20, అక్టోబర్ 2021, బుధవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*465వ నామ మంత్రము* 20.10.2021


*ఓం కాంతిమత్యై నమః*


తేజోవంతమయిన అవయవసంపదతో అలరారు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కాంతిమతీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం కాంతిమత్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తులకు ఇహపరదాయకమైన శాంతిసౌఖ్యములు సంప్రాప్తమగును.


*సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్|*


*పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీమ్ సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికామ్॥*


అమ్మవారు సిందూరం మాదిరిగా ఎర్రనైన శరీరంతో, మూడు కన్నులతో, తారానాయకుడైన చంద్రుణ్ణి మాణిక్యకిరీటమునందు ధరించి, చిఱునగవుతో కూడిన ముఖంతో, ఉన్నతమైన వక్షస్థలంతో, చేతులలో మద్యంతో నిండిన రత్నభాండాన్ని, ఎర్రని కలువను ధరించి, సౌమ్యమైన రూపంతో రత్న ఘటమందున్న ఎర్రని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ధ్యానించాలి తప్ప ఆ తల్లి తేజస్సును గాని, సౌందర్యమునుగాని వర్ణించడానికి నేను *(పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం)* ఎంతటి వాడను. ఆ తల్లి పాదాలను కూడా తదేకంగాచూచి భక్తిపారవశ్యంతో ధ్యానించడానికి కూడా అర్హత చాలని వాడను. 


ఆ అమ్మను కనులుమూసుకొని, నాకు సాధ్యమైనంతవరకే ఆ తల్లి రూపాన్ని మనోనేత్రాలలో చిత్రించుకోగలను తప్ప *(ఉద్యద్భాను సహస్రాభా* యని లలితా సహస్ర నామావళి యందు ఆరవ నామ మంత్రంలో ఉదయించుచున్న వేయి (అనంతకోటి) సూర్యుల కాంతితో తేజోమయరూపంతో ఉన్న పరమేశ్వరిని స్తుతింపబడిన) ఆ తల్లి తేజస్సును చూడగలనా?


పరబ్రహ్మస్వరూపిణి. నారాయణి. శివాని. ఆ తల్లి సర్వదేవతా స్వరూపిణి. *సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవిత* గా (లక్ష్మీ, వాణిలు ఆ తల్లి తనకు ఇరువైపులా నిలచి వింజామరలు వీచువైభవంతో) భాసిల్లు తల్లి. అనంతకోటి జీవరాశులలో తేజోమయిగా విలసిల్లే మూలప్రకృతి స్వరూపిణి. ఆ తల్లి తేజస్సును చూడాలన్నా, ఆస్వాదించాలన్నా కేవలం కామేశ్వరునికి మాత్రమే సాధ్యమగును గనుకనే అమ్మవారు *కాంతిమతీ* యని అనబడినది. 


అటువంటి పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం కాంతిమత్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: