*🌺🕉️ జై శ్రీమన్నారాయణ🕉️🌺*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*అక్షర యజ్ఞం*
*అక్షరాలు వాక్కుగా మారి శబ్దరూపంలో ప్రయాణిస్తాయి. సచ్చిదానందరూపంగా అక్షరాన్ని మహర్షులు ఆరాధించారు. వాగ్దేవిగా కొలిచారు. సరస్వతిగా ఆరాధించారు. భాషలు వేరైనా భావప్రకటనకు అక్షరమే మూలాధారం. తెలుగులో యాభై ఆరు అక్షరాల వర్ణమాల తరతరాలుగా భాషాసంపదను అందించింది. పిల్లలకు అక్షరాభ్యాసం సనాతనమైన సంప్రదాయం. ఓం ప్రారంభించి, శ్రీకారాన్ని దిద్ది, నమశ్శివాయ అని అక్షరాలు దిద్దించే సంస్కారం కొందరిది. మరికొందరు ఓం శ్రీ, న, మ అని అభ్యాసం ప్రారంభిస్తారు. ఏ విధానమైనా అది అక్షర సుముహూర్తం.*
*ఒకే అక్షరంగా సృష్టికి మూలమై ఉద్భవించిన ప్రణవనాదం ఓంకారం. ఏకాక్షర బ్రహ్మగా వేదం వర్ణించింది. శూన్యంలో, సముద్రహోరులో, గాలి సవ్వడిలో, గుడిగంటలో ఏకాక్షర శబ్దం ఓంకారంగా వినిపిస్తుంది. అది పరమాత్మవాణి. అనేక ఇతర ఏకాక్షర శబ్దాలు ఉన్నా మోక్షసామ్రాజ్యానికి ఓంకారాన్నే ప్రామాణికంగా చెబుతారు. రెండు అక్షరాల మంత్రాలు అనేక స్తోత్రాల్లో కనిపిస్తాయి. అక్షరాలు ఎన్ని ఉన్నా మంత్రానికి ప్రాణం అక్షరంలోని బీజశక్తి. వాటినే బీజాక్షరాలు అంటారు. అన్ని ధాన్యపు గింజలూ మొలకెత్తవు. బీజశక్తి కలిగిన విత్తనాలే పునరుత్పత్తి చెందుతాయి. రామ, కృష్ణ, శివ, హరి, హర... లాంటి రెండక్షరాల మంత్రాలు బీజాక్షర సమాశ్రితాలు. ఓం నమః శివాయ పంచాక్షరి, ఓం నమోనారాయణాయ అష్టాక్షరి, ఓం నమో భగవతే వాసుదేవాయలాంటి ద్వాదశాక్షరి... భగవన్నామస్మరణ కలిగించే తారక మంత్రాలు.*
*ఇరవై నాలుగు అక్షరాలతో కూడిన గాయత్రి- ఆగమశాస్త్రం అంగీకరించిన వేదమంత్రం. వాల్మీకి మహర్షి తన రామాయణంలో గాయత్రి మంత్రంలోని ఒక్కొక్క అక్షరాన్ని వరస క్రమంగా వేయి శ్లోకాలకు ఒకటిగా వేసి ఇరవైనాలుగు వేల శ్లోకాలతో రచించాడు. ఆదికావ్యంగా, మోక్షాన్ని, సామాజిక ధర్మాలను ప్రసాదించే ఇతిహాసంగా తరతరాలుగా నిలిచే శక్తిని తరించుకోవడానికి ఇదే కారణంగా చెబుతారు. విత్తనంలో శాఖోపశాఖలుగా విస్తరించే మహావృక్షం దాగినట్లు అక్షరంతో మహోన్నతమైన అర్థాలు నిక్షిప్తమై ఉన్నాయి. అక్షరం మనిషిని వివేకవంతం, సంస్కారవంతం కావిస్తుంది. అక్షర విన్యాసాలు అనేకం. అవి అనంతమైన కళారూపాలు. అఖండ విజ్ఞానభాండాగారాలు. దైవీస్వరూపాలు.*
*శతకాలుగా దర్శనమిచ్చిన అక్షర సంపద తరతరాలుగా మనిషికి వివేకజ్ఞానాన్ని ప్రసాదించింది. వేమనశతకం, దాశరథీ శతకం, కాళహస్తీశ్వర శతకం... లాంటి అనేక శతక కావ్యాలు మనిషికి మంచి మార్గాన్ని చూపించాయి. ఉన్నస్థితి నుంచి ఉన్నతస్థితికి చేర్చే సాధనాలుగా నిలిచాయి. పద్యంలోని కవితాత్మక అక్షరరూపాలు గుండెల్లో మధురానుభూతిని, రసానుభూతిని అందించాయి. తెలుగువారి పద్యకృషీవలుడు బమ్మెరపోతన భాగవత పద్యాలు సరస్వతికి అక్షర సుమహారాలు. ఆనంద ప్రేరకాలు. చమత్కారంగా ఒక కవి ఇలా వర్ణించాడు. పద్యం ఒక బంగారు పళ్ళెం. అంతర్యామి దానిలో వర్ణన, ఛందస్సు, సొగసు, కథాగమనం, అతిశయం, ఆర్ద్రత- వడ్డించిన మధుర పదార్థాలు. వాటిని ఆస్వాదించి, అనుభవించి బంగారుపళ్ళెం లాంటి పద్యాన్ని భద్రంగా దాచుకోవాలి. ముందుతరాలకు మన సంపదగా అందించాలి.*
*గ్రాంథికమైనా, వ్యావహారికమైనా వ్యావహారికమైనా అక్షరం ఆలోచనా సులోచనం. వాడి, వేడిగల అక్షరాల పదునుతో శిల్పంలా చెక్కి, సత్యం, ప్రియంగా అందాలను దిద్ది, నిజాన్ని నిర్భయంగా మలచి తీర్చిదిద్దిన వ్యాస పరంపర మనిషిని తప్పక మంచి మార్గంలో నడిపిస్తుంది. మంచి వ్యాసంలోని ప్రతి అక్షరం మనిషిని నిలదీస్తుంది. విచక్షణతో ఆలోచింపజేస్తుంది.*
*ఇతిహాసాలు, పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు... వీటి రూపేణా మానవ సమాజానికి హితం చేకూర్చే సంస్కరణే అక్షరయజ్ఞం. అక్షరం సంస్కృతీ సౌధానికి మహాద్వారం!*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి