12, జనవరి 2025, ఆదివారం

11-55-గీతా మకరందము

 11-55-గీతా మకరందము

          విశ్వరూపసందర్శనయోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అ|| దేవుని ఎవరు పొందగలరో వచించుచున్నారు-


మత్కర్మకృన్మత్పరమో మద్భక్తస్సఙ్గవర్జితః | 

నిర్వైరస్సర్వభూతేషు 

యస్స మామేతి పాణ్డవ || 

 

తా:- అర్జునా! ఎవడు నాకొఱకే కర్మలజేయునో (లేక నాసంబంధమైన (దైవసంబంధమైన) కార్యములనే చేయునో), నన్నే పరమప్రాప్యముగ నమ్మియుండునో, నాయందే భక్తిగల్గియుండునో, సమస్తదృశ్యపదార్థములందును సంగమును (ఆసక్తిని, మమత్వమును) విడిచివేయునో, సమస్తప్రాణులందును ద్వేషము లేకయుండునో అట్టివాడు నన్ను పొందుచున్నాడు. 

 

వ్యాఖ్య:- భగవంతుని యెవరు పొందగలరో ఇచట చక్కగ వివరింపబడినది. ఐదు సద్గుణములను వచించి, వాని నెవడుగల్గియుండునో అతడు తప్పక భగవత్సాయుజ్యమును బడయగలడని శ్రీకృష్ణపరమాత్మ పేర్కొనిరి. ‘యః’ అని చెప్పుటవలన ఎవడైనను సరియే ఇట్టి మహోన్నతగుణముల నవలంబించియుండినచో మోక్షభాగుడు కాగలడని స్పష్టముచేయబడినది.  ఇట జాతిమతకుల విచక్షణ యేమియును లేదు. యోగ్యతయే ప్రధానము. ఔషధమును ఎవరు త్రాగినను రోగము నయమగునుగదా! ప్రమిద, తైలము,వత్తి నిప్పుపెట్టె తెచ్చుకొనినచో దీపము ఎవరికైనను వెలుగునుగదా! గీతయందిట్టి విశాల భావములే పలుచోట్ల వ్యక్తీకరింపబడినవి. గీతయొక్క ఔన్నత్యమున కిట్టి సార్వజనిక భావములే కారణములు. 

    ‘మత్కర్మకృత్’ -  దైవసంబంధములగు పూజ, ధ్యాన, జపాదులను గావించువాడు, లేక ఏ కార్యముచేసినను భగవదర్పితముగ జేయువాడు (పాపకార్యములను జేయక సత్కర్మలనే ఈశ్వరార్పణబుద్ధితో నాచరించువాడని అర్థము). అట్టివాడు క్రమముగ చిత్తశుద్ధినిబడసి, భగవత్కృపకు పాత్రుడై, ఆత్మవిజ్ఞానమును బడసి మోక్షమునొందును. జీవితములో మనుజుడు తన దైనందినకార్యముల నెన్నిటినో ఆచరించును. కాని వానినన్నింటిని భగవదర్పితబుద్ధితో చేయుచో అవి దైవపూజగా పరిణమించిపోవును (work changes into worship). అత్తఱి అవి సామాన్యకారణములుగ నుండక మోక్షహేతువులుగ మారిపోవును. కనుకనే భగవంతుని పొందగల్గువారిలో ‘మత్కర్మకృత్’  (నా కొఱకే కర్మలుచేయువాడు, లేక నా సంబంధమైన కర్మలు చేయువాడు) అనునది చేర్చబడెను. 

       ‘మత్పరమః’ - భగవంతునే పరమప్రాప్యముగ, పరమలక్ష్యముగ దలంచి దైవతత్పరుడైయుండువాడు. సామాన్యముగ జనులలో పెక్కురు ప్రాపంచికవిషయములనే పరమగమ్యములుగ భావించి వానికొఱకే అహోరాత్రములు కృషిసలుపుచునుందురు. కాని దృశ్యపదార్థములన్నియు అసద్వస్తువులు, నశ్వరములు కావున అవి బంధవిముక్తిని గలిగింపజాలవు. పరమాత్మయొకడే ఈ ప్రపంచమునందలి సద్వస్తువు, కావున ఆతనినే తనలక్ష్యముగ, గమ్యముగ జీవుడు తలంచి తల్లక్ష్యప్రాప్తికై యత్నించవలెను. అట్టివాడు భగవంతుని తప్పక పొందగలడు. 

    ‘మద్భక్తః’ - పరమానందప్రదుడగు భగవంతునియందే అతిశయభక్తి కలిగియుండవలెనుగాని తదితర పదార్థములందుగాదు. జననమరణములనుండి తప్పించజాలని పదార్థములయెడల భక్తి (ప్రీతి) యున్నచో నేమి ప్రయోజనము? భగవద్భక్తిచే అచిరకాలములో జీవుడు పరమాత్మపదము నొందగలడను సత్య మిచట వచింపబడినది. 

    ‘సఙ్గవర్జితః’ - సంగమనగా ఆసక్తి, దేహాదిదృశ్యపదార్థములందు మమత్వము. అద్దానిని వదలవలెను. అసంగత్వమును అభ్యసించవలెను. అసంగమను పదునైన కత్తితో సంసార (దుఃఖ)వృక్షమును సమూలముగ ఛేదించివేయవలెనని భగవానుడు (గీత 15వ అధ్యాయమున) ఆనతిచ్చియున్నారు. (అసంగశస్త్రేణ దృఢేన ఛిత్వా). తామరాకు నీటిని అంటనట్లు, దృశ్యపదార్థములందు మెలగుచున్నను, విచారణా బలముచే వానితోనంటక, అసంగుడై మెలగువాడు -  అట్టి సంగరాహిత్యమువలన ముక్తిని బడయగలడని యిట పేర్కొనబడినది. 

    ‘నిర్వైరస్సర్వభూతేషు’ -  ఇక ఐదవది సమస్తప్రాణికోట్ల యెడల ప్రేమ, దయ, మరియు ద్వేషరాహిత్యము. ‘సర్వభూతేషు’ అని చెప్పినందువలన ఏ ఒకటి రెండు ప్రాణుల యెడలనో దయగల్గియున్న చాలదనియు, సమస్తభూతకోట్లయెడల కరుణ, దయగలిగియుండవలెననియు తేలుచున్నది. సమస్తప్రాణులు భగవత్స్వరూపులు, నారాయణస్వరూపులు. కనుక ఏ ప్రాణికైనను, అపకారముచేసినచో, దేవుని యెడల అపకారము చేసినట్లే యగును. కాబట్టి నిర్వైరత్వమును లెస్సగ శీలించవలెను. ఈ సత్యమునే ‘అద్వేష్టా సర్వభూతానామ్’ మొదలగు వాక్యముల ద్వారా గీతలో పెక్కుచోట్ల భగవానుడు తెలిపియున్నారు. ఒకప్రక్క ఉపనిషద్వాక్యములను వల్లించుచు, దేవుని పూజాదులను సల్పుచు, వేఱొకప్రక్క ప్రాణికోట్లను దూషించుచు, ద్వేషించుచు, హింసించుచునున్నచో ఆ పూజాదులవలన నేమి ప్రయోజనము?అది ఆచరణ వేదాంతముకానేరదు. మందు తినువాడు పథ్యము కూడ ఆచరించవలెను. పైనతెలిపిన నాలుగు సుగుణములు (మత్కర్మకృత్ - ఇత్యాదులు) మందు వంటివి. ఈ ఐదవ సుగుణమగు సర్వభూతదయ పథ్యమువంటిది. కాబట్టి వానితోబాటు దీనినిగూడ తప్పక అవలంబించవలెను. ఆ నాలుగు సుగుణములలో ప్రతియొక్కటియు ఈ ఐదవ సుగుణముతో చేరియుండవలెను. ఈ ప్రకారముగ భగవద్భక్తి, సర్వభూతదయ కలవాడు తప్పక భగవానుని చేరగలడని (‘మామేతి’) ఈ శ్లోకమందు అసందిగ్ధముగ చెప్పివేయబడెను.

గీతయం  దీశ్లోకము చాల ముఖ్యమైనది. శ్రీశంకరాచార్యులవారున్ను గీత మొత్తము మీద ఈశ్లోకము సర్వోత్కృష్టమైనదని, సారభూతమైనదని తెలిపియున్నారు. ఏలయనిన, దీనియందు అన్నియోగములున్ను సంక్షేపముగ బోధింపబడినవి. మఱియు ఆ అన్నియోగములకు ఆవశ్యకమైన సర్వభూతదయయు పేర్కొనబడినది. ఎట్లనిన - 

మందు:-

(1) నా కర్మలను చేయుము - (మత్కర్మకృత్) - కర్మయోగము 

(2) నా యందు తత్పరుడవైయుండుము (మత్పరమః) - ధ్యానయోగము 

(3) నాయెడల భక్తిగలిగియుండుము (మద్భక్తః) - భక్తియోగము 

(4) దృశ్యపదార్థములయెడల సంగము లేకుండయుండుము - (సఙ్గవర్జితః) - జ్ఞానయోగము .


పథ్యము :-

(5) సమస్తప్రాణులయెడల దయగలిగియుండుము - (నిర్వైరస్సర్వభూతేషు) - భూతదయ.


కాబట్టి సాధకులు ఈ శ్లోకముయొక్క తాత్పర్యమును పదేపదే చింతించుచు, భక్త్యాది సుగుణములుగల్గి పరమాత్మ సాయుజ్యమును ఈ జన్మయందే పొందేలాగున యత్నించవలెను. 

 ప్ర:-  భగవంతుని యెవడు పొందగలడు?

ఉ:- (1) దైవకార్యములు నాచరించువాడు, 

(2) దైవమునే పరమప్రాప్యముగ నెంచువాడు, దైవతత్పరుడై యుండువాడు, 

(3) దైవభక్తుడు, 

(4) సంగరహితుడు, 

(5) సర్వభూతదయగలవాడు - ఇట్టివాడు భగవంతుని పొందగలడు. 

ప్ర:- దీనినిబట్టి భగవత్ప్రాప్తికి ఉపాయములేవియని స్పష్టమగుచున్నది ?  

ఉ:- (1) దైవకార్యముల నాచరించుట, (2) దైవమునే పరమప్రాప్యముగ నమ్ముట, దైవతత్పరుడై యుండుట, (3) దైవభక్తి గలిగియుండుట, 

(4) సంగరాహిత్యము నవలంబించుట, 

(5) సర్వప్రాణులయందు దయ, వైరములేమి గలిగియుండుట. 


ఓమ్ 

ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే 

శ్రీకృష్ణార్జునసంవాదే విశ్వరూపసందర్శనయోగోనామ 

ఏకాదశోఽధ్యాయః


ఇది ఉపనిషత్ప్రతిపాదకమును, బ్రహ్మవిద్యయు, యోగశాస్త్రమును,

శ్రీకృష్ణార్జున సంవాదమునగు శ్రీ భగవద్గీతలందు విశ్వరూపసందర్శనయోగమను 

పదునొకండవ అధ్యాయము 

ఓమ్ తత్ సత్

కామెంట్‌లు లేవు: