12, జనవరి 2025, ఆదివారం

శ్రీ దత్త ప్రసాదం

 శ్రీ దత్త ప్రసాదం - 26 - చిత్రపటాల మార్పు - మొదటి భాగం 


ఆనాటికి నేను మందిరములో నావంతు బాధ్యతలను తీసుకొని రమారమి సంవత్సరం రోజులయ్యింది. ఆరోజు స్వామివారి గర్భమందిరము పక్కన ఉన్న పూజామూర్తి వద్ద అర్చక స్వామి చేత పూజ చేయించుకుంటున్న సమయములో నా దృష్టి అక్కడ మూర్తి వెనక గోడకు వేలాడదీసిన శ్రీ స్వామివారి చిత్రపటం మీదకు నా దృష్టి పోయింది. షుమారు 3 అడుగుల పొడవు మరియు 3 అడుగుల వెడల్పు వుండే శ్రీ స్వామివారి చిత్రపటం ఆది. దానికి అటునుంచి ఇటు వరకు రెండు పెద్ద రుద్రాక్షమాలలు వేసివున్నాయి. ఆ పటంలోని శ్రీ స్వామివారి చిత్రం ఎంతో ప్రశాంతంగా కరుణ కూడుకున్న కన్నులతో అక్కడ పూజ చేయించుకునేవాళ్లనే ఆశీర్వదిస్తున్నట్టు ఉంటుంది. 


కానీ, ఆ చిత్రపటం ఈనాటిది కాదు, మన మందిరములో అన్ని వస్తువులకు ఉన్న విధముగానే దాని వెనక కూడా ఒక ఘనమైన చరిత్ర ఉంది. 1976, మే 6 వ తేదీన శ్రీ దాత్తత్రేయ స్వామివారు కాపాల మోక్ష సిద్ధి పొందిన తరువాత, శ్రీ స్వామివారి రూపుని ప్రదర్శించేలా ఒక చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని శ్రీధరరావు దంపతులకు మనసులో తోచింది. అప్పుడు, చీరాల దగ్గర వేటపాలెం అనే ఊరిలో శీలం యతిరాజు అనే చిత్రకారుడిని పిలిపించి శ్రీధరరావు దంపతులు మరియు నాగేంద్రప్రసాద్ గారు శ్రీ స్వామివారి గురించి వర్ణించి చిత్రపటాన్ని సిద్ధం చెయ్యమన్నారు. యతిరాజు గారికి శ్రీ స్వామివారి రూపురేఖలు ఎలా సుస్పష్టంగా తెలిశాయో కానీ, 1977 మార్చి మాసానికి శ్రీ స్వామివారి చిత్రపటాన్ని సిద్ధం చేసి శ్రీధరరావు దంపతుల ఇంటికి తీసుకొని వచ్చారు. 


శ్రీధరరావు దంపతుల ఎదురుగా ఈ చిత్రపటాన్ని యతిరాజు గారు చూపించగానే, దానిని చూసిన వెంటనే శ్రీధరరావు గారు మరియు నాగేంద్రప్రసాద్ గారు అమితాశ్చర్యపోగా, నిర్మల ప్రభావతి గారు వారికి దూరమైన తమ పెద్ద బిడ్డ గుర్తొచ్చి ఒక్కసారిగా ఏడ్చేశారు. అచ్చం శ్రీ స్వామివారు ఎదురుగా కూర్చున్నంత, ప్రత్యక్షంగా చూస్తున్నారా అనేంత సరిగ్గా శ్రీ స్వామి వారు చిత్రపటాన్ని సిద్ధం చేశారు యతిరాజు గారు. 


అటుపైన, శ్రీధరరావు దంపతులు ఆ చిత్రపటానికి టేకుతో ఫ్రేమ్ చేయించి, మందిరములో పూజ మూర్తి వెనుక దాన్ని స్థాపించారు... అప్పటినుంచి అంటే షుమారు 47 ఏళ్ళు ఆ చిత్రపటం అలానే ఉంది. నాగేంద్రప్రసాద్ గారు వ్యవస్థాపక ధర్మకర్తగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఎంతో మంది భక్తులు ఆ చిత్రపటం పాతది అయిపోయిందని, కొత్తది చేయిద్దామని ఎన్ని సార్లు ప్రతిపాదించినా కానీ వారు తిరస్కరించారు. కారణం, శ్రీ స్వామి వారి నిజరూపానికి అత్యంత చేరువుగా చేరుకోగలిగింది ఆ చిత్రపటం మాత్రమే అని, దానిని కదిలిస్తే మళ్ళీ ఇక అంత సహజంగా మరే చిత్రం రాదని వారి ఆందోళన.



కానీ, కాలక్రమేణా ఆ చిత్రపటం లోపల మరియు బయట దుమ్ము మరియు చెమ్మ చేరి, నల్లటిమచ్చలు పడివున్నాయి. చాలా రోజులనుంచి నాకు కూడా ఆ చిత్రపటాన్ని మారిపించాలి అనిపించి, నాగేంద్రప్రసాద్ గారికి చెప్తే వారు ఒప్పుకోలేదు. కానీ, ఆరోజు శ్రీ స్వామివారి మూర్తి ముందు నిలచిన నాకు ఎందుకో బలంగా నేను దానిని చేయించగలను అనే దృఢమైన నమ్మకం కలిగింది. అంతే కాదు, అష్టోత్తర పూజ జరిగే వైపున్న పటాన్ని కూడా మర్పించాలి, అప్పుడు గర్భగుడి ఇరువైపుల ఉన్న పటాలు మరింత శోభను తెస్తాయి అని అనిపించింది. 


పాఠకులారా, ఆ తరువాత జరిగిన విశేషాలను వచ్చే భాగములో విన్నవిస్తాను. అలానే, భక్తుల మనసులను ఇంతలా పెనవేసుకోగలిగే మన మోగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరాన్ని మీరందరూ తప్పక దర్శించి తరించాలన్నది నా వ్యక్తిగత విన్నపము.


సర్వం,

శ్రీ దత్త కృప 

రచన : పవని శ్రీ విష్ణు కౌశిక్

(మందిర వివరముల కొరకు :

పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699)


----

మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య చరిత్ర క్రింది లింక్ ద్వారా యూట్యూబ్లో వినవచ్చును : 


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=nq8cskE8m3f3ZrNZ

-----


*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏 :


Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632

కామెంట్‌లు లేవు: