అన్నమాచార్య చరితము
ధర నారాయణసూరికి
హరిచింతన నెపుడుసేయు యా లక్కమకున్
పురప్రముఖులు యాత్మీయులు
పరిణయమును జేసిరంత బహు విభవమునన్
ఎంతయో యన్యోన్యంబుగ
సంతసమున జీవయాత్ర సాగుచు నుండన్
యెంతటి భాగ్యము లున్నను
సంతానము లేని లోటు తారస పడియెన్
నారాయణసూరి తిరుమల పయనము
సంతు లేక వారు సంతాప మొందియు
యిలను దైవతంబు యింటివేల్పు
తిరుమలేశుడైన శ్రీ వేంకటేశుని
దర్శనంబుసేయ తరలి రంత
తిరుమలందు వారు దివ్యపుష్కరణిలో
పుణ్య మజ్జనంబు పొంది పిదప
తొలివరాహు జూచి ఫలముల నర్పించి
దేవమందిరముకు జేరి రంత
శ్రీవేంకటేశుని దివ్య మందిరమందు
నారాయణయ్యయు లక్కమాంబ
మూలవిరాట్టును ముదమార గాంచియు
గోవింద యనుచును గొంతు కలిపి
ముడుపులు గట్టిన మూటల నర్పించి
తీర్థ ప్రసాదముల్ దీసుకొనిరి
దివ్య ధ్వజస్తంభ మెదుట యా లక్కమ
సాష్టాంగ దండంబు సల్పె నపుడు
యంత దివ్య కాంతి హరి దయ తోడను
వెలసి యచట మిగుల వైభవముగ
గరిమ లక్క మాంబ గర్భంబు నందున
శ్రీకరంబు గాను చేరె పోయె
✍️గోపాలుని మధుసూదనరావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి