#మహా_దర్శనము_రెండవ_తరంగము_2
సీమంతము
కన్నడ మూలము : శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి
తెలుగు సేత : భాస్కర జనార్దన శర్మ
మధ్యాహ్నమై జాము గడుస్తూ ఉంది . మూడో జాము అని సూర్యుడు తన ప్రచండ కిరణాలను ఉపసంహరించుకుంటున్నాడు . పొద్దుటి నుంచీ మబ్బులు ముసిరి , సంక్రమణమా అన్నట్లున్న దినము ఇప్పుడు కొంచముసేపటి నుండీ తేటపడింది . అయినా చుట్టూ దిగంతాల వైపు మేఘాల ఆక్రమణ బలంగా ఉంది . మేఘాలు మాయావుల వలె సూర్యునితో దొంగాట లాడుతున్నాయి .
దేవరాతునికి ఆలోచనల్లో అంతా నిన్నటి రాత్రి చూసిన దృశ్యమే ! మాధ్యాహ్నిక కర్మల నన్నిటినీ ముగించి భోజనము పూర్తి గావించుకుని వచ్చాడు . చిన్న చౌకపు శల్య నొకదానిని భుజంపై వేసుకుని , మడి పంచతోనే ప్రాంగణపు పక్కన నీడలో పచారు చేస్తున్నాడు . చల్లగా చలి మొదలైంది . ధావళిని ఎందుకు కప్పుకోరాదు అనిపిస్తున్నది . తాంబూలము నోటిలో కరగుతున్నది . అన్యమనస్కంగా తాంబూలాన్ని నములుతున్నాడు . " ఇంకేమి , ఆలంబి వస్తుంది , ఆమెతో పుట్టబోయే పిల్లవాడి సంగతులు మాట్లాడవలెను . ఇప్పుడు ప్రస్తుతానికి గర్భిణిగా తాను చేయవలసినదేమి ? ముందు ముందు తల్లియై చేయవలసినదేమి ? అంతటినీ చెప్పాలి . " అని ఆలోచిస్తున్నాడు . అరకన్ను మూసుకుని చేస్తున్న ఆ ఆలోచనలో శిష్యుడొక్కడు వచ్చి నిలుచున్నదానిని ఆచార్యుడు గమనించలేదు . ఇంకాసేపవుతుండగా , " ఆచార్యులకు ఈ సమయము విడుపేనా " అంటూ భార్గవుడు దగ్గరికి వచ్చాడు .
దేవరాతునికి భార్గవుడు అప్పుడప్పుడు అలాగ వచ్చి పలకరించుట కొత్తేమీ కాదు . అయితే ఈ దినము అతనికి ఆ రాక కావాలనిపించ లేదు . అట్లాగని , వచ్చినవాడిని ఆహ్వానించకుండా ఉండటము అవుతుందా ? వెంటనే ఆ వైపుకు తిరిగినాడు . ముఖము ఎప్పటివలెనే మందహాస ప్రసన్నమైంది . అయినా అతనికి నోటినుండీ ఏమాటా రాలేదు . బహుశః రాబోవు శిశువు ఆలోచన బలంగా ఉండుటను సూచిస్తున్నది. వచ్చిన వాణ్ణి ఊరికే కళ్ళప్పగించి చూస్తున్నాడు .
భార్గవుడు మరలా అడిగాడు , " ఏమిటో , ఆచార్యులు ఏదో లోకంలో ఉన్నట్టుంది , నోటి నుండీ మాటలే రావడము లేదు ? "
దేవరాతుడు నవ్వాడు . " ఔను , భార్గవులు వచ్చినపుడు రండి అని ఉపచారము చేయకుండా ఉంటే ,, నేను ఎదురుగ్గా ఉన్నా లేనట్లే కదా ! నిజం చెప్పాలంటే , మీ భవ్యమైన ఆకారము , దానికి తగినట్లు ఉట్టిపడుతున్న మీ ఠీవి , దానితో పాటు మీరు వచ్చిన వైఖరి , అవన్నీ చూసి మనసు అదరిపోయింది . మాట బెదరిపోయినట్టు ఎక్కడికో పారిపోయింది . దాన్ని పట్టి తెచ్చుటకు దాని వెంటనే మనసు పోయింది . బుద్ధి అక్కడ కొంచము , ఇక్కడ కొంచము అయిపోయింది . అదంతా సరే , రండి , దయచేయండి . ఇక్కడే కూర్చుందామా ? లేక నడిమింటికి వెళదామా ? "
" నేను గుర్రపు బండిలో వచ్చినాడను . ఆ బండి దడదడ శబ్దము విని మీరు వాకిలి వద్దకు వస్తారు అనుకున్నా. వాకిలి వద్దకు రాలేదేమా , ఏదో విశేషముంటుంది అనుకొని లోపలికి వచ్చినాను . మీ శిష్యుడొకడు నన్ను చూసి మీకు చెప్పాలని లోపలికి పరుగెత్తి వచ్చినాడు . ఇదిగో వాడు ఇక్కడే నిలుచున్నాడు . మీరు వాణ్ణి చూసినట్లు లేదు . ఇదంతా చూసి నేను , మీరిక్కడే ఉన్నారా లేక లోకాంతరములలో సంయమమై ఉన్నారో అని అడిగినాను , తప్పులేదు కదా ? "
" భార్గవులు ఏమి చేసినా తప్పుకాదు . అలాంటప్పుడు తప్పెలా వెదికేది ? రండి వెళదాము " అని దేవరాతుడు అక్కడే నిలుచున్న శిష్యునికి కళ్లతోనే ఏదో సూచించి , భార్గవుడిని పిలుచుకొని నడిమింటికి వెళ్ళినాడు .
నడిమింటిలో కృష్ణాజినములతో శోభిస్తున్న వేత్రాసనములు ( వెదురు బద్దలతో చేసిన ఆసనములు ) . వాటిలో ఇద్దరూ కూర్చున్నారు . భార్గవుడు విజయపు మందహాసమును చిందిస్తూ , " ఆచార్యులవారు నేనిప్పుడు వచ్చినది ఎందుకో చెప్పగలరా ? " అని అడిగాడు .
ఆచార్యులు అదే రీతిలోనే , అయితే వినయాన్ని వీడని నవ్వు నవ్వుతూ , " మీరు చెబితే తెలుసుకుంటాను , నిజానికి నేనే రావాలనుకున్నాను. అంతలో మీరే వచ్చినారు . మొదట మీరు చెప్పాలనుకున్నది చెప్పండి , తర్వాత నేను చెప్పాల్సినది చెపుతాను . " అన్నాడు
భార్గవుడు చెప్పదొడగినాడు , " ఈ పొద్దున్నే అన్ని కర్మలనూ ముగించుకుని ఎప్పటివలె రాజ భవంతికి వెళ్ళినాను . అక్కడి కార్యాలన్నీ అయిన పిదప , మహారాజా వారు ఏకాంతములో ఏదో లోకాభిరామాయణము మాట్లాడుతూ కూర్చున్నారు . నేనపుడు సమయము చూసి వారికి ఎరుక పరచినాను , ’ మన ఆచార్యుల ఇంట సీమంతము జరగవలసియున్నది , రాజ భవంతి నుండీ , తమరి గౌరవానికీ , వారి గౌరవానికి తగినట్లు ఏదైనా చేసిన బాగుండును . " అన్నాను . వారు , ’ మాకు తెలియనే లేదే ? ’ అని ఆశ్చర్యపడినారు . " ఆచార్యుల స్వభావము తమ సన్నిధానమునకు పరిచితము కానిదేమి కాదు . వారు నిత్య తృప్తులు . ఏమి కావలెనన్ననూ , ఉన్నదాంట్లోనే జరగనీ , కావాలన్న దేవుడే ఇచ్చి అన్నీ జరిపించనీ అంటారు . కాని మాకు అలాగుండుటకు సాధ్యము కాదు. " అన్నాను . వెంటనే మహారాజుగారు , ’ నూరు నిష్కములు , పది మూటలు బియ్యము , దానికి తగిన సంభారములు అన్నీ పంపించవలెను అని అనుమతి నిచ్చినారు . అవన్నీ ఈ దినమో రేపో వస్తాయి . వచ్చినపుడు , ’ ఇవన్నీ మాకెందుకు ? " అని ఎక్కడ వెనుకకు తిరిగి పంపిస్తారో , అటుల చేయవద్దని చెప్పడానికే వచ్చినాను . మీకు సమ్మతమే కదా ? నేను చేసినదాంట్లో తప్పేమీ లేదు కదా ? "
ఆచార్యులు నవ్వేసినారు . " ఇప్పుడిది సరే పోయింది . నేను సీమంతాన్ని ఆడంబరంగా చేయాలా లేక , వైదిక కర్మ కదా , దాన్ని నిరాడంబరంగా చేయాలా అని ఆలోచిస్తున్నాను . ఇక ఇప్పుడు రాజ సహాయము సమకూరినందు వల్ల ఆడంబరముగానే చేయవలెనన్నట్లే కదా ? సరే లెండి , అలాగే చేద్దాము . " అన్నాడు .
భార్గవుడు మరలా అన్నాడు , " మీరు ఒక ఆశ్రమమును కట్టుకొని యుంటే ఆ మాటే వేరు . అప్పుడు నేను మీ ఆశ్రమవాసులంతా చేరి అయినంత సులభముగా నెరవేర్చుకోండి అని చెప్పేవాడిని . కానీ మీరు ఇలా రాజధాని లోనే అగ్రహారీకులు గా ఉంటూ ఏదో పేదవాడి వలె మీకు తగినట్లు మీరు ఆ ఉత్సవాన్ని ఆచరిస్తే , మేమంతా తల దించుకోవలసి వస్తుంది . రాజ భవనపు వైభవముతో కాకున్నా , తమ అంతస్తుకు తగ్గట్టు గౌరవముగా అయినా కావద్దా ? వైదీక కర్మ , లోకాడంబరమెందుకు అంటారేమో ? మనుష్యుడు ఉత్సవ ప్రియుడు . వాడు ఏపని చేసినా డోలు వాయించినట్టు పదిమందికీ తెలియవలెను . వేదములోనే చెప్పలేదా , ’ బృహద్వదేమ విదథే సువీరాః ’ --సరైన సంతానము కోసము గట్టిగా మంత్రము చెప్పి యజ్ఞము చేయవలెను అని ? కాబట్టి , నేను చెప్పినట్లే చేయండి . "
ఆచార్యులు భార్గవుని మాట ఒప్పుకున్నట్లు ముఖ ముద్రతోనే సూచిస్తూ , " రాజ పురోహితులు శ్రీ భార్గవ భట్టు గారు ఆదేశిస్తుండగా , నేను కాదనుటకు అగునా ? అయితే , సీమంతములో మేము చేయవలసిన క్రియలన్నీ అప్పుడే సాంగముగా జరిగినాయి . అందుకే , సీమంతము కేవలము ఔపచారికమే కదా , చేయాలా వద్దా అని ఆలోచించు చుండినది . అందువలననే మీరు వచ్చినపుడు అన్యమనస్కముగా ఉండినది . " అన్నాడు .
" అలాగంటే ? "
ఆ వేళకు శిష్యుడు వచ్చి , ఒక మేజాను తీసుకొని వచ్చి , దాని పైన మడి ధావళులను ఒక చెంబు గోరు వెచ్చని నీటిని తెచ్చి పెట్టినాడు .ఆచార్యుడు , ’ మొదట ఈ పని కానివ్వండి , పిమ్మట అంతా చెబుతాను " అని వారిని తొందర పెట్టారు . భార్గవుడు అక్కడే బచ్చలిలో కాళ్ళు చేతులు కడుక్కుని , మడి ధావళి నొకదాన్ని కట్టుకొని , ఇంకో దాన్ని కప్పుకుని , ఆ వేళకు వచ్చిన ఫలహారాన్ని స్వీకరించినాడు . ఆచార్యునికి కూడా రాజ పురోహితుని బలవంతము పైన అటుకుల పులిహోర ఫలహారమైనది . ఇద్దరూ వేడి పాలను సేవించినారు . మరలా మాటలు మొదలయ్యాయి .
ఆచార్యుడు కిందటి రాత్రి జరిగినదంతా చెప్పినాడు . " చూడండి , భార్గవా , నేను నాకన్నా ప్రబలుడైన పుత్రుడిని పొందవలెను అని హోమ హవనములను చేసినది నిజమే , కానీ నిన్న దర్శనమైనట్లు , పుట్టబోవు వాడు బ్రహ్మజ్ఞానియైతే ఏమి గతి ? యజ్ఞవల్క్య అని ప్రసిద్ధి పొందిన మా వంశము ఏమవుతుంది ? నాకిదే యోచన అయిపోయింది " అన్నాడు .
" వదిలేయండి , దీనికింత యోచన యెందుకు ? మిథిలా నగరములో ఉన్నారు . విద్య ఉన్నదంతా కురు , పాంచాల , కాశీ ప్రదేశములయితే , ఆ విద్యకు గౌరవమున్నది మన జనక మహారాజుల వారి వద్ద . ’ యథా రాజా తథా ప్రజాః ’ మీరు కర్మ విద్యలో పొందిన పేరును మీ కుమారుడు బ్రహ్మవిద్యలో పొందితే మీకు ఇష్ట సిద్ధి యైనట్లే కదా ? "
" అలాగని నాకున్న జ్ఞానమంతా మట్టిపాలు కావలెనా ? నేను సంపాదించినదంతా వ్యర్థము కావలెనా ? "
" ఆ మాటెలా వచ్చింది ? బ్రహ్మవాదులు , అన్ని విద్యలకూ మూలస్థానము మన బ్రహ్మవిద్య అనేకదా చెప్పుకుంటారు ? ఒకవేళ మీ పుత్రుడు కర్మ విద్యను వదిలేస్తేనో అంటున్నారు , ఉపనయన సమయములో మహా యజ్ఞముల నన్నిటినీ చేస్తానని వాడిచేత ప్రమాణము చేయించండి . అవన్నీ చేసేటప్పటికి ఏమవుతుందో చూద్దాము . "
దేవరాతుడికి అది సమ్మతమైనది . " అలాగే చేయవలెను , ఇక వేరే దారి లేదు ’ అని నోటినుంచీ మాట కూడా వచ్చింది .
" ఆచార్యా , ఏదో జీవము వచ్చి ప్రవేశించినది , ఇంకేమిలే అని సీమంతాన్ని వదలివేయకండి . సీమంతమును చేయండి . గర్భిణికి పాపిడి తీసి , వీణానాద పూర్వకముగా మంత్రమును ఉచ్చరిస్తే , ఆ నాదము తరంగ తరంగములుగా గర్భిణి యొక్క గర్భాన్ని చేరి , అక్కడున్న పిండమునకు చేతనము కలిగి , వైదీకమవుతుంది . ఆ పిండము శిశువై బయటికి వచ్చిన తర్వాత ఆ శిశువు బుద్ధి వైదీక మార్గములోనే నడుచును . మీరిక యోచించవలదు . "
ఆచార్యుడు తాను కిందటి రాత్రి చూసినది మరువలేదు , కానీ శాస్త్ర సమ్మతముగా పలుకుతున్న రాజ పురోహితుని మాటను తిరస్కరించలేక , " నిజము , నిజము , అట్లే కావలెను . సంస్కారములను వదలిన వారుంటారా ? సీమంతము చేసే తీరవలెను ," అన్నాడు .
ఇంకొంత సేపు భార్గవుడు అలాగే అదీ ఇదీ మాట్లాడి , బయలుదేరి వెళ్ళిపోయినాడు .