మనిషన్నాక ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత ఆస్తి కచ్చితంగా ఉంటుంది. ధనవంతుడికైతే ఏడుతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి. ఆ ధీమాతో అతడు ఏ చీకూచింతా లేకుండా జీవితాన్ని గడిపేస్తూంటాడు. పేదవాడికి తాను ఉండే పూరి గుడిసే ఆస్తి! అందుకనే దాన్ని అతడు అపురూపంగా చూసుకుంటాడు. ఆస్తికి అనేక రూపాలు. ధనం, ధాన్యం, కీర్తి, పదవి, చదువు, నైపుణ్యాలు... కొన్ని సంపాదించుకునేవి, కొన్ని వారసత్వంగా వచ్చేవి, మరికొన్ని అయాచితంగా లభించేవి. మరి జ్ఞానం మాటేమిటి?
పుట్టినప్పటినుంచీ మనిషి తల్లిదండ్రుల నుంచి, చుట్టూ ఉన్న పెద్దల నుంచి, ఉపాధ్యాయుల నుంచి, సమాజం నుంచి... ఎన్నో నేర్చుకుంటాడు. అదంతా కూడా ఆస్తే. తమవైన ఆస్తుల్ని ఎవరూ ఎడాపెడా ఖర్చు చేయరు. అయాచితంగా పంచిపెట్టరు. విలువైనదీ, కష్టపడి సంపాదించుకున్నదీ కాబట్టి భద్రంగా దాచుకుంటారు. అవసరాలకైనా, దానధర్మాలకైనా ఆచితూచి వినియోగిస్తారు. అయితే ఆస్తులన్నీ ఒకే రకం కాదు. కొన్ని వాడినకొద్దీ తరుగుతాయి. కొన్ని మాత్రం పెరుగుతాయి. అది తెలియక కొందరు లౌకిక సంపదల్లాగే అలౌకికమైన జ్ఞానాన్ని కూడా భద్రంగా దాచుకోవడం చూస్తుంటాం. వారు తాము తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచడానికి ఇష్టపడరు. దాన్ని అడగడానికి కూడా చాలామంది సంశయిస్తారు. జ్ఞానం అంటే- తెలిసిన విషయం. దాన్ని ఇతరులకు చెప్పడానికి ముందుకు రానివారూ, అడగడానికి నోరు తెరవనివారూ ఇద్దరూ ఒకే భావనతో ఉన్నట్లే. ఎలా అంటే, జ్ఞానాన్ని ఇస్తూ పోతే అవతలివారూ తమతో సమానం అయిపోతారనీ, తమ విలువ తగ్గిపోతుందేమోననీ అనుకునేవారు ఒకరైతే; అడగడం వల్ల తమను తాము తక్కువ చేసుకున్నట్లు భావించేవారు మరొకరు. ఇద్దరిదీ అహంభావమే. కొంతమందికి తమకు తెలిసిన విషయాన్ని నలుగురికీ చెప్పాలని మనసులో ఉన్నా అడిగేవారు లేక ఊరుకుంటారు. లేదా అడిగే వారికే అంత ఉంటే నాకెంత ఉండాలి... అనుకుని జ్ఞానాన్ని గుట్టుగా దాచుకునేవారూ ఉంటారు.
ఇలా ఎందుకు జరుగుతుందంటే... ప్రాపంచిక జ్ఞానమంతా సేకరించుకున్నదే కాబట్టి. అలాంటి జ్ఞానం తరిగిపోయే ఆస్తిలాంటిదని వారు భావిస్తూ ఉండటం వల్లే! కానీ, ఆత్మజ్ఞానం ఆస్తి కాదు. అది ఇతరుల నుంచి సేకరించుకునేది కానే కాదు. ఎవరికి వారే పండించుకునే ఒక అద్భుతమైన పంట అది. బయటికి చల్లిన కొద్దీ మళ్లీ మళ్లీ ఊరే ఒక చల్లని నీటిచెలమ. తెంపిన కొద్దీ ఎన్నెన్నో పుష్పాలనిచ్చే ఒక పూలచెట్టు. విస్తర్లకోసం ఆకులెన్నో తెంపినా మళ్లీ మళ్లీ చిగురించే చెట్టు కొమ్మ.
ఇవ్వడమంటే మనసును విశాలంగా చేసుకోవడం. సంకుచిత బంధనాలను తెంపుకొని విశ్వనరుడిగా ఎదగడంలో అది మొదటి మెట్టు. ఏనాడూ ఎవరికీ ఏమీ ఇవ్వనివాడు చివరికి తనకోసం తాను ఇంత పుణ్యాన్ని కూడా మిగుల్చుకోలేడు. దాన్ని గుర్తించి నలుగురి మేలు కోరి స్వచ్ఛందంగా జ్ఞానవితరణ చేసేవారే మహాత్ములు. విరగకాసిన చెట్టు, పండ్లను పంచుకోవడానికి ఎదురుచూస్తూ ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి