ॐ శ్రీ హయగ్రీవ జయంతి శుభాకాంక్షలు.
జ్ఞానానంద మయం దేవం
నిర్మల స్ఫటికాకృతిమ్ I
ఆధారాం సర్వవిద్యానాం
హయగ్రీవ ముపాస్మహే ॥
అనంతాత్మకుల రంగారావుగారి పత్రికా వ్యాసం 👇
హయగ్రీవుడు జ్ఞానానికి, వివేకానికి, బుద్దికి, వాక్కుకు దేవుడు.
శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవ జయంతి సందర్భంగా అసలు హయగ్రీవుడూ, ఆయన వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకొందాం!
హయగ్రీవుడు హయము. అంటే ‘గుర్రము’. గుర్రం ముఖంగా కలవాడు అని అర్థం.
ఈయన తెల్లని శరీరచ్చాయతో, నాలుగు చేతులతో వెలుగొందుతున్నాడు. ఆ నాలుగు చేతులలో, శంఖము, చక్రము, పుస్తకం, అభయ హస్తంతో ఉంటూ భక్తుల మనోభీష్టాలు నెరవేరుస్తుంటాడు.
ఆయనను మన మందరం —
”జ్ఞానానందమయం దేవం,
నిర్మల స్పటికాకృతమ్ I
ఆధారం, సర్వవిద్యానాం
హయగ్రీవ ముపాస్మహే ॥” అని ఆరాధిస్తుంటాము.
మహా విష్ణువు స్వరూపమే హయగ్రీవుడు!
ఋషులు అందరూ సూతమహర్షిని సందర్శించి, ”మహర్షీ! ఋషి పుంగవా! విష్ణువు హయగ్రీవ రూపాన్ని ఎందుకు పొందవలసి వచ్చింది? వివరించండి!” అనగానే, సూతమహర్షి,
”ఒకసారి శ్రీ మహావిష్ణువు రాక్షసులతో పదివేల సంవత్సరాలు యుద్ధం చేయవలసివచ్చింది.
సుదీర్ఘ కాలం యుద్దం చేసేసరికి, ఆయన బాగా అలసిపోయి, విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించి,
ఆదమరుపుగా ఉన్న సమయంలో శత్రువులు ఎవరైనా దాడి చేస్తారేమోనని భావించి, దేవాదిదేవుడు ధనస్సుకు త్రాడుకట్టి, బాణాన్ని, ఒకదానిని సంధించి, దానిపైనే తన చుబుకాన్ని ఆనించి, విశ్రాంతి తీసుకోసాగాడు.
ఆ సమయంలో దేవతలందరూ, మహా యజ్ఞం చేయడానికి ఏర్పాట్లు చేసుకొంటున్నారు.
ఇంద్రుడు, బ్రహ్మ, శంకరుడు, దేవతలు విష్ణు భగవానుని దర్శన నిమిత్తం వెళ్ళగా, విష్ణువు మంచి యోగనిద్రలో ఉండడం చూసి, ఆయనను మేల్కొల్పడం ఎలా? అని ఆలోచిస్తుం డగా,
శంకరుడు ”దేవతలారా!” ఎవరికైనా నిద్రాభంగం చేయడం నిషిద్ధం. అయితే యజ్ఞకార్యం సుసంపన్నమగుటకు, స్వామిని, మేల్కొల్పవలసి ఉంది. కాబట్టి ఆ కార్యాన్ని బ్రహ్మ నిర్వర్తిస్తారు.” అనగానే,
బ్రహ్మ ”వమ్రి” (చెదపురుగు)ను సృష్టించాడు. అపుడు బ్రహ్మ ఆ కీటకాన్ని ఉద్దేశించి ”ఓ! కీటకమా! నువ్వు వెళ్ళి, ధనస్సు త్రాడును కొరికేస్తే, ధనస్సు, వంగి, కదలిక వల్ల విష్ణువు మేల్కొంటారు.” అని ఆజ్ఞాపించగా,
ఆ కీటకము ”అయ్యా! లక్ష్మీవల్లభుడు, భగవంతుడు, నారాయణుడు అందరికీ ఆరాధ్యుడు. ఆ జగద్గురువు ను నేనే ఎందుకు నిద్రలేపాలి? ఆ త్రాడు కొరకడం చాలా అసహ్యకరమైన పని. ఆ పని చేస్తే నాకేమి ప్రయోజనం? ఆయన నిద్ర నుండి మేల్కొన్న తర్వాత, నన్ను శపించ వచ్చుకదా!’ అని అడిగింది.
అప్పుడు బ్రహ్మ ”ఓ! కీటకమా! నీకు యజ్ఞ భాగం ఇస్తాము. అంతే కాకుండా ప్రతీసారీ యజ్ఞమునందు ”హవనము” చేసే సందర్భంలో యజ్ఞవాటిక చుట్టూ ఆ హవిష్యము పడుతూంటుంది. అదీ. నీ భాగమే.” అని వరం ఇస్తున్నాను అన్నాడు.
దాంతో ఆ ”వమ్రి” ధనస్సుకు కట్టిన అల్లెత్రాడును కొరకగానే, ధనస్సు. బంధం విడిపోయి దానికి ఎక్కుపెట్టి ఉన్న బాణం విష్ణువు తలను తాకేసరికి, అది ఎక్క డికో ఎగిరిపోయింది.
ఆ త్రాడు తెగిన సందర్భంలో భయంకరమై న శబ్దము, చీకటి ఆవరించింది. ఆ చీకటి వల్ల తల ఎక్కడ పడింది? గుర్తించలేకపోయి, దేవతలందరూ దు:ఖంతో ఉండగా,
బ్రహ్మ ”దేవతలారా! ఇది విధి ప్రేరేపితం. మనందరం జగన్మాతను ప్రార్థిస్తే మనకు తరుణోపాయం చెబుతుంది” అని అందర్నీ అమ్మ వారిని స్థుతించమనగానే, దేవతలు అందరూ అలా చేసిన కొద్దిసేపటికి జగన్మాత ప్రత్యక్షమై, బ్రహ్మ, పరమేశ్వరుడు ద్వారా జరిగిన వృత్తాంతం తెలుసుకొని,
జగన్మాత- హయగ్రీవుడు అనే రాక్షసుడు అమ్మ వారి గురించి ఘోరమైన తపస్సు చేసాడు.
అప్పుడు లలితా పరాభట్టారిక ప్రత్యక్షమై, ”ఏమి వరం కావాలో కోరుకోమన”గానే నాకు ఏ ప్రాణివల్ల మరణం సంభవించకూడదు” అనగానే- ”పుట్టిన ప్రతీ ప్రాణి మరణించక తప్పదు. అది కుదరదు. వేరే ఏదైనా వరం కోరుకోమంటే ”నాకు నారూపంతో (గుర్రపు తల) ఉన్నవారితో మాత్రమే మరణం సంభవించాలని కోరాడు.
ఆ హయగ్రీవ రాక్షసుని సంహారం నిమిత్తం శ్రీ మహావిష్ణువు హయగ్రీవుడుగా మారాలి. అందుకని తూర్పు దిశగా వెళ్ళి గుర్రపు తలను తీసుకొచ్చి అతి కించండి” అని చెప్పి అంతర్థానమయ్యింది.
వెంటనే తూర్పు దిశగా వెళ్ళి, గుర్రపుతలను తెచ్చి, అతికించి, అమ్మవార్ని, విష్ణువును స్తోత్రం చేయగానే హయగ్రీవుడు ఆవిర్భవించాడు.
ఆరోజే శ్రావణ పౌర్ణమి. అందుకే ప్రతీ శ్రావణ పౌర్ణమికి హయగ్రీవ జయంతి జరుపుకొంటున్నాము.
మధుకైటభులు అనే రాక్షసులు ఒకసారి బ్రహ్మ వద్దనున్న వేదాలను దొంగలించి, పాతాళ లోకంలో భధ్రపరచారు. బ్రహ్మ కోరిక మేరకు విష్ణువు హయగ్రీవ రూపంలో పాతాళ లోకానికి పోయి, అక్కడ సుదీర్ఘమైన ప్రణవధ్వని చేసాడు. ఆ ధ్వని విన్న మధుకైటభులు ఆ దిశగా పరుగెట్టారు. హయగ్రీవుడు. మరోవైపు వెళ్ళి, అక్కడ గట్టిగా బంధించి ఉంచబడిన వేదాలను కనుగొని, తీసుకువచ్చి, బ్రహ్మకు అప్పగించారు.
మనం లలితాసహస్రనామ పారా యణ చివరిలో ” ఇతి బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే ,శ్రీహయగ్రీవాగస్య్త సంవాదే శ్రీ లలితా రహస్యనామ ఫలనిరూపణ:” అని ఉండడం చూస్తాం.
ఒకసారి అగస్త్య మహర్షి ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశం వరకు తీర్థయాత్రలు చేస్తూ మనుషులు పడుతున్న కష్టాలను గమనించి, వారిని రక్షించడానికి కంచిలోని ఏకామ్రేశ్వరుని ఆలయ సమీపంలో ఘోరమైన తపస్సు చేయగా,
హయగ్రీవ రూపంలో ఉన్న మహావిష్ణువు ప్రత్యక్షమై, అగస్త్యుని కోరిక మేరకు శ్రీ లలితా సహస్రనామావళినీ, అందులో ప్రతీనామ మహాత్మ్యాన్నీ వివరించాడు.
ఇలా హయగ్రీ వుడు మనకు చాలా సందర్భాలలో కనిపిస్తా డు.
ఆయన జయంతి రోజున ఆయనను స్మరించి ఆయన కృపకు పాత్రులవుదాము.
– అనంతాత్మకుల రంగారావు
7989462679
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి