ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
1, ఏప్రిల్ 2026, బుధవారం
*శ్రీ మహావిష్ణు పురాణం*
🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*బుధవారం 1 ఏప్రిల్ 2026*
*శ్రీ మహావిష్ణు పురాణం*
`` *44వ భాగo*```
*హయగ్రీవ రాక్షస సంహారం*``
బ్రహ్మా ఇంద్రాది దేవతలు వైకుంఠంలో నారాయణుని యోగనిద్రనుంచి మేలుకొలపటానికి ప్రయత్నించి విఫలమయ్యారు. పరమశివుని సహాయం చేయమని మనస్సులో కోరుతూ సంకల్పించి ప్రార్ధించారు. మహేశ్వరుడు ప్రత్యక్షంకాగా బ్రహ్మదేవుడు పరిస్థితిని వివరించి విష్ణువుని నిద్రలేపడంలో సహాయం చేయమని అర్ధించాడు.
వింటికి శిరస్సు ఆనించి యోగనిద్రలో ఉన్న విష్ణువుని చూసి శివుడు బ్రహ్మతో “బ్రహ్మదేవా వింటితాడుని కొరికే కీటకాన్ని ఒకటి సృష్టించి విష్ణువు దగ్గరకు పంపు! ఆ పురుగు వింటితాడుని కొరికి తెంచగానే ఆశబ్దానికి విష్ణువు యోగనిద్ర నుంచి బయటకు వస్తాడు” అని సూచించాడు.
సరేనని బ్రహ్మ వింటితాడు కొరికే
పురుగును సృష్టించి పంపాడు.
ఆ పురుగు వింటి వద్దకు పాకుతూ వెళ్లి వింటితాడు పై ఎక్కి పైకి వెళ్లింది. పురుగు కదలికతో విల్లు కదలి వింటితాడు విష్ణువు శిరస్సు వద్దకు వచ్చింది. గట్టిగా బిగించి కట్టిన వింటి తాడు పైకొసను పురుగు కొరికింది. వింటితాడు పెద్ద శబ్దం చేస్తూ తెగి సర్రున విష్ణువు శిరస్సును కోసివేసింది. తెగిన విష్ణువు శిరస్సు ఎగిరి సముద్రంలో పడిపోయింది. విష్ణువు మొండెం మాత్రం శేషతల్పం పైన మిగిలింది.
చూస్తున్న బ్రహ్మాది దేవతలు హాహాకారాలు చేశారు. సహాయం కోరి వచ్చిన తామే శ్రీహరి కంఠం తెగగొట్టారు. విష్ణువే లేకపోతే లోకాలను, దేవతలను రక్షించే వారెవ్వరు అని దుఖించసాగారు. శివుడు వారిని ఓదారుస్తూ “శ్రీహరి శిరస్సు తెగడం వెనుక మనకి
తెలియని కారణముంటుంది. జగత్తులో కారణము లేకుండా ఏ కార్యము జరుగదు. జగన్మాతను ప్రార్ధించుదాము. ఆమె అనుగ్రహించి తరుణోపాయం చెబుతుంది" అనడంతో
బ్రహ్మాది దేవతలు శ్రీ సూక్త మంత్రాలు పఠిస్తూ జగదంబను స్మరించారు. జగన్మాత దేవతల ప్రార్థనలు ఆలకించి అంతరిక్షంలో ప్రత్యక్షమై "దేవతలారా హయగ్రీవ రాక్షసుడు తనలాంటి అశ్వశిరస్బు గల వీరుని చేతిలోనే మరణం పొందే వరం పొంది ఉన్నాడు. అందుకే లక్ష్మీదేవి శాపం వలన శ్రీహరి శిరస్సు తెగిపడింది. మీరు అశ్వపు శిరస్సు తెచ్చి విష్ణువు మొండానికి అతికించండి.
శ్రీహరి హయగ్రీవ అవతారం ధరించి హయగ్రీవ రాక్షసుని అంతం చేస్తాడు. పిదప మీరు శతృంజయ యజ్ఞం పూర్తి చేసి యజ్ఞఫలం విష్ణువుకి అర్పించండి. శ్రీహరి హయగ్రీవ రూపం పోయి విష్ణు రూపము పొందుతాడు" అని పలికి అదృశ్యమయ్యింది.
జగన్మాత మాటలకు ఊరట చెందిన దేవతలు అశ్వశిరస్సు తెచ్చి విశ్వకర్మ చేత విష్ణువు మొండానికి అతికించారు. బ్రహ్మ ప్రాణప్రతిష్ఠ మంత్రాలతో అభిషేకించగానే హయగ్రీవ అవతారములో విష్ణువు యోగనిద్ర నుండి లేచాడు. బ్రహ్మాది దేవతలను చూసి "మీకు అభయం ఇస్తున్నాను. హయగ్రీవ రాక్షసుని వధించి వస్తాను. అతని వద్ద నున్న వేదాలను బ్రహ్మకు తిరిగి అప్పగిస్తాను" అని పలికి హయగ్రీవ రాక్షసుని కోసం బయలుదేరి వెళ్లాడు.
హయగ్రీవ రాక్షసుడు నివసించే నగరానికి వెళ్లి యుద్దానికి రమ్మని సవాలు చేశాడు. హయగ్రీవ రాక్షసుడు భీకర సకిలింపులు చేస్తూ యుద్దభూమికి వచ్చాడు. తనలాగానే ఉన్న విష్ణువు హయగ్రీవ రూపం చూసి ఆశ్చర్యం చెందాడు. తను కోరినట్లు మృత్యువు హయగ్రీవ రూపం దాల్చి రాలేదు కదా అని అనుకున్నాడు.
ఖచ్చితంగా దేవతలు తనను చంపడానికి ఈ హయగ్రీవుని పంపారు అని నిశ్చయించుకుని ద్వంద్వ యుద్దానికి దిగాడు. ఇరువురి మధ్య భీకర పోరు మొదలైంది. రాను రాను రాక్షస హయగ్రీవుని శక్తి సన్నగిల్లసాగింది. దానవసంహారి విష్ణువే హయగ్రీవ రూపంలో వచ్చాడు అని అర్ధమైంది. హయగ్రీవ విష్ణువు రాక్షస హయగ్రీవుని మెడ పట్టుకుని తన శిరస్సుతో వాడిశిరస్సును బలంగా పదేపదే కొట్టి కుమ్మి రాక్షసుని శిరస్సును ఛిన్నాభిన్నం చేశాడు. తల పగిలి రక్తం ధారగా కారుతుంటే హయగ్రీవ రాక్షసుడు నేలపై పడి గిలగిలాతన్నుకుంటూ ప్రాణాలు వదిలేశాడు.
దేవతలు పుష్పవర్షం కురిపించారు కోపం తగ్గిన మహాలక్ష్మి హయగ్రీవ స్వామి చెంతకు వచ్చింది. దేవతల ప్రార్థనపై హయగ్రీవ అవతారంలో మహాలక్ష్మి సమేతుడై మహావిష్ణువు ఆ క్షేత్రంలో వెలిశాడు. బ్రహ్మకు వేదాలను తిరిగి ఇచ్చాడు.
ఇంద్రుడు శతృంజయ యాగంలో హయగ్రీవస్వామిని యజ్ఞపురుషుడిగా చేసి యాగం సుసంపన్నం చేశాడు. యజ్ఞ ఫలం హయగ్రీవ స్వామికి అర్పించి యజ్ఞ హవిర్భాగాలు ఇంద్రాదిదేవతలు స్వీకరించి బలవంతులు అయ్యారు. యజ్ఞఫలం పొందిన హయగ్రీవ స్వామి తన శ్రీమన్నారాయణ రూపం తిరిగి పొందాడు. లక్ష్మీదేవితో కలసి వైకుంఠం వెళ్లగా శివుడు కైలాసం, బ్రహ్మదేవుడు బ్రహ్మలోకానికి పయనమయ్యారు. దేవతలు శక్తి సంపన్నులై స్వర్గంలోకంలో ఉండసాగారు.
ఇంద్రుడు స్వర్గాధిపతి అయిన సుఖంగా లేడు. మనస్సులో హిరణ్యకశిపుడు చేసే ఘోర తపస్సు పై చింత కలిగిఉన్నాడు. తపస్సు ఏ క్షణమైనా ఫలించి బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడు కోరిన వరాలు ఇవ్వవచ్చును. హిరణ్యకశిపుని తపస్సు భగ్నంచేయడానికి చేసిన ప్రయత్నాలు అన్ని విఫలం అయ్యాయి.
*(సశేషం)*
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
వడదెబ్బ నివారణా యోగాలు -
వడదెబ్బ నివారణా యోగాలు -
* ఉల్లిపాయ రసమును వంటికి పట్టించిన వడదెబ్బ నివారణ అగును.
* వేసవి ఎండలో నడవవలసి వచ్చినపుడు ఒక ఉల్లిపాయ టోపిలో గాని రుమాలులో గాని నడినెత్తిన పెట్టి కట్టుకొని నడిచిన వడదెబ్బ తగలదు.
* నీరుల్లిపాయ రసం రెండు కణతలకు , గుండె ప్రదేశములో పూసిన వడదెబ్బ తగలడం వలన కలిగిన బాధలు తగ్గును.
* వడదెబ్బ తగిలిన ముఖము పైన , శరీరము పైన నీళ్లు చల్లుతూ తలపైన మంచుగడ్డలు ఉంచి తాగుటకు నిమ్మరసంలో ఉప్పు కలిపి ఇవ్వవలెను.
* కుమ్మున ఉడికించిన మామిడికాయ రసములో ఉప్పు , జీలకర్ర కలిపి భోజనం నందు తాగుచుండిన వడదెబ్బ తగలదు.
* విశ్రాంతిగా పడుకోనిచ్చి ఆ తరువాత కాఫీ ఇచ్చిన వడదెబ్బ నుంచి తేరుకొందురు.
* 48 గ్రాముల చన్నీటిలో ఒక తులము తేనె కలిపి ఇచ్చిన వడదెబ్బ నివారణ అగును.
* వడగళ్ళు పడినపుడు ఆ ఐస్ గడ్డలను ఏరి విభూతిలో వేసి నిలువ ఉంచి జాగ్రత్తగా దాచి ఆ విభూతిని మూడువేళ్ళకు వచ్చినంత తీసుకుని మంచినీటిలో వేసి వడదెబ్బ తగిలిన వారికి ఇచ్చిన వడదెబ్బ నివారణ అగును.
* తరువాణి తేటలో ఉప్పును చేర్చి ఇవ్వవలెను.
* తాటిముంజలు పంచదారతో కలిపి తినిపించవలెను.
* నాలుకకు పాత ఉశిరిక పచ్చడి రాసి పుల్లని ఆవుమజ్జిగ లో ఉప్పువేసి అన్నంలో పోసి పిసికి పిప్పిని పారవేసి ఆ రసమును తాగించవలెను .
* చన్నీటితో స్నానం చేయించవలెను .
* వేడివేడి పలచటి గంజిలో ఉప్పు వేసి తాగించవలెను .
వడదెబ్బ తగిలినప్పుడు పైన చెప్పిన యోగాలలో మీకు వీలైనవి పాటించి సమస్య నుంచి బయటపడండి . ప్రస్తుత పరిస్థితుల్లో ఎండలు చాలా ఎక్కువ అవుతున్నాయి. వీలున్నంతవరకు బయటకి పోకుండా ఉండటం మంచిది . వెళ్ళవలసి వస్తే పైన చెప్పిన యోగాలు పాటిస్తూ జగ్రత్త వహించండి.
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
రామాయణం - 22)
శ్రీరామ ( వాల్మీకి రామాయణం - 22)
🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏
సర్వే జనాః సుఖినో భవన్తు 🙏
(31-3-'26 పోష్టు తరువాయి భాగము)
శ్రీ రాముడు, పరశురాముని నుండి వైష్ణవ ధనస్సును స్వీకరించడం అనేది ఒక అద్భుతమైన ఘట్టం.
రామాయణం మొత్తంలో రాముడు విష్ణు స్వరూపుడుగా ప్రకటితమైన సన్నివేశం ఇదొక్కటే.
అహల్యా శాప విమోచనం,
శబరి, శరభంగ మహర్షి, కబంధుడు, జటాయువు, మొదలైన వారికి ఉత్తమ లోకాలు అనుగ్రహించటం,
రావణ వధానంతరం, బ్రహ్మాదిదేవతలు రాముని విష్ణువుగా స్తుతించడం,
మొదలైన సన్నివేశములలో,రాముడి దైవత్వం స్ఫురిస్తున్నా, కావ్యం అంతా రాముడి మానవత్వానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.
రాముడు మానవుడే అనిపించేలా వాల్మీకి మహర్షి రచన కొనసాగింది.
కేవలం ఈ ఘట్టంలోనే విష్ణువు, రాముడిగా అవతరించాడు అన్న విషయం స్పష్టంగా ప్రకటితమైంది.
వైష్ణవ ధనస్సును ధరించిన రాముడు సాక్షాత్తూ విష్ణుమూర్తిగా బ్రహ్మాది దేవతలకు దర్శనం ఇచ్చాడు.
మహాలక్ష్మి అయిన సీత అక్కడే ఉన్నది.
ఆదిశేషుడైన లక్ష్మణుడు ఉన్నాడు.
శంఖ,చక్రములైన భరత,శతృఘ్నులు ఉన్నారు.
చేతిలో తన శార్ జ్ఞ ధనస్సు ఉన్నది.
అలా దర్శనమిచ్చిన రాముని చూడటానికి బ్రహ్మాది దేవతలు, ఋషులు, గుంపులు గుంపులుగా అక్కడికి వచ్చారు,
అని వర్ణించారు వాల్మీకి మహర్షి.
పరశురాముడు వెళ్ళగానే,
చీకటి తొలగి దిక్కులన్నీ ప్రకాశించినవి.
విష్ణుధనస్సును ధరించిన రాముని దేవతలు,ఋషులు స్తుతించారు.
అప్పుడు దివ్యమైన ఆ వైష్ణవ ధనస్సును రాముడు వరుణునకు ఇచ్చి వేశాడు.
శ్లో// గతే రామే ప్రశాంతాత్మా రామో దాశరథిర్ధనుః/
వరుణాయాప్రమేయాయ దదౌ హస్తే ససాయకం//
(ప్రశాంత మనస్సుతో కూడిన దశరథరాముడు పరశురాముడు వెళ్లిన వెంటనే, ఆ ధనస్సును, బాణమును, అప్రమేయ ప్రభావంగల వరుణుని హస్తములలో పెట్టెను).
వివాహానంతరం అయోధ్యకు వెళ్తున్న రామునకు ప్రస్తుతము ఈ ధనస్సుతో అవసరం లేదు.
రాముడి వనవాసం ప్రారంభం అయిన తరువాత మిత్రా వరుణుల తేజస్సుతో కుంభసంభవుడుగా జన్మించిన "అగస్త్య మహర్షి" ఈ ధనస్సును రాక్షస సంహారం కోసం తిరిగి రామునకు ఇచ్చాడు.
ఆ వైష్ణవ ధనస్సును ఇస్తూ అగస్త్య మహర్షి రామునితో ఇలా అన్నాడు.
శ్లో// ఇదం దివ్యం మహచ్చాపం హేమరత్న విభూషితమ్/
వైష్ణవం పురుష వ్యాఘ్ర నిర్మితం విశ్వకర్మాణా/
ఆమోఘః సూర్యసంకాశో బ్రహ్మ దత్తః శరోత్తమః//
(పురుష శ్రేష్ఠుడవైన ఓ రామా! స్వర్ణ రత్న భూషితమైన ఈ ధనస్సు విష్ణుమూర్తిది.
దీనిని విశ్వకర్మ నిర్మించాడు.
సూర్యునితో సమానంగా ప్రకాశిస్తున్న,అమోఘమైన ఈ ఉత్తమ శరము బ్రహ్మ దేవుడు ఇచ్చినది).
ఈ విధంగా పరశురాముని ద్వారా స్వీకరించిన వైష్ణవ ధనస్సును, వరుణుని వద్ద న్యాసముంచి, తిరిగి వనవాసంలో, వరుణుని అంశయే అయిన అగస్త్యుని ద్వారా,రాక్షస సంహారం కోసం రాముడు స్వీకరించాడు.
ప్రస్తుత కథాంశమునకు వద్దాం.
భార్గవ రాముడు వెళ్లిన పిమ్మట, వైష్ణవ ధనస్సును వరుణునకు ఇచ్చి, శ్రీరాముడు, వశిష్ఠుడు మొదలైన మహర్షులకు నమస్కరించాడు.
విహ్వల హృదయంతో ఉన్న తండ్రితో, నమస్కారపూర్వకంగా ఇలా అన్నాడు.
"తండ్రీ!పరశురాముడు వెళ్లినాడు. మనము అయోధ్యాభిముఖంగా ప్రయాణం చేద్దాము.
మీరు సైన్యాన్ని ఆజ్ఞాపించండి"
శ్లో//గతో రామ ఇతి శ్రుత్వా హృష్ట: ప్రముదితో నృపః/
పునర్జాతం తదా మేనే పుత్ర మాత్మాన మేవచ//
(దశరథ మహారాజు రాముని మాటలు విని,ఆనందంతో అతనిని కౌగలించుకొని శిరస్సుపై మూర్కొన్నాడు.
పరశురాముడు వెళ్ళిపోయాడు అన్న మాటవిని పరమానందభరితుడయ్యాడు.
తను, రాముడు మళ్లీ పుట్టినట్లుగా భావించాడు).
పిదప అందరూ ప్రయాణం చేసి అయోధ్య చేరుకున్నారు.
కౌసల్యా, సుమిత్రా, కైకేయీ లు కొత్త కోడండ్రు,జనకమహారాజు కుమార్తెలైన సీతా ఊర్మిళలను,జనకమహారాజు తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలైన మాండవీ, శ్రుతకీర్తులను సాదరముగా స్వీకరించారు.
వారిని దివ్యాంబరములతోను,
పుష్పమాలికలతోను, భూషణములతోను,మంగళ కరమైన ద్రవ్యములతోను అలంకరించారు.
ఆ కొత్త కోడండ్రచేత గృహ దేవతలకు పూజలు చేయించారు.
నమస్కరింపదగిన పెద్దలందరకు నమస్కరింపజేశారు.
ధన, ధాన్యములను,గోవులను ఆ రాజకుమార్తెలచేత బ్రాహ్మణులకు దానం ఇప్పించారు.
శ్లో// గోభిర్ధనైశ్చ ధాన్యైశ్చ తర్పయిత్వా ద్విజోత్తమాన్/
రేమిరే ముదితాః సర్వా భర్త్రుభిః సహితా రహః//
(ఆ విధంగా గోవులతోను,ధన,ధాన్యాదులతోను, బ్రాహ్మణోత్తములను సంతృప్తి పరచి, పిదప ఆ రాజకుమార్తెలు తమ తమ భర్తలతో రహస్యంగా క్రీడించి ఆనందించారు).
రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ఆనందంగా వైవాహిక జీవితాన్ని అనుభవిస్తూ, తల్లిదండ్రులను సేవలతో సంతృప్తి పరుస్తూ, తండ్రి ఆజ్ఞలను పాటిస్తున్నారు.
ఆ తరువాత కొంతకాలానికి భరతుడు తన మేనమామ యుధాజిత్తుతోను,తమ్ముడు శత్రుఘ్నునితోను కలిసి, తల్లిదండ్రులు, రామ లక్ష్మణుల అనుమతితో, మాతామహుడైన కేకయమహారాజు దగ్గర కొన్నాళ్ళు ఉండటానికి వెళ్ళాడు.
రామ లక్ష్మణులు, రాజకార్యములలో తండ్రికి సహాయపడుతూ,ఆయాకాలములలోచేయవలసిన విధులు నిర్వర్తిస్తూ, తల్లిదండ్రులను, గురువులను, పౌరులను, సంతోష పెడుతున్నారు.
(సశేషం)
శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.
. ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః
శుభమస్తు.
తూములూరి మధుసూదనరావు.
1-4-'26
