16, జూన్ 2021, బుధవారం

చరక సంహిత ఒక పరిశీలన

చరక సంహిత ఒక పరిశీలన 

దైవానుగ్రము వలన ఇటీవల నేను  అగ్నివేశ మహర్షి కృతము, చరక ప్రతి సంస్కృతము అయినట్టి చరక సంహిత అను ఆయుర్వేద గ్రంథ రాజమును తిలకించ తటస్తించింది. ఇదే నాకు మునుపు లభించిన ఈ సరికి ఆ గ్రంథ పఠనము, అవగాహనను కలిగి వుండేడి వాడను. నేను చూసిన కొంత మటుకు అందరితో పంచుకొన తలంచి ఇది లిఖించుచున్నాను. 

మన మహర్షుల మేథా శక్తిని మనం యెంత స్తుతించినా తక్కువే అవుతుంది. సంస్కృత భాషలోని మూల ప్రతిని తెలుగులో సర్వులకు అర్ధమగు రీతిలో బ్రహ్మ శ్రీ పండిత నుదురుపాటి విశ్వనాధ శాస్త్రి గారు అనువాకము చేసినారు. వారు ఈ గ్రంథ పరిచయము గూర్చి విఫులముగా 13 పేజీల ఉపోధ్గాతాము వ్రాయటం విశేషము.  అందు గ్రంథ పరిచయం చేయుటయే కాక విశేషించి ఆయుర్వేద శాస్త్రము ఈ భువిపైకి వచ్చిన, తెచ్చిన వైనం దాని పరిణామ క్రమము నిశిత విశ్లేషణ గావించినారనుటలో అతిశయోక్తి లేదు. 

స్వర్గ లోకమున ఇంద్రునికడ యున్న ఆయుర్వేద శాస్త్రమును భూలోకమునందు మానవాళికి చేతుర్విధ పురుషార్ధముల సాధనకు శరీరారోగ్యము కాపాడుకొనుటకు ఆయుర్వేదము దక్క వేరొండువడి లేదని తలంచి అంగీరసుడు, జమదగ్ని, వసిష్ఠుడు, మొన్నగు దేవ, బ్రహ్మ ఋషివర్యులు నొక సభ యొనర్చి స్వర్గమున నున్న ఇంద్రుని నుంచి ఇలకు తే సమర్థునిగా భరద్వాజ మహర్షిని పంప  తా వెళ్లి సహస్రాక్షుని వేడ ఆ శతక్రతువు మహర్షి ప్రతిభా విశేషములను గ్రహించి హేతు, లక్షణ, ఔషధ స్కంద త్రయాత్మకనైనట్టి  అద్దానిని ఉపదేశించుటయు జరుగగా  భరద్వాజ మహర్షి ఆయుర్వేద సుశిక్షితుడై భువికి వచ్చెను. దానిని అమ్మహర్షి అంగిరసాది ఋషులకు సమర్మముగా ఉపదేశించ అద్దానిని అనుసరించి ఋషులు తమ ఆరోగ్యములను కాపాడుకొనుచు తమ తమ తపస్సులకు అంతరాయము కలుగక దీర్గాయువు నొందిరి. 

అట్టి తరి తపోధనుడైన యాత్రేయుడు అద్దానిని భూలోకమున బహుళ వ్యాపకమొనరింప అగ్నివేశుడు, ఖేలుడు, జాతకర్ణుడు, పరాశరుడు, హారీతుడు, క్షార పాణి అను నలుగురు శిస్యులకు సాంగముగా నుపదేశించెను. కాగా వారు నల్గురు వారి వారి పేర్ల వేరు వేరు తంత్రముల రచించిరి. తొట్ట తొలుతగా అగ్నివేశుడు అగ్నివేశతంత్రము యను ఆయుర్వేద తంత్రమును రచించెను. నయ్యది నూట ఇరువది అధ్యాయముల పరిమితిలో నుండెను. ఆ తంతంత్రమున " ఇత్యాధ్యయ శతం వింశమ్ ఆత్రేయ ముని వాగ్మయం హితార్థం ప్రాణినాం ప్రోక్తం అగ్ని వేసేన న ధీమతః " అని చెప్పబడినది. అగ్నివేశ కృతమైనట్టి ఆయుర్వేదమును చెరకుడు పునరసంస్కారము చేసెను.  అట్టిదే చెరక సంహిత. కాగా కాలాంతరమున పతంజలి మహర్షి అద్దానిని పునసంస్కారమొనర్చినట్లు చరక వాక్యత యగు చెక్రపాణి వ్యాఖ్యాన ఆరంభమున నాంది శ్లోకమున నుడివినట్లు తెలియుచున్నది. 

ఇవ్విధముగా వివరణలిస్తూ వ్యాఖ్యాత 13 పేజీల విశేష విశ్లేషణాత్మక వివరణలు సోదాహరణగా ఆయుర్వేద శాస్త్ర యుత్పత్తి గూర్చి వివరించి వున్నారు. 

ఈ గ్రంధము 1481 పేజీల నిడివి కలిగి యున్నది. అంతేకాదు అనేక రోగ విశేషములు తత్ నివారణలు తెలుపు తంత్రముల విషయ సూచిక 34 పేజీల నిడివి కలిగి ఉన్నదన్న ఈ గ్రంధములో ఎన్ని రోగ విశేషములు, తత్ నివారణ తంత్రములు ఉన్నవో చెప్పకనే చెప్పుచున్నవి. 

ఈ ప్రాచీన గ్రంథ రాజమును  బ్రహ్మ శ్రీ పండిత నుదురుపాటి విశ్వనాధ శాస్త్రి గారు ప్రతి శ్లోకమును తత్ తాత్పర్యమును అత్యంత నిశితముగా పేర్కొన్నారనుట ఈ గ్రంధము చదివిన వారనక మానరు. 

ఆనతి కాలములోనే ఈ గ్రంథ పఠన మొనర్చి సర్వులకు ఆ గ్రంథ గందమును పంచ ప్రయత్నించెదను. తత్ ద్వారా అనేక రోగముల బాపు తంత్రములను తెలియ చేయ మనస్సువిళ్లూరుతున్నది 

ఇట్లు 

బుధ జన విధేయుడు 

భార్గవ శర్మ 


కామెంట్‌లు లేవు: