి మాట్లాడుతున్నారు. నేను అప్పుడు దర్శనానికి వచ్చిన విషయం గురించి తెలిపారు. నేను అక్కడి నుండి హైదరాబాదుకు తరువాత తిరుపతికి వెళ్ళాలి. అది ఆలోచిస్తూ స్వామివారి అనుగ్రహం కోసం స్వామి వారివైపు చూస్తూ నిలబడ్డాను. తరువాత ఆచార్యులవారు కూడా నావైపే చూశారు. తరువాత నేను బయలుదేరాను.
తరువాత నాకు తెలిసిన విషయం, త్వరలోనే నీవు మువ్వురు ఆచార్యులను చూస్తావు అని స్వామివారు అక్కడున్న ఒక భక్తునితో అన్నారు.
మా పరమాచార్య స్వామివారు సత్యసంధులు. వారి జ్ఞాపకశక్తి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సర్వజనులను ఆదరించడంలో స్థిరచిత్తులు. వారిని ద్వేషించేవారికి కూడా సహాయం చెయ్యడం, సహాయం చేస్తున్న వారిని అభినందించడం వారికి అత్యంత ఆనందదాయకం. వర్ణాశ్రమ పరిరక్షణ, సామరస్యం మెండుగా కలవారు. విద్యాసక్తులు, సూక్ష్మ వివేచన గలవారు. ఇతరులకు బోధించిన రీతిన వారు సంచరిస్తారు. వారిని వరదలను నివారించే ఒక ఆనకట్టతో పోల్చవచ్చు.
--- మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1
అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం