1, సెప్టెంబర్ 2024, ఆదివారం

ఆదిభట్ల నారాయణ దాసు

 🙏ఆదిభట్ల నారాయణ దాసు గారు 🙏

ఆదిభట్ల నారాయణ దాసు గారి గురించి చాలామందికి పూర్తిగా తెలియదు. కేవలం హరికథా పితామహుడుగానే తెలుసు. ఆయన గొప్ప తత్త్వవేత్త. ఒక్కమాటలో చెప్పాలంటే భాస్కర రాయలు వారు వ్రాసిన లలితా సహస్ర నామ భాష్యాన్ని అచ్చ తెలుగులో వ్రాసిన మహానుభావులు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ప్రయత్నం చేస్తాను 

ఆదిభట్ల నారాయణదాసు గారు ఆగష్టు 31, 1864 సంవత్సరంలో జన్మించారు - జనవరి 2, 1945 శివైక్యం చెందారు. హరికథా కళాకారుడు, సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియని సృజించి "హరికథా పితామహ" అనే బిరుదంతో ప్రఖ్యాతిగాంచారు. సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు

తెలుగు, సంస్కృతం, తమిళం, హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఆంగ్లం, అరబ్బీ, పారశీకం భాషలలో ఆయన ప్రావీణ్యం సంపాదించాడు. అష్టావధానాలు చేసేవాడు. అచ్చతెలుగులోను, సంస్కృతంలోను, సంస్కృతభూయిష్టమైన తెలుగులోను కూడా వివిధ విషయాలపై శతాధిక గ్రంథాలు రచించిన మహా పండితుడు.


అంతకు ముందు తెలుగులో ఉమర్ ఖయ్యామ్ రుబాయితులను వ్రాసినవారు ఎక్కువగా ఎడ్వర్డ్ ఫిడ్జిరాల్డ్ రచించిన ఆంగ్ల రచననే మూలంగా తీసుకొన్నారు. అలా చేయడం వలన మూలగ్రంథాలలోని విషయం సరిగా చూపడం కుదరలేదని తలచాడు ఆదిభట్ల నారాయణదాసు. ఈ విషయం ఋజువు చేయడానికి ఆయన పారశీక భాష లోని మూల గ్రంథం కవితలనూ, ఫిడ్జిరాల్డ్ ఆంగ్లానువాదాన్నీ కూడా అచ్చ తెలుగులోకీ, సంస్కృతంలోకీ వేరు వేరు ఛందస్సులలో అనువదించాడు. 1932లో వెలువడిన ఈ రచన పాండిత్యానికి పరాకాష్ఠగా ఆనాటి సాహితీకారులచే మన్నింపబడింది.


మరొక గొప్ప రచన - 1922లో ప్రచురితమైన నవరస తరంగిణి - ఇందులో సంస్కృత మహాకవి, నాటక కర్త కాళిదాసు రచనలనుండి, ఆంగ్లభాషలో ప్రసిద్ధ నాటక రచయిత షేక్స్‌పియర్ రచనలనుండి నవరసాలను వర్ణించే ఖండికలను తెలుగులోకి అనువదించి చూపాడు.


కాని ఆయన రచనలలో ఉద్గ్రంథంగా చెప్పబడేది జగజ్యోతి అనే తాత్విక రచన. వివిధ భారతీయ తాత్వికుల సిద్ధాంతాలను, దృక్పథాలనూ ఈ గ్రంథంలో వివరించాడు. నాస్తిక వాదాలు కూడా విస్తృతంగా చర్చింపబడ్డాయి.


నారాయణదాసు సంస్కృత రచనలలో ముఖ్యమైనవి - మూడు హరికథల కూర్పు హరికథామృతం, స్వతంత్ర రచన తారకం, రెండు శతకాలు రామచంద్ర శతకం, కాశీ శతకం.


దశవిధ రాగ నవతి కుసుమ మంజరి అనే పాటలో మంజరీ వృత్తంలో 90 రాగాలు కూర్చాడు. అంతవరకూ ఎవరూ సాహసించని ఈ ప్రక్రియ సంగీతంలోనూ, కవితలోనూ నారాయణదాసుకు ఉన్న ప్రతిభకు తార్కాణం. ఋక్‌సంగ్రహం అనే బృహత్తర కావ్యంలో ఈయన ఋగ్వేదములోని 300 పైచిలుకు ఋక్కులకు సంగీతాన్ని సమకూర్చి, వాటిని వీణమీద వాయించడం విద్యార్థులకు నేర్పాడు. ఆ ఋక్కులను తెలుగులో గీతాలుగా అనువదించాడు.


నారాయణదాసు సంగీత ప్రతిభ ఆయన సాహితీ ప్రకర్షకు సమస్థాయిలో పరిమళించింది. ఆనాటి సంగీత విద్వాంసులు ఆయనను లయబ్రహ్మ అనీ, పంచముఖి పరమేశ్వర అనీ సన్మానించారు. ఒకేమారు ఐదు తాళాలకు అనుగుణంగా పాడడం ఆయన ప్రత్యేకత. ఈ పంచముఖి ప్రదర్శనలో నారాయణదాసు రెండు చేతులు, రెండు కాళ్ళు, తలలతో ఐదు తాళాలకూ దరువు చూపేవాడు. అప్పుడు ఆయనకు ఐదుగురు వివిధ వాద్యకారులు సహకరించేవారు. సంగీత సాహిత్య స్వర బ్రహ్మ అని ఆయనకు బిరుదు ప్రసాదించారు.


ఆనంద గజపతి నారాయణ దాసును తన ఆస్థాన విద్వాంసునిగా నియమించాడు. ఒకసారి సభలో ఆయన దాసును ఏదో రాగం పాడమని అడిగాడట. కానీ ఆయన నేను పాడను అని సభలో నుండి వెళ్ళిపోయాడట. రాజు గారు కూడా దానికి ఏమి కోపం తెచ్చుకోలేదు. ఐతే తరువాత ఆయన వ్యాయామశాలలో వ్యాయామం చేస్తున్నప్పుడు, ఎందుకో ఆ రాగం గుర్తుకు వచ్చి, పాడడం మొదలుపెట్టారట. నిమిషాలు గడుస్తున్నాయి, గంటలు గడుస్తున్నాయి. చుట్టూరా జనాలు ఉన్నారు. కానీ ఇవేవీ పట్టించుకొనే స్థితిలో లేడు నారాయణ దాసు. చివరికి పాడడం అయినతరువాత చూసుకుంటే ఒంటి మీద కేవలం గోచీ తప్ప ఏది లేదట. ఆ రాగం విన్న ప్రజలంతా ఆనందంతో ఇంటికి వెళ్ళిపొయారు. వెళ్ళిపోయిన ఆ జనంలో, ఆనంద గజపతి రాజు కూడా ఉన్నాడట…!


ఆదిభట్ల నారాయణ దాసు రచనలు :-


 తల్లి విన్కి (లలితా సహస్ర నామాలకు అచ్చతెలుగు పద్యాలు)

 నారాయణ దర్శనము 

జగజ్జ్యోతి - ప్రథమ సంపుటము

 జగజ్జ్యోతి - ద్వితీయ సంపుటము

 కచ్ఛపీశ్రుతులు

 జానకీ శపథం

నవరసతరంగిణి (షేక్స్పియర్ కవిత్వమందలి సొగసులు)

బాటసారి (గూఢార్థ కావ్యం)

 తారకం

 సావిత్రీ చరితము

 పాండురంగ బృందావన సంకీర్తనలు

 ఋక్సంగ్రహః - మొక్కుబడి

ప్రహ్లాదచరిత్రము

 మన్కిమిన్కు (ఆయుర్వేదం) కుదురు

నూఱుగంటి 

పంచశతి - శతకాలు

                          సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: