2, సెప్టెంబర్ 2022, శుక్రవారం

వక్రములను తొలగించే గణపతి

 వక్రతుండ నామార్ధం


గణపతికి వక్రతుండుడని పేరు. వక్రతుండ అనగానే వంకర తొండము కలవాడని చెప్పేస్తారు, కానీ నిజానికి అది వక్రతొండం కాదు, వక్రతుండం. వక్రానాం తుండయతి ఇతి వక్రతుండః అని అంటున్నది గణేశపురాణం. వక్రములను తుండనము చేయువాడు వక్రతుండుడు. వక్రములంటే దుష్టశక్తులు, దురలవాట్లు, చెడు సంస్కారాలు, పాపౌ ఆలోచనలు, నీచభావనలు మొదలైనవి చెప్పుకోవచ్చు. దుష్టులను శిక్షించేవాడు కనుక గణపతి వక్రతుండుడయ్యాడు. గణపతి శాంత స్వభావుడు అయినా, దుష్టులపట్ల చండశాసనుడు, కాలుడు. తన తొండంతో దుష్టులను, అరిష్టాలను, గండాలను, దోషాలను ద్వంసం చేస్తాడు. దుష్టులంటే వ్యక్తులే అని భావించనవసరంలేదు. మనలో కూడా అనేక చెడు సంస్కారాలు, నీచపు ఆలోచనలు ఉంటాయి. వాటిని నాశనం చేస్తాడు కనుక గణపతికి వక్రతుండ అని పేరు. అంతేకాదు, మనలో చెడు తొలగించినా, మనం మంచిగానే ప్రవర్తించినా, ఎదుటివారు మనకు కీడు చేయవచ్చు. కనుక అటువంటి వారి వక్రమైన ఆలోచనల పాలిట కాలుడై, నంశింపజేయువాడు కనుక గణపతికి వక్రతుండ అన్న నామం వచ్చింది.


పిల్లలు దురలవాట్లకు లోనైనప్పుడు, తల్లిదండ్రులు గణపతికి వక్రతుండ నామంతో జపించి, అర్చించి, వేడుకుంటే, తప్పుత్రోవ పట్టిన పిల్లలు తిరిగి మంచిమార్గంలోకి వస్తారు. ఈ వక్రతుండ అన్న నామం చాలా మహిమాన్వితమైంది. తంత్రశాస్త్రంలో సదాచారతంత్ర విధానంలో 'ఓం వక్రతుండాయ నమః' అనే వక్రతుండ గణపతి మంత్రానికి ఒక బీజాక్షరం చేర్చి, జపిస్తారు. ఈ వక్రతుండ గణపతి మంత్రాన్ని గణపతి గురించి తెలిసినవారి వద్దనుంచి గ్రహించి జపించాలి. ఆ జపం చేయడం వలన ఉపాసకుడి పై చేసిన ప్రయోగాలు విఫలమవుతాయి. మనం ధార్మికంగా ఉన్నా, లోకమంతా వ్యతిరేకంగా మారి, మనపై యుద్ధానికి వస్తున్న సమయంలో, ఈ వక్రతుండ గణపతిని జపిస్తే, చాలా త్వరగా వక్రమైన ఆలోచనలు నశించి, మిత్రభావం ఏర్పడుతుంది. ప్రపంచంలో అల్లకల్లోలాలు, ఉత్పాతాలు, యుద్ధాలు ముంచుకొస్తున్న సమయంలో వక్రతుండ గణపతి మంత్రాన్ని జపిస్తే, తక్షణమే ఫలించి, లోకంలో శాంతి ఏర్పడుతుందని చెప్పారు. ఎప్పుడైనా ఆపదలు ముంచుకోస్తే, పరిస్థితులు చేజారితే, వెంటనే వక్రతుండ అనే నామంతో గణపతి స్మరించాలి. రక్షణ కలుగుతుంది. తొండం యొక్క ప్రస్తావన వచ్చింది కనుక గణపతికి ఉండే వంకర తిరిగిన తుండం ఓంకారానికి సంకేతం అని గుర్తుపెట్టుకోండి.


ఓం వక్రతుండాయ నమః


వక్రములను తొలగించే ఆ గణపతి మనలోని చెడు భావనలను తొలగించుగాకా

ఓం గం గణపతయే నమః

కామెంట్‌లు లేవు: