*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
అనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము
*653 వ రోజు*
గౌతముడు ఇంద్రుడిని గుర్తించుట
గౌతముడు " మహాత్మా ! మీరు సామాన్యులు కారు సాక్షాత్తు దేవేంద్రులు. లేని ఎడల సకల లోకముల గురించి తెలియడం ఎలా సాధ్యం. దేవేంద్రా ! నీవు అన్ని లోకములు తిరుగుతుంటావు కదా ! నీవు పోకూడని లోకము ఏది ? " అని అడిగాడు. ఆ మాటలకు దేవేంద్రుడు సంతోషించి " మహాత్మా నీకు ఏమి కావాలో కోరుకో " అని అడిగాడు. గౌతముడు " దేవేంద్రా ! నేను ఈ ఏనుగును బిడ్డలా పెంచుకున్నాను దీనిని నా వద్ద ఉండనివ్వు " అని వేడుకున్నాడు. ఇంద్రుడు " గౌతమా ! నాకు ఆ మాత్రము తెలియదా ! ఆ ఏనుగు చూడు ప్రేమతో నీ తల మీద తన తొండముతో తడుముతూ వాసన చూస్తుంది. నిన్ను నీ బిడ్డను ఎలా వేరు చెయ్యగలను. మారు వేషములో ఉన్న నన్ను దేవతలు సహితం గుర్తుపట్ట లేరు. నీవు నీ పుణ్యవశమున నన్ను గుర్తు పట్టగలిగావు. నీకు నీ ఏనుగుకూ స్వర్గలోకప్రాప్తి కలిగిస్తాను నీవు నీ ఏనుగుతూ స్వర్గలోకములో శాశ్వతంగా ఉండండి " అని స్వర్గలోకానికి ఆహ్వానించాడు. గౌతముడు ఆ ఆహ్వానాన్ని మన్నించి ఏనుగుతో స్వర్గలోకముకు వెళ్ళాడు " ఇదీ స్వర్గలోకము కథ అని భీష్ముడు చెప్పాడు.
తపోధర్మము
ధర్మరాజు " పితామహా ! మీరు తపోధర్మము గురించి చెప్పారు కదా ! తపోధర్మము కంటే మించిన ధర్మము మరొకటి లేదా " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ధర్మములన్నీ మంచివే అందులో తపోధర్మము మిక్కిలి శ్రేష్టము. తపస్సు అనగా ముఖ్యముగా మితంగా భుజించడం. ఒక సారి భాగీరధుడు బ్రహ్మసభకు వేళ్ళాడు. భాగీరధుడిని చూసిన బ్రహ్మ " నిర్మల తపస్సు చేస్తే కాని ఇక్కడకు రావడం సాధ్యము కాదు. ఎలాంటి తపస్సు చేయని నీవు ఎలా ఇక్కడకు వచ్చావు " అని అడిగాడు. భాగీరధుడు " బ్రహ్మదేవా ! నేను గోదానములు, భూదానములు, కన్యాదానము, రాజసూయయాగములు, అశ్వమేధయాగములు ఎన్నో చేసాను. కాని నేను అవి చేసినంత మాత్రాన ఇక్కడకు రాలేదు. ఒకసారి బ్రాహ్మణులు అంతా చేరి ఒక చోట యజ్ఞము చేస్తున్నారు. అప్పుడు వారి యజ్ఞానికి ఎన్నో అవరోధాలు కలిగాయి. నేను ఆ అవరోధాలు తొలగించి వారి యజ్ఞం సక్రమంగా జరిగేలా చూసాను. అందుకు వారు నన్ను " బ్రహ్మలోక ప్రాప్తి రస్తు " అని దీవించారు. అందుకని నేను బ్రహ్మలోకానికి వచ్చాను. నేను ఆకలిదప్పులు మాని బ్రాహ్మణులకు సేవ చేసాను. అందుకు మించిన తపస్సు ఏదైనా ఉందా " అని అన్నాడు. ఆ మాటలు విన్న బ్రహ్మదేవుడు భగీరధుడిని ఎంతో ఆదరించాడు. ధర్మనందనా ! నీవు కూడా బ్రాహ్మణులను భక్తితో సేవింపుము " అని అన్నాడు భీష్ముడు.
ఆశీర్వాదము ఆయుస్షు
ధర్మరాజు " పితామహా ! శ్తాయుష్మాన్భవ అనేది వేద వాక్కు కదా ! అయినా చాలామంది అల్పాస్కులుగా మరణించాడానికి కారణం ఏమిటి ? ఆయుస్షు వృద్ధి చెందడానికి కారణం ఏమిటి ఆయుస్షు క్షీణించడానికి కారణం ఏమిటి ? " అని అడిగాడు. భీష్ముడు ధర్మనందనా ! సదాచారము, నియమబద్ధ జీవితము ఆయుస్షును పెంచి వాడికి సంపదలు, కీర్తి కలిగిస్తుంది. దురాచారము, నియము లేని జీవితము ఆయువును క్షీణింపజేస్తుంది. సృష్టిలోని సమస్త భూతములు వాడిని తిరస్కరిస్తాయి. కనుక సదాచారము నియమబద్ధంగా జీవించుట మంచిది. ఉత్తములు నడచుమార్గమున నడిచిన నియమబద్ధ జీవితము అలవడుతుంది.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి