17, జనవరి 2021, ఆదివారం

తామరాకు మీద నీటిబొట్టు

 *తామరాకు మీద నీటిబొట్టు*


భగవద్గీతలో కృష్ణపరమాత్మ అర్జునుడితో ‘కర్మను చేయడంలోనే నీకు అధికారం... ఫలంపై లేదు. కర్మఫలానికి నువ్వు కారణం కారాదు. అలాగని కర్మల్ని చేయడం మానవద్దు’ అని బోధిస్తాడు.


అందుకే మన పెద్దలు తామరాకు మీద నీటిబొట్టులా మనిషి మసలుకోవాలని, కర్మకు బద్ధుడు కాకూడదని హితవు చెబుతారు. తామరాకుపై నీటిబొట్టు తామరాకును అంటుకోదు, పట్టుకోదు. అలాగే మనిషీ నిష్కామ బుద్ధితో, నిస్వార్థ బుద్ధితో కర్మలు నిర్వర్తించాలి.


కర్తవ్య నిర్వహణ పట్ల బాధ్యత ఉండాలి తప్ప బంధం, ఆశ పనికిరావు. బాధ్యతతో సక్రమంగా కర్తవ్య నిర్వహణ చేసినప్పుడు ఆ పరిపూర్ణత తప్పక తృప్తినిస్తుంది. కర్మఫలాలపై మనకెలాంటి అధికారం లేదు. కాబట్టి వాటిని భక్తితో, వినయంగా పరమాత్మకు అర్పించాలి.


కర్మబంధం వదిలించుకోవడానికి కర్మాచరణను మాననవసరం లేదు, ఫలాపేక్షను వదిలి నిస్సంగంగా విధ్యుక్త కర్మను ఆచరించు- అని గీతాచార్యుడు బోధిస్తున్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడి బోధనలు విన్న అర్జునుడు కర్మను వదిలేయలేదు. ఉత్సాహంగా గాండీవాన్ని చేపట్టాడు. విజయుడయ్యాడు.


‘గృహస్థుగా కర్తవ్య కర్మలు అనుష్ఠించి తామరాకు మీద నీటిబొట్టులా, నీటిమీద పయనిస్తున్న నావలా మసలుకునే వ్యక్తికి సంసారమనే బురద అంటదు. ఆ వ్యక్తి జీవన్ముక్తుడే’ అంటారు సద్గురువులు. దేహాభిమానం వదిలేసి వస్తు విశేషాలతో మానసిక సంబంధం పెట్టుకోకపోవడం వల్లే జనకుడు, నిష్కామ కర్మ ద్వారా అంబరీషుడు... ముక్తిని పొందారు.


మనం ఆచరించే సత్కర్మలు సత్ఫలితాన్ని, దుష్కర్మలు దుష్ఫలితాల్నీ ఇస్తాయి. అవి ఎప్పుడు ఎలా అందాలని ఆ భగవంతుడు నిర్దేశిస్తాడో అలాగే అందుతాయి. వాటికై ఎదురుచూడకూడదు. ఫలాపేక్ష విషయంలో ఎంత విరక్తి చూపగలిగితే కర్మను అంత సమర్థంగా, ప్రశాంతంగా ఆచరించగలుగుతాం.


తామరాకు మీద నీటి బిందువులెన్ని పడినా ఆకు తడవదు. అలాగే కష్టాలు ఎన్ని వచ్చినా మనిషి చలించరాదని పెద్దల మాట. ఇది చెప్పినంత తేలిక కాదు కదా అనిపిస్తుంది.  పురాణ పురుషులే ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. శ్రీరాముడు సతీవియోగాన్ని తట్టుకోలేకపోయాడు. వేదవ్యాసుడు పుత్రశోకాన్ని భరించలేకపోయాడు. రావణబ్రహ్మ తన కుమారుల మరణానికి ఎంతగానో కుంగిపోయాడు. కష్టాలు వచ్చినప్పుడు దుఃఖం అనివార్యం. కాని దుఃఖ వివశత్వంతో మనల్ని మనం కోల్పోకూడదు. సుఖం ప్రతి ఒక్కరికీ సంతోషదాయకమే. కాని అది శాశ్వతమనే భ్రమలో పడకూడదు. ఈ సుఖదుఃఖాలకు అతీతంగా ఉండాలంటే మనిషి నిశ్చల మనస్కుడు కావాలి.


నిశ్చల మనస్తత్వం కలిగిన మనిషి నిందలకు భయపడడు. పొగడ్తలకు పొంగిపోకుండా అన్నింటినీ సమభావనతో చూస్తాడు. ఆ మనిషికి శోకం, సంతోషం ఉండవు. ఏ విపత్తు సంభవించబోతున్నదోనన్న భయం బాధించదు. ఆ మనిషి ఎలాంటి ప్రలోభాలకూ లొంగడు. ఎలాంటి పరిస్థితినైనా నిబ్బరంతో ఎదుర్కొంటాడు. ఆత్మతత్త్వం అలవరచుకుని ఆత్మజ్ఞానిలా ప్రకాశిస్తాడు. ఎల్లప్పుడూ తన మనసును, బుద్ధిని అంతర్యామిపై లగ్నం చేస్తాడు. సత్యనిష్ఠతో ముందుకు సాగి జీవితాన్ని తపస్సులా మార్చుకుంటాడు!

- విశ్వనాథ రమ

కామెంట్‌లు లేవు: