6, మార్చి 2021, శనివారం

మన మహర్షులు - 41

 మన మహర్షులు - 41


శుక మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷


పరమ పవిత్రమైన భారత బ్రహ్మర్షుల్లో శ్రీశుక మహర్షి చాలా గొప్పవాడు. వేదవ్యాస మహర్షి తపస్సు చేసి పొందిన కొడుకు. శ్రీశుక మహర్షిని పోలిన మహర్షి త్రిభువనాల్లోనూ ఎక్కడ వెదికినా లేడు.


పూర్వం వేదవ్యాస మహర్షి 'కర్ణికారం' అనే వనంలో పరమేశ్వరుణ్ణి గురించి తపస్సు చేసి పంచభూతాలు సమానమైన కొడుకు కావాలని కోరుకుని వరం పొందాడు.


ఆయన కోరుకున్నట్లుగానే ఘ్నతాచి అనే చిలుక రూపంలో వున్న అప్సరస కారణంగా శ్రీశుకుడు పుట్టాడు.


శుక మహర్షి పుట్టినప్పుడు ఆకాశగంగ వచ్చి స్నానం చేయించింది. ఆకాశం నుంచి కృష్ణాజినం, దండం వచ్చాయి. దివ్యదుందుభులు మ్రోగాయి, దేవతలు గానం చేస్తూ, పుష్ప వర్షం కురిపించారు. పార్వతీ సహితంగా పరమేశ్వరుడు వచ్చి ఉపనయం చేశాడు. ఇంద్రుడు కమండలం, దేవతలు ఎప్పుడూ మాయని దివ్య వస్త్రాలు ఇచ్చారు.


శ్రీశకుడికి పుట్టకతోనే వేదాలు వచ్చేశాయి. అయినా బృహస్పతి దగ్గర మిగిలిన విద్యలన్నీ నేర్చుకున్నాడు. 


కొంతకాలం తర్వాత వ్యాసుడు తన కొడుకు శుకుణి మోక్ష మార్గం గురించి తెలుసుకోమని జనక మహారాజు దగ్గరకి పంపించాడు. 


కాని నడిచి మాత్రమే వెళ్ళమని

చెప్పాడు వ్యాస మహర్షి.


తండ్రి చెప్పిన ప్రకారం శ్రీశుకుడు మిథిలా నగరానికి వెళ్ళాడు. ద్వారపాలకులు మొదట లోపలికి పంపించలేదు, తర్వాత పంపారు. 


. జనక మహారాజు మంత్రితో సహా ఎదురొచ్చి అర్హ్య పాద్యాలిచ్చి లోపలికి తీసుకెళ్ళాడు. బంగారు సింహాసనం మీద కూర్చోపెట్టి పూజచేశాడు.


జనక మహారాజుని మోక్షమార్గం గురించి చెప్పమన్నాడు శుక మహర్షి జనకమహారాజు మోక్షమార్గం గురించి విపులంగా శుక మహర్షికి చెప్పి పంపాడు. 


శ్రీశుకుడు తండ్రి వలన కాలావయవ నిరూపణ, చతుర్యుగ ధర్మాలు, బ్రహ్మం దాని విజ్ఞానం, సర్వ వర్ణ ధర్మాలు, దానగుణ ప్రాశస్త్యం, మైత్రి గుణలాభం, ఇంద్రియ నిగ్రహం ఇలాంటివెన్నో నేర్చుకున్నాడు.


తండ్రితో అన్ని విషయాల గురించి చెప్పించుకుని ఆచరించి బ్రహ్మర్షియై వెలిగాడు శుకుడు. ఆత్మజ్ఞానంతో బాహ్య ప్రపంచం మర్చిపోయి శరీరం మీద దుస్తులు కూడా లేకుండా వుండేవాడు.


తక్షకుడి విషంతో ఏడు రోజుల్లో మరణించేలా శాపాన్ని పొందిన పరీక్షిత్తు దగ్గరకి శ్రీశుకుడు వెళ్ళి అతనికి ముక్తి కలిగేలా తన తండ్రి రాసిన భాగవత కథ వినిపించాడు .మిగిలివున్న ఏడు రోజులు వేరేది ఆలోచించక భగవంతుడి యందే మనస్సుంచి ధ్యానం చెయ్యమని చెప్పి పరీక్షిత్తుకు బ్రహ్మలోకం కలిగేలా చేశాడు.


 ఒక రోజు నారద మహర్షి ఆశ్రమానికి వచ్చి శుకుణ్ణి నీకేంకావాలో అడగమన్నాడు 


ఈలోకంలో పుట్టిన నాకు ఏది మంచో చెప్పమన్నాడు శుక మహర్షి.


యోగసిద్ధి మంచిదని నారదుడు చెప్పగానే శుక మహర్షి నారాదునికి ప్రదక్షిణం చేసి తండ్రికి చెప్పి కైలాస పర్వతం మీద తపస్సు చేసి యోగ సిద్ధి పొందాడు.


నారదుడు శ్రీశుకుణ్ణి చూడ్డానికి వెడితే అతనికి ఆత్మయోగం చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోయాడు శుకుడు. మిగిలిన సిద్దులు ఆశ్చర్యపోయారు. అలా వెళ్ళిపోతూ మృగాలికి పక్షులకి, పర్వతాలకి తన తండ్రి వచ్చి శుకా! అని పిలిస్తే ఓయని పలకమని చెప్పాడు శుక మహర్షి.


శుకుడు ఆకాశ గంగ మీద ఆకాశంలో వెడుతూ వుంటే దాంట్లో స్నానం చేస్తున్న స్త్రీలు అతన్ని చూసి సిగ్గుపడలేదు, కాని అదే వ్యాసుడు వెడుతుంటే సిగ్గుపడ్డారు. అది చూసిన వ్యాసుడికి తనని చూసుకుని తనకే సిగ్గనిపించింది. ఎందుకంటే శ్రీశుకుడు పసిబిడ్డ మనసులాంటి మనసున్నవాడు, ఆడ, మగ ఎవరో తెలియనివాడు.


వ్యాసుడు శుకుడు కనిపించక శుకా! అని పిలుస్తే 'ఓ'యని వినిపింపిందిట. ఇంతలో ఈశ్వరుడు వచ్చి బాధపడుతున్న వ్యాసుణ్ణి ఓదార్చి నీకు కావలిసనట్లే నీ కొడుకు చాలా గొప్పవాడయ్యాడు, ఇంకెందుకు బాధపడతావని చెప్పి పంపించాడు.


శుకుడిని మించిన యోగీశ్వరుడు, తత్వజ్ఞుడు,తపస్వి మూడులోకాలలో మరి లేరు..

అంతటి మహానీయ మహర్షికి మనసులోనే పాదాభివందనం చేద్దాం...🙏🙏


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

కామెంట్‌లు లేవు: