1, ఏప్రిల్ 2026, బుధవారం

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*బుధవారం 1 ఏప్రిల్ 2026*


       *శ్రీ మహావిష్ణు పురాణం*

`` *44వ భాగo*```


*హయగ్రీవ రాక్షస సంహారం*``


బ్రహ్మా ఇంద్రాది దేవతలు వైకుంఠంలో నారాయణుని యోగనిద్రనుంచి మేలుకొలపటానికి ప్రయత్నించి విఫలమయ్యారు. పరమశివుని సహాయం చేయమని మనస్సులో కోరుతూ సంకల్పించి ప్రార్ధించారు. మహేశ్వరుడు ప్రత్యక్షంకాగా బ్రహ్మదేవుడు పరిస్థితిని వివరించి విష్ణువుని నిద్రలేపడంలో సహాయం చేయమని అర్ధించాడు.


వింటికి శిరస్సు ఆనించి యోగనిద్రలో ఉన్న విష్ణువుని చూసి శివుడు బ్రహ్మతో “బ్రహ్మదేవా వింటితాడుని కొరికే కీటకాన్ని ఒకటి సృష్టించి విష్ణువు దగ్గరకు పంపు! ఆ పురుగు వింటితాడుని కొరికి తెంచగానే ఆశబ్దానికి విష్ణువు యోగనిద్ర నుంచి బయటకు వస్తాడు” అని సూచించాడు. 


సరేనని బ్రహ్మ వింటితాడు కొరికే 

పురుగును సృష్టించి పంపాడు.


ఆ పురుగు వింటి వద్దకు పాకుతూ వెళ్లి వింటితాడు పై ఎక్కి పైకి వెళ్లింది. పురుగు కదలికతో విల్లు కదలి వింటితాడు విష్ణువు శిరస్సు వద్దకు వచ్చింది. గట్టిగా బిగించి కట్టిన వింటి తాడు పైకొసను పురుగు కొరికింది. వింటితాడు పెద్ద శబ్దం చేస్తూ తెగి సర్రున విష్ణువు శిరస్సును కోసివేసింది. తెగిన విష్ణువు శిరస్సు ఎగిరి సముద్రంలో పడిపోయింది. విష్ణువు మొండెం మాత్రం శేషతల్పం పైన మిగిలింది. 


చూస్తున్న బ్రహ్మాది దేవతలు హాహాకారాలు చేశారు. సహాయం కోరి వచ్చిన తామే శ్రీహరి కంఠం తెగగొట్టారు. విష్ణువే లేకపోతే లోకాలను, దేవతలను రక్షించే వారెవ్వరు అని దుఖించసాగారు. శివుడు వారిని ఓదారుస్తూ “శ్రీహరి శిరస్సు తెగడం వెనుక మనకి 

తెలియని కారణముంటుంది. జగత్తులో కారణము లేకుండా ఏ కార్యము జరుగదు. జగన్మాతను ప్రార్ధించుదాము. ఆమె అనుగ్రహించి తరుణోపాయం చెబుతుంది" అనడంతో

బ్రహ్మాది దేవతలు శ్రీ సూక్త మంత్రాలు పఠిస్తూ జగదంబను స్మరించారు. జగన్మాత దేవతల ప్రార్థనలు ఆలకించి అంతరిక్షంలో ప్రత్యక్షమై "దేవతలారా హయగ్రీవ రాక్షసుడు తనలాంటి అశ్వశిరస్బు గల వీరుని చేతిలోనే మరణం పొందే వరం పొంది ఉన్నాడు. అందుకే లక్ష్మీదేవి శాపం వలన శ్రీహరి శిరస్సు తెగిపడింది. మీరు అశ్వపు శిరస్సు తెచ్చి విష్ణువు మొండానికి అతికించండి.


శ్రీహరి హయగ్రీవ అవతారం ధరించి హయగ్రీవ రాక్షసుని అంతం చేస్తాడు. పిదప మీరు శతృంజయ యజ్ఞం పూర్తి చేసి యజ్ఞఫలం విష్ణువుకి అర్పించండి. శ్రీహరి హయగ్రీవ రూపం పోయి విష్ణు రూపము పొందుతాడు" అని పలికి అదృశ్యమయ్యింది.


జగన్మాత మాటలకు ఊరట చెందిన దేవతలు అశ్వశిరస్సు తెచ్చి విశ్వకర్మ చేత విష్ణువు మొండానికి అతికించారు. బ్రహ్మ ప్రాణప్రతిష్ఠ మంత్రాలతో అభిషేకించగానే హయగ్రీవ అవతారములో విష్ణువు యోగనిద్ర నుండి లేచాడు. బ్రహ్మాది దేవతలను చూసి "మీకు అభయం ఇస్తున్నాను. హయగ్రీవ రాక్షసుని వధించి వస్తాను. అతని వద్ద నున్న వేదాలను బ్రహ్మకు తిరిగి అప్పగిస్తాను" అని పలికి హయగ్రీవ రాక్షసుని కోసం బయలుదేరి వెళ్లాడు.


హయగ్రీవ రాక్షసుడు నివసించే నగరానికి వెళ్లి యుద్దానికి రమ్మని సవాలు చేశాడు. హయగ్రీవ రాక్షసుడు భీకర సకిలింపులు చేస్తూ యుద్దభూమికి వచ్చాడు. తనలాగానే ఉన్న విష్ణువు హయగ్రీవ రూపం చూసి ఆశ్చర్యం చెందాడు. తను కోరినట్లు మృత్యువు హయగ్రీవ రూపం దాల్చి రాలేదు కదా అని అనుకున్నాడు.


ఖచ్చితంగా దేవతలు తనను చంపడానికి ఈ హయగ్రీవుని పంపారు అని నిశ్చయించుకుని ద్వంద్వ యుద్దానికి దిగాడు. ఇరువురి మధ్య భీకర పోరు మొదలైంది. రాను రాను రాక్షస హయగ్రీవుని శక్తి సన్నగిల్లసాగింది. దానవసంహారి విష్ణువే హయగ్రీవ రూపంలో వచ్చాడు అని అర్ధమైంది. హయగ్రీవ విష్ణువు రాక్షస హయగ్రీవుని మెడ పట్టుకుని తన శిరస్సుతో వాడిశిరస్సును బలంగా పదేపదే కొట్టి కుమ్మి రాక్షసుని శిరస్సును ఛిన్నాభిన్నం చేశాడు. తల పగిలి రక్తం ధారగా కారుతుంటే హయగ్రీవ రాక్షసుడు నేలపై పడి గిలగిలాతన్నుకుంటూ ప్రాణాలు వదిలేశాడు.


దేవతలు పుష్పవర్షం కురిపించారు కోపం తగ్గిన మహాలక్ష్మి హయగ్రీవ స్వామి చెంతకు వచ్చింది. దేవతల ప్రార్థనపై హయగ్రీవ అవతారంలో మహాలక్ష్మి సమేతుడై మహావిష్ణువు ఆ క్షేత్రంలో వెలిశాడు. బ్రహ్మకు వేదాలను తిరిగి ఇచ్చాడు.


ఇంద్రుడు శతృంజయ యాగంలో హయగ్రీవస్వామిని యజ్ఞపురుషుడిగా చేసి యాగం సుసంపన్నం చేశాడు. యజ్ఞ ఫలం హయగ్రీవ స్వామికి అర్పించి యజ్ఞ హవిర్భాగాలు ఇంద్రాదిదేవతలు స్వీకరించి బలవంతులు అయ్యారు. యజ్ఞఫలం పొందిన హయగ్రీవ స్వామి తన శ్రీమన్నారాయణ రూపం తిరిగి పొందాడు. లక్ష్మీదేవితో కలసి వైకుంఠం వెళ్లగా శివుడు కైలాసం, బ్రహ్మదేవుడు బ్రహ్మలోకానికి పయనమయ్యారు. దేవతలు శక్తి సంపన్నులై స్వర్గంలోకంలో ఉండసాగారు.


ఇంద్రుడు స్వర్గాధిపతి అయిన సుఖంగా లేడు. మనస్సులో హిరణ్యకశిపుడు చేసే ఘోర తపస్సు పై చింత కలిగిఉన్నాడు. తపస్సు ఏ క్షణమైనా ఫలించి బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడు కోరిన వరాలు ఇవ్వవచ్చును. హిరణ్యకశిపుని తపస్సు భగ్నంచేయడానికి చేసిన ప్రయత్నాలు అన్ని విఫలం అయ్యాయి.


                   *(సశేషం)*

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: