*శ్రీ మూకశంకర విరచిత* *మూక పంచశతి*
*పాదారవిందశతకము*
*7 వశ్లోకము :*
*నయంతీ సంకోచం సరసిజరుచం దిక్పరిసరే*
*సృజంతీ లౌహిత్యం నఖకిరణ చంద్రార్ధ ఖచితా*
*కవీంద్రాణాం హృత్కైరవ వికసనోద్యోగ జననీ*
*స్ఫురంతీ కామాక్ష్యాః చరణ రుచిసంధ్యావిజయతే*
*భావము :*
*కామాక్షీదేవి చరణకాంతి అనే సంధ్య, కమలాలకాంతిని సంకోచింపచేయునదియై, నలుదిశలయందు అర్ధచంద్రునిలాంటి గోళ్ళ కాంతులతో అరుణకాంతిని పుట్టించినదియై, కవీంద్రుల హృదయములనే కలువపూలను వికసింపచేయునదియై ప్రకాశిస్తూ విజయాన్ని పొందినది.*
*అంటే అమ్మవారి చరణములందలి కాంతి అనే సంధ్య సర్వోత్కర్షముగా వర్ధిల్లుతున్నది.*
*వివరణ :*
*అమ్మవారి పాదముల మరియు గోళ్ళ ఔన్నత్యాన్ని శ్రీ శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరి ( 89 వ శ్లోకం ) లో ఈవిధంగా వర్ణించారు :*
*నఖై ర్నాకస్త్రీణాం - కరకమలసంకోచశశిభిః*
*తరూణాం దివ్యానాం - హసత ఇవ తే చండి ! చరణౌ*
*ఫలాని స్వస్థ్సేభ్యః - కిసలయకరాగ్రేణ దదతాం*
*దరిద్రేభ్యో భద్రాం - శ్రియ మనిశ మహ్నాయ దదతౌ*
*భావము :*
*అమ్మా ! చండీమాతా !దేవలోకంలో ఇంద్రుని నందనవనంలో కోరికలు తీర్చే కల్పవృక్షం ఉన్నది. అది తన చిగురుటాకుల చేత కోరిన కోరికలు తీరుస్తుంది. కాని ఆ కల్పవృక్షం దేవలోకవాసులైన దేవతల కోరికలు మాత్రమే తీరుస్తుంది. .మరి నీ దివ్య చరణములో ! ఆలోకం, ఈ లోకం అనే భేదం లేక, నిన్ను నమ్మిన సర్వలోకములలో ఉండే వారందరికీ, ఎల్లవేళలా, తరుగులేనన్ని సంపదలను శీఘ్రముగా అనుగ్రహిస్తూ ఉంటాయి. అంతే కాదు, ఇంద్రుని భార్యయైన శచీదేవి మొదలుగా గల స్త్రీలు నిన్ను సేవించటానికి, అర్చించటానికి నీ పాదముల వద్దకు రాగానే పద్మములవంటి వారి చేతులు, చంద్రోదయం వంటి నీ నఖ (గోటి) కాంతులవలన ముకుళింపబడి (రెండుచేతులు దగ్గరకు ముడవబడి) నీకు నమస్కరిస్తున్నాయి. అటువంటి శోభతో నీ పాదాలు, నీ కాలిగోళ్ళు అలరారుతున్నాయి.*
*{ పద్మాలు చంద్రోదయం కాగానే ముడుచుకుపోతాయి. అమ్మ దగ్గరకు రాగానే ముడుచుకుపోయే ఆ దేవతా స్త్రీల చేతులను కరపద్మాలుగా పోల్చి, అమ్మ కాలిగోళ్లను చంద్రునితో పోల్చి శ్రీ శంకరులు చక్కటి వర్ణణ గావించారు. అంటే అమ్మ పాదాలు దేవతల చేత, దేవతా స్త్రీలచేత కూడా నమస్కరింపబడతాయని అర్ధం. అందుకే కదా ! పోతనగారు 'అమ్మలగన్నయమ్మ' అనే భాగవత పద్యంలో *'వేల్పుటమ్మల మనమ్ములనుండెడియమ్మ'* *అని వర్ణించారు.* *మనమందరమూ ఇష్టదైవాలుగా కొలిచే ఈ దేవతలంతా, వారు తమ ఆరాధ్య దేవతగా అమ్మనే పూజిస్తున్నారని పోతనగారి పద్య భావము.}*
*ఆ తల్లి*
*పాదపద్మములకు నమస్కరిస్తూ* 🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి