12, జనవరి 2025, ఆదివారం

కెరటం నాకు ఆదర్శం..

 కెరటం నాకు ఆదర్శం..

 లేచి పడుతున్నందుకు కాదు...

 పడినా కూడా... 

లేస్తున్నందుకు.... 

జీవితంలో సమస్యలు వస్తే రానీ... సవాళ్లు ఎదురవుతే ఎదురవనీ...

ఓటమి తలుపు తడితే తట్టనీ....

మన బలమే జీవనం....

మన బలహీనతే మరణం ....

కనుక

ధైర్యంతో నిలుద్దాం....

 పోరాడుదాం....

గెలిచి విజయ పతాకాన్ని ఎగురవేద్దాం.

.....స్వామి వివేకానంద🙏🪷🙏

అపూర్వ కవితా భానూదయం!!




అపూర్వ కవితా భానూదయం!!


ఉదయాద్రి బుజమెక్కి ఒకడు నవ్వెను చూడు 

     భూ దివమ్ములు వెల్గుపూలు పూయ,


ఉవిద తామరబుగ్గ నెవడొ ముద్దిడె చూడు 

     మనసులో వలపు చందనము రాయ,


చిమ్మ చీకటి కాల జిమ్మె నెవ్వడొ చూడు 

    గుండె లోపలి తమోగుణము మాయ,


కనురెప్ప దుప్పటీ కప్పులాగె నెవండొ 

      వెలుగు లోకాలు తల్పులను తీయ


వేయి చేతుల ధరణిన పిలచి పిలచి

     కౌగిలించు నెవండొ శృంగారి చూడు,


కనబడరాని దివ్య లోకాలు చూపి    

     తాను కనుమూయు లోకబాంధవుడు వాడు.


( *సుప్రభాతము * డా:దాశరధి.) 🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కన్నీరేలకొ

 


కన్నీరేలకొ? చెల్లి! నీ యెడదలో కార్చిచ్చులే రేగెనా?


ఎన్నేండ్లైనను నెన్ని కష్టములకున్ నేడాటమున్ జెందకే


పన్నీరున్ నొక కంట నీవొలుకగన్ పండింతు వానందముల్


చిన్నారీ! దిగులొందకే బిగువుతో ఛేదించుమా విఘ్నముల్.


అల్వాల లక్ష్మణ మూర్తి.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - హేమంత ఋతువు - పుష్య మాసం - శుక్ల పక్షం  - చతుర్దశి - మృగశిర -‌‌ భాను వాసరే* (12.01.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

అహం వీడిన రోజు

 🙏🕉️శ్రీ మాత్రేనమః.శుభోదయం🕉️🙏 🔥 *మనిషిలో అహం వీడిన రోజు ఆప్యాయత అంటే ఏంటో అర్ధమవుతుంది..గుర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది.. నేనే నాకేంటి అనుకుంటే మాత్రం చివరికి ఒక్కడివే మిగిలి పోవాల్సి వస్తుంది.. నలుగురితో ఎప్పుడూ నవ్వాలి, నవ్వించాలి, ప్రేమించాలి, గౌరవించాలి, గౌరవం పుచ్చుకోవాలి* 🔥రెండు చెవులు ఒకే శబ్దన్ని వింటాయి.. రెండు కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి. రెండు నాసికలు ఒకే వాసన పిలుస్తాయి.. కాని అదేమి మాయ రోగమో ఉండే ఒక్క నాలుక మాత్రం రెండు రకాలుగా మాట్లాడుతుంది.. అదే *నేను అనే అహం* 🔥 పుట్టినప్పుడు పేరు ఉండదు, ఊపిరి మాత్రమే ఉంటుంది.. మరణింంచినప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది..ఈ రెండింట మధ్య ఉన్నదే జీవితం.. ఊపిరి ఎలాగో నిలుపుకోలేం.. కనీసం పేరైన నిలుపుకుందాం..అందుకే అహం వీడి భగవంతుని ధ్యానంతో నిరంతరం మంచి జ్ఞానాన్ని పొందడం, దానిని స్థిరమైన ఆచరణలో పెట్టడం వల్ల కీర్తి, సంబంధాలు, అనందం, ఆలోచన పెరిగి హృదయం ప్రశాంతత కలుగుతుంది🔥🔥మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ & జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంకు ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయిన వారు రాలేని వారు కొత్తవారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593 9182075510* 🙏🙏🙏

మగవాళ్ళకి ఒక వరం...!!!*🥀

 *భర్త జీవించినంత కాలం భార్య జీవిస్తే మగవాళ్ళకి ఒక వరం...!!!*🥀 

అందుకనేమో మన పెద్దలు వయసులో తేడా పెట్టారు, సహజంగా ఆడవాళ్లు భర్త చేతుల మీదుగా వెళ్లాలని కోరుకుంటారు, ప్రస్తుతం మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిన పరిస్థితుల్లో  మగవాళ్లే భార్య చేతుల మీదగా వెళ్లాలి అని కోరుకుంటున్నారు.

--సాధారణంగా భార్యాభర్తల్లో పురుషులు వయసులో పెద్దవారై ఉంటారు కాబట్టి, వారు తమ కన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవడానికి మహిళలు సిద్ధమై ఉంటారట. 

తన కన్నా చిన్నదైన భార్య

చనిపోతుందనే సన్నద్ధత

పురుషుల్లో ఉండదట. 

భార్య చనిపోతే భర్త 

కృంగుబాటు  గురవడానికి 

ఇది కూడా ఒక ప్రధాన 

కారణము..!

                                                                                                           --భార్య మీద జోకులేస్తారు. కోపమొస్తే అరుస్తారు, అలుగుతారు, తిడతారు., 

*ఆమె శాశ్వతంగా దూరమైతే*

*మాత్రం  తట్టుకొని బతికేంత*

*మానసిక బలం పురుషులకు ఉండదు.*

‘🌷ఆమె’ లేని మగాడి జీవితం, మోడువారిన చెట్టుతో సమానం !!'

అడగకుండానే అన్నీ అమర్చిపెట్టినన్నాళ్లూ ఆమె విలువ తెలుసుకోలేని మహానుభావులుంటారు 

ఆమె వెళ్లిపోయిననాడు, మనసులో మాటను చెప్పుకొనే తోడు లేక..,

అందరితో కలవలేక..,

మనసులోనే కుమిలిపోయి శారీరకంగా క్షీణించిపోతారు 

                                                                                                                                                                                  "నేను ముందు పోతే పసుపు, కుంకాలు మిగిలిపోతాయేమో గానీ., ఆ జీవుడు ఎంత అవస్థపడతాడో నాకు తెలుసు. పైనున్న భగవంతుడికి తెలుసు.


‘🌷దేవుడా ఈ మనిషిని తీసుకెళ్లు, ఆ తర్వాత నా సంగతి చూడు’ అని రోజూ దణ్నం పెట్టుకునేదాన్ని.

‘మొగుడి చావు కోరుకునే వారు ఉంటారా ఉండరు. 

నాకు మీ మావయ్యంటే 

చచ్చేంత ఇష్టంరా. 

ఆయన మాట చెల్లకపోయినా, కోరిక తీరకపోయినా, నా ప్రాణం కొట్టుకుపోయేది. 

చీకటంటే భయం. 

ఉరిమితే భయం. 

మెరుపంటే భయం. 

నే వెన్నంటి ఉండకపోతే ధైర్యం ఎవరిస్తారు ? 

అర్ధరాత్రిపూట ఆకలేస్తోందని 

లేచి కూర్చుంటే ఆవిరికుడుములూ కందట్లూ పొంగరాలూ ఎవరు చేసి పెడతారు ?’’

ప్రముఖ రచయిత శ్రీరమణ రాసిన.., నటుడు ప్రయోక్త శ్రీ తనికెళ్ళ భరణి తీసిన ‘మిథునం’లో భర్త మరణం గురించి బుచ్చిలక్ష్మి పాత్ర ఆవేదన ఇది !                             

                   

🌷నటుడు రంగనాథ్‌ గుర్తున్నారా ? భార్యతో అపూర్వమైన అనుబంధం ఆయనది. మేడ మీద నుంచి పడటంతో నడుం విరిగి ఆవిడ మంచాన పడితే.. పద్నాలుగేళ్లపాటు ఆమెకు సేవలు చేశారాయన ! తాను ఎంతగానో ప్రేమించిన భార్య శాశ్వతంగా దూరమవడాన్ని తట్టుకోలేక కుంగుబాటుకు గురై 2015లో ఉరి వేసుకుని చనిపోయారు.

                                                                                                                                                 ప్రముఖ చిత్రకారుడు, 

దర్శకుడు బాపు సైతం., 

భార్య భాగ్యవతి మరణాన్ని తట్టుకోలేక ఆమె వెళ్లిన ఏడాదిన్నరలోపే తుదిశ్వాస విడిచారు.

                                                                                                                                                                                                                                                                                                                                                    🌷సాధారణంగా భార్య అంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది.

భార్య తన మీద ఆధారపడి ఉందని.,తాను తప్పఆమెకు 

దిక్కులేదని చాలామంది పురుషులు అనుకుంటారు. 

కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది. 

చాలామంది పురుషులు తమకు తెలియకుండానే భార్యపై మానసికంగా ఆధారపడిపోతారు.

 భార్యను కోల్పోయినప్పుడు ఆ లోటు వారికిబాగా తెలుస్తుంది. వారి జీవితం గందరగోళంలో పడిపోతుంది. 

🌷భాగస్వామి దూరమైనప్పుడు మహిళలు స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. భర్తకు దూరమైన తరువాత మహిళలు కుటుంబ సభ్యులతో కలిసిపోవడం, కొన్ని బరువు బాధ్యతలు తీసుకుంటారు.

స్త్రీ చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బతుకుతుంది 

తండ్రికి బాగోలేకపోయినా, భర్తకు జ్వరం వచ్చినా, పిల్లలకు జలుబు చేసినా తనే సేవ చేస్తుంది. అదే తనకు ఏదైనా అయితే 

ఎవరి కోసం ఎదురు చూడదు. తనకు తానే మందులు వేసుకుంటుంది. 

ఓపిక లేకపోయినా లేచి పనులు చేసుకోవడానికి యత్నిస్తుంది. ఆ మనోబలమే., భర్త లేకపోయినా ధైర్యంగా బతకడానికి ఉపయోగపడుతుంది.

                                                                                                                                                                                                                        -🌷భావోద్వేగ బలం ఆమెదే !

_*పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే, స్ర్తీ భావోద్వేగాలపరంగా బలంగా ఉంటుంది.*

సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే, భార్య కుటుంబ బాధ్యత మోస్తుంది. 

ఒక విధంగా చెప్పాలంటే.. 

ఇంట్లో ఆమే రిమోట్‌ కంట్రోల్‌. ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకే తెలుసు. 

ఎంతటి భావోద్వేగాన్నయినా భరిస్తుంది. పిల్లలే సర్వస్వంగా బతుకుతుంది. 

అందుకే భర్త తనువు చాలించినా పిల్లల కోసం తను కష్టపడుతుంది..

* స్త్రీ మగాడికి సర్వస్వం..!*

"యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత"


ప్రతి భర్తకు భార్య

దేవత స్వరూపం...!!!


నచ్చితే షేర్ చేయటం మరచిపోకండి...!!! 🥀🥀🥀


 👍

🙏🌻🌹🌻🌹🌻🌹🙏

అంబా పరాకు

 అంబా పరాకు దేవీ పరాకు

మమ్మేలు మా శారదాంబా పరాకు

ఉమామహేశ్వర ప్రసాద లబ్ధ

పూర్ణజీవనా గజాననా

బహుపరాక్ బహుపరాక్

ఛండ భుజామండల గోధూయమాన

వైరి గణా షడాననా!

బహుపరాక్ బహుపరాక్

మంగళాద్రి నారసింహ బహుపరాక్ బహుపరాక్

బంగరుతల్లి కనకదుర్గ బహుపరాక్ బహుపరాక్

కృష్ణాతీర కూచెన్నపూడి నిలయ 

గోపాలదేవ బహుపరాక్


అవధరించరయ్యా విద్యలనాదరించరయ్యా

అవధరించరయ్యా విద్యలనాదరించరయ్యా

లలితకళల విలువ తెలియు సరసులు పదింపదిగ పరవశులయ్యి

అవధరించరయ్యా విద్యల నాదరించరయ్యా


ఈశుని మ్రోల.. హిమగిరి బాల..

ఈశుని మ్రోల.. హిమగిరి బాల..కన్నెతనము ధన్యమయిన గాథ

lఅవధరించరయ్యాl


కణకణలాడే తామసాన కాముని రూపము బాపీ..ఆ కోపీ..

కాకలు దీరీ కను తెరచి తను తెలసీ

తన లలనను పరిణయమైన ప్రబంధము

lఅవధరించరయ్యాl


రావో.. రావో.. లోల లోల లోలంబాలక రావో....

రావో రావో లోల లోల లోలం బాలక రావో

లోకోన్నత మహోన్నతుని తనయ మేనాకుమారి

లోకోన్నత మహోన్నతుని తనయ మేనాకుమారి

రాజ సలోచన రాజాననా...

రావో రావో లోల లోల లోలంబాలక రావో


చెలువారు మోమున లేలేత నగవులా

కలహంస గమనాన కలికీ ఎక్కడికే

మానస సరసినీ మణి పద్మదళముల

రాణించు అల రాజహంస సన్నిధికే


వావిలి పూవుల మాలలు గైసేసి

వావిలి పూవుల మాలలు గైసేసి

వయ్యారి నడల బాలా ఎక్కడికే

వయ్యారి నడల బాలా ఎక్కడికే


కన్నారా నన్నేల కైలాస నిలయాన

కొలువైన అల దేవదేవు సన్నిధికే 


తగదిది తగదిది తగదిది

ధరణీధర వర సుకుమారీ

తగదిది తగదిది తగదిది

ధరణీధర వర సుకుమారీ.. తగదిదీ 

 

అండగా మదనుడుండగా

మన విరిశరముల పదనుండగా

నిను బోలిన కులపావని తానై

వరు నరయగ బోవలెనా ...ఆ.....ఆ....ఆ...

తగదిది తగదిది తగదిది

ధరణీధర వర సుకుమారీ


కోరిన వాడెవడైనా ఎంతటి ఘనుడైనా

కోలనేయనా సరసను కూలనేయనా

కనుగొనల ననమొనల గాసి చేసి.. నీ దాసు చేయనా

తగదిది తగదిది తగదిది

ధరణీధర వర సుకుమారీ.. తగదిదీ ..


ఈశుని దాసుని చేతువా అపసద అపచారము కాదా

ఈశుని దాసుని చేతువా

కోలల కూలెడి అలసుడు కాడూ ఆదిదేవుడే అతడూ

సేవలు చేసి ప్రసన్నుని చేయ నా స్వామి నన్నేలు నోయీ నీ సాయమే వలదోయీ

ఈశుని దాసుని చేతువా..


కాని పనీ మదనా

అది నీ చేతకాని పని మదనా

అహంకరింతువ.. హరుని జయింతువ

అహంకరింతువ.. హరుని జయింతువ

అది నీ చేతకాని పని మదనా ..... కాని పని మదనా...


చిలుక తత్తడి రౌత ఎందుకీ హుంకరింతా

చిలుక తత్తడి రౌత ఎందుకీ హుంకరింతా

వినకపోతివా ఇంతటితో

వినకపోతివా ఇంతటితో నీ విరిశరముల పని సరి

సింగిణి పని సరి..  తేజో పని సరి.. నిదురుకు నీ పని సరి మదనా

చిలుక తత్తడి రౌత ఎందుకీ హుంకరింతా... చిలుక తత్తడి రౌత


సామగ సాగమ సాధారా.. శారద నీరద సాకారా

ధీనా ధీనా ధీసారా ... సామగ సాగమ సాధారా


ఇవె కైమోడ్పులు ...  ఇవె సరిజోతలు

వినతులివే అరవిందోజ్వలా... ఇదె వకుళాంజలి మహనీయా

ఇదె హృదయాంజలి... ఈశా మహేశా

సామగ సాగమ సాధారా.. 

ధీనా ధీనా ధీసారా ... సామగ సాగమ సాధారా


విరులన్ నిను పూజ సేయగా విధిగా నిన్నొక గేస్తు జేయగా

దొరకొన్న రసావతారు చిచ్చరకంటన్ పరిమార్తువా ప్రభూ...

కరుణన్ గిరిరాజ కన్యకన్ సతిగా తాము పరిగ్రహింపగా

మరుడేపున రూపున వర్థిలుగా...

రతి మాంగల్యము రక్ష సేయరా ప్రభూ... ప్రభూ... పతిభిక్ష ప్రభూ....


అంబాయని అసమశరుడు నను పిలిచెను వినవో

జనకుడవై ఆదరణగ తనయునిగా జేకొనవో

అంబాయని అసమశరుడు నను పిలిచెను వినవో...


మనమే నీ మననమై... తనువే నీ ధ్యానమై

నీ భావన లీనమైన గిరిబాలనేలవో

శరణం భవ శరణం భవ శరణం భవ స్వామీ

పరిపాలయ పరిపాలయ పరిపాలయ మాం స్వామీ


బిడియపడి భీష్మించి పెళ్ళికొడుకైనట్టి జగమేలు తండ్రికి.. జయమంగళం

జగమేలు తండ్రికి.. జయమంగళం...

విరులచే వరునిచే కరము చేకొనజేయు జగమేలు తల్లికి.. జయమంగళం

కూచేన్నపూడి భాగవతుల సేవలందే దేవదేవా శ్రీ వేణుగోపాల.. జయమంగళం..

త్రైలోక్య మందార శుభమంగళం...


        గానం - ఘంటసాల మాష్టారు, పి. సుశీల

                    మరియు బృందం

వాసుదేవ పెరుమాళ్ళ...!!

 🎻🌹🙏 శ్రీకాకుళం జిల్లా మందస గ్రామం వాసుదేవ పెరుమాళ్ళ...!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌿మందస, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక గ్రామం మరియు మండలం. 


🌸 దాదాపు 800 ఏళ్ల  క్రితం నాటి ఆలయం. కళింగ శైలిలో నిర్మించబడిన ఆలయం. ఆలయంలోని మూర్తి మాత్రం తిరుమల శ్రీనివాసుని పోలి ఉంటుంది. 

ఈ ఆలయం నిర్మాణానికి సంబంధించిన పూర్తి ఆధారాలు లభ్యం కానప్పటికీ సుమారు 266 సంవత్సరాల క్రితం ఇది పునర్నిర్మితమయినట్టు ఇక్కడ లభించిన ఆధారాలబట్టి తెలియవచ్చింది. 


🌿 ఎర్రని ఇసుక రాయితో కళింగ శైలిలో తీర్చిదిద్దిన ఈ ఆలయ అపూర్వ శిల్పసంపద వర్ణనాతీతంగా ఉంటే, ఆలయంలో నెలకొని ఉన్న నిలువెత్తు సాలగ్రామ మూలమూర్తి మాత్రం  తిరుపతి వెంకటేశ్వరుని విగ్రహాన్ని పోలివుండి చూపరులను కట్టిపడేస్తుంది. 


🌸గత శతాబ్దము చివర వరకు ఇది మంచి వేదాధ్యయన కేంద్రముగా విలసిల్లినట్లు కూడా తగిన ఆధారాలు లభించినాయి. శ్రీకాకుళం నుంచి 94 కిలోమీటర్ల దూరంలో ఉంది మందస గ్రామం. చుట్టూ పచ్చని చెట్లు, కొండలు ప్రశాంతమైన వాతావరణం... వీటి మధ్యలో ఉంది మందస గ్రామం. 


🌿పూర్వం ఈ మందస గ్రామాన్ని 'మంజూష' అని పిలిచేవారు. 

‘మంజూష’ అంటే నగలపెట్టె అని అర్ధం. అలాంటి  గ్రామంలో  కొలువుతీరాడు ' మందస వాసుదేవ పెరుమాళ్ స్వామి ఆలయం'


🌸 ఆలయంలోని మూర్తి కంచి క్షేత్రంలో తయారు చేయించి తెచ్చిన మూలమూర్తి. ఈ ఆలయం కొన్ని కోణాల్లో ఒరిస్సా రాష్ట్రంలోని పూరీ జగన్నాధ ఆలయాన్ని గుర్తు చేస్తే కొన్ని కోణాల్లో కోణార్క్ దేవాలయాన్ని జ్ఞాపకం చేస్తుంది. 


🌿ఆలయం శిల్పకళ నిర్మాణం ఒరిస్సా

సంప్రదాయాన్ని గుర్తు చేస్తే, ఇక ఆలయం పేరు వింటే ఎక్కడో తమిళ దేశంలో ఉంది అనుకుంటాం. 

కాని ఈ ఆలయం ఉన్నది మాత్రం ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న గ్రామం


🌸 పూర్వం ఈ ఆలయంలో వేద విద్యాభ్యాసం ముమ్మరంగా జరిగేదట.

వైష్ణవానికి పెట్టింది పేరుగా సమస్త వైష్ణవ క్షేత్రాలను దర్శించినంత ఫలితాన్నిస్తుందని చెప్తారు. 

 

🌹 చరిత్ర 🌹


 🌿ఆ కాలంలో మందసా రామానుజులను ప్రసిద్ధ వేదవిద్వాంసులు ,ఈ ఆలయ ప్రాంగణంలోనే వేదవిద్యను నేర్పుతూ కాశీ వరకు కూడా పర్యటించి పలువురు వేద విధ్వాంసులను వేదాంత చర్చలలో ఓడించి పలు సన్మాన పత్రములను పొంది ఉన్నారట. 


🌸 వీరి ప్రసిద్ధిని గురించి తెలుసుకున్న చినజియ్యర్ స్వామివారు 1988లో ఆలయానికి వచ్చి ఈ ఆలయానికి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేసి ఆలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలు ప్రారంభించారు. 


🌿తన గురువూ ఆధ్యాత్మిక మార్గదర్శీ అయిన పెద్దజీయర్ స్వామివారు స్వయంగా విద్య అభ్యసించిన క్షేత్రం కావడంతో పెద్దజీయర్ వారి శతాబ్ది ఉత్సవాలప్పుడు ప్రత్యేక శ్రద్ధతో ఆలయాన్ని బాగుచేయించారు చినజీయరు స్వామివారు. 


 🌸వందల ఏళ్లనాటి ప్రాచీనతకూ, శిల్పకళా చాతుర్యం ఎక్కడా చెడకుండా ఆలయ పునర్నిర్మాణం జరిగింది. శిధిలమయిన ఆలయాన్ని పూర్తిగా పునరుద్ధరించి 2009 ఫిబ్రవరి నెలలో  ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది.


🌿 ఈ స్వామి ఇక్కడ కొలువుతీరడానికి ఒక కథనాన్ని చెప్తారు. పూర్వం ఇక్కడి సంస్థానాధీశులు కొన్ని కారణాల వల్ల బ్రహ్మహత్యా దోషానికి గురయ్యారు. 


🌸ఆ బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడటం కోసం, ఒక దేవాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు.

 కాంచీపురంలో వాసుదేవ పెరుమాళ్

విగ్రహాన్ని తయారుచేయించి ఆలయంలో ప్రతిష్ఠించారు.


🌿 కాలాంతరంలో దివ్యమైన ఈ ఆలయం పాలకుల నిరాదరణకు గురి అయ్యి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఆలయానికి చెందిన అపూర్వ శిల్పసంపద చాలావరకు ఆకతాయి చేష్టలకు నాశనం కాబడింది.

సుమారు 1683 ఎకరాలు మాన్యం ఉన్నప్పటికీ ఈ ఆలయం మనిషి స్వార్థానికి ప్రతీకగా శిథిలమయ్యింది.


🌸 1988 లో ఈ ఆలయ చరిత్ర తెలుసుకున్న చిన్నజీయరు స్వామి వారు ఆలయ సందర్శనార్ధం మందసకు వేంచేసి, ఖర్చుకు వెరవకుండా ఆలయ ప్రాచీనతకు భంగం కలుగకుండా పునర్నిర్మించాలని సంకల్పించారు. 


🌿అన్ని ప్రభుత్వ లాంచనాలు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ వారినుండి ఆలయాన్ని స్వాధీనం చేసుకుని, ఒడిషా నుంచి శిల్పులను రప్పించి యదాతధంగా ఆలయాన్ని పునర్నిర్మింపచేసారు. 


🌸 గురువు పెద్దజీయరు స్వామివారి విద్యాభ్యాసానికి గుర్తుగా వారి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయరు స్వామివారు 2009 ఫిబ్రవరి నెలలో పూర్తిగా శిథిలమయిన ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. 


🌿 శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రముఖ ఆలయాలు అరసవెల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం మొదలగు వాటికి సమానంగా ఈ ఆలయం కూడా క్రమేపి ప్రాధాన్యత పొందుతున్నది.


🌸 జిల్లాలో వివిధ ప్రాంతాలనుంచే కాకుండా ఇతర జిల్లాలు, ఒడిషా నుండి కూడా అనేకమంది భక్తులు వస్తుంటారు.  ప్రతి సంవత్సరం మాఘమాసంలో అనగా ఫిబ్రవరి నెలలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి.


🌿 ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న ఈ ఆలయం తప్పక సందర్శించ తగినది... స్వస్తి..🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


    శ్లో𝕝𝕝  *బుద్ధిర్బలం యశో ధైర్యం*

            *నిర్బలత్వ మరోగతా* 

            *అజాడ్యం వాక్పటుత్వం చ*

            *హనూమత్ స్మరణాత్భవేత్*

                      

తా𝕝𝕝 *హనుమంతుడిని స్మరించినంత మాత్రాన బుద్ది వికసిస్తుంది. కీర్తి,ధైర్యం కలుగు తుంది. నిర్బలత్వం వుండదు, రోగాలు నశిస్తాయి. వాక్పటుత్వం కలుగుతుంది కార్యసాధనకు అవసరమైన ధృఢ దీక్ష ఏర్పడుతుంది. హనుమంతుడి ప్రభావాన్ని మొదట లోకానికి తెలిపిన వాడు వాల్మీకి మహర్షి.*

     

✍️🌹🌺🌷🙏

⚜ శ్రీ ఎర్నాకులతప్పన్ ఆలయం

 🕉 మన గుడి : నెం 987


⚜ కేరళ  : ఎర్నాకులం


⚜ శ్రీ ఎర్నాకులతప్పన్ ఆలయం



💠 ఎర్నాకులం శివాలయం, ఎర్నాకులతప్పన్ ఆలయం  అని కూడా పిలుస్తారు, ఇది కేరళలోని ప్రధాన దేవాలయాలలో ఒకటి


💠 హిందూ విశ్వాసాల ప్రకారం, శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయం నగర దేవాలయంగా పరిగణించబడుతుంది, ప్రధాన దేవత నగర రక్షకుడిగా పరిగణించబడుతుంది.  కేరళలో దేవతను ఎర్నాకులతప్పన్ అని పిలుస్తారు, అంటే ఎరనాకులం ప్రభువు. 


💠 ప్రారంభంలో ఇది మహారాజు పాలనలో నిర్మించబడింది.  తరువాత దీనిని 1842 సంవత్సరంలో ప్రారంభించి 1846లో దివాన్ శ్రీ ఎడక్కున్ని శంకర వారియర్ చేత పునర్నిర్మించబడింది.  

ఈ ఆలయాన్ని పునర్నిర్మించిన తర్వాత, ఆలయ శక్తి కొచ్చి అంతటా వ్యాపించింది మరియు ఎక్కువ మంది భక్తులు ఈ ఆలయాన్ని తరచుగా సందర్శించడం ప్రారంభించారు


🔆 ఆలయ పురాణం 


💠 ఈ ఆలయం హిందూ ఇతిహాసం మహాభారతంతో లోతైన సంబంధం కలిగి ఉంది . అర్జునుడు పరమశివుని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్ర తపస్సు చేశాడు. అర్జునుడి భక్తికి సంతోషించిన శివుడు తన భార్య పార్వతితో కలిసి కైలాస పర్వతం వద్ద ఉన్న వారి నివాసం నుండి అర్జునుడిని కలవడానికి బయలుదేరాడు .


💠 అర్జునుడికి తన పట్ల ఉన్న భక్తితో పార్వతిని మెప్పించాలని శివుడు సంకల్పించాడు . అర్జునుడి ముందు కనిపించడానికి ముందు శివుడు "కిరాత" అనే గిరిజన వేటగాడిగా మారువేషంలో ఉంటాడు. 

శివుడు అర్జునుడి ముందు కనిపించినట్లే అతను అడవి పంది అర్జునుడి వైపు దూసుకుపోవడాన్ని చూసి పందిపై బాణం వేస్తాడు. నిష్ణాతుడైన అర్జునుడు కూడా పందిపై బాణం వేస్తాడు. 

నిజానికి మారువేషంలో ఉన్న మూకాసురుడు అనే రాక్షసుడు చంపబడ్డాడు మరియు దాని అసలు రూపం బయటపడింది. 

అయితే, అర్జునుడు మరియు కిరాత మధ్య జంతువు యొక్క నిజమైన హంతకుడు ఎవరు అనే వివాదం తలెత్తుతుంది. 

వారిద్దరి మధ్య చాలా కాలం పాటు యుద్ధం జరుగుతుంది, చివరికి అర్జునుడిపై కిరాత విజయం సాధించాడు.


💠 ఓడిపోయిన అర్జునుడు లేచి నిలబడలేకపోయాడు, మట్టితో శివలింగాన్ని తయారు చేసి, పువ్వులు సమర్పించి పూజ చేస్తాడు. ఆశ్చర్యకరంగా, అతను శివలింగంపై సమర్పించిన పువ్వు కిరాత తలపై పడటం చూస్తాడు. అర్జునుడు కిరాతుడు మరెవరో కాదు తన పరమశివుడు అని తెలుసుకుంటాడు. అతని భక్తి మరియు చిత్తశుద్ధికి సంతోషించిన శివుడు అర్జునుడికి పాశుపత బాణాన్ని ఇచ్చాడు. 


💠 అర్జునుడు ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టాడు మరియు వెంటనే ఈ ప్రాంతం దట్టమైన అడవితో కప్పబడి, చాలా కాలం పాటు జనావాసాలు లేకుండా పోయింది. 

అర్జునుడు చేసిన శివలింగం యొక్క ఉనికి కూడా అందరి జ్ఞాపకాల నుండి అదృశ్యమైంది.

శతాబ్దాల తరువాత, ఒక ముని శాపానికి గురైన దేవలా అనే బాలుడు, ఇప్పుడు పాము శరీరాన్ని కలిగి ఉన్నాడు, ఈ అడవిలోకి పాకాడు మరియు ఈ లింగం పూర్తిగా మట్టిలో మునిగిపోవడం చూశాడు. 


💠 శాపం నుండి విముక్తి కోసం తపస్సులో భాగంగా అతను ఈ లింగాన్ని పూజించాడు. కొద్దిసేపటికే కొందరు వ్యక్తులు పాము శరీరంతో ఉన్న ఈ వ్యక్తిని గుర్తించి రిషి నాగం అని పిలిచారు మరియు అతని దగ్గరికి రావడానికి కూడా భయపడారు. 

కొందరు కర్రలు మొదలైనవాటితో అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. 


💠 ఈ చర్యలన్నింటికీ చలించని రిషి నాగం తన కఠోర తపస్సును కొనసాగించాడు. చివరగా శివుడు మరియు పార్వతి వారి అసలు రూపంలో కనిపించి, సమీపంలోని చెరువులో స్నానం చేయమని ఋషిని కోరారు. 

నిమజ్జనం చేసిన వెంటనే శాపవిముక్తి పొందాడు. కొద్దిసేపటికే అసలు లింగానికి సమీపంలోనే కొత్త విగ్రహం కనిపించింది. 

ఈ పురాణం ఆధారంగా, ఈ ప్రదేశానికి ఋష్నాగకులం (రిషి నాగం యొక్క చెరువు) అనే కొత్త పేరు వచ్చింది 


💠 మొత్తం ఆలయం 1.2-ఎకరం భూమిలో ఉంది . ఈ ఆలయం సాధారణ కేరళ ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించబడింది.


💠 ప్రధాన శివాలయం ప్రక్కనే, ఆలయ మైదానంలో మరో 2 ఆలయాలు నిర్మించబడ్డాయి, ఇది ఎర్నాకులం ఆలయ సముదాయాన్ని చేస్తుంది. 

ఉత్తరం వైపున, తమిళ శైలిలో నిర్మించిన మురుగన్ కోవిల్ చూడవచ్చు. 


💠 ఈ ఆలయంలో అన్ని ఆచారాలు తమిళ శైలికి అనుగుణంగా ఉంటాయి. 

అధిష్టానం మురుగ దేవుడు తన భార్యలు వల్లి మరియు దేవన్యాని. 

విష్ణువు , దక్షిణామూర్తి మరియు దుర్గాదేవికి సాధారణ పూజలు కాకుండా, నవగ్రహాలు మరియు గణేశుడికి రెండు వేర్వేరు మందిరాలు ఉన్నాయి .


💠 హనుమాన్ దేవాలయం ఉడిపి మాధ్వ సంప్రదాయ శైలిలో నిర్మించబడింది

తూర్పు వైపున కన్నడిగ ఉడిపి శైలిలో నిర్మించిన హనుమాన్ దేవాలయం కనిపిస్తుంది.

కృష్ణుడు ప్రధాన దేవత లేకుండా మధ్వ సంప్రదాయంలో నిర్మించిన అతి కొద్ది దేవాలయాలలో ఇది ఒకటి. 

అధిష్టానం హనుమంతుడు పడమర వైపు శివాలయం వైపు చూస్తున్నాడు.


🔆 పండుగలు


💠 శివాలయంలోని ఆలయ ఉత్సవం నగరంలో జరిగే గొప్ప పండుగలలో ఒకటి, సాధారణంగా మకరమాసంలో జరుపుకుంటారు . 

మొదటి రోజు సాయంత్రం కొడియెట్టం (ఆలయ జెండాను ఎగురవేయడం)తో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 

పంచవాద్యంతో ప్రసిద్ధి చెందిన ఆరాట్టు ఊరేగింపు ప్రారంభమవుతుంది. 

ఊరేగింపు దర్బార్ హాల్ గ్రౌండ్‌లో ముగుస్తుంది. గొప్ప బాణాసంచా ఈ వారం రోజుల పండుగకు తెర దించుతుంది


రచన

©️ Santosh Kumar

తిరుమల సర్వస్వం 116-*

 *తిరుమల సర్వస్వం 116-*

*తాళ్ళపాక అన్నమాచార్యుడు 4*


 అంటూ పుష్కరిణి మహాత్మ్యాన్ని ప్రస్తుతించాడు. క్షేత్ర నియమానుసారం ఆదివరాహస్వామిని దర్శించుకుని, వెనువెంటనే స్వామివారి ఆలయం చేరుకున్నాడు. ముందుగా మహాద్వార గోపురానికి చేయెత్తి నమస్కరించి, *"నీడ తిరగని చింతచెట్టు"* ను సందర్శించుకుని, *గరుడగంభాన్ని* ఈ విధంగా సేవించుకున్నాడు:


*గరుడగంభము కాడ కడు బ్రాణాచారులకు* 

*వరము లొసగేని శ్రీ వల్లభుడు*


 *తిరుమలేశుని దర్శనం* 


 గరుడగంభాన్ని సేవించుకుని, బంగారువాకిలి చెంత నిలచి, ఆనందనిలయంలో కొలువై ఉన్న శ్రీవారి దివ్యమంగళ విగ్రహాన్ని తొలిసారిగా దర్శించుకుంటూ, ఆనంద పారవశ్యంతో శేషాచల శిఖరాన్ని, శ్రీవారి మూర్తిని ఈ విధంగా కీర్తించాడు:


*ఇప్పుడిటు కలగంటి - నెల్లలోకములకు -*

*అప్పడగు తిరువేంక - టాద్రీశు గంటి ||* 

*అతిశయంబైన శే- షాద్రి శిఖరము గంటి* 

*ప్రతిలేని గోపుర - ప్రభలు గంటి* 

*శతకోటి సూర్య తే - జములు వెలుగగ గంటి* 

*చతురాస్యు బొడగంటి – చయ్యన మేల్కొంటి ||*


 ఈ కీర్తనలో మహోన్నతమైన శేషాచల శిఖరాన్ని, ఆనందనిలయ గోపుర కాంతులను, రత్నఖచితమైన బంగారువాకిళ్ళను, దేదీప్యమానంగా వెలుగుతున్న దీపసమూహాన్ని, కనకాంబరధారియైన స్వామివారిని, శంఖుచక్రాలను, కటి, వరద హస్తాలను కళ్లకు కట్టినట్లు వర్ణించాడు.


‌తరువాత ఆలయంలోని ఇతర దేవతలను, మంటపాలను, తిరుమలక్షేత్రం లోని సమస్త తీర్థాలను, గోపురాలను, వైభవోపేతంగా జరిగే ఉత్సవాలను దర్శించుకుని వాటి విశేషాలను ఈ విధంగా పదబంధం చేశాడు -


*కంటి నఖిలాండతతి కర్తనధిపుని గంటి* 

*కంటి నఘములు వీడికొంటి నిజమూర్తి గంటి ||* 

*మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి* 

*బహు విభవముల మంటపములను గంటి.... ||*


 *కటాక్షించిన స్వామివారు* 


 ఇలా నిత్యం స్వామివారిని సేవిస్తున్న అన్నమయ్య ఒకనాడు ఆలయ సమీపానికి చేరుకోగానే, కాస్త సమయాతీతం కావటంవల్ల బంగారువాకిళ్ళు మూసి వేయబడ్డాయి. ఆరోజు శ్రీవారి దర్శనం కలుగక పోవడంతో విచారించిన అన్నమయ్య - స్వామి వారిని కీర్తిస్తూ, తనకు దర్శనభాగ్యం ప్రసాదించమని రాగయుక్తంగా వేడుకొన్నాడు. అంతే! పరమాశ్చర్యంగా, తాళాలు ఊడిపడి బంగారువాకిళ్ళు తెరుచుకున్నాయి. ఈ సంఘటనతో అన్నమయ్య భక్తిప్రపత్తులను గుర్తెరిగిన అర్చకస్వాములు ఆయనను సాదరంగా తోడ్కొనివెళ్లి శ్రీవారి దర్శనం చేయించి, తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. హద్దులెరుగని ఆనందంతో శ్రీవారిని స్తుతిస్తూ ఒక పద్యశతకాన్ని ఆశువుగా చెప్పాడు అన్నమయ్య! పులకించి పోయిన స్వామివారు తన ఆనందాన్ని వ్యక్తపరచినట్లుగా, మూలమూర్తి మెడలోని ఓ ముత్యాలహారం జారి స్వామి పాదాలపై పడింది. అర్చకస్వాములు దాన్ని అన్నమయ్యకు ప్రసాదంగా బహూకరించారు.


 *"అన్నమాచార్యుని" గా మారిన అన్నమయ్య* 


 తిరుమలలో *"ఘనవిష్ణుయతి'* అనే ఒక వైష్ణవగురువుకు స్వామివారు స్వప్నంలో కనిపించి, వేంకటాచల వీధుల్లో పాటలు పాడుకుంటూ పరిభ్రమిస్తున్న అన్నమయ్య రూపురేఖలను వర్ణించి చెప్పి, అతనికి వైష్ణవమతాన్ని ప్రసాదించమని ఆదేశించి, తన శంఖు-చక్ర ముద్రలను ప్రసాదించారు. ఆ గురువుగారు, శ్రీవారి ఆదేశానుసారం, తిరుమలవీధుల్లో తిరుగాడుతున్న అన్నమయ్యను గుర్తించి అతనికి వైష్ణవమతాన్ని ముద్రాంకితంగా ప్రసాదించారు. ఆ క్షణం నుంచి అన్నమయ్య, *"అన్నమాచార్యుని"* గా వినుతికెక్కారు


 *అన్నమయ్య వివాహం* 


 అటు, తాళ్లపాకలో అన్నమయ్య హఠాత్తుగా అదృశ్యం కావటంతో ఊరూ వాడ వెదకి విసిగి వేసారిన అన్నమయ్య తల్లిదండ్రులు చిక్కిశల్యమై మంచాన పడ్డారు. అతని ఆచూకీ కోసం వారి కులదైవమైన చెన్నకేశవుణ్ణి వేడుకున్నారు. చుట్టుప్రక్కల ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ గాలించి, చివరి ప్రయత్నంగా తమ పుత్రుణ్ణి తమకు తిరిగి ప్రసాదించమని ఆ శ్రీనివాసుణ్ణి వేడుకోవడం కోసం తిరుమల క్షేత్రం చేరుకున్నారు. 


 శ్రీవేంకటేశ్వరుని సన్నిధిలో పాటలు పాడుకుంటూ తిరుగుతున్న అన్నమయ్యను చూసి, ఆ దంపతులకు పుత్రోత్సాహం పెల్లుబికింది. స్వగృహానికి తిరిగి రావలసిందిగా అన్నమయ్యను బ్రతిమాలుకున్నారు. స్వామివారి చరణాలను వీడి రానంటూ భీష్మించిన అన్నమయ్యకు శ్రీవారు స్వప్నంలో సాక్షాత్కరించి తల్లిదండ్రుల మనస్సు కష్టపెట్టరాదని, వారు కోరినట్లు ఇంటికి తిరిగి వెళ్లి గృహస్థాశ్రమం స్వీకరించమని, దానివల్ల తన కటాక్షం మరింతగా సిద్ధిస్తుందని నచ్చజెప్పారు. దాన్ని సుగ్రీవాజ్ఞగా భావించిన అన్నమయ్య, తల్లిదండ్రులతో కలిసి స్వగ్రామానికి చేరుకున్నాడు.

గేయాలు, కీర్తనలు, శతకాలతో స్వామి వారిని నిత్యం కీర్తిస్తూ కొంతకాలం గడిపిన తర్వాత, అన్నమయ్యకు *అక్కలమ్మ-తిరుమలమ్మ* అనే ఇరువురు కన్యలతో వివాహం జరిగింది.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

11-55-గీతా మకరందము

 11-55-గీతా మకరందము

          విశ్వరూపసందర్శనయోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అ|| దేవుని ఎవరు పొందగలరో వచించుచున్నారు-


మత్కర్మకృన్మత్పరమో మద్భక్తస్సఙ్గవర్జితః | 

నిర్వైరస్సర్వభూతేషు 

యస్స మామేతి పాణ్డవ || 

 

తా:- అర్జునా! ఎవడు నాకొఱకే కర్మలజేయునో (లేక నాసంబంధమైన (దైవసంబంధమైన) కార్యములనే చేయునో), నన్నే పరమప్రాప్యముగ నమ్మియుండునో, నాయందే భక్తిగల్గియుండునో, సమస్తదృశ్యపదార్థములందును సంగమును (ఆసక్తిని, మమత్వమును) విడిచివేయునో, సమస్తప్రాణులందును ద్వేషము లేకయుండునో అట్టివాడు నన్ను పొందుచున్నాడు. 

 

వ్యాఖ్య:- భగవంతుని యెవరు పొందగలరో ఇచట చక్కగ వివరింపబడినది. ఐదు సద్గుణములను వచించి, వాని నెవడుగల్గియుండునో అతడు తప్పక భగవత్సాయుజ్యమును బడయగలడని శ్రీకృష్ణపరమాత్మ పేర్కొనిరి. ‘యః’ అని చెప్పుటవలన ఎవడైనను సరియే ఇట్టి మహోన్నతగుణముల నవలంబించియుండినచో మోక్షభాగుడు కాగలడని స్పష్టముచేయబడినది.  ఇట జాతిమతకుల విచక్షణ యేమియును లేదు. యోగ్యతయే ప్రధానము. ఔషధమును ఎవరు త్రాగినను రోగము నయమగునుగదా! ప్రమిద, తైలము,వత్తి నిప్పుపెట్టె తెచ్చుకొనినచో దీపము ఎవరికైనను వెలుగునుగదా! గీతయందిట్టి విశాల భావములే పలుచోట్ల వ్యక్తీకరింపబడినవి. గీతయొక్క ఔన్నత్యమున కిట్టి సార్వజనిక భావములే కారణములు. 

    ‘మత్కర్మకృత్’ -  దైవసంబంధములగు పూజ, ధ్యాన, జపాదులను గావించువాడు, లేక ఏ కార్యముచేసినను భగవదర్పితముగ జేయువాడు (పాపకార్యములను జేయక సత్కర్మలనే ఈశ్వరార్పణబుద్ధితో నాచరించువాడని అర్థము). అట్టివాడు క్రమముగ చిత్తశుద్ధినిబడసి, భగవత్కృపకు పాత్రుడై, ఆత్మవిజ్ఞానమును బడసి మోక్షమునొందును. జీవితములో మనుజుడు తన దైనందినకార్యముల నెన్నిటినో ఆచరించును. కాని వానినన్నింటిని భగవదర్పితబుద్ధితో చేయుచో అవి దైవపూజగా పరిణమించిపోవును (work changes into worship). అత్తఱి అవి సామాన్యకారణములుగ నుండక మోక్షహేతువులుగ మారిపోవును. కనుకనే భగవంతుని పొందగల్గువారిలో ‘మత్కర్మకృత్’  (నా కొఱకే కర్మలుచేయువాడు, లేక నా సంబంధమైన కర్మలు చేయువాడు) అనునది చేర్చబడెను. 

       ‘మత్పరమః’ - భగవంతునే పరమప్రాప్యముగ, పరమలక్ష్యముగ దలంచి దైవతత్పరుడైయుండువాడు. సామాన్యముగ జనులలో పెక్కురు ప్రాపంచికవిషయములనే పరమగమ్యములుగ భావించి వానికొఱకే అహోరాత్రములు కృషిసలుపుచునుందురు. కాని దృశ్యపదార్థములన్నియు అసద్వస్తువులు, నశ్వరములు కావున అవి బంధవిముక్తిని గలిగింపజాలవు. పరమాత్మయొకడే ఈ ప్రపంచమునందలి సద్వస్తువు, కావున ఆతనినే తనలక్ష్యముగ, గమ్యముగ జీవుడు తలంచి తల్లక్ష్యప్రాప్తికై యత్నించవలెను. అట్టివాడు భగవంతుని తప్పక పొందగలడు. 

    ‘మద్భక్తః’ - పరమానందప్రదుడగు భగవంతునియందే అతిశయభక్తి కలిగియుండవలెనుగాని తదితర పదార్థములందుగాదు. జననమరణములనుండి తప్పించజాలని పదార్థములయెడల భక్తి (ప్రీతి) యున్నచో నేమి ప్రయోజనము? భగవద్భక్తిచే అచిరకాలములో జీవుడు పరమాత్మపదము నొందగలడను సత్య మిచట వచింపబడినది. 

    ‘సఙ్గవర్జితః’ - సంగమనగా ఆసక్తి, దేహాదిదృశ్యపదార్థములందు మమత్వము. అద్దానిని వదలవలెను. అసంగత్వమును అభ్యసించవలెను. అసంగమను పదునైన కత్తితో సంసార (దుఃఖ)వృక్షమును సమూలముగ ఛేదించివేయవలెనని భగవానుడు (గీత 15వ అధ్యాయమున) ఆనతిచ్చియున్నారు. (అసంగశస్త్రేణ దృఢేన ఛిత్వా). తామరాకు నీటిని అంటనట్లు, దృశ్యపదార్థములందు మెలగుచున్నను, విచారణా బలముచే వానితోనంటక, అసంగుడై మెలగువాడు -  అట్టి సంగరాహిత్యమువలన ముక్తిని బడయగలడని యిట పేర్కొనబడినది. 

    ‘నిర్వైరస్సర్వభూతేషు’ -  ఇక ఐదవది సమస్తప్రాణికోట్ల యెడల ప్రేమ, దయ, మరియు ద్వేషరాహిత్యము. ‘సర్వభూతేషు’ అని చెప్పినందువలన ఏ ఒకటి రెండు ప్రాణుల యెడలనో దయగల్గియున్న చాలదనియు, సమస్తభూతకోట్లయెడల కరుణ, దయగలిగియుండవలెననియు తేలుచున్నది. సమస్తప్రాణులు భగవత్స్వరూపులు, నారాయణస్వరూపులు. కనుక ఏ ప్రాణికైనను, అపకారముచేసినచో, దేవుని యెడల అపకారము చేసినట్లే యగును. కాబట్టి నిర్వైరత్వమును లెస్సగ శీలించవలెను. ఈ సత్యమునే ‘అద్వేష్టా సర్వభూతానామ్’ మొదలగు వాక్యముల ద్వారా గీతలో పెక్కుచోట్ల భగవానుడు తెలిపియున్నారు. ఒకప్రక్క ఉపనిషద్వాక్యములను వల్లించుచు, దేవుని పూజాదులను సల్పుచు, వేఱొకప్రక్క ప్రాణికోట్లను దూషించుచు, ద్వేషించుచు, హింసించుచునున్నచో ఆ పూజాదులవలన నేమి ప్రయోజనము?అది ఆచరణ వేదాంతముకానేరదు. మందు తినువాడు పథ్యము కూడ ఆచరించవలెను. పైనతెలిపిన నాలుగు సుగుణములు (మత్కర్మకృత్ - ఇత్యాదులు) మందు వంటివి. ఈ ఐదవ సుగుణమగు సర్వభూతదయ పథ్యమువంటిది. కాబట్టి వానితోబాటు దీనినిగూడ తప్పక అవలంబించవలెను. ఆ నాలుగు సుగుణములలో ప్రతియొక్కటియు ఈ ఐదవ సుగుణముతో చేరియుండవలెను. ఈ ప్రకారముగ భగవద్భక్తి, సర్వభూతదయ కలవాడు తప్పక భగవానుని చేరగలడని (‘మామేతి’) ఈ శ్లోకమందు అసందిగ్ధముగ చెప్పివేయబడెను.

గీతయం  దీశ్లోకము చాల ముఖ్యమైనది. శ్రీశంకరాచార్యులవారున్ను గీత మొత్తము మీద ఈశ్లోకము సర్వోత్కృష్టమైనదని, సారభూతమైనదని తెలిపియున్నారు. ఏలయనిన, దీనియందు అన్నియోగములున్ను సంక్షేపముగ బోధింపబడినవి. మఱియు ఆ అన్నియోగములకు ఆవశ్యకమైన సర్వభూతదయయు పేర్కొనబడినది. ఎట్లనిన - 

మందు:-

(1) నా కర్మలను చేయుము - (మత్కర్మకృత్) - కర్మయోగము 

(2) నా యందు తత్పరుడవైయుండుము (మత్పరమః) - ధ్యానయోగము 

(3) నాయెడల భక్తిగలిగియుండుము (మద్భక్తః) - భక్తియోగము 

(4) దృశ్యపదార్థములయెడల సంగము లేకుండయుండుము - (సఙ్గవర్జితః) - జ్ఞానయోగము .


పథ్యము :-

(5) సమస్తప్రాణులయెడల దయగలిగియుండుము - (నిర్వైరస్సర్వభూతేషు) - భూతదయ.


కాబట్టి సాధకులు ఈ శ్లోకముయొక్క తాత్పర్యమును పదేపదే చింతించుచు, భక్త్యాది సుగుణములుగల్గి పరమాత్మ సాయుజ్యమును ఈ జన్మయందే పొందేలాగున యత్నించవలెను. 

 ప్ర:-  భగవంతుని యెవడు పొందగలడు?

ఉ:- (1) దైవకార్యములు నాచరించువాడు, 

(2) దైవమునే పరమప్రాప్యముగ నెంచువాడు, దైవతత్పరుడై యుండువాడు, 

(3) దైవభక్తుడు, 

(4) సంగరహితుడు, 

(5) సర్వభూతదయగలవాడు - ఇట్టివాడు భగవంతుని పొందగలడు. 

ప్ర:- దీనినిబట్టి భగవత్ప్రాప్తికి ఉపాయములేవియని స్పష్టమగుచున్నది ?  

ఉ:- (1) దైవకార్యముల నాచరించుట, (2) దైవమునే పరమప్రాప్యముగ నమ్ముట, దైవతత్పరుడై యుండుట, (3) దైవభక్తి గలిగియుండుట, 

(4) సంగరాహిత్యము నవలంబించుట, 

(5) సర్వప్రాణులయందు దయ, వైరములేమి గలిగియుండుట. 


ఓమ్ 

ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే 

శ్రీకృష్ణార్జునసంవాదే విశ్వరూపసందర్శనయోగోనామ 

ఏకాదశోఽధ్యాయః


ఇది ఉపనిషత్ప్రతిపాదకమును, బ్రహ్మవిద్యయు, యోగశాస్త్రమును,

శ్రీకృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు విశ్వరూపసందర్శనయోగమను 

పదునొకండవ అధ్యాయము 

ఓమ్ తత్ సత్

సంపూర్ణ మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము*


*254 వ రోజు*


*ఆరవరోజు యుద్ధం*


ఆరవ రోజు యుద్ధానికి అర్జునిని సూచన మేరకు ధృష్టద్యుమ్నుడు పాండవ సైన్యాలను మకర వ్యూహములో నిలిపాడు. తల ముందు భాగంలో అర్జునుడు, పాంచాలరాజు, కన్నుల భాగంలో నకుల సహదేవులు, నోటి భాగంలో భీముడు అభిమన్యుడు, ఉపపాండవులు, ఘటోత్కచుడు దవడలుగా సాత్యకీ సమేత యుధిష్టరుడు కంఠభాగమున, ధృష్ట ద్యుమ్న సహిత విరాటుడు వెన్నుభాగమున, ఎడమ పక్క కేకయరాజులు, కుడి పక్క దుష్టకేతు, కరూశరాజు, కుంతిభోజ, శతానీకులు జఘన భాగమున శిఖండి, ఇరావంతుడు తోకభాగమున నిలిచారు. ఈ మరవ్యూహమునకు దీటుగా భీష్ముడు క్రౌంచ వ్యూహమును పన్నాడు. తలభాగమున కృతవర్మ సేనలతో నిచిచాడు. ద్రోణుడు, భీష్ముడు ముక్కు భాగమున నిలిచారు. కృపాచార్యుడు, అశ్వథామ కన్నులుగా నిలిచారు. శూరసేనుడితో సహా సుయోధనుడు కడుపుభాగమున నిలిచారు. కాంభోజ బాహ్లికులు కంఠ భాగమున నిలిచారు. సౌవీరుడు వీపు భాగమున నిలిచారు. విందానువిందులు ఏడమ వైపున, సుశర్మ కుడిపక్కన, యవన రాజు, శ్రుతాయువు, భూరి శ్రవుడు తోక వైపు నిలిచారు. యుద్ధం ఆరంభం కాగానే మకర వ్యూహ తలవైపు చొరబడుతున్న ద్రోణుని చూసి భీముడు తన రథాన్ని అతని మీదకు నడిపాడు. భీముని ధాటికి ద్రోణుని ముందు ఉన్న సేనలు పోరి పోవడం చూసి ద్రోణుడు ఉగ్రుడై భీమునిపై క్రూర బాణములు ప్రయోగించాడు. భీముడు ద్రోణుని సారథిని చంపాడు. తానే రథాన్ని తోలుతూ ద్రోణుడు వైరి వీరులను చెండాడు తున్నాడు. ఇది చూసి భీష్ముడు ద్రోణునికి సాయంగా వచ్చాడు. భీష్మద్రోణుల ప్రతాపానికి కేకయ రాజులు భయంతో వెనక్కి తగ్గారు. ఇది చూసిన భీముడు కౌరవ సేనలను చావకొట్టి చాపలా చుట్టి పారేస్తున్నాడు. ధర్మరాజు, సుయోధనులు తమ తమ సేనలను చేతులు ఆడిస్తూ ప్రోత్సాహ పరుస్తున్నారు. ఇరు సేనలు ఉత్సాహంగా పోరుతున్నారు.


*దృతరాష్ట్రుని సందేహం*


ధృతరాష్ట్రుడు యుద్ధ విశేషాలు వింటూ సంజయునితో " సంజయా ! మన సేనలో ఎంతో మంది ఉండి కూడా పాండవులను గెలవ లేక పోవడానికి కారణం ఏమిటి?. ఇది దైవ లీల కాక మరేమిటి? ఇలా జరుగుతుందని విదురుడు ముందే చెప్పాడు. దుర్మార్గుడైన నా కుమారుడు వినలేదు. బుద్ధి కర్మానుసారిణి అన్నారు కదా! " అని విరక్తి చెందాడు. సంజయుడు " మహారాజా ! నీ కుమారుడు తెలియని వాడు. యుక్తా యుక్త వివేచన లేని వాడు. నాడు జూదం ఆడినప్పుడే మనం ఊరుకోకుండా ఆపి ఉంటే ఈ దారుణ యుద్ధం సంబవించేది కాదు కదా ! ఇక పశ్చాతాపం మాని యుద్ధక్రమాన్ని ఆలకించు " అన్నాడు. ఆ సమయంలో భీముడు కౌరవ సేనలోకి చొచ్చుకుని పోతూ దృతరాష్ట్ర కుమారులైన దుశ్శాసనుడు, జయుడు, దుస్సహుడు, జయత్సేనుడు, వికర్ణుడు, చిత్రసేనుడు, చారుమిత్రుడు, సుదర్శనుడు, సువర్ముడు, దుష్కరణుడు ఒకచోట ఉండటం గమనించి రథాన్ని వారి ముందు నిలిపాడు. అది చూసి వారు " అడుగో భీముడు వాడిని అందరం కలసి చంపుతాము రండి " అని తమ సేనలతో ఒక్క సారిగా చుట్టుముట్టారు. భీముడు తన సారథితో చెప్పి రథాన్ని అక్కడే నిలిపి దిగి కాలి నడకన వారిని ఎదుర్కొని యుగాంతమున యమధర్మరాజు వలె కౌరవ సైన్యాన్ని చంపసాగాడు. ఏనుగుల కుంభస్థలములను మోదుతూ, హయములను చంపుతూ రథములను నుగ్గు చేస్తున్నాడు. నేలపై నిలబడి అందరితో ఒక్కడై యుద్ధం చేస్తున్నాడు. ద్రోణునితో యుద్ధం చేసి అలసి పోయిన ధృష్టద్యుమ్నుడు ఆ ప్రదేశానికి వచ్చి భీముని రథం చూసి ఖిన్నుడై సారథిని " భీముడెక్కడ ? అతడు నా బహిర్ప్రాణం అతడు లేక నేను ఉండ లేను " అని అడిగాడు. సారథి " మహారాజా ! అడుగో భీముడు నన్ను ఇక్కడ నిలిపి తాను అక్కడ ఒక్కడే యుద్ధం చేస్తున్నాడు " అని భీముని చూపాడు. ధృష్టద్యుమ్నుడు భీముని చెంతకు వెళ్ళి " భీమసేనా ! నీ పరాక్రమం చూపు నేను కూడా నీకు సాయంగా కౌరవ సేనలను నుగ్గు చేస్తాను " అని కౌరవ సేనలను చేండాడం మొదలు పెట్టాడు. అది చూసిన నీ కుమారుడు " ఈ ధృష్టద్యుమ్నుని వదలకండి చంపండి " అన్నాడు. అది విని అతని సోదరులు ధృష్టద్యుమ్నుని చుట్టుముట్టారు. ధృష్ట ద్యుమ్నుడు తన గురువు ప్రసాదించిన ప్రమోహనాస్త్రం వదిలాడు. నీ కుమారులంతా మూర్చిల్లారు. భీముడు పక్కనే ఉన్న మడుగు వద్దకు వెళ్ళి దాహం తీర్చుకుని ధృష్టద్యుమ్నుని కలుసుకున్నాడు. ధృష్టద్యుమ్నుడు తప్పుకున్న తరువాత పాంచాలరాజు ద్రోణునితో యుద్ధానికి తలపడ్డాడు. ద్రోణుని ధాటికి ఆగలేక పాంచాలరాజు పక్కకు తప్పుకున్నాడు. తన నుండి తప్పుకున్న ధృష్టద్యుమ్నుడు ఎక్కడా అని పరికించి చూడగా కౌరవ సేనలు ప్రమోహనాస్త్రానికి కట్టుబడ్డారని గ్రహించి ప్రజ్ఞాస్త్రాన్ని ప్రయోగించి వారిని విముక్తులను చేసాడు. మూర్చ నుండి తేరుకున్న నీ కుమారులు ద్రోణుని అండ చూసుకుని భీమసేన ధృష్టద్యుమ్నుల మీదకు తిరిగి ఉరికారు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

తిరుప్పావై 28వ పాశురం

 *తిరుప్పావై 28వ పాశురం*

🕉🌞🌏🌙🌟🔥

🔥🕉🌞🌏🌙🌟


*28.పాశురం*


*ॐॐॐॐॐॐॐॐॐॐ*


     *కఱవై పిన్ శెన్ఱు కానమ్ శేర్ న్దుణ్బోమ్* 

        *అఱివోన్ఱు మిల్లాత వాయ్ క్కులత్తు, ఉన్ఱన్నై*

        *ప్పిఱవి పెఱున్దనై పుణ్ణియమ్ యాముడై యోమ్*

        *కుఱైవోన్ఱు మిల్లాదగోవిన్డా! ఉన్ఱన్నోడు*

        *ఉఱవేల్ నమక్కు ఇంగోళిక్క వోళియాదు*

        *అణియాద పిళ్ళైగాళోం అన్బినాల్, ఉన్ఱన్నై?*

        *శిరు ఇఱైవా నీ తారయి పరమేలో రెంబావాయ్!!*


*ॐॐॐॐॐॐॐ*


*భావం:-*


*ॐॐॐॐॐॐॐ*


పశువుల వెంట వానిని మేపుటకై అడవికి పోయి, అచటనే శుచి నియమములు లేక తిని, జీవించి ఉండుటయే ప్రయోజనముగా తిని, తిరిగెడివారము. ఏమియూ జ్ఞానము లేని మా గోప వంశమున మాతో సజాతీయుడవై నీవు జన్మించిన పుణ్యమే మాకున్న పుణ్యము.


 మాకెన్ని లొపములున్నను తీర్చగల్గినట్లు ఏ లోపము లేనివాడవు కదా నీవు. గోవిందా ! ఓ స్వామీ ! నీతో మాకు గల సంబంధము పోగొట్టుకొన వీలుకాదు. లోకమర్యాద తెలియని పిల్లలము. అందుచే ప్రేమ వలన నిన్ను చిన్న పేరుపెట్టి పిలిచినాము.


దానికి కోపము తెచ్చుకొని మమ్ములను అనుగ్రహింపక ఉండకము. మాకు ఆపేక్షితమగు 'పఱ' ను ఒసంగుము. అని గోపికలు అందరు స్వామికి శరణాగతిని చేశారు. తమ తప్పులను క్షమించమని క్షమాయాచన చేశారు. 


 ఓ కృష్ణా! మేము అవివేక శిఖామణులము, తెల్లవారగానే చద్దిత్రాగి పశువుల వెంట అడవికిపోయి, పశువులను మేపి సాయంకాలము తిరిగి చేరేవారము . వివేకమేమాత్రమును లేనివారము. అజ్ఞానులము. గొల్లపడుచులము.


నీవు మా గొల్లకులంలో జన్మించటయే మాకు మహాభాగ్యము . నీతోడి సహవాసమే మాకదృష్టము. యీ బంధమెన్నటికినీ తెగనిది. త్రెంచలేనిది. అందుకే మా గోపికాకులం ధన్యమైంది. పరిపూర్ణ కళ్యాణగుణగుణాలతో ప్రకాశించే నీవు గోవిందుడువు.


        మాకు లోక మర్యాద మేమాత్రము తెలియక నిన్ను చిన్నచిన్న పేర్లతో కృష్ణా! గోవిందా! అని పిలిచాము. స్వామీ! అందుకు కోపగించుకోకు! జ్ఞానులు పొందవలసిన ఆ పఱ వాద్యమును యీ కారణమున మాకు యివ్వననబోకుము.


 నీతో మెలిగిన సుఖలమనే యెంచి మాపై కృపచేయుము . అని గోపికలందరూ స్వామికి శరణాగతిని చేశారు. తమను అనుగ్రహించి వ్రతమును పూర్తిచేయగ ఆశీర్వదించుమని, తమ తప్పులను సైరించమని క్షమాయాచన చేశారు.


*ॐॐॐॐॐॐॐ*


*అవతారిక*


*ॐॐॐॐॐॐॐ*


భగవానునే ఉపాయముగా ఆశ్రయించువారు సర్వోపాయములను పరిత్యజించవలెను. అది వారి - వారి స్థితిని బట్టి భిన్న - భిన్నముగా ఉండును. కర్మ జ్ఞాన భక్ష్యాద్యుపాయములను ఇదివరకు సాధనములు అనుకొని ఆచరించినవారు వదలితిని అని నివేదించవలెను.


వానిని ఆచరించుటకు అశక్తులు ఐనవారు .... స్వామీ ! నేను అట్టి సాధనములను ఆచరింప అసమర్ధుడను అనవలెను. ఆచరింపవలెనని తెలిసియూ తన స్వరూపమునకు తగదని ఆచరింపని వారు అవి మాకు తగినవి కాదు కదా ! అని అనవలెను.


బొత్తిగా వాని విషయమునే తెలియని వారు నేను వేరొక ఉపాయముందని తెలియలేము స్వామీ ! అనవలెను. గోపికలు శ్రీకృష్ణుడు తప్ప వేరొక సాధనముండునని తెలియనివారు మాకేమియూ విడువదగినది లేదు స్వామి అని ఈ పాశురమున విన్నవించుచున్నారు.  


గోపికలు కోరిన ఆభరణాదులు కేవలం లౌకికమైనవి. కాని వారి అంతరంగ మందున్న కోరిక ఆముష్మిక మైనదని స్వామికి తెలియును 'నీకు మాకును వున్న సంబంధమే! మేమజ్ఞానులము. మేము నిన్నుగాని, నీవు మమ్ములనుగాని విడిచి వుండలేని బంధమే అర్హత' అని విన్నవించారీ పాశురంలో.....


 *కమానురాగము _ రూపకతాళము*


    ప... ప్రేమతో చిరునామమున నిన్ను పిలిచినామని

        స్వామీ! గోవింద ! అలగబోకుమా! కణ్ణా!


    అ..ప.. ఏమీ! తెలియని వారము స్వామీ!

        మము కృపజూడర! గొల్ల పడుచులము 

        స్వామీ! గోవింద! అలగబోకుమా! కణ్ణా!


    చ ... ఎంతటి పుణ్యమొ నీ అవతారము 

        వింత గద! గొల్లకులమున ప్రభవము!

        ఎంత త్రేంచినను తెగనీది బంధము 

        ఎంత ధన్యమీ గోపికా కులము!

        స్వామీ! గోవింద! అలగాబొకుమా! కణ్ణా!


    2చ.. కోపింపకుమా! కృష్ణ ! కృపాకర!

        కృపాజేయును వాద్య విశేషము త్వర!

        గోపికలము మే ఉంది ఉంది నేనుమజ్ఞానులము

        మేవుచు పశువులను బ్రతికెడివారము

        స్వామీ! గోవింద! అలగాబోకుమా! కణ్ణా!


*ॐॐॐॐॐॐॐॐॐॐ*


*శ్రీకృష్ణుడే సిద్దోపాయం*

*ఆండాళ్ తిరువడిగలే శరణం* 


*ॐॐॐॐॐॐॐॐॐॐ*


ఇన్నిరోజులు స్వామిని రకరకాల పేర్లతో పిలిచినా, నిన్న స్వామి కష్టపడి సంపాదించిన నామం *"గోవిందా"* అని పిలవడంచే స్వామికి సంతోషం వేసింది.


వీళ్ళకు నిజంగా ప్రేమ ఉందా లేదా అని పరిశీలించి గాని అనుగ్రహించడు. భగవంతుని చేరే ఉపాయాలు కర్మ, భక్తి, జ్ఞానం ఇవన్నీ మనం సంపాదించాలి. చివరికి భగవంతుడు అనుగ్రహిస్తే తప్ప అవి మనకు లభించవు.


పరమాత్మను ఏం తయారు చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఆయనను సిద్దోపాయం అని అంటారు. ఇలా ఉపాయాలు రెండు రకాలు, ఒకటి మనం సాదించాల్సిన కర్మ, జ్ఞానాదులు ఇక రెండోది సిద్దమైన ఉన్న పరమాత్మ.


అందుకే మనవాల్లుళ్ళు కర్మ జ్ఞానాదులపై ఆధారపడిన వాళ్ళం కాదు, నిన్నే ఉపాయంగా కోరుతున్నాం *"హే గోవిందా"* నిన్నే నమ్మి వచ్చాం అని చెప్పారు. అయితే సిద్దోపాయం కోరిన వారు కూడా ఆరు విషయాలు ఆవిష్కరించాల్సి ఉంటుంది.


అవి ఏమిటంటే


1. తమంతట తాము ఈ ఫలితాన్ని పొందడానికి ఆర్జించినది ఏమి లేదు అని స్పష్టం చెయ్యాలి.


2. తమలో ఆ ఫలితాన్ని పొందే యోగ్యతలేమి లేవు కనుక తమ వద్ద లోపం ఉన్నదని స్పష్టం చేయాలి.


3. ఇక మనల్ని అనుగ్రహించటానికి భగవంతునిలో సమస్త కళ్యాణ గుణ పూర్తి ఉందని అంగీకరించాలి.


4. ఆయనకీ మనకు విడదీయరాని సంబంధం ఉందని వేదం చెబుతుంది, ఈ విషయం మనకు తెలుసును అని చెప్పాలి.


5. మన దోషాలని క్షమించమని ప్రార్థించాలి.


6. వెంటనే వాడి సేవ అనే అనుగ్రహం పొందడానికి మనలోని ఆర్తిని చూపించగలగాలి.

 

ఈ ఆరూ లేకుంటే వాడిని చేరే యోగ్యత లేనట్లే!!


ఏదైనా మనం ఒక వైద్యుడి వద్దకు వెళ్ళినప్పుడు మనం ఏం చేసి ఈ రోగం తెచ్చుకున్నాం, దాన్ని తగ్గించుకొనే శక్తి మనలో లేదు, దాన్ని తగ్గించగల యోగ్యుడవు నివ్వు అని చెప్పాలి.


 నిన్ను నమ్ముకుని వచ్చాను అని అయనతో సంబంధం గురించి చెప్పాలి, జబ్బురాకుండా మళ్ళీ ఆ తప్పులు చెయ్యనని చెప్పాలి, త్వరగా తగ్గించండి అంటూ త్వరను తెలుపాలి.


అప్పుడు గాని ఆ వైద్యుడు మందు ఇవ్వడు. అదే మన స్వంత ప్రవృత్తి చూపితే అదేదో నివ్వే చూసుకో అని వదిలేస్తాడు. లోకంలో వ్యాదిని నయం చేయటానికి ఎన్నో మందులు ఉండవచ్చు,


 వైద్యుడు వేరే మందు వేరే. అయితే ఈ సంసారం అనే వ్యాది నివారించాలి అంటే వైద్యుడూ, మందూ అన్నీ శ్రీకృష్ణుడే. అందుకే మనవాళ్ళు శ్రీకృష్ణుడిని *"వైద్యో వైద్యః"* చక్కటి వైద్యుడు సుమా!! అని చెబుతారు.  


అయితే మనవాళ్ళంతా నీవే మాకు మందువు అని వచ్చారు, అయితే ఇంకా వీళ్ళల్లో కర్తుత్వ భావనలు ఏమైనా ఉన్నాయా అని పరిక్షిస్తాడు. అవి ఏం లేవని తెలిస్తే వెంటనే అనుగ్రహిస్తాడు.


 ఈ రోజు మనవాళ్ళు మాకు కర్మ, జ్ఞానం, భక్తి ఇవన్నీ ఏమి లేవు అని చెబుతున్నారు, దీన్నే ఉపాయ నిష్కర్ష అని అంటారు. సాధనా స్వరూపాన్ని స్పష్టం చేస్తున్నారు.


మొదట మేం అంటూ ఆర్జించుకున్నవి కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి ఇవన్ని ఏమి లేవు. 

ఇవి లభించాలి అంటే వేదాధ్యయణం చేయాలి, ఒక గురువుని ఆశ్రయించాలి, ఆ గురువు జ్ఞానంచే శీలంచే వృద్దుడై ఉండాలి.


అలాంటి గురువు వెంట కదా వెళ్ళితే అవి ప్రాప్తిస్తాయి. మరి మేమో *"కఱవైగళ్ పిన్ శెన్ఱు "* పాలిచ్చే పశువుల వెంట నడిచే వాళ్ళం. మా గురువులు పశువులయ్యా. అవి కూడా పాలు ఇస్తేనే మేం పోశిస్తాం. లేకుంటే లేదు.


ఇది కర్మ అని కూడా భావించం, కర్మయోగానికి ఏవో కొన్ని నియమాలు ఉంటాయి. *"కానమ్ శేర్-నుంద్-ణ్భోమ్"* అడవుల వెంట పడి తింటూ తిరిగే వాళ్ళం. ఎలాంటి నియమాలు లేని వాళ్ళం. ఇక మెల్లగా కర్మపై పట్టు తొలగితే కదా జ్ఞానం ఏర్పడేది, ఇక జ్ఞానం లేనప్పుడు భక్తి కలిగే ప్రసక్తే లేదు.


 మేం *"అఱివొన్ఱు మిల్లాద వాయ్-క్కులత్తు"* ఎలాంటి జ్ఞానం, భక్తి లేని గొల్ల కులానికి చెందిన వారమయ్యా. మరి స్వామి ఏం లేకుంటే ఎందుకు వచ్చారు అన్నట్టుగా వీళ్ళకేసి చూసాడు.


మరి ఇవన్నీ లేని మేం ఎందుకోసం వచ్చామంటే *"ఉన్ఱన్నై ప్పిఱవి పిఱన్దనై పుణ్ణియమ్ యాముడయోమ్"* మాకోసం మమ్మల్ని వెతుక్కుంటూ మా మద్య ఉంటూ మేం పండించ నక్కర లేని ఒక పుణ్యం మావద్ద ఉందయా, అది నివ్వు.


 *"కుఱైవొన్ఱుమిల్లాద గోవిందా"* కళ్యాణ గుణ పూర్తి కల వాడివి, ఏలోటు లేని వాడివి. మాలోటు తీర్చగలిగే వాడివి గోవిందా. 


*"ఉందన్నో డుఱవేల్ నమక్కు ఇంగొరిక్క వొరియాదు"* నీకూ మాకూ ఒక సంబంధం ఉంది, తెంచుకున్నా తొలగేది కాదు. సూర్యుడికి కాంతికి ఉన్న సంబంధం. ఎవరు వద్దు అనుకున్నా తొలగేది కాదు. *"అఱియాద పిళ్ళైగళోమ్ అంబినాల్"* ఇన్నాళ్ళు తెలియక రక రకాల పేర్లతో పిలిచాం తెలియక, చిన్న పిల్లలం, పట్టించుకుంటారా.


  *"ఉన్ఱన్నై చ్చిఱు పేర్-అళైత్తనవుం"* చిన్న పేర్లు అనుకొని పిలిచాం, పొరపాటు చేసాం, నీవు సంపాదించుకున్న గొప్ప పేరు గోవిందా అది మేం ఇప్పుడు తెలుసుకున్నాం.


 *"శీఱి యరుళాదే"* కోపించక అనుగ్రహించు. *"ఇఱైవా! నీ తారాయ్ పఱై"* మాకందరికి స్వామివి, మాకు ఏం తెలియదని అనుగ్రహించకుండా ఉండేవు, నీవు నీవాళ్ళను అనుగ్రహిస్తే ఎవరు దూషిస్తారు. అనుగ్రహించు.


*ॐॐॐॐॐॐॐॐॐॐ*


*తిరుప్పావై 28వ పాశురము/అనువాద పద్యం*

*రచన*

 *మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

*ॐॐॐॐॐॐॐॐॐॐ*


*సీ.గోపకులము చేరి గోవిందు డైనావు* 

       *చల్లగా చూడుము గొల్లలనక*

*వేచి యుంటిమి మేము వేసారి బోనీకు*

      *చిత్తడి చేయకు చిత్తములను*

*గోవు వెంట తిరిగి గోపాలుడైనావు*

        *మాకుఫలము నిమ్ము మదిని దోచి*

*కోనలందు తిరుగు గొల్ల కన్నియలంచు*

        *కోపించ బోకుము కోరిక విని*

*పుణ్య మేమున్నదో పుట్టిరేపల్లెలో*

        *నోచుచున్నాము యీ నోమునిపుడు!!*


*తే.గీ.జన్మ జన్మల బందమై సాగునపుడు*

*చిన్ని పేర్లతో పిలుచుచు యెన్ని మాట*

"లంటిమో కాని నొచ్చక యన్ని సైచి*

*పరను దయచేసి మాకొక వరము నిమ్ము*

*శ్రద్ధ భక్తి నొసగి బుద్ధిని కల్గించు* 

*శ్రీధరుని మనసున స్థిరము కమ్ము!!*


🕉🌞🌎🌙🌟🚩

భగవంతుడు

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


*భగవంతుడు...*

                  *నీతో వున్నాడు!*

                    ➖➖➖✍️


*ప్రతి సంవత్సరం ఒక పిల్లవాడ్ని తల్లిదండ్రులు వేసవి విరామం కోసం అతని అమ్మమ్మ ఇంటికి తీసుకువెళ్ళేవారు, మళ్లీ రెండు వారాల తరువాత అదే రైలులో ఇంటికి తిరిగి వచ్చేవారు.*


*అయితే ఒక రోజు అబ్బాయి తన తల్లిదండ్రులతో ఇలా చెబుతాడు:  “నేను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను, ఈ సంవత్సరం ఒంటరిగా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తాను! ”*


*కొంచెం ఆలోచన తరువాత తల్లిదండ్రులు అంగీకరిస్తారు....*


*తర్వాత రోజు వారు రైల్వే స్టేషన్ కి వెళ్తారు, ట్రైన్ ప్లాట్ ఫాం మీద ఉంది, ఫ్లాట్ ఫాం మీద ఉండి కిటికీ ద్వారా అతనికి వీడ్కోలు చెప్తూ పదే పదే జాగ్రత్తలు చెబుతున్నారు.*


*"తెలుసు నాకు తెలుసు, మీరు ఇప్పటికే నాకు చాలాసార్లు చెప్పారు.! "అన్నాడు బాలుడు కొంచెం అసహనంతో.*


*రైలు బయలుదేరబోతోంది ఇంతలో తండ్రి అతని జేబులో ఏదో పెడుతూ గుసగుసలుగా: ”బాబూ, నీకు అకస్మాత్తుగా ఒంటరిగా లేదా భయం అనిపిస్తే, ఇది చూడు!”*


*ట్రైన్ బయలుదేరింది...*


*ఇప్పుడు బాలుడు ఒంటరిగా ఉన్నాడు, రైలులో కూర్చున్నాడు, తల్లిదండ్రులు లేకుండా, మొదటిసారి!*


*అతను కిటికీ గుండా వెళ్లే దృశ్యాన్ని చూస్తున్నాడు.*


*అతని చుట్టూ అపరిచితులు హల్‌చల్ చేస్తున్నారు, శబ్దం చేస్తున్నారు, కొంతమంది కంపార్ట్మెంట్‌లోకి ఎక్కుతున్నారు,కొంతమంది దిగుతున్నారు. అటూ ఇటూ చూస్తున్నాడు అన్నీ కొత్త మొహలే. తెలిసిన మొహం ఒక్కటీ లేదు. అతను ఒంటరిగా ఉన్నాడు అనే భావన అతనికి వచ్చింది. ఒక వ్యక్తి విచారకరమైన మొహంతో తననే చూస్తూన్నాడు.అది కుర్రాడికి మరింత అసౌకర్యంగా ఉంది.*


*ఇప్పుడు ఒక్క సారిగా భయం వేసింది. రైలు వేగానికి కుదుపులకి కడుపు నొప్పి మొదలైంది. మరియు రైలు వేగంతో సరిపోలడానికి ప్రయత్నిస్తున్నట్లుగా గుండె కొంచెం వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది.*


*సీట్లో మూలకి ముడుసుకుని కూర్చున్నాడు, ఒక్క సారిగా అతని కళ్ళల్లో నీళ్ళు.....*


*ఆ సమయంలో అతనికి తన తండ్రి తన జేబులో ఏదో ఉంచినట్లు గుర్తువచ్చింది.*


*వణుకుతున్న చేతితో అతను జేబులోంచి ఓకాగితాన్ని తీశాడు. అందులో ఇలా ఉంది:  "భయపడవద్దు, నేను నెక్స్ట్ కంపార్ట్మెంట్లో ఉన్నాను."*


*ఒక్కసారిగా కొండంత ఆత్మవిశ్వాసం మరియు దైర్యంతో మొహం మెరిసి పోయింది.  గుండెల నిండా దైర్యం... చిరునవ్వుతో తల పైకి ఎత్తుకొని కూర్చున్నాడు, గుండె వేగం తగ్గింది, కడుపు నొప్పి ఛాయలు లేవు!* *అపరిచితుల మధ్యలో చాలా సౌకర్యంగా ఉంది ఇప్పుడు.*



 *నీతి:*


*అందరి జీవితాల్లో కూడా ఇదే పరిస్థితి!*


*దేవుడు ఈ లోకంలో మనలను పంపినప్పుడు, మనందరి జేబులో కూడా ఒక నోట్ వుంచుతాడు: "నేను మీతో ప్రయాణిస్తున్నాను!" అని.*


*కాబట్టి భయపడవద్దు!*

*నిరాశ చెందకండి!*

*ఇది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది!*


*ప్రస్తుతం ప్రపంచంలో మనుగడ కోసం పోరాడుతున్న ఈ అనిశ్చిత సమయాల్లో, ఏవరో ఒకరు నీ కోసం మరొక కంపార్ట్మెంట్లో అలాగే వేరెవరో నీ సహాయం కోసం వేరే కంపార్ట్మెంట్లో ఉండవచ్చు.*


*భగవంతుని విశ్వసించండి, ఆయనపై నమ్మకం ఉంచండి, మన ప్రయాణమంతటా మన దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు.*


*దయచేసి ప్రతిరోజూ అందరి కోసం ప్రార్థించండి.✍️*

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀