16, జనవరి 2021, శనివారం

అన్నమాచార్య చరితము

 🌹అన్నమాచార్య చరితము🌹



అంతట యాశువు తోడను 

సంతసమున యన్నమయ్య శతకం బొకటిన్ 

వింతగ జెప్పెను తెలివితొ 

స్వాంతము పొంగగ తెలుగు సాహిత్య మునన్ 


శ్రీకరమగు దివ్య "శ్రీ వేంకటేశ్వర 

శతక " మొకటి జెప్పె సమ్మతిగను 

అందు తనివిదీర " యమ్మ" ను బొగిడియు

 సంతసంబు నొందె స్వాంత మందు


అమ్మ జెప్పిన రీతిగా యన్నమయ్య 

పాదరక్షలు విడనాడి భక్తి తోడ 

యేడుకొండల నెక్కియు నేక బిగిన 

చేరె తిరుమలక్షేత్రంబు చివరగాను 


శ్రీకరంబైనట్టి తిరుమల జేరియు 

           యానంద మొందెను యన్నమయ్య 

స్వామి పుష్కరణిలో స్నానంబు జేసియు 

            శ్రీ వరాహుని జూచె చిత్త మలర 

అచట వరాహుని యర్చించి భక్తితో 

            గాలిగోపుర స్థలి కడకు జనియె 

యా మహాద్వారంబు కానించి శిరమును 

            ప్రణతుల నర్పించె భక్తి తోడ 

ద్వారమును దాటి ముందుకు తరలి కదల 

దివ్యమౌ ధ్వజ స్తంభంబు తేజరిల్లి 

యెదుట కన్పించ నిండుగా విభవ మొప్ప 

యర్పణము జేసె నతులను యన్నమయ్య 


అంత ముందుకేగి యచ్చోట నెలకొన్న 

వకుళమాత దివ్య వంటశాల 

భక్తితోడ గాంచి ప్రణతుల నర్పించి 

తన్మయత్వqమునను దలచె మదిలొ 


చిద్విలాసుడైన శ్రీ వేంకటేశ్వరు 

మహితమైన దివ్య మందిరంబు,

యతిశయ మగుదివ్య యానందనిలయంబు 

గాంచె నన్నమయ్య కన్నులార 


మహిత మైనట్టి శిల్పపు మంటపములు 

సతత యగ్నుల వెల్గెడి సవన శాల 

వాహనంబుల నుంచెడి వసతి శాల 

నచట గాంచెను కనులార యన్నమయ్య



✍️గోపాలుని మధుసూదనరావు 🙏

కామెంట్‌లు లేవు: