7, జూన్ 2026, ఆదివారం

వివేకచూడామణి

 *వివేకచూడామణి*


*శ్రీఆదిశంకరాచార్య విరచితము*


*స్థూలశరీరవర్ణనము*


*73. అహం మమేతి ప్రథితం శరీరం*

*మోహాస్పదం స్థూలమితీర్యతే బుధైః*

*నభోనభస్వద్దహనాంబు భూమయః*

*సూక్ష్మాణి భూతాని భవంతి తాని*


*పదవిభజన :*

*అహం - మమ + ఇతి - ప్రథితం - శరీరం - మోహ + ఆస్పదం - స్థూలమ్ + ఇతీర్యతే - బుధైః - నభః + నభస్వత్ + దహన + అంబు - భూమయః - సూక్ష్మాణి - భూతాని - భవంతి - తాని*


*భావము :*

*నేను, నాది అని ప్రసిద్ధి చెందిన ఈ మాయాకల్పిత దేహాన్ని 'స్థూలశరీరమ'ని పండితులంటారు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అనే సూక్ష్మ ( పంచ ) భూతాలచే ఇది ఏర్పడింది.*


*వివరణ :*

*అహం = నేను ; మమేతి = నాది ; ప్రథితం = ప్రసిద్ధమైనది. నేను, నాది అని మమకారాస్పదమై ప్రసిద్ధమైన శరీరము అనేక విధములైన దోషాలకు ఆశ్రయమైనది. ఇది స్థూలమని ( స్థూలశరీరమని ) పండితులచేత చెప్పబడుతున్నది. శరీరము ఆత్మకంటే భిన్నమనే విషయం చెప్పినట్లే, ఆత్మ అంటే స్వామి , శరీరము ఆ ఆత్మ యొక్క భోగమునకై ఉన్నదని తెలుసుకోవాలి. ఈ శరీరము అనిత్యము. అందువలన కూడా ఇది నిత్యాత్మరూపము కాజాలదు.*

*నభః = ఆకాశము ; నభస్వత్ = వాయువు ; దహన = అగ్ని ; అంబు = జలము ; భూమయః = భూమి అనేవి ; సూక్ష్మాణి భూతాని భవంతి = సూక్ష్మ భూతములుగా అవుతున్నవి.*

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: