6, మార్చి 2021, శనివారం

మన మహర్షులు - 41

 మన మహర్షులు - 41


శుక మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷


పరమ పవిత్రమైన భారత బ్రహ్మర్షుల్లో శ్రీశుక మహర్షి చాలా గొప్పవాడు. వేదవ్యాస మహర్షి తపస్సు చేసి పొందిన కొడుకు. శ్రీశుక మహర్షిని పోలిన మహర్షి త్రిభువనాల్లోనూ ఎక్కడ వెదికినా లేడు.


పూర్వం వేదవ్యాస మహర్షి 'కర్ణికారం' అనే వనంలో పరమేశ్వరుణ్ణి గురించి తపస్సు చేసి పంచభూతాలు సమానమైన కొడుకు కావాలని కోరుకుని వరం పొందాడు.


ఆయన కోరుకున్నట్లుగానే ఘ్నతాచి అనే చిలుక రూపంలో వున్న అప్సరస కారణంగా శ్రీశుకుడు పుట్టాడు.


శుక మహర్షి పుట్టినప్పుడు ఆకాశగంగ వచ్చి స్నానం చేయించింది. ఆకాశం నుంచి కృష్ణాజినం, దండం వచ్చాయి. దివ్యదుందుభులు మ్రోగాయి, దేవతలు గానం చేస్తూ, పుష్ప వర్షం కురిపించారు. పార్వతీ సహితంగా పరమేశ్వరుడు వచ్చి ఉపనయం చేశాడు. ఇంద్రుడు కమండలం, దేవతలు ఎప్పుడూ మాయని దివ్య వస్త్రాలు ఇచ్చారు.


శ్రీశకుడికి పుట్టకతోనే వేదాలు వచ్చేశాయి. అయినా బృహస్పతి దగ్గర మిగిలిన విద్యలన్నీ నేర్చుకున్నాడు. 


కొంతకాలం తర్వాత వ్యాసుడు తన కొడుకు శుకుణి మోక్ష మార్గం గురించి తెలుసుకోమని జనక మహారాజు దగ్గరకి పంపించాడు. 


కాని నడిచి మాత్రమే వెళ్ళమని

చెప్పాడు వ్యాస మహర్షి.


తండ్రి చెప్పిన ప్రకారం శ్రీశుకుడు మిథిలా నగరానికి వెళ్ళాడు. ద్వారపాలకులు మొదట లోపలికి పంపించలేదు, తర్వాత పంపారు. 


. జనక మహారాజు మంత్రితో సహా ఎదురొచ్చి అర్హ్య పాద్యాలిచ్చి లోపలికి తీసుకెళ్ళాడు. బంగారు సింహాసనం మీద కూర్చోపెట్టి పూజచేశాడు.


జనక మహారాజుని మోక్షమార్గం గురించి చెప్పమన్నాడు శుక మహర్షి జనకమహారాజు మోక్షమార్గం గురించి విపులంగా శుక మహర్షికి చెప్పి పంపాడు. 


శ్రీశుకుడు తండ్రి వలన కాలావయవ నిరూపణ, చతుర్యుగ ధర్మాలు, బ్రహ్మం దాని విజ్ఞానం, సర్వ వర్ణ ధర్మాలు, దానగుణ ప్రాశస్త్యం, మైత్రి గుణలాభం, ఇంద్రియ నిగ్రహం ఇలాంటివెన్నో నేర్చుకున్నాడు.


తండ్రితో అన్ని విషయాల గురించి చెప్పించుకుని ఆచరించి బ్రహ్మర్షియై వెలిగాడు శుకుడు. ఆత్మజ్ఞానంతో బాహ్య ప్రపంచం మర్చిపోయి శరీరం మీద దుస్తులు కూడా లేకుండా వుండేవాడు.


తక్షకుడి విషంతో ఏడు రోజుల్లో మరణించేలా శాపాన్ని పొందిన పరీక్షిత్తు దగ్గరకి శ్రీశుకుడు వెళ్ళి అతనికి ముక్తి కలిగేలా తన తండ్రి రాసిన భాగవత కథ వినిపించాడు .మిగిలివున్న ఏడు రోజులు వేరేది ఆలోచించక భగవంతుడి యందే మనస్సుంచి ధ్యానం చెయ్యమని చెప్పి పరీక్షిత్తుకు బ్రహ్మలోకం కలిగేలా చేశాడు.


 ఒక రోజు నారద మహర్షి ఆశ్రమానికి వచ్చి శుకుణ్ణి నీకేంకావాలో అడగమన్నాడు 


ఈలోకంలో పుట్టిన నాకు ఏది మంచో చెప్పమన్నాడు శుక మహర్షి.


యోగసిద్ధి మంచిదని నారదుడు చెప్పగానే శుక మహర్షి నారాదునికి ప్రదక్షిణం చేసి తండ్రికి చెప్పి కైలాస పర్వతం మీద తపస్సు చేసి యోగ సిద్ధి పొందాడు.


నారదుడు శ్రీశుకుణ్ణి చూడ్డానికి వెడితే అతనికి ఆత్మయోగం చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోయాడు శుకుడు. మిగిలిన సిద్దులు ఆశ్చర్యపోయారు. అలా వెళ్ళిపోతూ మృగాలికి పక్షులకి, పర్వతాలకి తన తండ్రి వచ్చి శుకా! అని పిలిస్తే ఓయని పలకమని చెప్పాడు శుక మహర్షి.


శుకుడు ఆకాశ గంగ మీద ఆకాశంలో వెడుతూ వుంటే దాంట్లో స్నానం చేస్తున్న స్త్రీలు అతన్ని చూసి సిగ్గుపడలేదు, కాని అదే వ్యాసుడు వెడుతుంటే సిగ్గుపడ్డారు. అది చూసిన వ్యాసుడికి తనని చూసుకుని తనకే సిగ్గనిపించింది. ఎందుకంటే శ్రీశుకుడు పసిబిడ్డ మనసులాంటి మనసున్నవాడు, ఆడ, మగ ఎవరో తెలియనివాడు.


వ్యాసుడు శుకుడు కనిపించక శుకా! అని పిలుస్తే 'ఓ'యని వినిపింపిందిట. ఇంతలో ఈశ్వరుడు వచ్చి బాధపడుతున్న వ్యాసుణ్ణి ఓదార్చి నీకు కావలిసనట్లే నీ కొడుకు చాలా గొప్పవాడయ్యాడు, ఇంకెందుకు బాధపడతావని చెప్పి పంపించాడు.


శుకుడిని మించిన యోగీశ్వరుడు, తత్వజ్ఞుడు,తపస్వి మూడులోకాలలో మరి లేరు..

అంతటి మహానీయ మహర్షికి మనసులోనే పాదాభివందనం చేద్దాం...🙏🙏


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

ప్రయాణములకు

 *ప్రయాణములకు అనుకూల సమయాలు*

మానవుడు తన నిత్యజీవితంలో ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అయితే కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందన్నట్లు ప్రయాణాలు ఎప్పుడు పడితే అప్పుడు చేయడం మంచిది కాదు. ప్రయాణాలు ఎప్పుడు ఎలా చేయాలో శాస్త్రాలు వివరించాయి.సుదూర ప్రయాణాలకు సోమ, బుధ, గురు, శుక్రవారాలు శుభప్రదం. అలాగే, విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి ప్రయాణానికి శుభ తిథులుగా పరిగణించాలి.

ముఖ్యంగా దీర్ఘకాల ప్రయాణాలకు తీర్థయాత్రలు చేయటానికి అనువైన ముహూర్తాలను నిర్ణయించుకుని బయలుదేరటం మంచిది.అలాగే శుక్ర, ఆది వారాలు పశ్చిమ దిశ ప్రయాణం మంచిది కాదు. గురువారం దక్షిణ దిక్కుకు ప్రయాణం చేయరాదు. భరణి, కృత్తిక, ఆర్థ్ర, ఆశ్లేష, పుబ్బ, విశాఖ, పూర్వాషాఢ, పూర్వభాద్ర అనే స్థిర లగ్నాల్లో ప్రయాణమే పెట్టుకోరాదు.విదియ, తదియ రోజులల్లో కార్యసిద్ధి, పంచమి నాడు శుభం.

సప్తమి నాడు ఆత్మా రాముడు సంతృప్తి చెందేలా అతిథి మర్యాదలు జరుగుతాయి.దశమిరోజు ధనలాభం. ఏకాదశి కన్యలాభమంత సౌఖ్యం.త్రయోదశి శుభాలను తెస్తుంది.


ఇక శుక్ల పాడ్యమి దుఃఖాన్ని కలిగిస్తుంది.చవితి నాడు ఆపదలు వచ్చే అవకాశం.షష్ఠీ నాడు అకాల వైరాలు. అష్టమి నాడు అష్టకష్టాలు. నవమినాడు నష్టాలు. వ్యధలు కలుగుతాయి. ద్వాదశి నాడు మహానష్టాలు.బహుళ చతుర్ధీనాడు ప్రయాణం చేస్తే చెడును కలిగిస్తుంది.శుక్ల చతుర్దశినాడు ఏ పని కాదు.


ఇక మేషం, మిధునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకరం, మీనం వంటి శుభ లగ్నాలలో ప్రయాణం చేపట్టడం మంచింది.ముఖ్యంగా సోమవారం తూర్పు దిశగా ప్రయాణాలు చేయకూడదు.ప్రయాణ ముహూర్తాలకు ఆది, మంగళ, శనివారాలు పాఢ్యమి, పంచ పర్వాలు, ద్వాదశి, షష్ఠి, అష్టమీలలో ప్రయాణాలు చేయకూడదు.


అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, అనూరాధ, శ్రవణం, ధనిష్ఠ, రేవతి శుభ నక్షత్రాలుగా పరిగణిస్తున్నారు.అందువల్ల ఈ నక్షత్ర కాలంలో ప్రయాణాలు ఆరంభించడం మంచిది.


పౌర్ణమి, అమావాస్య నాడు ప్రయాణాలు


మానవుడి మనసుపై గ్రహాల ప్రభావం ఉంటుందని తెలుసుకున్నాము. చంద్ర గ్రహ ప్రభావం మనసుపై స్పష్టంగా ఉంటుంది. పౌర్ణమినాడు చంద్రుడు పూర్ణ కళలతో ఉంటాడు. చంద్రుడు జలానికీ, లవణానికీ, మనసుకీ అధిపతి. అందుకే సముద్రంలో పౌర్ణమినాడు ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి.అలాగే మన శరీరంలో కూడా నీరు, లవణాలు, మనసు ఉంటాయి కదా. వీటికీ అధిపతి చంద్రుడే కనుక మన శరీరానికీ ఆటుపోట్లు ఎక్కువగా వుంటాయి. ఆయితే ఇవి అంతగా పైకి కనబడవు.


మన శరీరంలో ఆటుపోట్లెక్కువగా ఉన్నప్పుడు మనం ఏ విషయంలోనైనా సరైన నిర్ణయం తీసుకోలేక పోవచ్చు. ప్రయాణాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటం ప్రయాణ సమయంలోకానీ, మన పనుల్లోకానీ చాలా అవసరం.అందుకే,ఆ నిర్ణయాలు తీసుకోలేని సమయంలో ప్రయాణం చేయవద్దని చెబుతారు. మొత్తానికి పూర్ణిమ రోజు పనులు ఏవి కావు.


ఇక అమావాస్యనాడు చంద్రుడు కనిపించడు.


దీంతో రాత్రి పూట వెలుతురు చాలా తక్కువగా వుంటుంది.అందుకే అమావాస్నాడు అర్ధరాత్రి ప్రయాణాలు చేయకూడదంటారు.వెలుతురు తక్కువగా ఉండటం మూలంగా దారి సరిగ్గా కనబడక ప్రమాదాలు జరగవచ్చు, చీకట్లో ఏదైనా చూసి ఇంకేదో అనుకుని భయపడవచ్చు,చీకట్లో దొంగల భయం కూడా ఉండవచ్చు.మనం ప్రయాణం చేసే వాహనం ఏ కారణం వల్లనైన ఆగినా ఇబ్బంది పడవచ్చు.


రాత్రి పూట, అందులో చీకటి రాత్రి అలా జరిగితే ఎవరికైనా ఇబ్బందే కదా, అందుకే అమావాస్య అర్ధరాత్రి ప్రయాణాలు, అందులోనూ ఒంటరిగా అసలు ప్రయాణం చేయవద్దు.మొత్తానికి అమావాస్యనాడు ప్రయాణం చేస్తే ఆపదలు వస్తాయని శాస్త్రం చెబుతోంది.అలాగే జన్మ జాతకరిత్య నైదనతారరోజు ప్రయాణం చేయకూడదు.మనం ప్రయాణం ముగించుకుని మన ఇంటికైన సరే తొమ్మిదవ రోజు తిరిగి ఇంటికి రాకూడదు. శాస్త్రం,పెద్దలు చెప్పిన మాటలు వింటే మంచి జరుగుతుంది.

మొగలిచెర్ల

 *గాలిచేష్ఠ..గురువారం దర్శనం..*


"స్వామివారి సమాధి దర్శించుకొని..ఒక్కసారి ఆ అవధూత పాదుకులకు నమస్కారం చేసుకొని వెళ్లిపోతానండీ..ఆ ఒక్క కోరికా తీర్చండి చాలు.." అని ఆ మధ్యవయస్కుడు నన్ను ప్రాధేయపడుతూ అడిగాడు.."మీరేమీ కంగారు పడకండి..మంటపం లోపల సుమారు ఇరువై మంది స్వామివారి సమాధి దర్శనం కొఱకు వేచి వున్నారు..వాళ్లకు అర్చన కూడా చేయించాలి..వరుసక్రమం లో మా సిబ్బంది పంపుతున్నారు..మీరూ లోపలికి వెళ్లి కూర్చోండి..మిమ్మలనూ పంపుతారు..మీ వంతు రాగానే అర్చకస్వామితో సమాధి దర్శనం కొఱకు వచ్చానని చెప్పండి..వారు మిమ్మల్ని స్వామివారి సమాధి వద్దకు పంపుతారు.." అని చెప్పాను.."అలాగేనండీ..మరొక్కమాట..నేను బైటకు వచ్చిన తరువాత మీతో కొన్ని విషయాలు చెప్పుకోవాలి..నాకోసం ఓ పదినిమిషాల సమయం కేటాయించండి.." అన్నాడు.."అలాగేనండీ.." అన్నాను..


ఆరోజు ఆదివారం..ఆదివారం ఉదయం పది గంటల దాకా స్వామివారి సమాధి దర్శించుకునే భక్తుల హడావిడి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది..ఆ సమయం లోనే పై వ్యక్తి తో సంభాషించాల్సి వచ్చింది..మరో గంట గడిచిపోయింది.."ప్రసాద్ గారూ..మీ సిబ్బంది సహకారం తో చక్కగా దర్శనం చేసుకున్నాను..స్వామివారి పాదుకలూ తాకి నమస్కారం చేసుకున్నాను..తృప్తిగా వుందండీ..ఇప్పుడు మీతో మాట్లాడొచ్చా..?" అని అతను అడిగాడు.."చెప్పండి.." అన్నాను..


"నా పేరు ఏడుకొండలు..నెల్లూరు లో చిన్న వ్యాపారం పెట్టుకొని వున్నాను..నా కుటుంబపోషణకు ఇబ్బంది లేదు..ఇద్దరు పిల్లలు..పెద్దది అమ్మాయి..ఇంటర్ చదువుతున్నది..రెండోవాడు అబ్బాయి తొమ్మిదో తరగతి..మా అమ్మా నాయనా కూడా మాతోనే వుంటారు..అందరం కలిసున్నాము..గత రెండేళ్లుగా మా ఆవిడ ప్రవర్తన లో మార్పు వచ్చిందండీ..ఉన్నట్టుండి కేకలు పెడుతుంది..ఏడుస్తుంది..క్రింద పడి దొర్లుతుంది..మళ్లీ ఒక గంట లోపల మామూలు గా మారిపోతుంది..ఏమీ అర్ధం కాలేదు..డాక్టర్ వద్దకు తీసుకెళ్ళాను..పరీక్షలు చేశారు..మానసిక వైద్యం చేయించాలి అన్నారు..అదీ చేయించాను..ఫలితం కనబడలేదు..ఏం చేయాలో దిక్కు తోచలేదు..పిల్లలు, నేను, మా అమ్మా నాన్న..అందరమూ అల్లాడిపోతున్నాము..పిల్లల చదువు దెబ్బతింటున్నది..ఆరునెలల క్రితం నా స్నేహితుడు నారాయణరెడ్డి అనే అతను, ఒక్కసారి మొగిలిచెర్ల వెళ్లి  ఆ దత్తాత్రేయ స్వామి వారి సమాధి వద్ద మొక్కుకో..ఇటువంటి గాలి చేష్టలన్నీ త్వరగా తగ్గుతాయి అని చెప్పాడు..చివరి ప్రయత్నం అనుకున్నాను..ఒక గురువారం పొద్దున్న మేమందరం నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చి..స్వామివారి సమాధి దర్శనం చేసుకొన్నాము..ఆరోజు మీరు లేరు..ఆ రాత్రికి ఇక్కడే మంటపం లో నిద్ర చేసాము..రోజూ మా భార్యలో ఒక్కసారి కనబడే ఆ విపరీత ప్రవర్తన..ఆరోజు దాదాపు మూడు నాలుగు సార్లు కనబడింది..తెల్లవారి శుక్రవారం నాడు కూడా ఇక్కడే ఉన్నాము..స్వామివారి సమాధి మందిరాన్ని శుభ్రం చేస్తుంటే..నేనూ పాల్గొన్నాను..శుక్రవారం నాడు కూడా అదే తంతు..ఆ సాయంత్రం మేము తిరిగి నెల్లూరు వెళ్లిపోయాము..వెళ్లేముందు స్వామివారి విభూతి తీసుకొని వెళ్ళాను..ఇంటికి వెళ్లిన తరువాత ఒక వారం పాటు నరకం చూసాము..నా భార్య జబ్బు తగ్గకపోగా..ఇంకా పెరిగింది..స్వామివారి విభూతి ఆమె నుదుటిపై పెట్టాను..చిత్రంగా ఒక్క అరగంటలో మామూలు మనిషి అయింది..నాకు ఆ విభూతి పై గురి కుదిరింది..రోజూ పెట్టుకోమని చెప్పాను..మొదటి వారం మమ్మల్ని ఎంత ఏడిపించిందో..ఆ మరుసటి వారం ఒక్కసారి కూడా తన గాలి చేష్ట కనబడలేదు..పూర్తిగా స్వామినే నమ్ముకున్నాము..ఆ తరువాత ఆమెను తీసుకొని రెండుసార్లు వచ్చి వెళ్ళాను..ఇప్పుడు తాను మామూలు గా వుందండీ..పిల్లలు కూడా స్వామిదగ్గరకు వెళ్ళొద్దాము నాన్నా అంటున్నారు..ఇప్పుడు పిల్లలకు పరీక్షలు ఉన్నాయండీ..నేను మాత్రం స్వామివారి కి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను..ఎప్పుడూ ఆదివారం నాడు రాలేదండీ..ఇంత జనం ఉంటారని అనుకోలేదు..అందువల్ల ఉదయం కొద్దిగా కంగారు పడ్డాను.." అన్నాడు.."ప్రసాద్ గారూ మేము మొదటిసారి స్వామివారి సమాధిని గురువారం నాడు దర్శించుకున్నాము..ఆరోజు మధ్యాహ్నం ఇక్కడే స్వామివారి అన్నప్రసాదం తీసుకున్నాము..అలాగే శుక్రవారం నాటి మధ్యాహ్నం కూడా స్వామివారి వద్దే భోజనం చేసాము..ఆ తరువాత రెండు సార్లూ గురువారమే వచ్చాము..ఇక్కడే ప్రసాదం తీసుకున్నాము..మా ఆవిడ గాలిచేష్ట పూర్తిగా పోవడానికి మేము గురువారం నాడు రావడం కూడా ఒక కారణం అని అనిపిస్తోంది..అందువల్ల ప్రతి సంవత్సరం ఒక గురువారం అన్నదానానికి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాను..వచ్చే గురువారం నాడు నాకు ఆ అవకాశం ఇవ్వండి.." అన్నాడు..


"అలాగేనండీ..సంవత్సరం లో మొత్తం 52 గురువారాలు..52 మందిని ఎంపిక చేసుకొని..వాళ్ళ సహకారం తో అన్నదానం చేయించాలని ఒక సంకల్పం మీవల్ల కలిగింది..అలాగే శుక్రవారాలు కూడా..చూద్దాం..స్వామివారు కృప చూపితే..అది కూడా సాకారం అవుతుంది.." అన్నాను.."అలా అయితే..ఒక శుక్రవారం కూడా మా కొఱకు కేటాయించండి.." అన్నాడు ఏడుకొండలు..


ఏడుకొండలు సంసారం బాగు పడింది..అంతేకాక..ఏడుకొండలు ద్వారా కొత్త ప్రతిపాదన రూపుదిద్దుకుంది..ఇక అమలు చేయడానికి సన్నద్ధం కావాలి..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

షష్టిపూర్తి ఘనంగా

 🙏🙏🙏🙏🙏

పెళ్లి సాధారణంగా జరగాలి షష్టిపూర్తి ఘనంగా జరగాలి.

     

కొంచం వీలు కల్పించుకొని ప్రతిఒక్కరూ తెలుసుకోవలసిన విషయం.


1. మానవుని  సంపూర్ణ ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని జ్యోతిష్య శాస్త్రం  చెబుతున్నది. 


2. 60 సంవత్సరాలు నిండినప్పుడు  చేసుకునేది షష్టిపూర్తి.

3. ప్రతివారికీ మృత్యువు 60 వ యేట ఉగ్రరథుడు అను పేరుతో , 70 వ యేట భీమరథు డు అను పేరుతో, 78 వ యేట విజయరథు డు అను పేరుతో ఎదురుచూస్తుంటాడు.

      ఎక్కువ మంది ఈ సంవత్సరం లలో గండం...

4. ఆరోగ్య సమస్యలకు తట్టుకోవటానికి  చేసే శాంతి ప్రక్రియ షష్టిపూర్తి.


5.బృహస్పతి , శని 30 సంవత్సరాలకు  మానవుని జన్మకాలంలో ఉన్నరాశికి చేరటానికి 60 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళిద్దరూ తాము బయలుదేరిన రాశికి చేరుకోవటంతో మానవుని జీవితం మరలా ప్రారంభమవుతుంది. తిరిగి జీవితం ప్రారంభం ఐనట్లు సంకేతం.


6. మానవుడు పుట్టిన  తెలుగు సంవత్సరాలు (60) నిండుతాయి కనుక షష్టిపూర్తి. 


7. షష్టిపూర్తి  సందర్భంగా  ఆయుష్కామన యజ్ఞము చేస్తారు. ఆయువును కోరి చేయు యజ్ఞము ఆయుష్కామనయజ్ఞము అని అంటారు.


8. పెద్దలు ఈ ఆయుష్కామన యజ్ఞాన్ని చేసే పధ్ధతిని ఇలా చెప్పారు.


9. ‘’  తెల్లని నూతన వస్త్రముపై తూర్పు దిక్కుగా 12 గీతలు గీచి వాటిమీద అయిదు గీతలు గీసి మొత్తము 60 గదులు వచ్చే విధంగా చేస్తారు . వరుసకు 12 అయిదు వరుసలు తూర్పు దిక్కున బియ్యం పోసి కలశం ఉంచుతారు. ప్రభవ నుంచి క్షయ వరకు 60 సం " అధిదేవతలతో ఆవాహన చేస్తారు. దక్షిణాయన ఉత్తరాయణ దేవతలను, 6 ఋతువులను 12 మాసములను ఆవాహన చేస్తారు. పక్షములను,తిదులను వారములను - వారదేవతలు అయిన - సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని ని ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు - అగ్ని, జలము , భూమి, విష్ణువు ఇంద్రుడు, ప్రజాపతి లని ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు శివుడు, దుర్గ, కుమారస్వామి, బ్రహ్మ - ఇంకా ఏకాదశ రుద్రులు, నక్షత్ర దేవతలు 27 యోగములు 11 కరణములు ఇలా అందరి దేవి దేవతా స్వరూపాలని మృత్యుంజయుని ఆవాహన చేసి బ్రాహ్మణోత్తములు మంగళాచరనములతొ వేదయుక్తంగా ఈ కార్యక్రమం జరిపిస్తారు. అపమృత్యు నివారణార్థం హోమాల్ని, జపాలని కుడా చేస్తారు.తదుపరి బ్రహ్మలను సత్కరించి బంధుమిత్రులతో విందు ఆరగిస్తారు. 


10. పూర్వకాలంలో  పురుషుడు ఏ వేడుక చేసుకున్నా భార్యకు కూడా జరగినట్టే   భావించేవారు కనుక  స్త్రీలకు మళ్ళీ విడిగా షష్టిపూర్తి చేసే ఆచారంలేదు.


11.పెళ్లి సాధారణంగా జరగాలి. షష్టిపూర్తి ఘనంగా జరగాలని పెద్దల మాట. ఎందుకంటే షష్టిపూర్తి దృఢమైన   ఆత్మీయతల సుగంధం పరిమళించే సందర్భం కనుక.


12.బిడ్డలు తమ కృతజ్ఞతను తమ తల్లిదండ్రులకు  అర్పించుకొనే అపురూప సందర్భం  షష్టిపూర్తి.

 గమనిక:- షష్ఠి పూర్తి మాకు ఆచారం లేదండి...... అనేది అవాస్తవం. నిరభ్యంతరంగా అందరూ తమ శక్తి కొలది చేసికోవాలి.

🙏🙏🙏🙏🙏