15, ఏప్రిల్ 2026, బుధవారం

జలధారలు కనుగొను విధానం

 భూమియందు జలధారలు కనుగొను విధానం -

• బావిలో నీరు ఉప్పగా ఉండినను , బురదగా లేదా వగరుగా , దుర్గన్ధముగా ఉండినచో మద్దిచెట్టు బెరడు , తుంగ గడ్డలు , వట్టివేళ్లు , శొంఠి , బీర విత్తులు , ఉశిరిక పొట్టు , చిల్లగింజలు తీసుకుని మెత్తటి చూర్ణం చేసుకుని ఆ చూర్ణాన్ని బావినీటిలో కలిపిన ఆ బావినీరు తియ్యగా , శుభ్రముగా తయారగును. బావి వొడ్డున ఉశిరిక చెట్టు వేసినను బావినీరు తియ్యగా ఉండును.

• మనిషి శరీరమున సిరలు ఏవిధముగా రక్తమును తీసుకువెళ్లే విధముగా ఉండునో అదేవిధముగా జలనాడులు భుమియందు ఉండును. ఈ జలనాడులు పెద్దవి మరియు చిన్నవిగా ఉండును.

• పాతాళం నుండి పైకి వచ్చు జలనాడులను మహ సిరలు అనగా పెద్దగా జలతో కూడిన నాడులు అని అర్థం. దక్షిణదిశ , పశ్చిమ దిశ , ఉత్తరదిశ నుండి వచ్చు నాడులు శుభప్రధములు . ఆగ్నేయ , నైఋతి , వాయువ్య దిశల నుండి జలనాడులలో జల స్వల్పంగా ఉండును.

• నిర్జల ప్రదేశము నందు నీరు ప్రబ్బలి చెట్టు ఉన్న దానికి పడమర దిశలో మూడు మూరల దూరము నందు ఒకటిన్నర పురుష ప్రమాణం నందు పశ్చిమదిశ నుండి వచ్చు జలనాడి ఉండును. ముందుగా తెల్లటి కప్పు వచ్చును. ఆ తరువాత బండ వచ్చును. ఆ బండని చేధించిన పిమ్మట జలం ఉండును.

• పురుష ప్రమాణం అనగా 120 అంగుళములుగా లెక్కలోకి తీసికొనవలెను. మరికొన్ని గ్రంథాలలో పురుషుడు నీటిలోకి దుమికెప్పుడు తన చేతులను పైకి ఎత్తునప్పుడు 120 అంగుళములు ఉన్నచో దానిని పురుషప్రమాణముగా నిర్ధారించుకొనవలెను .

• నిర్జల ప్రదేశము నందు నేరేడు చెట్టు ఉన్నచో ఆ నేరేడు చెట్టుకు ఉత్తర దిశకు మూడు మూరలు దూరములో రెండు పురుష ప్రమాణంలో తవ్విన తూర్పు దిక్కు నుండి వెలువడు ఐంద్రి అను పేరుగల జలనాడి ఉండును. అందులో ఇనుపవాసన కలిగిన మృత్తిక ( మట్టి ) , తెల్లని కప్ప ఉండును.

• తోయరహిత ప్రదేశము నందలి నేరేడు చెట్టునకు తూర్పు దిశ యందు పుట్టయున్నచో దానికి సమీప దక్షిణ పార్శ్వమున రెండు పురుష ప్రమాణములు తవ్విన అందు మధుర జలం ఉండును. తవ్వు సమయమున అర్థ పురుష ప్రమాణం నందు ఒక చేప , పావురపు రంగు గల బండ , నల్లని మట్టి దాని క్రింద జలం ఉండును .

• జలహీన ప్రదేశము నందు అత్తిచెట్టు ఉన్నచో దానికి పడమట మూడు మూరల దూరంలో రెండున్నర పురుష ప్రమాణములు తవ్విన అందు ఒక పురుష ప్రమాణంబున తెల్లని సర్పము , నల్లని రాయి ఆ క్రింద తూర్పు దిశ నుండి మధురజలం స్రవించెడి జలనాడి ఉండును.

• నిర్జల ప్రదేశము నందలి నల్లవావిలి చెట్టుకు పుట్ట చుట్టుకుని ఉన్న దానికి దక్షిణ దిశ యందు మూడు మూరల దూరమున రెండుంబాతిక పురుష ప్రమాణము తవ్విన ఎన్నటికి ఎండిపోని జలనాడి ఉండును. అందు అర్థ పురుష ప్రమాణమున ఎర్రని చేప , దాని క్రింద కపిల వర్ణము గల మృత్తిక దాని క్రింద తెల్లని మృత్తిక దాని క్రింద ఇసుకయు ఆ క్రింద సున్నపు రాళ్ళను దాని క్రింద ఉదకము ( నీరు ) ఉండును .



ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .




కామెంట్‌లు లేవు: