16, జనవరి 2021, శనివారం

అన్నమాచార్య చరితము

 🙏అన్నమాచార్య చరితము 🙏


అంత శ్రీవారి హుండీలొ సంతసమున 

పంచ యందున ముడివేసి పదిల పరచి 

వెంట గొనితెచ్చి నటువంటి నొంటి కాసు 

భక్తితోడను యర్పించె పరవశమున 


అమిత భక్తితోడ యర్పించి కాసును 

యన్నమయ్య కదలి యచట నుండి 

యిలను స్వామివారు నెలకొన్న మందిర 

పసిడివాకిలికిని ప్రణతు లిడెను 


పసిడి వాకిలి దాటి పదపడి కదలియు 

           పరికించె కనులార పరవశమున 

కాంచన మణిమయ కటకాంగదములతొ

            విభ్రాజమానుడై వెలుగు చున్న 

మకరకుండల ద్యుతి మణిమయ మకుటంబు 

            తిరునామ శోభిత చిద్విలాసు 

శ్రీ వేంకటేశ్వర దివ్యమూర్తిని గాంచి 

            తనువెల్ల పులకించె తన్మయమున 

యుభయ కరములు జోడించి యొడలు పొంగ 

" యేడుకొండల దేవరా ! వేంకటేశ ! 

జన్మ ధన్యంబు నయ్యె నీ దర్శ నమున "

యనుచు ప్రణమిల్లె నేలపై యన్నమయ్య 


స్వామి దర్శన భాగ్యంబు తనర బొంది 

దివ్య తీర్థ ప్రసాదముల్ దీసుకొనియు 

భవ్య శఠకోప దీవెనల్ బడసి  యంత 

ప్రణతు లర్పించె ప్రభువుకు భక్తి తోడ 


ఏడుకొండల వేలుపు వేంకటేశు 

భక్తి మనసార ప్రార్థించి పరవశించి 

మందిరము నందు శ్రీ మహామంటపమున 

యపుడు విశ్రాంతి నొందెను యన్నమయ్య 


సుప్రభాత ద్యుతులు తోచెను దిక్కుల 

తెల్లవారె నపుడు తిరుమలందు 

యమిత భక్తితోడ యర్చకస్వాములు 

పలికి రపుడు సుప్రభాత వినుతి 


అన్నమయ్య లేచి యానంద డెందాన 

దివ్య పుష్కరణిలో తీర్థ మాడె 

సంతసమున మఱల స్వామిని దర్శించి 

పరిసరముల గాంచ బయట కొచ్చె 


✍️గోపాలుని మధుసూదనరావు🙏

కామెంట్‌లు లేవు: