7, జూన్ 2026, ఆదివారం

ఆసురీ సంపదలో

  ఈ ఆసురీ సంపదలో మొట్ట మొదటిది *దంభము:

అంటే కపటము, మోసము, వేషముతో మోసంచేయడం, కాషాయములు ధరించి, సన్యాసి ముసుగులో అన్ని అకృత్యాలు చేయడం. తమకు అన్నీ తెలుసు అని నమ్మించడం. తనను తాను పొగుడుకోవడం, ఇతరుల చేత పొగిడించుకోవడానికి తాపత్రయ పడటం, తనకు అన్నీ తెలుసు అని గర్వించడం. తాను చేసే ప్రతి పనీ ఆర్భాటంగా చేయడం. తనకు ఉన్న సంపదలను, విద్యలను అందరిముందు ప్రదర్శించడానికి ఆరాటపడటం.


*దర్పము:

అంటే ఒక విధమైన గర్వము. వల్లమాలిన అహంకారము. నన్ను మించిన వాడు లేడు అని గర్వించడం, విద్యాగర్వము, అధికార గర్వము, ధనవంతుడు అనే గర్వము. నాకే అంతా తెలుసు అనే అహంకారంతో ఎదుటి వారిని కించపరుస్తూ, తీసిపారేసినట్టు మాట్లాడటం వీటిలోముఖ్యమైనవి.


*అభిమానము:

సుయోధనుడు అభిమానమే ధనముగ కలవాడు అంటే అభిమానధనుడు అంటారు. ఇది కొంతవరకు మంచిదే కానీ, శ్రుతి మించితే పాతాళానికి తొక్కుతుంది. అహంకారమునకు ప్రతిబింబము అభిమానము. చాలామంది ఇదేదో గొప్పగుణంగా భావిస్తారు. కాని అది పరిమితులు దాటకూడదు అని గ్రహించాలి.


*కోపము:

దీని గురించి గీతలో చాలాసార్లు మనకు వివరించారు. అభిమానము ఎక్కడ ఉంటుందో కోపం అక్కడే ఉంటుంది. తన గొప్పతనాన్ని గుర్తించని వాడి మీద కోపం రావడం సహజం. ఆ కోపం విపరీత పరిణామాలకు దారితీస్తుంది. కోపం వలన సమ్మోహము అంటే ఏం చేస్తున్నాడో ఏ మాట్లాడుతున్నాడో తెలియని స్థితి. దానివలన స్మృతి పోతుంది. బుద్ధి నశిస్తుంది, తరువాత సర్వనాశనము కలుగుతుంది. అందుకే దీనిని ఆసురీ సంపద అన్నారు.


*పరుషత్వము:

అంటే కాఠిన్యము. కొంతమందికి ఇది అలవాటు. ఏం మాట్లాడినా మొహం మీద కొట్టినట్టు మాట్లాడటం, పరుషంగా మాట్లాడటం. ఎదుటి వారిని గౌరవించకపోవడం. నిర్లక్ష్య భావన. దీని వలన ఎన్నో ఇబ్బందులు వస్తాయి. చాలా మంది అటువంటి వారిని తప్పించుకు తిరుగుతారు. కొంతమంది దానిని గొప్ప సుగుణంగా భావిస్తారు. "నేను ఉన్నది ఉన్నట్టు మొహాన అడిగేస్తాను. మనసులో ఉంచుకోను" అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మరి కొంత మంది పైకి తియ్యగా మాట్లాడతారు. లోపల గోతులు తీస్తుంటారు. మాట కాఠిన్యమే కాదు మనసు కాఠిన్యం కూడా ఆసురీ సంపదలో భాగమే.


*ఆఖరుది అజ్ఞానము, అవివేకము: ప్రతిదానినీ తప్పుగా అర్ధం చేసుకోవడం. తెలియకపోయినా తెలిసినట్టు నటించడం. తాను చెప్పిందే వేదం అని మూర్ఖంగా వాదించడం. ప్రాపంచిక విషయములే శాశ్వత సుఖాలు ఇస్తాయని నమ్మడం. ఆ భ్రమలో పడి ఎప్పుడూ చేయకూడని పనులు చేయడం. ఇదే అవివేకము. ఇది కూడా ఆసురీ సంపదే.


ఎవరైతే ఆసురీ సంపదతో పుడతారో వారిలో పైన చెప్పిన గుణాలు కనిపిస్తాయి. ఈ గుణాలు ఎవరిలో ఉంటే వారిలో ఆసురీ సంపద పుష్కలంగా ఉన్నట్టు అనుకోవాలి. తమలో ఉన్న గుణాలను ఎవరికి వారు బేరీజు వేసుకొని, తమలో పై చెప్పిన గుణాలు ఉంటే వాటిని వదుల్చుకొని, ఆసురీ సంపదల నుండి బయటపడటానికి ప్రయత్నం చేయాలి.

_సాద్యమయ్యే పనిని చేసేందుకు

 *_సాద్యమయ్యే పనిని చేసేందుకు తగిన శక్తి అవసరం. కానీ అసాధ్యం అన్పించే పనిని చేసేటపుడు విశ్వాసం అవసరం. విశ్వాసం లేకుండా చేసే ఏదైవకార్యమైనా సరైన ఫలితాన్నివ్వలేదు.  విశ్వాసము అనేది కొండను కూడా గాలిలో తేలేలా చేయగలదు. రాములువారిపై విశ్వాసముచేతనే హనుమంతుడు పెద్ద కొండను చిన్న కుండవలే మోసినాడు. దేవునిపై అచంచల విశ్వాసము ఉండాలే గానీ నిత్యమూ అద్భుతాలను చూస్తాము.._*

ఆదివారం,జూన్.7,2026

  🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻

ఆదివారం,జూన్.7,2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

అధిక జ్యేష్ఠ మాసం - బహుళ పక్షం

తిథి:సప్తమి రా10.11 వరకు

వారం:ఆదివారం(భానువాసరే)

నక్షత్రం:శతభిషం తె4.42 వరకు 

యోగం:వైధృతి ఉ6.50 వరకు

కరణం:భద్ర ఉ10.07 వరకు తదుపరి బవ రా10.11 వరకు

వర్జ్యం:ఉ11.23 - 1.02

దుర్ముహూర్తము:సా4.44 - 5.36

అమృతకాలం:రా9.17 - 10.56

రాహుకాలం:సా4.30 - 6.00

యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30

సూర్యరాశి:వృషభం

చంద్రరాశి:కుంభం   

సూర్యోదయం:5.28

సూర్యాస్తమయం:6.28

సర్వేజనా సుఖినోభవంతు

శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి

ఆస్తి

  మనిషన్నాక ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత ఆస్తి కచ్చితంగా ఉంటుంది. ధనవంతుడికైతే ఏడుతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి. ఆ ధీమాతో అతడు ఏ చీకూచింతా లేకుండా జీవితాన్ని గడిపేస్తూంటాడు. పేదవాడికి తాను ఉండే పూరి గుడిసే ఆస్తి! అందుకనే దాన్ని అతడు అపురూపంగా చూసుకుంటాడు. ఆస్తికి అనేక రూపాలు. ధనం, ధాన్యం, కీర్తి, పదవి, చదువు, నైపుణ్యాలు... కొన్ని సంపాదించుకునేవి, కొన్ని వారసత్వంగా వచ్చేవి, మరికొన్ని అయాచితంగా లభించేవి. మరి జ్ఞానం మాటేమిటి?


పుట్టినప్పటినుంచీ మనిషి తల్లిదండ్రుల నుంచి, చుట్టూ ఉన్న పెద్దల నుంచి, ఉపాధ్యాయుల నుంచి, సమాజం నుంచి... ఎన్నో నేర్చుకుంటాడు. అదంతా కూడా ఆస్తే. తమవైన ఆస్తుల్ని ఎవరూ ఎడాపెడా ఖర్చు చేయరు. అయాచితంగా పంచిపెట్టరు. విలువైనదీ, కష్టపడి సంపాదించుకున్నదీ కాబట్టి భద్రంగా దాచుకుంటారు. అవసరాలకైనా, దానధర్మాలకైనా ఆచితూచి వినియోగిస్తారు. అయితే ఆస్తులన్నీ ఒకే రకం కాదు. కొన్ని వాడినకొద్దీ తరుగుతాయి. కొన్ని మాత్రం పెరుగుతాయి. అది తెలియక కొందరు లౌకిక సంపదల్లాగే అలౌకికమైన జ్ఞానాన్ని కూడా భద్రంగా దాచుకోవడం చూస్తుంటాం. వారు తాము తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచడానికి ఇష్టపడరు. దాన్ని అడగడానికి కూడా చాలామంది సంశయిస్తారు. జ్ఞానం అంటే- తెలిసిన విషయం. దాన్ని ఇతరులకు చెప్పడానికి ముందుకు రానివారూ, అడగడానికి నోరు తెరవనివారూ ఇద్దరూ ఒకే భావనతో ఉన్నట్లే. ఎలా అంటే, జ్ఞానాన్ని ఇస్తూ పోతే అవతలివారూ తమతో సమానం అయిపోతారనీ, తమ విలువ తగ్గిపోతుందేమోననీ అనుకునేవారు ఒకరైతే; అడగడం వల్ల తమను తాము తక్కువ చేసుకున్నట్లు భావించేవారు మరొకరు. ఇద్దరిదీ అహంభావమే. కొంతమందికి తమకు తెలిసిన విషయాన్ని నలుగురికీ చెప్పాలని మనసులో ఉన్నా అడిగేవారు లేక ఊరుకుంటారు. లేదా అడిగే వారికే అంత ఉంటే నాకెంత  ఉండాలి... అనుకుని జ్ఞానాన్ని గుట్టుగా దాచుకునేవారూ ఉంటారు.


ఇలా ఎందుకు జరుగుతుందంటే... ప్రాపంచిక జ్ఞానమంతా సేకరించుకున్నదే కాబట్టి. అలాంటి జ్ఞానం తరిగిపోయే ఆస్తిలాంటిదని వారు భావిస్తూ ఉండటం వల్లే! కానీ, ఆత్మజ్ఞానం ఆస్తి కాదు. అది ఇతరుల నుంచి సేకరించుకునేది కానే కాదు. ఎవరికి వారే పండించుకునే ఒక అద్భుతమైన పంట అది. బయటికి చల్లిన కొద్దీ మళ్లీ మళ్లీ ఊరే ఒక చల్లని నీటిచెలమ. తెంపిన కొద్దీ ఎన్నెన్నో పుష్పాలనిచ్చే ఒక పూలచెట్టు. విస్తర్లకోసం ఆకులెన్నో తెంపినా మళ్లీ మళ్లీ చిగురించే చెట్టు కొమ్మ.


ఇవ్వడమంటే మనసును విశాలంగా చేసుకోవడం. సంకుచిత బంధనాలను తెంపుకొని విశ్వనరుడిగా ఎదగడంలో అది మొదటి మెట్టు. ఏనాడూ ఎవరికీ ఏమీ ఇవ్వనివాడు చివరికి తనకోసం తాను ఇంత పుణ్యాన్ని కూడా మిగుల్చుకోలేడు. దాన్ని గుర్తించి నలుగురి మేలు కోరి స్వచ్ఛందంగా జ్ఞానవితరణ చేసేవారే మహాత్ములు. విరగకాసిన చెట్టు, పండ్లను పంచుకోవడానికి ఎదురుచూస్తూ ఉంటుంది.

బార్లలో ఎందుకు

  బ్రహ్మానందం భార్య కనకం "మీరు గుంటూరు వెళ్ళినప్పుడల్లా బార్లలో ఎందుకు గడుపుతున్నారు?" భర్తని నిలదీసింది. 


"అరండల్ పేటలో అడ్డరోడ్ల నెంబర్లు కన్ఫ్యూజ్ చేస్తుంటాయి కాబట్టి"చెప్పాడు బ్రహ్మానందం. 


"దానికీ దీనికీ ఏమిటి సంబంధం?"


"పిచ్చిమొహమా...కూర్చో చెపుతాను.

ఏలూరులో దారి అడిగితే ' నేరుగా పొండి' అంటారు.

చిత్తూరులో ' సీదా పొండి' అంటారు. 

అనంతపురంలో 'ముందుకు పొండి' అంటారు.

కొవ్వూరులో ' ఎదరకి వెళ్ళండి' అంటారు. 

గుడ్లవల్లేరులో ' ఈ దారంబడి వెళ్ళండి' అంటారు. 

నెల్లూర్లో ' స్ట్రెయిట్ గా వెళ్ళండి' అంటారు. 

కర్నూల్లో ' సక్కగా పొండి' అంటారు 

గుంటూరులో మాత్రం అదేమిటో 'బారుకి వెళ్ళండి' అంటుంటారు, అందుకే .😀😀😀😀

కారము

 కారము మనసుని మండిస్తుంది.  

సహకారము మనసుని కలుపుతుంది.  

ప్రత్యుపకారము ఆశించకు.  

మమకారము బంధిస్తుంది.  

చీత్కారము బాధిస్తుంది.  

అహంకారము ఒంటరిని చేస్తుంది.  

సాకారము బతుకునిస్తుంది.  

నిర్వికారము ముక్తినిస్తుంది.


ఈ ఎనిమిది 'కారాల' మధ్యే మన జీవితం నడుస్తుంది. ఏ 'కారం' ఎంచుకుంటామో, ఆ రుచే మన బతుకుకి వస్తుంది.