16, జనవరి 2021, శనివారం

బ్రహ్మ జ్ఞానం

 



బ్రహ్మ జ్ఞానం వల్ల కలిగే ప్రయోజనం                                 [ఉపనిషత్తులు]


 


బ్రహ్మ జ్ఞానం కలగటం అనేది చాలా కష్టమైన పని. అట్లా అంత కష్టపడి సాధించాల్సిన అవసరం ఏముంది అనే సందేహం రావచ్చు. ఎందుకు బ్రహ్మ జ్ఞానం కావాలి, దాని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో ఈ మంత్రం తెలుపుతుంది.


 


స పర్యగా చ్ఛుక్రమకాయ మవ్రణమ్

అస్నావీరమ్ శుద్ధమపాపవిద్ధమ్ |

కవిర్మనీషీ పరిభూః స్వయమ్భూః

యాథాతథ్యతోర్థాన్ వ్యదధాచ్ఛాశ్వతీభ్యః సమాభ్యః || (8)


 


 


ఎవడైతే బ్రహ్మ జ్ఞానం పొందుతాడో వాడు బ్రహ్మన్(పరమాత్మ) స్థాయికి చేరుతాడు. ఆ స్థితి ఎలా ఉంటుందో తెలుపుతుంది ఈ మంత్రం. బ్రహ్మన్ అంటే పరమాత్మ, ఆయన "చ్ఛుక్రమ్"- పరిశుద్ధమైనవాడు, స్వచ్చమైన వాడు. జీవుడు ముక్తి పొందాక కర్మ తొలగి ఇలాంటి స్థితిని పొందుతాడు. పరమాత్మ దయ వల్లే ఇది లభించాలి తప్ప మరొక మార్గం లేదు. "అకాయమ్" - ఆయన దేహం లేనివాడు, అంటే మన వంటి మురికి స్రవించే పాంచభౌతిక దేహం కాదు, ఆయనది పంచ ఉపషణ్మయ దివ్య మంగళ విగ్రహం . "అవ్రణమ్" - రోగాలు, వ్యాదులు అంటని శరీరం. "అస్నావీరమ్"- ప్రేగులు నరాలు ఉండే దేహం కాదు. కనుక "శుద్ధమపాపవిద్ధమ్" ఆయన దేహం పాప పుణ్యాలకు అతీతమైనది. పరమాత్మ తత్త్వాన్ని ఎవడైతే గుర్తిస్తాడో వాడూ అట్లాంటి స్థితినే పొందుతాడు. వాడు వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు దర్శించగలుగుతాడు. కర్మ తొలగుతుంది కాబట్టి అట్లాంటి స్థితి ఏర్పడుతుంది, కర్మ వల్ల ఏర్పడ్డ శరీరానికి హద్దులు ఎన్నో. మనం కంటితో అన్నింటినీ గుర్తించగలమా ? మన ఇంద్రియాలకు, ఊహకు ఉన్న శక్తి సంకుచితమైనది. ముక్తి పొందిన జీవుడికీ పరమాత్మ వలె జ్ఞానం అంతటా విస్తరించి ఉంటుంది. సూక్షమైన జ్ఞానం కలిగి ఉంటాడు. వాడు జ్ఞానం కోసం తపిస్తూనే ఉంటాడు. వాడి మనస్సు పూర్తి నియంత్రణలో ఉంటుంది.  వాడికీ కోరికలు ఉంటాయి, కానీ అవి పరమాత్మ మయమై ఉంటాయి. భగవంతుని సేవ చేయాలని కోరిక ఉంటుంది. వాడికీ కోపం ఉంటుంది, ఇతరత్రమైన విషయాల యందు. అట్లాంటి వాడికి మరణం అనేది ఉండదు, ఆ స్థితినుండి దిగజారడం అనేది ఉండదు. కర్మ బంధాలు తొలగి భగవత్ అనుభవాన్ని ఎప్పటికీ అనుభవిస్తూ ఉంటాడు.



 

కామెంట్‌లు లేవు: