పరమాచార్యుల దుఃఖం
పరమాచార్య స్వామివారు ఒకరోజు ఉదయం చెన్నైలోని మ్యూసిక్ అకాడమి నుండి పశ్చిమంగా నడుచుకుంటూ వస్తున్నారు. అది బహుశా 1964 - 1965 ప్రాంతం అనుకుంటా. మహాస్వామి వారితో పి.జి. పాల్ & కొ నిలకంఠ అయ్యర్, శ్రీమఠం శివరామ అయ్యర్, పానాంపట్టు కణ్ణన్, శ్రీకంఠన్, రోయపురం బాలు మరియు నేను ఉన్నాము. దారిలో పది ఇరవై మంది దాకా భక్తులు మాకు తోడయ్యారు.
గోపాలపురం వైపు వెళ్ళే మలుపులో స్వామివారు నన్ను పిలిచి, “వెనుక అక్కడ కిరాణా కొట్టు దగ్గర తలపై శిఖతో నోటినుండి పొగ వదులుతూ ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు కదా చూశావా? అతని వద్దకు వెళ్లి పరవాక్కరై శ్రౌతిగళ్ గురించి అడిగి రా” అని చెప్పారు. నేను అతని వద్దకు పరిగెత్తాను. అతను ఆ కొట్టుకు వేలాడదీసిన తాడు చివరన ఉన్న నిప్పుతో బీడి అంటించుకుంటున్నాడు. అతని వద్దకు వెళ్లి అడిగాను,
“ఓయ్! నీకు పరవాక్కరై శ్రౌతిగళ్ తెలుసా?” అని.
అతను కాస్త కంగారు పడి, చేతిలోని బీడి క్రింద పడేసి “మీరు ఎవరు? ఎందుకోసం అడుగుతున్నారు?” అని అడిగాడు.
“ఆచార్య స్వాములు కనుక్కోమన్నారు. . .”
“పెరియవా? ఎక్కడా?”
“అక్కడ” అని నేను చేయి చూపించే సరికి అతను పరుగు లంకించుకుని అటువైపుగా వెళ్ళిపోయాడు. నేను కొద్దిసేపు వేచిచూసి, స్వామివారికి చెప్పాను “నేను అతణ్ణి అడిగాను. ఏమి బదులు చెప్పకుండా పారిపోయాడు” అని.
స్వామివారు మౌనంగా గోపాలపురం వైపు కదిలారు. కొద్దిదూరంలో, ప్రహరీ అవతల చక్కని పందిరి వేసి తోరణాలతో అలంకరించారు. భక్తులు స్వామివారిని పూర్ణకుంభంతో స్వాగతించారు. పెద్ద భవంతి ముందర ఉన్న నాలుగు మెట్లు ఎక్కగానే వరండా మూలలో స్వామివారు ఆసనం వేయించుకుని కూర్చున్నారు.
భక్తులు స్వామివారికి నమస్కరించి సెలవు తీసుకున్నారు. కార్యాలయాలకు వెళ్ళాలి కాబోలు! స్వామివారు లేచి లోపలి పోయేంతలో నుదుటిపై విభూతి రేఖలతో, చేతులు ఎదపై ఎలాపడితే అలా పెట్టిన విభూతితో, నడుముకు ఒక టవల్ చుట్టుకుని వచ్చిన ఒక వ్యక్తి వచ్చి స్వామివారికి సాష్టాంగం చేసి నిలబడ్డాడు.
స్వామివారు మరలా కూర్చుని నన్ను చూపిస్తూ, “ఎవరతను?” అని అడిగారు. “కొద్దిసేపటి క్రితం పరమాచార్య స్వామివారే ఈ వ్యక్తి ద్వారా నాకు పరవాక్కరై శ్రౌతిగళ్ తెలుసేమో కనుక్కుని రమ్మని పంపారు”. “అవును నేను పరవాక్కరై శ్రౌతిగళ్ మనవడిని. నా పేరు ప్రణతార్థి”
“ప్రణతార్థి అని పలకవద్దు. అది స్వామివారి పేరు. ప్రణతార్థి హరణ్ లేదా హరణ్ అని చెప్పు. తనని నమస్కరించిన వారి పీడలను పోగొట్టే స్వామీ ఆయన. అది ఆ నామము యొక్క అర్థము”
“అందరూ నన్ను ఇలాగే పిలుస్తారు. అలవాటయిపోయింది”
“నువ్వు ఇలా ఉండడానికి కారణం ఏంటి? అధ్యయనం(వేదాధ్యయనం) చేశావా?”
“తాత గారు సామము నేర్పించారు”
ఒక సామవేద పన్నమును ఉదాహరిస్తూ “ఏది ఈ సామ పన్నం చెప్పు” అన్నారు. రెండు మూడు వాక్యాలు చెప్పగలిగాడు. అతని సామగానము పెద్ద కంఠంతో మంచి సమ్మోహన శక్తితో చాలా దివ్యంగా ఉంది.
“తరువాత గుర్తులేదు” అన్నాడు.
“నీ తోడబుట్టిన వారు పెద్దవారా? చిన్నవారా?”
“ఇద్దరూ పెద్దవారు. వారు ఇంగ్లిషు చదువులు చదివి ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. నా స్వరం బావుండడంతో తాత గారు సామవేదం నేర్పారు. నాకు అది ఇష్టం లేదు అందుకే ఇంటి నుండి పారిపోయాను”
“ఇప్పుడు ఏమి చేస్తున్నావు?”
“నేను పోలీసులకు సహాయపడుతుంటాను”
“పోలీసులకు సహాయమా? ఏమి సహాయం చేస్తావు?”
“వారు నన్ను న్యాయస్థానాలకు తీసుకుని వెళతారు. నేను సాక్ష్యం చెబుతాను. వారు డబ్బులిస్తారు. . .”
“ధూమపానం ఎలా అలవాటు అయ్యింది?”
“వాళ్ళతో వెళ్ళినప్పుడు ఎక్కువ మోతాదులో కొంటారు. నాకు రెండు మూడు ఇచ్చేవారు”
“నువ్వు చూసినవాటినే న్యాయస్థానంలో చేబుతుంటావు. అవును కదా?”
“నేను ఏమి చూడలేదు. వారు ఇలా చెప్పమని చెబుతారు. నేను అదే చెప్తాను”
“న్యాయవాదులు ఎక్కువ ప్రశ్నలు వేస్తారు కదా!”
“అవును. అందుకే పోలీసులు నన్ను హత్య జరిగిన స్థలానికి తీసుకుని వెళ్లి అది ఎలా జరిగిందో విపులంగా చెబుతారు. నేను ఇక్కడ నిలబడ్డాను; ఇంతమంది ఉన్నారు; నేను చూస్తున్నాను; హంతకుడు తూర్పు వైపుగా పరిగెత్తి వెళ్ళాడు; చేతిలో కొడవలి ఉంది; అందులో నుండి రక్తం కారుతోంది; ఇలా నాకు నేర్పిస్తారు. ఎన్నో కేసుల్లో సాక్ష్యం చెప్పాను కాదా. నాకు అనుభవం ఉంది. లాయరు నన్ను ఎంత తికమక పెట్టినా, నేను అంతే తెలివిగా సమాధానం ఇస్తాను. రెండు మూడు సార్లు మాట తడబడ్డాను. అప్పుడు నన్ను పోలీసులు బాగా కొట్టారు”
“కోర్టుకు వెళ్ళేటప్పుడు చొక్కా అవి వేసుకుంటావా?”
“లేదు లేదు. దానికి పోలీసులు ఒప్పుకోరు. నేను పెద్ద పెద్ద విభూతి పట్టలు పెట్టుకోవాలి. సబ్బు పెట్టి నా యగ్నోపవీతాన్ని తెల్లగా ఉంచుకోవాలి. నడుముకు తుండు కట్టుకోవాలని కూడా ఆదేశిస్తారు”
“ఇలా సాక్షిగా మారడం తప్పు కాదా?”
“అవును పాపమే. నాకు బాగా తెలుసు. కాని నాకు ఇక దారి లేదు”
“అలాగా! మరి ఒక దారి చూపిస్తాను. చేస్తావా?”
“దయచేసి సెలవివ్వండి”
“మైలాపూర్ లో కపాలీశ్వర దేవాలయం ఉంది. సాయింత్రాలు అక్కడకు వెళ్ళు. పడమర గోపురం దగ్గర రోజూ చత్త ఊడ్చి, నీళ్ళు చెల్లు. నీకు పది రూపాయలు, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయిస్తాను”
“ఈ ఊడిగాలు, ప్రసాదాలు అవన్నీ నాకు పడవు”
“దేవాలయ ప్రసాదం కాదు. రోజుకొక భక్తుని ఇంట నీ భోజనం ఏర్పాటు చేస్తాను. నువ్వు ఆ పది రూపాయలతో రాత్రిపూట తిను”
“నాకు అవన్నీ సరిపడవు. నావల్ల కుదరదు”
“అంత ఆత్రుత ఎందుకు? మఠంలో రెండు రోజులు ఉండు. చంద్రమౌళిశ్వర పూజ చూడు. పూజ అయిన వెంటనే నీకు ఆహారం ఏర్పాటు చేయిస్తాను. తరువాత ఆలోచించి చెప్పు”
“ఈరోజు నాకు కుదరదు. ఎగ్మోర్ కోర్టులో ఒక పెద్ద కేసు ఉంది. నేను అక్కడకు సాక్ష్యం చెప్పడానికి వెళ్ళకపోతే, నా వీపు విరగ్గొడతారు. నన్ను వెళ్ళనివ్వండి” అని అతను వెళ్ళిపోయాడు.
ఆ ప్రహరి దాటి వెళ్లిపోఏంతవరకు అలా చూస్తుండిపోయారు. తరువాత స్వామివారు లేచి లోపలకు వెళ్ళారు. నిలకంఠ అయ్యర్, నేనూ వెనకాతలే వెళ్ళాము. స్వామివారు తిరిగి చూశారు. నిలకంఠ అయ్యర్ చిన్నగా అన్నారు, “మహాస్వామి వారు అంతగా చెప్పినా అతను వినిపించుకోలేదు”
“అలాగే ఉండని. జనాలకు తప్పుడు సాక్ష్యం చెప్పడం అలవాటు చేశారు ఈ పోలీసులు” అన్నారు స్వామివారు.
అందుకు నిలకంఠ అయ్యర్ “వారు మాత్రం ఏం చేస్తారు? పట్టపగలే అంతమంది ముందు ఒక హత్య జరిగినా కూడా ఎవరూ సాక్ష్యం చెప్పడానికి ముందుకురారు. అది ఎవరు చేశారో తెలిసి కూడా ఎవరూ సాక్షిగా రావడానికి ఒప్పుకోరు. అందరికి వాళ్ళ వాళ్ళ పనులు ఉన్నాయి. పోనీ అలా వెళ్ళినా ఈ లాయర్లు వారిని పదే పదే కోర్టుల చుట్టూ తిప్పుతారు. తీరా నిందితుడే ఒప్పుకున్నా, సాక్ష్యం లేదని కేసు కొట్టేస్తారు. తరువాత పొలిసు వ్యవస్థ సరిగా లేదని. కనుక వారికి తప్పుడు సాక్ష్యం చెప్పించడం తప్ప వేరే దారి లేదు”
“ఓహో! నేరం చెయ్యడం మొదటి తప్పు. చూసి కూడా సాక్ష్యం చెప్పడానికి రాకపోవడం రెండవ తప్పు. చూడనివారిని సాక్ష్యంగా తయారుచెయ్యడం మూడవ తప్పు. ఈ తప్పులను సమర్తిచడం మరొక తప్పు”
“మహాస్వామి వారు నన్ను మన్నించాలి. ప్రపంచంలో జరుగుతున్నడి నేను తెలిపాను అంతే”
“ఇది మరీ బాధాకరం. ఇదంతా ఒక బ్రాహ్మణుని విషయంలోనా! తప్పుడు సాక్ష్యం చెప్పినా ఒక బ్రాహ్మణుడు చెబుతున్నాడు అంటే కోర్టు కూడా నమ్ముతుందనే కదా పోలీసులు ఇలా చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ! ఆ శ్రౌతి మనుమడు ఇలా . . .”
“మహాస్వామి వారు చేప్పినదేదీ అతని చెవిన పడలేదు”
“చెప్పాడు కదా. కోర్టుకు వెళ్ళకపోతే పోలీసులు కొడతారు అని. అతడెంచేస్తాడు”
“పరమాచార్యుల వారు చాలా క్లేశ పడుతున్నారు. మేమేమైనా చెయ్యగలమా?”
“ఒక సన్యాసి తన మనస్సులో సుఖదుఖాలకు కష్టనష్టాలకు తావివ్వకూడదు అని మీకు తెలుసు కదా” అని స్వామివారు స్నానానికి వెళ్ళిపోయారు.
మధ్యాహ్నం మూడు గంటలప్పుడు పూజగది పక్కన ఉన్న వరండాలో నేను పడుకుని ఉన్నాను. “రామా!” అని అరుపు వినబడడంతో లేచి వచ్చాను. మేలూర్ మామ - రామచంద్ర అయ్యర్ - మహాస్వామి వారి పూజా పర్యవేక్షకులుగా ఉన్నారు. చాలా సంప్రదాయం పాటించే మనిషి. పూజ సహాయకులకు ఆయన సింహస్వప్నం. పూజకట్టులో చిన్న పొరపాటును కూడా సహించరు. దేవతా మూర్తులను లోపల పెట్టి తాళం వేసిన తరువాత కూడా వాటిని పర్యవేక్షిస్తుంటారు.
వారు లోపల నుండి పెద్ద ఇత్తడి గిన్నెతో బయటకు వచ్చారు. నన్ను అక్కడ చూసి రమ్మని సైగ చేశారు.
“ఉదయం పరమాచార్య స్వామివారితో పాటుగా వచ్చావా?” అని అడిగారు.
“అవును వారితోపాటే వచ్చాను”
“అప్పుడు ఏమైనా జరిగిందా?”
“ఏమిలేదు”
“లేదు. ఏమో జరిగింది. మహాస్వామి వారు ఈరోజు పూజ చెయ్యలేదు”
“అలాగా! అది ఏం జరిగిందంటే. . .” అని పరవాక్కరై శ్రౌతిగళ్ మనవడి గురించి మొత్తం జరిగినదంతా చెప్పాను. చేతిని నుదిటిపై బాదుకుంటూ ఆయన చలించిపోయారు. అప్పుడే స్వామివారు అటువైపుగా వచ్చారు. నేను నమస్కరించాను.
“మేలూర్ మామ ఏం చెప్పాడు. చూస్తె ఈరోజు భోజనం చేసినట్టు లేదు. ఏమైనదో కనుక్కున్నావా?” అని అడిగారు.
నేను కళ్ళు తుడుచుకున్నాను. “నాతో ఎదో చెప్పాలని అనుకుంటున్నావు కదా! చెప్పు మరి”
“నేనేమి చెప్పగలను పెరియవా! శ్రీధర అయ్యవాళ్ శ్లోకం ఒకటి స్ఫురించింది”
“అయ్యవాళ్ శ్లోకమా? భక్తి రసంలో ముంచుతుంది. ఏది చెప్పు ఒకసారి”
“త్వన్ నామధ్యేయ రసికాః తరుణేందు మౌళే
దుఃఖం న యాన్తి కిమపీతి హి వాదమాత్రం
దేశమీకిల స్వవిపతీవ వహంతి దుఃఖం
త్రుకోకరీభవతి దుఖాని జంతుమాత్రే”
“మరొక్క సారి చెప్పు!” నేను మరలా చెప్పాను. “అర్థం కూడా చెప్పు చూద్దాం”
“తలపై నెలవంకను ధరించిన స్వామి ఎవరో ఆ స్వామి పేరు శివా శివా అని తలచిన వారికి దుఃఖము కలగదు అని. కాని వారు కూడా ఇతరుల కష్టములను చూసి చలించిపోతారు. అదేదో ఆ కష్టము వారికే వచ్చింది అన్నట్టుగా”
“సరిగ్గా చెప్పావు. ఇందులో నువ్వు ఒకటి గమనించావా?”
“దేని గురించి? నాకు తెలియదు”
“ఇక్కడ “తరుణేందు మౌళే” అని అంటున్నాడు. అది మన చంద్రమౌళీశ్వరుడే. వారి గురువు అయిన బోధేంద్ర సరస్వతీ పూజించిన చంద్రమౌళీశ్వరుని పైనే ఇలా కీర్తించాడు” అని చెప్పి స్వామివారు తాదాత్మ్యం చెందారు.
నేను స్వామివారికి ఒక విషయం చెప్పదలచుకున్నాను. అది చెప్పి ఉంటే అది అపచారము అయ్యి ఉండేదేమో. అందుకే ఇక్కడ చెబుతున్నాను.
వేరొకరి బాధలకు చలించిపోయే మాహామనీషి పుట్టబోతున్నాడని మూడువందల యాభై సంవత్సరాల క్రితమే శ్రీధర అయ్యవాళ్ చంద్రమౌళీశ్వరునికి చెప్పుకున్నాడు.
--- వి. విశ్వనాథ ఆత్రేయన్, మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1
అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి