6, మార్చి 2021, శనివారం

మొగలిచెర్ల

 *గాలిచేష్ఠ..గురువారం దర్శనం..*


"స్వామివారి సమాధి దర్శించుకొని..ఒక్కసారి ఆ అవధూత పాదుకులకు నమస్కారం చేసుకొని వెళ్లిపోతానండీ..ఆ ఒక్క కోరికా తీర్చండి చాలు.." అని ఆ మధ్యవయస్కుడు నన్ను ప్రాధేయపడుతూ అడిగాడు.."మీరేమీ కంగారు పడకండి..మంటపం లోపల సుమారు ఇరువై మంది స్వామివారి సమాధి దర్శనం కొఱకు వేచి వున్నారు..వాళ్లకు అర్చన కూడా చేయించాలి..వరుసక్రమం లో మా సిబ్బంది పంపుతున్నారు..మీరూ లోపలికి వెళ్లి కూర్చోండి..మిమ్మలనూ పంపుతారు..మీ వంతు రాగానే అర్చకస్వామితో సమాధి దర్శనం కొఱకు వచ్చానని చెప్పండి..వారు మిమ్మల్ని స్వామివారి సమాధి వద్దకు పంపుతారు.." అని చెప్పాను.."అలాగేనండీ..మరొక్కమాట..నేను బైటకు వచ్చిన తరువాత మీతో కొన్ని విషయాలు చెప్పుకోవాలి..నాకోసం ఓ పదినిమిషాల సమయం కేటాయించండి.." అన్నాడు.."అలాగేనండీ.." అన్నాను..


ఆరోజు ఆదివారం..ఆదివారం ఉదయం పది గంటల దాకా స్వామివారి సమాధి దర్శించుకునే భక్తుల హడావిడి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది..ఆ సమయం లోనే పై వ్యక్తి తో సంభాషించాల్సి వచ్చింది..మరో గంట గడిచిపోయింది.."ప్రసాద్ గారూ..మీ సిబ్బంది సహకారం తో చక్కగా దర్శనం చేసుకున్నాను..స్వామివారి పాదుకలూ తాకి నమస్కారం చేసుకున్నాను..తృప్తిగా వుందండీ..ఇప్పుడు మీతో మాట్లాడొచ్చా..?" అని అతను అడిగాడు.."చెప్పండి.." అన్నాను..


"నా పేరు ఏడుకొండలు..నెల్లూరు లో చిన్న వ్యాపారం పెట్టుకొని వున్నాను..నా కుటుంబపోషణకు ఇబ్బంది లేదు..ఇద్దరు పిల్లలు..పెద్దది అమ్మాయి..ఇంటర్ చదువుతున్నది..రెండోవాడు అబ్బాయి తొమ్మిదో తరగతి..మా అమ్మా నాయనా కూడా మాతోనే వుంటారు..అందరం కలిసున్నాము..గత రెండేళ్లుగా మా ఆవిడ ప్రవర్తన లో మార్పు వచ్చిందండీ..ఉన్నట్టుండి కేకలు పెడుతుంది..ఏడుస్తుంది..క్రింద పడి దొర్లుతుంది..మళ్లీ ఒక గంట లోపల మామూలు గా మారిపోతుంది..ఏమీ అర్ధం కాలేదు..డాక్టర్ వద్దకు తీసుకెళ్ళాను..పరీక్షలు చేశారు..మానసిక వైద్యం చేయించాలి అన్నారు..అదీ చేయించాను..ఫలితం కనబడలేదు..ఏం చేయాలో దిక్కు తోచలేదు..పిల్లలు, నేను, మా అమ్మా నాన్న..అందరమూ అల్లాడిపోతున్నాము..పిల్లల చదువు దెబ్బతింటున్నది..ఆరునెలల క్రితం నా స్నేహితుడు నారాయణరెడ్డి అనే అతను, ఒక్కసారి మొగిలిచెర్ల వెళ్లి  ఆ దత్తాత్రేయ స్వామి వారి సమాధి వద్ద మొక్కుకో..ఇటువంటి గాలి చేష్టలన్నీ త్వరగా తగ్గుతాయి అని చెప్పాడు..చివరి ప్రయత్నం అనుకున్నాను..ఒక గురువారం పొద్దున్న మేమందరం నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చి..స్వామివారి సమాధి దర్శనం చేసుకొన్నాము..ఆరోజు మీరు లేరు..ఆ రాత్రికి ఇక్కడే మంటపం లో నిద్ర చేసాము..రోజూ మా భార్యలో ఒక్కసారి కనబడే ఆ విపరీత ప్రవర్తన..ఆరోజు దాదాపు మూడు నాలుగు సార్లు కనబడింది..తెల్లవారి శుక్రవారం నాడు కూడా ఇక్కడే ఉన్నాము..స్వామివారి సమాధి మందిరాన్ని శుభ్రం చేస్తుంటే..నేనూ పాల్గొన్నాను..శుక్రవారం నాడు కూడా అదే తంతు..ఆ సాయంత్రం మేము తిరిగి నెల్లూరు వెళ్లిపోయాము..వెళ్లేముందు స్వామివారి విభూతి తీసుకొని వెళ్ళాను..ఇంటికి వెళ్లిన తరువాత ఒక వారం పాటు నరకం చూసాము..నా భార్య జబ్బు తగ్గకపోగా..ఇంకా పెరిగింది..స్వామివారి విభూతి ఆమె నుదుటిపై పెట్టాను..చిత్రంగా ఒక్క అరగంటలో మామూలు మనిషి అయింది..నాకు ఆ విభూతి పై గురి కుదిరింది..రోజూ పెట్టుకోమని చెప్పాను..మొదటి వారం మమ్మల్ని ఎంత ఏడిపించిందో..ఆ మరుసటి వారం ఒక్కసారి కూడా తన గాలి చేష్ట కనబడలేదు..పూర్తిగా స్వామినే నమ్ముకున్నాము..ఆ తరువాత ఆమెను తీసుకొని రెండుసార్లు వచ్చి వెళ్ళాను..ఇప్పుడు తాను మామూలు గా వుందండీ..పిల్లలు కూడా స్వామిదగ్గరకు వెళ్ళొద్దాము నాన్నా అంటున్నారు..ఇప్పుడు పిల్లలకు పరీక్షలు ఉన్నాయండీ..నేను మాత్రం స్వామివారి కి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను..ఎప్పుడూ ఆదివారం నాడు రాలేదండీ..ఇంత జనం ఉంటారని అనుకోలేదు..అందువల్ల ఉదయం కొద్దిగా కంగారు పడ్డాను.." అన్నాడు.."ప్రసాద్ గారూ మేము మొదటిసారి స్వామివారి సమాధిని గురువారం నాడు దర్శించుకున్నాము..ఆరోజు మధ్యాహ్నం ఇక్కడే స్వామివారి అన్నప్రసాదం తీసుకున్నాము..అలాగే శుక్రవారం నాటి మధ్యాహ్నం కూడా స్వామివారి వద్దే భోజనం చేసాము..ఆ తరువాత రెండు సార్లూ గురువారమే వచ్చాము..ఇక్కడే ప్రసాదం తీసుకున్నాము..మా ఆవిడ గాలిచేష్ట పూర్తిగా పోవడానికి మేము గురువారం నాడు రావడం కూడా ఒక కారణం అని అనిపిస్తోంది..అందువల్ల ప్రతి సంవత్సరం ఒక గురువారం అన్నదానానికి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాను..వచ్చే గురువారం నాడు నాకు ఆ అవకాశం ఇవ్వండి.." అన్నాడు..


"అలాగేనండీ..సంవత్సరం లో మొత్తం 52 గురువారాలు..52 మందిని ఎంపిక చేసుకొని..వాళ్ళ సహకారం తో అన్నదానం చేయించాలని ఒక సంకల్పం మీవల్ల కలిగింది..అలాగే శుక్రవారాలు కూడా..చూద్దాం..స్వామివారు కృప చూపితే..అది కూడా సాకారం అవుతుంది.." అన్నాను.."అలా అయితే..ఒక శుక్రవారం కూడా మా కొఱకు కేటాయించండి.." అన్నాడు ఏడుకొండలు..


ఏడుకొండలు సంసారం బాగు పడింది..అంతేకాక..ఏడుకొండలు ద్వారా కొత్త ప్రతిపాదన రూపుదిద్దుకుంది..ఇక అమలు చేయడానికి సన్నద్ధం కావాలి..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: