5, సెప్టెంబర్ 2024, గురువారం

దేవాలయాలు - పూజలు 31*

 *దేవాలయాలు - పూజలు 31*

🙏🙏(చివరి భాగము)🙏🙏


సభ్యులకు నమస్కారములు.


పూజాదులను మరియు దేవాలయాలను *యథాలాపంగా చూడకుండా భక్తి, శ్రద్ద,  నియమ, నిష్ఠ, నిబద్ధతతో  మరియు నిర్దేశింపబడిన ఆచారాలను పాటిస్తూ భగవత్ కృపకు పాత్రులు కావడం మానవాళి ప్రథమ కర్తవ్యం*  పూజలు మరియు ఇతర భగవత్ ఆరాధనా విషయాలను, కార్యక్రమాలను ఆషామాషీగా తీసుకోనరాదు. *శ్రీ మదఖిల చరా చరాత్మక వస్తువిస్తారానికి, ప్రాణి కోటికి మూల హేతువైన "ప్రరబ్రహ్మానికి" సృష్ఠి యావత్తు ఎల్లప్పుడూ ఋణపడియే ఉంటుంది*. పూజాదికాల ద్వారా భగవత్ అనుగ్రహం పొందడం విశ్వ కళ్యాణానికి ఒక మార్గం. 


భగవద్ అనుగ్రహం కొరకు హైందవ ధర్మం ఎన్నో మార్గాలు సూచించి  యున్నది. ధర్మ మార్గాలైన పూజలు పునస్కారాలలో  *దినవారి పూజలే గాకుండా అన్ని సందర్భాలకు, అన్ని వర్గాల (స్త్రీ, పురుష, బాల, బాలికలకు) తగిన కార్యక్రమాలు సూచించ బడినవి. ఇందులో కొన్ని మహిళలకు మాత్రమే, కొన్ని పురుషులకు మాత్రమే, మరికొన్ని చిన్న వయసుల వారికి, మరికొన్ని కుటుంబ సహితంగా ఆచరించ దగినవి*  మహిళా పూజల విభాగంలో కొన్ని  *నోములు, వ్రతములు లాంటి పూజలు తమ వ్యక్తి గత క్షేమము, సౌభాగ్య లబ్ధికి మాత్రమే పరిమితం గాకుండా ఆ ప్రభావము తమ సన్నిహితులు అనగా తమ కుటుంబంతో పాటు  సోదర సోదరీమణుల  సంక్షేమానికి గూడా ఉపకరిస్తాయి.*.*తిథి, వార, నక్షత్రాలను బట్టి గూడా వివిధ పూజలు నిర్దేశించ బడినవి* 

*నిత్యోత్సవ*....

*వారోత్సవ*.....

*పక్షోత్సవ*....

*పవిత్రోత్సవ*

*సంవత్సరోత్సవాః*...

భూయాసురితి భవంతో మహాంతో అనుగృహ్ణన్తు...

అని భగవంతుని మనం నిత్యం వేడుకునే 

 *శ్రీ నివాసగద్యం*

మనకందరికీ పరమ ప్రమాణం.


నిర్దేశించబడిన పూజలు కొన్ని దారిద్ర్య నాశనం,  కొన్ని *ఆధ్యాత్మిక ,ఆధిదైవిక*,

*ఆధి భౌతిక తాపత్రయ నివారణార్థంగా*  భగవత్ కార్యాలు రాబోయే ఆపద నివారణలు, మరికొన్ని గ్రహ దోషాలను హరిస్తాయి, మరి కొన్ని ప్రకృతి ప్రకోపాలను, వైపరీత్యాలను శాంతింప జేస్తాయి, ఇంకొన్ని మానవ మరియు విశ్వ కళ్యాణానికి తోడ్పడుతాయి. అవసరమైనప్పుడు పూజా క్రమం *అంగన్యాస కరన్యాస యుక్తంగా కూడా ఉంటుంది*. 


పూజలలో కొన్నిటిని ఉదాహరణగా  తెలుసుకుందాము:- *నోములు*

 కళ్యాణ గౌరీ, ధైర్య గౌరీ, బొమ్మల నోము, పదహారు కుడుముల నోము. *వ్రతాలు* కేదారేశ్వర వ్రతం, గౌరీ వ్రతం,

 శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, అష్టాక్షరీ మహా వ్రతం. *అర్చనలు* కవచ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అమ్మ వార్లకు కుంకుమ అర్చనలు, *యజ్ఞాలు*  తులసి యజ్ఞాలు, స్వాధ్యాయ మహా పుష్కర ప్రయుక్త బ్రహ్మ యజ్ఞము, అధర్వ యజ్ఞము, గో జప మహా యజ్ఞం, 

శ్రీ మద్భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞము, జ్ఞాన గీతా యజ్ఞాలు. *యాగములు* మహా రుద్ర సహిత సహస్ర చండీ యాగము, శ్రీ మహా రుద్ర సహిత చండి, రాజ శ్యామల యాగము, శత చండీ యాగము, ఆయుత శత చండీ యాగము, తిరుమల పుష్ప యాగము. *హోమాలు* సుదర్శన హోమము, మహా మృత్యుంజయ హోమము, నవ గ్రహ నక్షత్ర హోమము, ఆండాళ్ అమ్మ వారికి ఉంజల్ సేవా హోమము. *కల్యాణాలు* శ్రీ సీతా రామ కళ్యాణం, పార్వతీ కళ్యాణం. *పారాయణాదులు* 

లలితా సహస్ర నామ పారాయణం, 

శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ, 

శ్రీ భగవద్ గీతా పారాయణము, సుందరాకాండ పారాయణము, 

నిత్య పారాయణలు కూడా ఉంటాయి. *ఉత్సవాలు* శుక్రవారోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, పార్వేట ఉత్సవం (తిరుమల), తెప్పోత్సవాలు. *మంత్ర జపాలు* శ్రీ గాయత్రీ, నారాయణ, శివ పంచాక్షరీ,

 శ్రీ రామ, శాంతి, దశ మహా విద్యలకు సంబంధించిన మంత్రాలు.ఇలా ఎన్నో.... ఎన్నెన్నో .... అన్నీ మానవ శ్రేయస్సును కోరేవే....*స్థలాభావము వలన ఇంకా వివరాలు అందజేయలేని పరిస్థితి*. 


భగవత్ సంబంధమైన *పూజలు* అను పదంతో బాటు *పునస్కారాలు* అను పదము కూడా విడదీయరానిది. పూజలు అంటే సర్వత్రా విదితమే. *పునస్కారము* అర్థము పరిశీలిస్తే  మానసిక నివేదన, తెలియజేయట అని చెప్పబడినది. పూజల అనంతరం భగవంతుడికి మన అంతరంగం నివేదించవలసి ఉంటుంది. అంతే గాని తీర్థ ప్రసాదాలు స్వీకరణ అనంతరం  అదాట్టుగా దేవాలయం  వెలుపలికి (పూజా స్థలం నుండి)  రాకూడదు. భక్తులకు ఇబ్బందులు,  కోరికలు ఇతరత్రా లేకున్నా సరే, *భగవంతునికి ప్రణామ పూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదములు చెప్పవలసిందే. మనస్సులోని భావమును భగవంతునికి నివేదించకుంటే ఆ పూజా అసంపూర్తిగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు*.


*చివరిగా* భౌతికమైన కొలతలకు, ఋజువులకు అందనిది అయినా దివ్యమైన ప్రశాంతతను ప్రసాదించేది భగవత్ అనుభవము మరియు భగవత్ తత్వము. భగవత్ తత్వమును ఆరాధించాలి, అనుసరించాలి, అనుభవించాలి. పూజలు వేరు తత్వము వేరు అన్న వాదన కూడదు.  పూజలు పునస్కారాలు,  అర్చనలు, అభిషేకాలు, హోమాలు, యజ్ఞాలకు దేవాలయలు,ఆశ్రమాలు, గృహాలు ముఖ్యం.  ఆధ్యాత్మికం జ్ఞానానికి సంబంధము. భక్తి  మార్గం ద్వారా జ్ఞానం, జ్ఞానం  ద్వారా తత్వం సుగమము. ఇన్ని ప్రయత్నాల తదుపరి భగవత్ తత్వ దర్శన మవుతుంది. *అస్తు*


ధన్యవాదములు.

*(స్వస్తి)*

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: