పోతనగారి కవితా చిత్రపటం!!
"ప్రాచీన పద్యకవులలో పోతనదొక విలక్షణమైన బాణి.అతడుచెప్పదలచిన కవితావస్తువు నొకచక్కని దృశ్యముగా మలచి పాఠకులముందుంచుట పోతనలోనిప్రత్యేకత!
మకరిచేతజిక్కిన గజేంద్రుని రక్షించుటకు బోవు నాశ్రీహరి రాకను భక్తితో ననురక్తితో వీక్షించుచున్న దేవతల
దిదృక్షా సంరంభమును వర్ణించిన ఈపద్యములొక చక్కని అక్షరచిత్రపటమును రచియించినవి.
"వినువీధిన్ జనుదేరగాంచిరమరుల్ విష్ణున్, సురారాతి జీ
వనసంపత్తి నిరాకరిష్ణు, కరుణావర్ధిష్ణు, యోగీంద్రహృ
ద్వనవర్తిష్ణు, సహిష్ణు, భక్తజనబృంద ప్రభవాలంకరి
ష్ణు, నవోఢల్లస దిందిరాపరిచరిష్ణున్, జిష్ణు,రోచిష్ణునిన్;
భాగ-8స్కం.105 ప.
"చనుదెంచెన్ ఘను డల్లవాడె,హరి, పజ్జంగంటిరేలక్ష్మి,శం
ఖనినాదంబదె, చక్రమల్లదె, భుజంగద్వంసియున్వాడె, క్ర
య్యన నేతెంచె నటంచు, వేల్పులు "నమోనారాయణాయేతి" ని స్వనులై మ్రొక్కిరి, మింట హస్తిదురవస్థావక్రికిన్ చక్రికిన్!!
భాగ-8స్కం.107ప.
మొదటిపద్యంలో పోతన తన శబ్దాలంకారప్రియత్వంవెల్లడిస్తో అసమాపకక్రియాప్రయోగాలతో , శ్రీహరి యెంతవేగంగా వెళుతున్నాడో సూచించాడు.
రెండవ పద్యంలో పోతన తనచిత్రీకరణమారంభించాడు.ఆకవితాదృశ్యాన్ని మీరుగూడా ఒకసారి మనోనేత్రాలతో వీక్షించండి.
" , అదిగదిగో శ్రీహరిసరిగాచూడండి, అదిగోఅతనిప్రక్కనున్నఆమెయే లక్ష్మి, అదో శంఖము, అదిగో చక్రము, అడుగో గరుత్మంతుడు.అంటూఆకాశంలో నిలచి దేవతలందరూ ఆశ్రీమన్నారాయణునకు ఫాలవిన్యస్త హస్తులై నమస్కరిస్తున్నారట!!.
అపూర్వమైన ఆదృశ్యమును పోతన తొలుత తానుదర్శించి,పిదపమనచే దర్శింపజేయుచున్నాడు.అహో!మనదెంతటి మహాభాగ్యము!!
ఇట్టి మనోజ్ఞకవితాదృశ్యములు నాన్యతోదర్శనీయములనుట యదార్ధమేకదా??.🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి