12, జనవరి 2025, ఆదివారం

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..*


*ఉపోద్ఘాతం..*


శ్రీ దత్తాత్రేయ స్వామివారి జీవిత చరిత్ర వ్రాసేటప్పుడు మా తల్లిదండ్రులు శ్రీ పవని శ్రీధరరావు, నిర్మల ప్రభావతి గార్ల అనుభవాలను ప్రస్తావించడం జరిగింది..నాకు శ్రీ స్వామివారితో పరిచయం ఏర్పడ్డ నాటినుంచి, శ్రీ స్వామివారు కపాలమోక్షం పొందేదాకా..ఆ తదుపరి నేను శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి ధర్మకర్తగా బాధ్యతలు తీసుకునే దాకా..అప్పటినుండి నేటిదాకా..నా పరంగా శ్రీ స్వామివారితో గల అనుభవాలను..మా దంపతులము పొందిన అనుభూతులనూ..నేటి నుంచి ధారావాహికంగా ఈ సోషల్ మీడియా అనబడే మాధ్యమం ద్వారా అందించాలనే ప్రయత్నమిది.. ఆదరిస్తారని ఆశిస్తున్నాను..


గురువారం...1972, మే, 11 వతేదీ...


ఆరోజు ఉదయం 6.30 గంటలకు మా అమ్మా నాన్న గార్లు, (శ్రీ పవని శ్రీధర రావు, నిర్మల ప్రభావతి గార్లు) మాలకొండ వెళ్ళడానికి తయారవుతూ..అక్కడ తపస్సు చేసుకుంటున్న యోగి గురించి , వేసవి సెలవులకు మా ఊరొచ్చిన నాకూ, మా చెల్లెలు గాయత్రికీ ఎంతో గొప్పగా చెప్పారు..


ఎలాగూ గూడు బండి సిద్ధం చేసారు.. మేమూ వస్తామని చెప్పాము..వాళ్ళూ మమ్మల్ని స్వామి వద్దకు తీసుకెళ్లాలని అనుకున్నారు కనుక వెంటనే మమ్మల్నీ తయారవమని చెప్పారు..


ఇంతలో..కందుకూరు నుంచి తహసీల్దారు గారు మొగలిచెర్ల వస్తున్నారనీ, నాన్న గారిని ఇంటి వద్దే ఉండమన్నారనీ ఓ మనిషి వచ్చి చెప్పాడు..కొద్దిగా నిరాశ..రెండురోజుల్లో మళ్ళీ వెళదామని నాన్న చెప్పారు..సరే నన్నాము..


నాకెందుకో నడచి అయినా వెళ్లి చూసొద్దామని(దాదాపు 8కిలోమీటర్ల దూరం) అనిపించింది..అదే మాట నాన్నగారిని అడిగాను..నవ్వారు..నీ ఇష్టం అన్నారు..అమ్మే కోప్పడింది.."ఎండాకాలం..అంతదూరం నడిచి పోతావా..మళ్ళీ బెట్ట కొట్టి అడ్డంపడితే ఎలా" అంటూ..ఏం కాదులేవే..అని చెప్పాను..మొత్తానికి ఒప్పుకున్నది.. ఓ హార్లిక్స్ సీసా నిండా మజ్జిగ పోసిచ్చింది..


"ఇదుగో..ఆయన మౌనం లో వుంటే, నువ్వు ఏమీ మాట్లాడకు..చూసి, నమస్కారం పెట్టుకుని వచ్చేయ్.."అంటూ బోలెడు జాగ్రత్తలు చెప్పింది..అన్నిటికీ తలూపాను..వచ్చేటప్పుడు ఎండకుపయోగపడుతుందని టవల్ కూడా తీసుకున్నాను..అమ్మకు, నాన్నకు చెప్పి ఇంట్లోనుంచి బైటకు వచ్చాను..


పక్కింట్లో ఉండే నా స్నేహితుడు, వెంకట్రాముడిని కేకేసాను..వచ్చాడు..ఇలా అని చెప్పి వస్తావా అన్నాను...వెంటనే రైటో అన్నాడు..


"బావా మళ్లీఎప్పుడొస్తాము?" అన్నాడు..


"చెప్పలేము..ఆయన కనపడే దాకా ఉండాలి కదా!" అన్నాను..(వాడు ఇప్పటికీ నన్ను బావా అంటాడు..తాగుడుతో భ్రష్టు పట్టాడు..)..


"సాయంత్రానికి గొడ్లు(పశువులు) వచ్చేలోపల తిరిగొద్దాము " అనే ఒప్పందం మీద నాతో రావడానికి తయారయ్యాడు..


అలా నడచుకుంటూ, అడవిలో కబుర్లు చెప్పుకుంటూ..ఇద్దరమూ మాలకొండ లో ఆవలి వైపున ఉండే పార్వతీ అమ్మవారి మఠానికి చేరాము..సమయం దాదాపు తొమ్మిదిన్నరయింది..తలుపులు వేసి ఉన్నాయి..ముందున్న అరుగు మీద కూర్చున్నాము..


10 నిమిషాల లోపే, తలుపుతీసుకుని, ఆరడుగుల పైనే ఎత్తుతో..తెల్లని శరీర ఛాయ తో, దిగంబరంగా చిరునవ్వుతో శ్రీ స్వామివారు బైటకు వచ్చారు..


మమ్మల్ని చూసి...


"ఎవురు మీరు? యాడ నుండి వచ్చినారు" అంటూ పల్లెటూరి యాసతో అడిగారు..మాది మొగలిచెర్ల అనీ, శ్రీధర రావు గారి అబ్బాయిననీ, వీడు వెంకట్రాముడని నా స్నేహితుడనీ చెప్పాను..


"అమ్మా నాయనా బాగుండారా?" అని అడిగారు..తలూపాను..నాకు ఏం మాట్లాడాలో తెలీడం లేదు..ఏదో తెలియని ఆకర్షణ ఆ కళ్ళలో ఉన్నది..ముఖం స్వచ్ఛంగా ఉంది..చల్లటి చిరునవ్వు..


"నన్ను చూద్దామని వచ్చారా?"అన్నారు..ఔనన్నట్లుగా తలూపాను..


ఏం చదువుతున్నదీ, ఎక్కడ చదువుతున్నదీ అడిగారు..అమ్మా నాన్న గార్ల గురించి క్షేమ సమాచారం అడిగారు.చెప్పాను..


పార్వతీ అమ్మవారి విగ్రహం పక్కన ఉన్న కుండ లోంచి ఒక గ్లాసుతో నీళ్లిచ్చారు..తీసుకొని త్రాగాను..


"జాగ్రత్తగా వెళ్ళండి..ఎండ ఎక్కువ కాకముందే ఇల్లు చేరండి!.." అని చెప్పి..పార్వతీదేవి మఠం లోపల ఉన్న అరుగు మీద పద్మాసనం వేసుకొని కూర్చుని కళ్ళుమూసుకున్నారు..


మేమిద్దరమూ ఒకరి ముఖాలు ఒకరం చూసుకొని..అక్కడనుంచి బైటకు వచ్చేసాము..


శ్రీ స్వామివారి సన్నిధిలో దాదాపు ఓ అరగంట పైనే ఉన్నాము..ఒక్క క్షణం కూడా ఆయన దిగంబరి అన్న స్పృహే లేదు..అర్ధమయ్యే జ్ఞానమూ లేదు..


అదీ... మొదటి సారి  స్వామి వారితో నా అనుభవం..అప్పుడు నాకు 12 ఏళ్ళ వయసు...


మళ్ళీ నా 43 ఏళ్ళ వయసులో...ఆ స్వామి వారి మందిరానికి ధర్మకర్తగా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది..ఆనాటి మా తల్లిదండ్రుల ఆశీస్సులే ఇప్పటికీ నాకు రక్షగా ఉన్నాయి...


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్...శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా.. పిన్: 523114...సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: