15. " మహా దర్శనము "-- పదునైదవ భాగము --మనకు కావలసిన కథ
15. పదునైదవ భాగము -- మనకు కావలసిన కథ
కొడుకుకు మూడో యేడు కూడా నిండింది . పెరిగిన దూడ తల్లి సన్నిధిని వదలినట్లే , వాడుకూడా తండ్రి వద్దకే ఎక్కువగా చేరుతూ వచ్చినాడు . తండ్రికీ , కొడుకుకూ ఋణానుబంధము బలముగా ఉండినది . తండ్రికి పదిమంది శిష్యులకు అధ్యాపనము , ప్రవచనములను గావించుట ఒకఎత్తైతే , కొడుకు వెంట ఉండుటే ఒక ఎత్తు . కొడుకు తల్లి సావాసము వదలకున్ననూ , ఆమెకు చెప్పి తండ్రి వద్దకు వచ్చి చేరును . ఇంతవరకూ తల్లి వెంట వెంటే తిరుగుతున్నట్టే , ఇప్పుడు తండ్రి వెంట వెంటే వెళ్ళును . తండ్రి ఇంటిలో ఉన్నపుడు , అతడు ఏమి చేస్తున్ననూ పక్కనే కొడుకు ఉండవలసినదే . చేస్తున్న పని అగ్ని పరిచర్య కావచ్చును , లేదా , శిష్యులకు అధ్యాపనము చేస్తుండుట కావచ్చును . తండ్రి తోడు మాత్రము వదలడు .
ఒక దినము కొడుకు తండ్రి తొడపైన కూర్చొని , ’ తండ్రీ , ఆ దినము నేను ఒకమాట అడిగినాను . సరే కానీవయ్యా , చెపుతాను అన్నారు . ఇప్పుడు అడిగేదా ? అన్నాడు . తండ్రి , ’ చూడయ్యా , యాజ్ఞవల్క్యా , ఇవి కార్తీక మాసము చివరి రోజులు . ఇంకా మార్గశిరము , పుష్యము రెండు నెలలు మనసును గట్టిగా పట్టుకో . మాఘ మాసములో చౌలము జరగనీ , ఆ తరువాత ఏమి కావలసినా అడుగు . చెపుతాను . అంతవరకూ నువ్వు నేను చెప్పే కథలను వింటూ ఉండు . " అన్నాడు .
కొడుకు తన మనసు తన చేతిలో ఉన్నట్లే , తాను లేగదూడలను పట్టుకొని లాగికొని తెచ్చునట్లే , మనసును పట్టి లాగి తెచ్చువాడి వలె , ’ ఊ ’ అన్నాడు . అది చూసి తండ్రికి ఆశ్చర్యము ! మంచి సంయమశీలుని వలె మనసును బిగించువాడిలా ఉన్నాడే యని . కానీ , తనకు అయిన దర్శనము వలన ఎదురుగా ఉన్నవాడు మహా పురుషుడు అని తెలుసు కాబట్టి ఆశ్చర్య పడునట్లు కూడా లేడు . ఏదైతేనేమి , తన స్థితి విచిత్రముగా ఉంది .
తండ్రి కొడుకును , " కథ చెప్పవలెనా ? " అని అడిగినాడు . కొడుకు ’ ఊ ’ అన్నాడు . తండ్రి చెప్పనారంభించినాడు , ’ ఒక ఊళ్ళో ఒక చెట్టు , దానిపై ఒక కాకి ఉండింది .’
కొడుకు , తొడపైకూర్చున్నవాడు , అలాగే తండ్రి నోటిని తన చిట్టి చేతులతో మూసి , గంభీరముగా అన్నాడు,
" తండ్రీ , మనవంటి వారికి కాకి కథలతో వచ్చేదేమిటి ? వద్దు " కొడుకు మాటలో సత్య నిష్ఠురత , భావపు బిగి , రెండూ ఉన్నాయి . తండ్రికి ఇంకేమి మాట్లాడుటకూ నోరు రాలేదు , " మన వంటి వారు అంటే , ఎటువంటి వారు ? " అని అడుగవలెననిపించినది , అడుగుటకే అవలేదు , కానీ మాట్లాడకుండా ఎలా ఉండుట ? యాంత్రికముగా , యంత్రము వలె , మాట్లాడినాడు , " అట్లయితే , నీకు ఎటువంటి కథ కావలెనయ్యా ? "
" అప్పుడు నచికేతుని కథ చెప్పినారు కదా , దాన్ని ఇంకొక సారి చెప్పండి , బండి కింద పడుకున్న వాడి కథ చెప్పండి , అటువంటి కథలైతే , చెప్పుటకూ బాగు , వినుటకూ బాగు "
తండ్రికి నిజమే యనిపించినది . వాడు అడుగుతున్నవన్నీ బ్రహ్మజ్ఞుల కథలు . ఈ కథలను ఇప్పటినుండే ’ బాగు ’ అంటే ఇక ముందు ఏమి గతి ? అని దిగులు కలిగింది . అయితేనేమి , త్రేతాగ్నులు చెప్పినారు కదా , వారే సర్వమునూ చూచుకొనెదరు . కాబట్టి దిగులు పడనవసరము లేదు అని ఒక మొండి ధైర్యము .
కానిమ్ము యని తండ్రి నచికేతుని కథ చెప్పినాడు .
" నచికేతుడు గౌతమ వాజశ్రవసుని కొడుకు . అతని తండ్రి స్వర్గమును పొందవలెనని ఒక యాగమును చేసినాడు . దానిలో , తనవద్దనున్న సర్వమునూ దానము చేయవలసి వచ్చెను . "
" అలాగ తన వద్దనున్నదంతా ఎందుకు తండ్రీ , ఇచ్చేది ? .... ఊ , తప్పయిపోయింది , ఇంకా రెండు నెలలు ఏమీ మాట్లాడకూడదు , ఆ తరువాత ఏమైనా అడగవచ్చును , సరే, తర్వాత ఏమైంది , చెప్పండి "
తండ్రి ఏదేదో ఆలోచిస్తూ , ఒక నిట్టూరుపుతో అదంతా బయటికి పారద్రోలి , ముందరి కథ చెప్పనారంభించినాడు .
" అలాగ దక్షిణగా సర్వమునూ ఇచ్చునపుడు , ఇంట్లో ఉన్న ముసలి యావులను దానమిచ్చినాడు . అవి ముసలివై , పళ్ళూడిపోయి , వాటికి గడ్డితినుటకు కూడా చేతకాదు . అటువంటివి . అప్పుడు , నచికేతుడు ఆలోచించినాడు , ’ మాతండ్రి తన సర్వస్వమునూ దానము ఇచ్చివేస్తున్నాడు , అట్లయిన , నన్ను కూడా ఇచ్చివేయునా ? అలాగ ఇచ్చినా అది విశేషమేమీ కాదు . కొడుకు తండ్రి ఆస్థిలో భాగమే కదా ? అలాగైతే నన్ను ఎవరికి ఇచ్చునో ? అడిగి తెలుసుకుంటాను ’ అనిపించినది . " తండ్రీ ! నన్ను ఎవరికి ఇస్తావు ? ’ అని అడిగెను . తండ్రి తన ముఖ్యమైన పనులను గురించి ఆలోచిస్తూ సమాధానము చెప్పలేదు . మరలా అడిగినాడు , మరలా సమాధానము లేదు . మరలా మరలా మూడు నాలుగు సార్లు అడిగినాడు . తండ్రికి కోపము వచ్చినది . యజ్ఞములో యజమానుడై యున్న వాడు , దీక్షితుడైన వాడు కోపము చేసుకో కూడదు అనునది కూడా మరచినాడు . నిన్ను మృత్యువుకు ఇచ్చివేస్తాను అన్నాడు . యజ్ఞశాల అంతటా నిండియున్న దేవతలు తథాస్తు అన్నారు . మృత్యు దూతలు వచ్చినారు . నచికేతునిని పిలుచుకొని పోయినారు .
" మృత్యువంటే యముడు కదా ? ఆతడు నచికేతుని మూడు దినములు పరీక్ష చేసినాడు . నాలుగవ దినము ఆకాశవాణి, ’ మొదట ఆ బాలుడిని సత్కరించు ’ అని మ్రోగింది . యముడు సరేనని , ఆ పిల్లవాడిని పిలిచి , " పాపము , నువ్వు వచ్చి మూడు దినములు అయినది , నిన్ను ఎవరూ పట్టించుకోలేదు , యోగ క్షేమములు కూడా అడుగలేదు , తిండీ నీరూ లేక అలాగే ఉన్నావు , ఆ మూడు దినములనూ మరచిపో , ఆ మూడు దినములు కష్టపడినావు కనుక , దినమునకు ఒకటిగా , మూడు వరములను ఇచ్చెదను " అన్నాడు
నచికేతుడు సరేనన్నాడు . ’ ధర్మ రాజా , మా తండ్రి గారికి నాపైన చాలా ప్రేమ . వారు ఇప్పుడు నేను లేనని శోకిస్తున్నారు . యాగమును పూర్తి చేసినారో , లేదో ? కాబట్టి , వారి యాగము పూర్ణము కావలెను , వారు శోకరహితులు కావలెను , కోప రహితులు కావలెను , నువ్వు నన్ను తిరిగి మా లోకమునకు పంపించివేసిన , వారు నన్ను ముందరిలాగానే ప్రేమతో చూడవలెను.’ .ఇది నా మొదటి వరము " అన్నాడు . యమ ధర్మరాజు ’ ఈ పిల్లవాడు తనకోసమై ఏమీ అడుగలేదు . తండ్రికోసము ఈ వరమును అడిగినాడు ’ అని సంతోషపడి , ’ అటులనే యగుగాక , ఈ వరమును ఇచ్చినాను , ఇక రెండవ వరమును అడుగుము ’ అన్నాడు
" నచికేతుడు సరేనని , ’ ధర్మరాజా , మా తండ్రిగారు యాగమును చేసినది స్వర్గము కోసము: ఆ స్వర్గమునకు పోవు దారి వేరే ఉన్నదా ? ఉంటే అది నాకు కూడా నేర్పించు ’ అన్నాడు . ధర్మరాజు అటులనేనని అతడికి అగ్నివిద్యను చెప్పినాడు . నచికేతుడు , చెప్పుతుండగనే ఆ విద్యను నేర్చేసుకున్నాడు . యముడికి సంతోషమై , ఆ విద్య ’ నాచికేతాగ్ని ’ అనే పేరుతోనే ప్రసిద్ధమవనీ అని , హెచ్చుగా ఇంకొక వరమును తానై ఇచ్చినాడు , ’ నచికేతా , ఈ అగ్నిని దినమునకు మూడు సార్లు ఆరాధించినవాడికి కావలసిన లోకములు దొరకును ’ అన్నాడు "
దేవరాతుడు కథ చెప్పుచుండగానే ఆవేళకే సరిగ్గా తల్లి యాజ్ఞవల్క్యుని పిలిచింది . " యజ్ఞయ్యా , ఇక్కడికి రావయ్యా " అన్న ఆమె పిలుపు విని యాజ్ఞవల్క్యుడు ఏమి చేయవలెనని అడుగువాడి వలె తండ్రి ముఖమును చూచినాడు . తండ్రి , ’ అమ్మ పిలుస్తున్నది , వెళ్ళిరా ’ అన్నాడు.
’ కథ ? ’
’ ఇంకొక దినము చెపుతానులే , ’
" ఆ దినము ఈ కథను ఇంకా పెద్దగా చేసి చెప్పండి . నేను వినవలెను . నేను కూడా ఒక నచికేతుని కావలెను " అంటూ కొడుకు తల్లి వద్దకు పరుగెత్తి పోయినాడు .
తండ్రి , దిగ్భ్రాంతుడై కూర్చున్నాడు . " ఇంకా మూడు యేళ్ళే . అప్పుడే తానొక నచికేతుడిని కావలెనను ఆశ , అబ్బా ! " అనుకున్నాడు . అలాగే , ’ ఈ సంగతినంతా బుడిలులకు చెప్పవలెను ’ అనిపించినది . ఇంకా ఏమేమో ఆలోచనలు వచ్చినాయి . " ఔను , వారొక్కరే దీనికి సమాధానమును చెప్పగలరు " అని కాళ్ళూ చేతులూ కడుగుకొని మంచి దుస్తులు ధరించినాడు .
వెంటనే గుర్తుకు వచ్చింది , ఈ దినము ఆచార్యులు బుడిలుల ఇంటికి వెళ్ళవలసి యుండినది . బుడిలుల కొడుకు కాత్యాయనుడు ఈ దినము సమావర్తనము చేసుకొని , స్నాతకుడై ఇంటికి వచ్చును . ఇక్కడ కొడుకును తొడపై కూర్చోబెట్టుకొని ముద్దు చేయుటలో ఆ సంగతే మరచిపోయినాడు . ’ ఇప్పుడైనా గుర్తొచ్చినది , అదే సంతోషము ’ అనుకొని , ఆత్రాత్రముగా వెళ్ళినాడు .