25, ఆగస్టు 2023, శుక్రవారం

రామాయణమ్ 303

 రామాయణమ్ 303

...

మహారాజా వాడెవడో భయంకర రూపముతో ఉన్న వానరుడు అశోకవనమును ధ్వంసము చేసి అడ్డు వచ్చిన వారిని అరచేతితోనే చావమోది చంపేశాడు.వాడు అంతకు మునుపు సీతతో మాటలాడినాడు ప్రభూ!.

.

వానికి నీవు భయంకరమైన దండన విధింపుము.

.

రాక్షస్త్రీల మాటలు వినగానే రావణుడి నేత్రాంచలములనుండి ,మంటతో కూడిన దీపములనుండి వేడివేడి నూనెబిందువులు కారినట్లు, కన్నీటిబిందువులు రాలెను .

.

మండుచున్న అగ్నిహోత్రము వలే ఎర్రనైన కన్నులు మరింత పెద్దవి చేసి  ధూర్తవానరుని పట్టుకొనుడు అనుచు ఎనభైవేల మంది శూరులైన కింకరులను ఆజ్ఞాపించెను.

.

ప్రభువాజ్ఞ అయిన వెంటనే వివిధ ఆయుధములతో వారు హనుమంతుని పైకి యుద్ధమునకు బయల్వెడలిరి.

.

మిడతలదండు అగ్నివైపు దూకినట్లుగా వారంతా ఆ మహాబలుడి మీదకు దూసుకుంటూ పోసాగిరి.

.

వారిని చూడగనే సమరోత్సాహముతో తోకను నేలపై విసరికొట్టి దేహము ఇంకా పెద్దది చేసి లంకా నగరము ప్రతిధ్వనించునట్లుగా జబ్బలు చరచి  నిలబడెను.

.

ఆ ధ్వనికి పక్షులు రాలిక్రింద పడిపోయెను.

.

శ్రీరామ చంద్రునకు జయము అంటూ జయఘోషలు చేయసాగెను.

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: