29, జులై 2020, బుధవారం

సినారె #ముద్ర



నా చిన్నప్పుడు వేంకటపార్వతీశ్వరకవుల రచనలైన ‘పిల్లల బొమ్మల రామాయణం, భారతం..’ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉన్నప్పుడు (1958 ప్రాంతాల్లో) అప్పటికింకా తెలంగాణాగురించి మాకెవరికీ సరిగా అవగాహనే ఉండేది కాదు. ఒక రోజున మా నాన్నగారు చెప్పారు - “ఒరేయ్! తెలంగాణాలో దాశరథి, నారాయణరెడ్డి అనే ఇద్దరు యువకవులు కూడా ఈ బొమ్మల గ్రంథాలను చాలా బాగా వ్రాశారురా!” అని. అదీ నేను మొదటిసారి వీరిరువురి పేర్లూ వినడం.

తరవాత ఇద్దరి రచనల పేర్లు మాత్రమే విన్నాను మరికొన్నాళ్ళు.

1962లో అనుకుంటా - ‘ఇద్దరు మిత్రులు’ ఒక ప్రక్కన, ‘గులేబకావళి’ మరొక ప్రక్కన పోటీగా ఆడుతున్నాయి. ఒక రోజున (కొవ్వూరులో) మా ఇంటి వెనకాల ఏదో కార్యక్రమానికి సినిమా రికార్డులు వేస్తున్నారు. (నాకేమో ఎన్టీ-ఆరంటే ఒక పిసరు అభిమానం ఎక్కువే!) అందులోని పాట “నన్ను దోచుకొందువటే” (అది భీంప్లాస్ రాగంలో ఉందని తరవాత తెలిసింది) విని, దాదాపు నాకు మతిపోయినంతపనయింది! ఆ రికార్డు వేస్తున్నతడిని మంచిచేసుకుని, అక్కడ 3 గంటలపాటు కూర్చుని, ఒక ఏడెనిమిది సార్లు విని ఉంటాను! అంతగా నచ్చేసింది ఆ పాట నాకు. (మరొక రెండు నెల్లో మల్టీపర్పస్ పరీక్షలు (12th) మాకు!)

సుమారు మరొక 30 సంవత్సరాల తరవాత  సినారె తన ఆత్మకథను వ్రాసుకున్నపుడు ఈ సినిమాకు పాటలు వ్రాసే అవకాశం ఎలా కలిగిందో వ్రాసుకున్నాడు.

(ఈయన తన అగ్రజుడని పిలిచే దాశరథి సినీరంగంలోకి చేరాడు అప్పటికే. ఆత్రేయ తీసిన సినిమా ‘వాగ్దానం’లోని ‘నా కంటిపాపలో నిలిచిపోరా!’తో ఆయన రంగప్రవేశం చేశాడని విన్నాను.) ఎన్టీ ఆర్ కు ఈయన ప్రతిభాపాటవాలగూర్చి తెలిశాక, ఎవరో ఆయనకు ఈయన్ను పరిచయంచేశాడట! ఇద్దరూ మాట్లాడుకుంటూంటే ‘మాకొక పాటతో సినీరంగప్రవేశం చేయండి!’ అని ఆయన అడగ్గా ఈయన “సింహద్వారంగుండా ప్రవేశంచేయాలని ఉందండీ నాకు!” అన్నాడట. (అంటే ఒకే చిత్రానికి అన్ని పాటలనూ వ్రాయడమన్నమాట!) “సరే, ఆ అవకాశం మేమే ఇస్తామేమో!” అని నవ్వుతూ ఎన్టీ ఆర్ అన్నాడట.

అనుకోకుండా ఒకరోజు ఈయనకు ఫోనొచ్చిందట మద్రాసునుండి - ‘రామారావుగారు మీతో మాట్లాడాలంటున్నారు!’ అని, ఒకాయన హైదరాబాదులో ఈయనకు ఫోనివ్వడం, ఆ హీరోగారు ‘మా గులేబకావళి చిత్రానికి #మీరే #అన్ని #పాటలూ #వ్రాస్తున్నారు!’ అనడం, ఈయన ఒప్పుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి.

మద్రాస్ సెంట్రల్ స్టేషనుకి రామారావే స్వయంగా వచ్చి ఇంటికి తీసుకెళ్ళడం, పది పన్నెండురోజులు ఆయన ఇంట్లోనే ఉండి, ఆయనకు నచ్చినట్లుగా తాను మొత్తం పాటలు వ్రాయడం - ఈ వివరాలనన్నిటినీ సినారె వ్రాసుకున్నాడు తన పుస్తకంలో.

అంతే కాదు, అదే సమయంలో (మద్రాసులో ఉండగానే) నాగేశ్వరరావు సినిమా ఒకదానికి ఒకటిరెండు పాటలను వ్రాయమని కబురొస్తే, ఈయన రామారావుగారిని అడగడానికి జంకాడట. ఆయనే ఈయన ఇబ్బందిని గ్రహించి, ‘బ్రదర్ సినిమాకి వ్రాయడానికి జంకూగొంకూ ఎందుకు? ఆ పని కూడా చేసుకోండి. మీకిక తిరుగుండదు!’అన్నాడట ‘మా’ హీరోగారు.

అంతే ఆ ఆశీర్వచనం ఫలించింది - సినారె సినీ-ప్రస్థానం ఆ  విధంగా మొదలైంది, ఇక ఆయన వెనుతిరిగి చూడలేదు!

(రామారావు మరణించినప్పుడు #నిజంగా భోరున ఏడ్చినవారిలో సినారె ఒకడు!)

నేను ‘సినారె’ను 1964లో హైదరాబాద్ లోని వైయంసీఏలో చూచాను మొదటిసారి. ఆరోజు సినిమాపాటలలోకి జానపదసాహిత్యాన్ని చొప్పించడంగురించి ఆయన మాట్లాడినట్లు,
‘సెనగచేలో నిలబడి..’ అనే పాట పాడివినిపించినట్లుగా గుర్తు.

ఆయన ‘కర్పూరవసంతరాయలు’ ఖండకావ్యాన్ని, మరికొన్ని ఇతరరచనలనూ మాత్రమే నేను చదవగలిగాను. ఆయన గజళ్ళగురించి నాకు ఎక్కువగా తెలియదు.

ఆయన సినీరచనల్లో నేను మరచిపోలేని కొన్నిటిని క్రింద పేర్కొంటున్నాను:

1) ‘గంగావతరణం’ - బాపు సినిమా “సీతాకల్యాణం”

2) రెండు సినిమా హరికథలు - ‘కలెక్టర్ జానకి’ & ‘స్వాతిముత్యం (రామా! కనవేమిరా?)’

3) ‘ఎంత దూరమో? . ’ - ‘ఏకవీర’  (ఆ చిత్రానికి సంభాషణలు ‘సినారె’వే)

4) ‘చిత్రం! భళారే విచిత్రం!’ - ‘డీవీఎస్’ కర్ణ’

5) ‘పూవై విరిసిన పున్నమి వేళా.. ‘ - ‘శ్రీతిరుపతమ్మ కథ’

6) ‘దాచాలంటే దాగదులే...’ - ‘లక్షాధికారి’ (సంగీతదర్శకుడు చలపతిరావుకు ఈయన ట్యూన్ కూడా కూనిరాగంతో సూచించాడట!)

7) ‘కిలకిల నవ్వులు...’ - ‘చదువుకున్న అమ్మాయిలు’

8) ‘చెలికాడు నిన్నే..’ - ‘కులగోత్రాలు’

9) ‘గోరంత దీపం… (నీళ్ళు లేని ఎడారిలో కన్నీళ్ళైన తాగి బతకాలి..)’ - ‘గోరంత దీపం’

10) ‘గోగులు పూచే గోగులు కాచే..’ - ‘ముత్యాలముగ్గు’

11)  ‘ఊయలలూగినదోయి మనసే (భానుమతి)’ - ‘బొబ్బిలియుద్ధం’

12) ‘కలల అలల...’ - ‘గులేబకావళి కథ’

అయినా ఎన్నని చెప్పగలను(ము)? అదొక పెద్ద అమూల్యమైన భాండాగారం.

ఆయన జోక్ ఒకటి మరచిపోలేనిది - 'తూర్పు-పడమర' సినిమాలో - "#మీ #బిల్లుకు #నా #పాట #చెల్లు!"

1969లో చోటుచేసుకున్న ‘వేరు తెలంగాణా’ ఉద్యమంలో ‘మాకు కావలసినది #వీర #తెలంగాణా’ అన్న ‘పక్షం’లో ఈయన నిలిచాడు.

అదే సమయంలో ‘తెలుగుజాతి మనదీ..’ (‘తల్లా? పెళ్ళామా?’ సినిమాకి) అనే ప్రసిద్ధమైన పాటను వ్రాశాడు కూడా.

ఎన్టీఆర్ ప్రతిష్ఠాత్మకంగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పైన పెట్టించిన విగ్రహాలకు సంబంధించిన వాక్యాలను వ్రాయడంలో కూడా సినారె హస్తం ఉందని విన్నాను.

‘#మార్పు #నా #తీర్పు’ అనే ఒక మకుటంతో వచ్చిన ఆయన కవిత ఒకటి జ్ఞాపకం వస్తుంది తెలంగాణా వేరుపడడాన్ని తలుచుకున్నప్పుడల్లా. ఆయన చివరిరోజుల్లో జరిగిన ఈ ఏర్పాటుపైన  ఆయన ఏ విధంగా స్పందించాడో ఆలోచించడం కూడా గతజల-సేతుబంధనమే!

‘పుట్టినరోజు పండగే అందరికీ …’ అనే పాటలో ఆయనే చెప్పినట్లుగా ‘పుట్టింది ఎందుకో తెలిసిన’ కొందరిలో కచ్చితంగా ఆయన ఉంటాడు, ఇక ఆయన సాహిత్యమంటారా? ఎప్పటికీ నిలచి ఉండేది అది!

భౌతికంగా ఆయన మనమధ్య లేడు గానీ, తెలుగు సాహిత్యంలో తనదైన ఒక చెరగని ముద్ర వేసి మరీ పరమపదించాడు.

విశ్వనాథవారు స్వర్గస్థులైనపుడు మా సాహిత్యమిత్రులం అనుకున్నాం ‘ఒక వటవృక్షం కూలిపోయిం’దని! ఈయన విషయమూ అంతే!
(అయితే, ఈ వటవృక్షాలు వేరే మొక్కలు ఎదగకుండా అడ్డుకున్నవి మాత్రం కావు!)

కామెంట్‌లు లేవు: