12, జనవరి 2025, ఆదివారం

తిరుమల సర్వస్వం 116-*

 *తిరుమల సర్వస్వం 116-*

*తాళ్ళపాక అన్నమాచార్యుడు 4*


 అంటూ పుష్కరిణి మహాత్మ్యాన్ని ప్రస్తుతించాడు. క్షేత్ర నియమానుసారం ఆదివరాహస్వామిని దర్శించుకుని, వెనువెంటనే స్వామివారి ఆలయం చేరుకున్నాడు. ముందుగా మహాద్వార గోపురానికి చేయెత్తి నమస్కరించి, *"నీడ తిరగని చింతచెట్టు"* ను సందర్శించుకుని, *గరుడగంభాన్ని* ఈ విధంగా సేవించుకున్నాడు:


*గరుడగంభము కాడ కడు బ్రాణాచారులకు* 

*వరము లొసగేని శ్రీ వల్లభుడు*


 *తిరుమలేశుని దర్శనం* 


 గరుడగంభాన్ని సేవించుకుని, బంగారువాకిలి చెంత నిలచి, ఆనందనిలయంలో కొలువై ఉన్న శ్రీవారి దివ్యమంగళ విగ్రహాన్ని తొలిసారిగా దర్శించుకుంటూ, ఆనంద పారవశ్యంతో శేషాచల శిఖరాన్ని, శ్రీవారి మూర్తిని ఈ విధంగా కీర్తించాడు:


*ఇప్పుడిటు కలగంటి - నెల్లలోకములకు -*

*అప్పడగు తిరువేంక - టాద్రీశు గంటి ||* 

*అతిశయంబైన శే- షాద్రి శిఖరము గంటి* 

*ప్రతిలేని గోపుర - ప్రభలు గంటి* 

*శతకోటి సూర్య తే - జములు వెలుగగ గంటి* 

*చతురాస్యు బొడగంటి – చయ్యన మేల్కొంటి ||*


 ఈ కీర్తనలో మహోన్నతమైన శేషాచల శిఖరాన్ని, ఆనందనిలయ గోపుర కాంతులను, రత్నఖచితమైన బంగారువాకిళ్ళను, దేదీప్యమానంగా వెలుగుతున్న దీపసమూహాన్ని, కనకాంబరధారియైన స్వామివారిని, శంఖుచక్రాలను, కటి, వరద హస్తాలను కళ్లకు కట్టినట్లు వర్ణించాడు.


‌తరువాత ఆలయంలోని ఇతర దేవతలను, మంటపాలను, తిరుమలక్షేత్రం లోని సమస్త తీర్థాలను, గోపురాలను, వైభవోపేతంగా జరిగే ఉత్సవాలను దర్శించుకుని వాటి విశేషాలను ఈ విధంగా పదబంధం చేశాడు -


*కంటి నఖిలాండతతి కర్తనధిపుని గంటి* 

*కంటి నఘములు వీడికొంటి నిజమూర్తి గంటి ||* 

*మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి* 

*బహు విభవముల మంటపములను గంటి.... ||*


 *కటాక్షించిన స్వామివారు* 


 ఇలా నిత్యం స్వామివారిని సేవిస్తున్న అన్నమయ్య ఒకనాడు ఆలయ సమీపానికి చేరుకోగానే, కాస్త సమయాతీతం కావటంవల్ల బంగారువాకిళ్ళు మూసి వేయబడ్డాయి. ఆరోజు శ్రీవారి దర్శనం కలుగక పోవడంతో విచారించిన అన్నమయ్య - స్వామి వారిని కీర్తిస్తూ, తనకు దర్శనభాగ్యం ప్రసాదించమని రాగయుక్తంగా వేడుకొన్నాడు. అంతే! పరమాశ్చర్యంగా, తాళాలు ఊడిపడి బంగారువాకిళ్ళు తెరుచుకున్నాయి. ఈ సంఘటనతో అన్నమయ్య భక్తిప్రపత్తులను గుర్తెరిగిన అర్చకస్వాములు ఆయనను సాదరంగా తోడ్కొనివెళ్లి శ్రీవారి దర్శనం చేయించి, తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. హద్దులెరుగని ఆనందంతో శ్రీవారిని స్తుతిస్తూ ఒక పద్యశతకాన్ని ఆశువుగా చెప్పాడు అన్నమయ్య! పులకించి పోయిన స్వామివారు తన ఆనందాన్ని వ్యక్తపరచినట్లుగా, మూలమూర్తి మెడలోని ఓ ముత్యాలహారం జారి స్వామి పాదాలపై పడింది. అర్చకస్వాములు దాన్ని అన్నమయ్యకు ప్రసాదంగా బహూకరించారు.


 *"అన్నమాచార్యుని" గా మారిన అన్నమయ్య* 


 తిరుమలలో *"ఘనవిష్ణుయతి'* అనే ఒక వైష్ణవగురువుకు స్వామివారు స్వప్నంలో కనిపించి, వేంకటాచల వీధుల్లో పాటలు పాడుకుంటూ పరిభ్రమిస్తున్న అన్నమయ్య రూపురేఖలను వర్ణించి చెప్పి, అతనికి వైష్ణవమతాన్ని ప్రసాదించమని ఆదేశించి, తన శంఖు-చక్ర ముద్రలను ప్రసాదించారు. ఆ గురువుగారు, శ్రీవారి ఆదేశానుసారం, తిరుమలవీధుల్లో తిరుగాడుతున్న అన్నమయ్యను గుర్తించి అతనికి వైష్ణవమతాన్ని ముద్రాంకితంగా ప్రసాదించారు. ఆ క్షణం నుంచి అన్నమయ్య, *"అన్నమాచార్యుని"* గా వినుతికెక్కారు


 *అన్నమయ్య వివాహం* 


 అటు, తాళ్లపాకలో అన్నమయ్య హఠాత్తుగా అదృశ్యం కావటంతో ఊరూ వాడ వెదకి విసిగి వేసారిన అన్నమయ్య తల్లిదండ్రులు చిక్కిశల్యమై మంచాన పడ్డారు. అతని ఆచూకీ కోసం వారి కులదైవమైన చెన్నకేశవుణ్ణి వేడుకున్నారు. చుట్టుప్రక్కల ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ గాలించి, చివరి ప్రయత్నంగా తమ పుత్రుణ్ణి తమకు తిరిగి ప్రసాదించమని ఆ శ్రీనివాసుణ్ణి వేడుకోవడం కోసం తిరుమల క్షేత్రం చేరుకున్నారు. 


 శ్రీవేంకటేశ్వరుని సన్నిధిలో పాటలు పాడుకుంటూ తిరుగుతున్న అన్నమయ్యను చూసి, ఆ దంపతులకు పుత్రోత్సాహం పెల్లుబికింది. స్వగృహానికి తిరిగి రావలసిందిగా అన్నమయ్యను బ్రతిమాలుకున్నారు. స్వామివారి చరణాలను వీడి రానంటూ భీష్మించిన అన్నమయ్యకు శ్రీవారు స్వప్నంలో సాక్షాత్కరించి తల్లిదండ్రుల మనస్సు కష్టపెట్టరాదని, వారు కోరినట్లు ఇంటికి తిరిగి వెళ్లి గృహస్థాశ్రమం స్వీకరించమని, దానివల్ల తన కటాక్షం మరింతగా సిద్ధిస్తుందని నచ్చజెప్పారు. దాన్ని సుగ్రీవాజ్ఞగా భావించిన అన్నమయ్య, తల్లిదండ్రులతో కలిసి స్వగ్రామానికి చేరుకున్నాడు.

గేయాలు, కీర్తనలు, శతకాలతో స్వామి వారిని నిత్యం కీర్తిస్తూ కొంతకాలం గడిపిన తర్వాత, అన్నమయ్యకు *అక్కలమ్మ-తిరుమలమ్మ* అనే ఇరువురు కన్యలతో వివాహం జరిగింది.

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: