కోడిమాంసం గురించి సంపూర్ణ వివరణ -
కోడిని సంస్కృతము నందు కుక్కుటము అని పిలుస్తారు . ఇది జిగటగా , స్నిగ్దముగా ఉండును. ఉష్ణవీర్యముగా ఉండును. కంటికి హితముగా ఉండును. అనగా నేత్రసంబంధ సమస్యలతో ఇబ్బందిపడువారికి ఇది హితము కలిగించును. వీర్యవృద్ధిని కలిగించును. కఫోద్రేకము కలిగిచును . కోళ్ళలో ఆడకోడి , మగకోడి రెండు బేధములతో ఉండును. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో కోడిని విష్కిర జంతువులలో ( అనగా కాలితో నేలను చిమ్మి అందుండు పురుగులు మొదలయిన వానిని తినేవి ) చేర్చడం జరిగింది . విష్కిర జంతువుల మాంసం సాధారణముగా శుక్రవృద్ధిని కలిగించునదిగాను, కొంచం వగరు , తీపి రుచులు కలదిగాను , చలువనిచ్చి , ఇంపుగా ఉండునదిగా వర్ణించబడినది.
• కోడిపుంజు మాంస విశిష్టత -ఇది మిగుల శ్రేష్టమైనది . అందులోనూ కూతపెట్టని పుంజుమాంసం బలకరం రక్తవృద్ధిని ఇచ్చి వాతవ్యాధులను , ఉదరశూల పోగొట్టును . సమశీతోష్ణత కలిగించును. ఏ కారణము చేతనైనను రక్తము తగ్గి కృశించి పోవువారికి సాధారణముగా వేడి శరీరతత్వము కానివారు కోడిమాంసం తినవచ్చు . ప్రాయపు పుంజుమాంసం అధిక బలకరము , దేహబుద్ధి పెంచును . వీర్యవృద్ధి కలిగించును. కాసరోగముచే కృశించువారికి ఇది హితము . వాతప్రకృతి కలవారికి అనుకూలత ఇచ్చును . ముదురుకోడిపుంజు మాంసం శరీరం నందు అమితముగా ఉష్ణమును పెంచును . ఉష్ణముతో వచ్చు శ్లేష్మముకూడా పెరుగును . దీనిని తీసుకోకపోవడము ఉత్తమం . దీనికి పులుసు విరుగుడు.
• కోడిపెట్ట మాంస విశిష్టత - ఇది స్నిగ్దముగా , హితముగా , రుచికరంగా , వాతశ్లేష్మ హరముగా ఉండును. గురుత్వము ఇచ్చును. వీర్యపటిమ , దేహబలము , రక్తవృద్ది ఇచ్చి కన్నులకు మేలు చేయును . కొడిపెట్ట మాంసం చక్కగా పక్వము కాకున్నచో విరుద్ధగుణములు ఇచ్చును. ముసలి పెట్ట మాంసం ఉదరవ్యాధులు , శూలలు మున్నగువానిని పోగొట్టును . వీటిలో పిల్లలమాంసం నీరసముతో ఉన్నవారికి హితము . ఇది విరేచనకారి . ముసలిపెట్ట మాంసం విరేచనబద్ధం , లేతకొడిపెట్ట మాంసం అత్యుష్ణము . ముదురుది శ్వాసకాసలను హెచ్చించును. దీనికి విరుగుడు పులుసు .
పైనచెప్పిన ఔషధ విలువలు అన్నియు దేశివాళి కోళ్లకు సంబంధించినవి . ఇప్పుడు మనకి లభ్యం అయ్యే బాయిలర్ కోళ్ళకి త్వరగా పెరగడానికి హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. వాటిని మనం ఆహారంగా తీసుకుంటున్నాము . అలా ఆ కృత్రిమ హర్మోన్స్ మనశరీరములోకి ప్రవేశించి విపరీత ఫలితాలు కలుగుతున్నాయి. ముఖ్యముగా ఆడపిల్లలు సాధారణ వయస్సు కన్నా ముందే పుష్పవతులు ( Matured ) అవ్వడం జరుగుతుంది. పెద్దవారిలో హర్మోనల్ inbalance అవ్వడం జరుగుతుంది.
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .