23, డిసెంబర్ 2021, గురువారం

పాపం-పుణ్యం

 పాపం-పుణ్యం 

(ఈ వ్యాసం వ్రాయటానికి ముందు నేను ఒకింత సందేహించాను ఎందుకంటె ఇంత చిన్న విషయాలు మాకు తెలియవా అని మనలో చాలామంది అనుకోవచ్చు.  కానీ ఇది కేవలం తెలియని వారిని దృష్టిలో ఉంచుకొని వ్రాసిందని గమనించగలరు)

మనం తరచుగా పాపం-పుణ్యం అనే ద్వంద పదాలను వింటుంటాము, అంటూవుంటాము. కానీ ఇదమిద్దంగా పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి అంటే చాలామంది చెప్పలేని స్థితిలో వుంటారు.  కానీ ఒక్కటి మాత్రం ప్రతి వక్కరు చెప్పగలరు అదెమంతి పాపం అనేది చెడుకు సంబంధించింది, పుణ్యం అనేది మంచికి సంబంధించింది కాబట్టి మనం పుణ్యం చేయాలి అని మాత్రం అంటారు. ఎవరైనా ఏదయినా కానీ పని చేస్తే పోన్లే వాడి పాపాన వాడే పోతాడు అని మనం అనటం కూడా కద్దు. అంటే మనం ఏమిచేయనవసరం లేదు వాడి పాప ఫలితాన్ని వాడే పొందుతాడు అని కాబోలు ఆలా వాడుకలోకి వచ్చింది.  ఏది యెమీయేన ఒక్కటి మాత్రం నిజం పాపం కానీ లేక పుణ్యం కానీ మనం చేసే పనులకు ప్రతిగా వచ్చే ఫలితం అంటే మన కర్మలకు లభించే ఫలితం. అంటే పాప పుణ్యాలకు కారణం కర్మలు అంటే కొన్ని కర్మలు చేస్తే పాపం వస్తుంది అదే విధంగా కొన్ని కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది. 

ఒక చిన్న ఉదాహరణ చూద్దాం 

1) తల్లి తండ్రులను గౌరవించాలి 

2) తల్లి తండ్రులను హింసించాలి. 

ఇందులో మొదటి కర్మ చేస్తే పుణ్యం వస్తుందని రెండవ కర్మ చేస్తే పాపం వస్తుందని అందరము ముక్త కంట్టంగా చెపుతాము. కానీ ఎందుకు అంటే మాత్రం చెప్పలేము. 

మనం చేసే కర్మలు రెండు రకములు 1) విహిత కర్మలు 2) నిషిద్ధ కర్మలు అంటే మొదటిది చేయవలసిన పనులు లేక చెప్పిన పనులు రెండవది చేయకూడదని చెప్పిన పనులు అని స్థూలంగా అర్ధం. ఇంకా వివరంగా పరిశీలిస్తే విహిత కర్మలు అంటే వేదవిదిత కర్మలు అనగా వేదంలో చేయమని చెప్పిన కర్మలు అదే విధంగా నిషిద్ధ కర్మలు అంటే వేదనిషిద్ద కర్మలు అనగా వెడలు చేయవద్దని చెప్పిన కర్మలు. 

వేదాలు అంటేనే కర్మ కాండ అనగా మానవులు ఎలాంటి కర్మలు చేయాలి, ఎలాంటి కర్మలు చేయకూడదు అని వివరించేవి వేదాలు 

మనం అక్కడక్కడ ఇది యాంటీ కాన్స్టిట్యూషన్ అని రాజకీయ నాయకులూ పలుకుతూ ఉండటం చూస్తాం అంటే కాన్స్టిట్యూషన్కి విరుద్ధం అని కదా అర్ధం, అదే మాదిరి నిషిద్ధ కర్మలు కూడా ఇప్పుడు కొంతవరకు మీకు అర్ధం అయ్యిందని నేను అనుకుంటాను. 

ఇదంతా చాలా గజిబిజిగా వున్నది ఒక్క మాటలో పాప పుణ్యాలు అంటే ఏమిటో చెప్పలేవా అని మీరు అడగ వచ్చు. ఆలా చెప్పాలంటే 

ధర్మాన్ని ఆచరించటం పుణ్యం 

ధర్మాన్ని ఆచరించక పోవటం మరియు ధర్మ విరుద్ధంగా ప్రవర్తించటం పాపం. 

ఇప్పుడు ధర్మం అంటే ఏమిటన్న ప్రశ్న ఉదయిస్తుంది. ధర్మం అంటే ప్రతివారు తానూ ఆచరించవలసిన విధానం. ఇది ఒక్కొక్క వ్యక్తికీ ఒక్కొక్క రీతిగా వుంటూ అందరికి ఒకేరీతిగా ఉంటుంది. 

అదెలా అంటే నీ తల్లిదండ్రులను చూసుకొనేది నీ ధర్మం నీవు నీ తల్లిదండ్రులను సరిగా చూసుకోలేదనుకో అప్పుడు నేను నీ తల్లిదండ్రులను చూసుకోవటం నా ధర్మం కాదు మరి అది ఏమిటి అంటే దానికి శ్రీ కృష్ణ భగవానులు దానిని పరధర్మం అని స్పష్టం చేసారు. భగవానులు ఎల్లప్పుడూ ప్రతి వారు తన ధర్మాన్నే ఆచరించాలని పరధర్మాన్ని ఆచరించకూడదని పేర్కొన్నారు. 

 శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita – 142 🌹
. తృతీయ అధ్యాయము – కర్మ యోగము  – 35 
35. శ్రేయాన్ స్వధర్మో విగుణ: పరధర్మాత్ స్వనుష్టితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయ: పరధర్మో భయావహ: ||
🌷. తాత్పర్యం :
పరధర్మము చక్కగా నిర్వహించుట కన్నను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మపాలనము హానికరమైనది కావున దానిని పాటించుట కన్నను స్వధర్మపాలనము నందు నాశనము పొందుటయైనను ఉత్తమమైనదే!

ప్రతివారు వారి వారి ధర్మం ఏమిటో తెలుసుకొని దానిని మాత్రమే ఆచరించాలి. వారు ఆచరించాల్సిన ధర్మాన్ని విద్యుక్త ధర్మం అని అంటారు. 
ఒక పురుషునికి తన తల్లిదండ్రులను, తన భార్య పిల్లల యోగాక్ష్యేమాలు చూడాల్సిన ధర్మం ఉంటుంది. అదే విధంగా ఒక స్త్రీకి తన భర్త, అత్తా మామలు, పిల్లల యోగక్షేమాలు చూడాల్సిన ధర్మం ఉంటుంది. కాబట్టి, ధర్మం అనేది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది తెలుసుకొని నడచుకోవటం తద్వారా పొందే ఫలమే పుణ్యం దానికి భిన్నంగా ప్రవర్తించటమే పాపం. 
ఓం శాంతి శాంతి శాంతిః 
బుధజన విధేయుడు 
భార్గవ శర్మ 






ఒక్క క్షణం.....

 🍁ఒక్క క్షణం.....🍁


ఒక ఊర్లో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన పండితుడు ఒకాయన ఉండేవాడు. చాలా చక్కని వాక్పటిమ గలవాడు. ఆయన ఆలయం ఆవరణలో కూర్చొని ప్రవచనం చెబుతూ వుంటే వేలమంది జనం అలా కదలకుండా బొమ్మల్లా వింటూ ఉండిపోయేవాళ్ళు. ఆయన ప్రఖ్యాతి చుట్టుపక్కల చాలా గ్రామాల్లో వ్యాపించింది.


ఒకసారి ఆయన ప్రవచనం నిమిత్తం పొరుగూరు వెళ్ళవలసి వచ్చింది. ఆ ఊరు వెళ్ళే బస్సు ఎక్కి టికెట్ తీసుకున్నాడు. అయితే పొరపాటున బస్సు కండక్టర్ పది రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. పండితుడు అది గమనించి తిరిగి ఇవ్వాలని యోచించాడు. కానీ బస్సు నిండా జనం కిక్కిరిసి ఉండటంతో, దిగేటప్పుడు ఇద్దాంలే అనుకుని కూర్చున్నాడు. 


కొద్ది సేపు తరువాత అతని మనసులొ ఆలోచనలు మారాయి. 'ఆ కండక్టరు కూడా ఎంతమంది దగ్గర చిల్లర కొట్టేయడం లేదు.. ఈ బస్సు కూడా ఒక సంస్థదే కదా.. ఎంత మంది తినటంలేదు.. నా పది రూపాయలకే నష్టపోతుందా ఏమిటి.. ఈ పది రూపాయలు ఏదైనా దైవ కార్యనికి ఉపయోగిస్తా...' అని అనుకుని మౌనంగా కూర్చున్నాడు.

 

అంతలో వూరు వచ్చింది... బస్సు ఆగింది... కానీ ఆయన దిగేటప్పుడు బస్సు కండక్టర్ దగ్గరికి రాగానే తన ప్రమేయం ఏమాత్రం లేకుండా అసంకల్పితంగా కండక్టరుకు ఇవ్వవలిసిన పది రూపాయలు ఇచ్చి... "మీరు నాకు టికెట్ ఇచ్చేటప్పుడు ఈ పది రూపాయలు ఎక్కువగా ఇచ్చారు" అన్నాడు. 


దానికి ఆ కండక్టర్ "అయ్యా..! నేను మీ ప్రవచనాలు ఎంతో శ్రద్ధగా వింటాను. మీరు చెప్పడంతోటే సరిపెట్టుకుంటారా లేక పాటిస్తారా అని చిన్న పరీక్ష చేశాను" అని అన్నాడు. 


పండితుడు చల్లటి చిరు చెమటలతో బస్సు దిగి.. 'పది రూపాయల కోసం తుచ్ఛమైన ఆశతో నా విలువలకే తిలోదకాలు ఇవ్వబోయాను... నా అదృష్టం బాగుంది. నా మనస్సాక్షి సరైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకొని నా విలువలను కాపాడింది' అనుకున్నాడు.


జీవిత కాలం పాటు సంపాదించుకున్న మంచితనం కూడా సర్వనాశనం కావడానికి క్షణం చాలు🍁