12, జనవరి 2025, ఆదివారం

సంపూర్ణ మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము*


*254 వ రోజు*


*ఆరవరోజు యుద్ధం*


ఆరవ రోజు యుద్ధానికి అర్జునిని సూచన మేరకు ధృష్టద్యుమ్నుడు పాండవ సైన్యాలను మకర వ్యూహములో నిలిపాడు. తల ముందు భాగంలో అర్జునుడు, పాంచాలరాజు, కన్నుల భాగంలో నకుల సహదేవులు, నోటి భాగంలో భీముడు అభిమన్యుడు, ఉపపాండవులు, ఘటోత్కచుడు దవడలుగా సాత్యకీ సమేత యుధిష్టరుడు కంఠభాగమున, ధృష్ట ద్యుమ్న సహిత విరాటుడు వెన్నుభాగమున, ఎడమ పక్క కేకయరాజులు, కుడి పక్క దుష్టకేతు, కరూశరాజు, కుంతిభోజ, శతానీకులు జఘన భాగమున శిఖండి, ఇరావంతుడు తోకభాగమున నిలిచారు. ఈ మరవ్యూహమునకు దీటుగా భీష్ముడు క్రౌంచ వ్యూహమును పన్నాడు. తలభాగమున కృతవర్మ సేనలతో నిచిచాడు. ద్రోణుడు, భీష్ముడు ముక్కు భాగమున నిలిచారు. కృపాచార్యుడు, అశ్వథామ కన్నులుగా నిలిచారు. శూరసేనుడితో సహా సుయోధనుడు కడుపుభాగమున నిలిచారు. కాంభోజ బాహ్లికులు కంఠ భాగమున నిలిచారు. సౌవీరుడు వీపు భాగమున నిలిచారు. విందానువిందులు ఏడమ వైపున, సుశర్మ కుడిపక్కన, యవన రాజు, శ్రుతాయువు, భూరి శ్రవుడు తోక వైపు నిలిచారు. యుద్ధం ఆరంభం కాగానే మకర వ్యూహ తలవైపు చొరబడుతున్న ద్రోణుని చూసి భీముడు తన రథాన్ని అతని మీదకు నడిపాడు. భీముని ధాటికి ద్రోణుని ముందు ఉన్న సేనలు పోరి పోవడం చూసి ద్రోణుడు ఉగ్రుడై భీమునిపై క్రూర బాణములు ప్రయోగించాడు. భీముడు ద్రోణుని సారథిని చంపాడు. తానే రథాన్ని తోలుతూ ద్రోణుడు వైరి వీరులను చెండాడు తున్నాడు. ఇది చూసి భీష్ముడు ద్రోణునికి సాయంగా వచ్చాడు. భీష్మద్రోణుల ప్రతాపానికి కేకయ రాజులు భయంతో వెనక్కి తగ్గారు. ఇది చూసిన భీముడు కౌరవ సేనలను చావకొట్టి చాపలా చుట్టి పారేస్తున్నాడు. ధర్మరాజు, సుయోధనులు తమ తమ సేనలను చేతులు ఆడిస్తూ ప్రోత్సాహ పరుస్తున్నారు. ఇరు సేనలు ఉత్సాహంగా పోరుతున్నారు.


*దృతరాష్ట్రుని సందేహం*


ధృతరాష్ట్రుడు యుద్ధ విశేషాలు వింటూ సంజయునితో " సంజయా ! మన సేనలో ఎంతో మంది ఉండి కూడా పాండవులను గెలవ లేక పోవడానికి కారణం ఏమిటి?. ఇది దైవ లీల కాక మరేమిటి? ఇలా జరుగుతుందని విదురుడు ముందే చెప్పాడు. దుర్మార్గుడైన నా కుమారుడు వినలేదు. బుద్ధి కర్మానుసారిణి అన్నారు కదా! " అని విరక్తి చెందాడు. సంజయుడు " మహారాజా ! నీ కుమారుడు తెలియని వాడు. యుక్తా యుక్త వివేచన లేని వాడు. నాడు జూదం ఆడినప్పుడే మనం ఊరుకోకుండా ఆపి ఉంటే ఈ దారుణ యుద్ధం సంబవించేది కాదు కదా ! ఇక పశ్చాతాపం మాని యుద్ధక్రమాన్ని ఆలకించు " అన్నాడు. ఆ సమయంలో భీముడు కౌరవ సేనలోకి చొచ్చుకుని పోతూ దృతరాష్ట్ర కుమారులైన దుశ్శాసనుడు, జయుడు, దుస్సహుడు, జయత్సేనుడు, వికర్ణుడు, చిత్రసేనుడు, చారుమిత్రుడు, సుదర్శనుడు, సువర్ముడు, దుష్కరణుడు ఒకచోట ఉండటం గమనించి రథాన్ని వారి ముందు నిలిపాడు. అది చూసి వారు " అడుగో భీముడు వాడిని అందరం కలసి చంపుతాము రండి " అని తమ సేనలతో ఒక్క సారిగా చుట్టుముట్టారు. భీముడు తన సారథితో చెప్పి రథాన్ని అక్కడే నిలిపి దిగి కాలి నడకన వారిని ఎదుర్కొని యుగాంతమున యమధర్మరాజు వలె కౌరవ సైన్యాన్ని చంపసాగాడు. ఏనుగుల కుంభస్థలములను మోదుతూ, హయములను చంపుతూ రథములను నుగ్గు చేస్తున్నాడు. నేలపై నిలబడి అందరితో ఒక్కడై యుద్ధం చేస్తున్నాడు. ద్రోణునితో యుద్ధం చేసి అలసి పోయిన ధృష్టద్యుమ్నుడు ఆ ప్రదేశానికి వచ్చి భీముని రథం చూసి ఖిన్నుడై సారథిని " భీముడెక్కడ ? అతడు నా బహిర్ప్రాణం అతడు లేక నేను ఉండ లేను " అని అడిగాడు. సారథి " మహారాజా ! అడుగో భీముడు నన్ను ఇక్కడ నిలిపి తాను అక్కడ ఒక్కడే యుద్ధం చేస్తున్నాడు " అని భీముని చూపాడు. ధృష్టద్యుమ్నుడు భీముని చెంతకు వెళ్ళి " భీమసేనా ! నీ పరాక్రమం చూపు నేను కూడా నీకు సాయంగా కౌరవ సేనలను నుగ్గు చేస్తాను " అని కౌరవ సేనలను చేండాడం మొదలు పెట్టాడు. అది చూసిన నీ కుమారుడు " ఈ ధృష్టద్యుమ్నుని వదలకండి చంపండి " అన్నాడు. అది విని అతని సోదరులు ధృష్టద్యుమ్నుని చుట్టుముట్టారు. ధృష్ట ద్యుమ్నుడు తన గురువు ప్రసాదించిన ప్రమోహనాస్త్రం వదిలాడు. నీ కుమారులంతా మూర్చిల్లారు. భీముడు పక్కనే ఉన్న మడుగు వద్దకు వెళ్ళి దాహం తీర్చుకుని ధృష్టద్యుమ్నుని కలుసుకున్నాడు. ధృష్టద్యుమ్నుడు తప్పుకున్న తరువాత పాంచాలరాజు ద్రోణునితో యుద్ధానికి తలపడ్డాడు. ద్రోణుని ధాటికి ఆగలేక పాంచాలరాజు పక్కకు తప్పుకున్నాడు. తన నుండి తప్పుకున్న ధృష్టద్యుమ్నుడు ఎక్కడా అని పరికించి చూడగా కౌరవ సేనలు ప్రమోహనాస్త్రానికి కట్టుబడ్డారని గ్రహించి ప్రజ్ఞాస్త్రాన్ని ప్రయోగించి వారిని విముక్తులను చేసాడు. మూర్చ నుండి తేరుకున్న నీ కుమారులు ద్రోణుని అండ చూసుకుని భీమసేన ధృష్టద్యుమ్నుల మీదకు తిరిగి ఉరికారు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: