16, జనవరి 2021, శనివారం

ప్రపంచమంతా పరమాత్మ దేహం

 ప్రపంచమంతా పరమాత్మ దేహం అని తెలిస్తే శోకం ఉండదు (7వ మంత్రం)                     [ఉపనిషత్తులు]


ప్రపంచంలో అన్నీ పరమాత్మ దేహంలో భాగాలే, పరమాత్మ అన్నింటిలో లోన బయట వ్యాపించి ఉన్నాడు కనుక.  కానీ మనిషికి ఎల్లప్పుడూ దుఃఖమే. దాన్ని ఎలా దూరం చేసుకోవాలో ఈ మంత్రం చెబుతుంది.


యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానతః |

తత్ర కో మోహః కః శోక ఏకత్వమనుపశ్యతః || (7)


లోకంలో నా అనుకున్నవాడు దగ్గరవుతే మోహం, దూరమైతే శోకం కలుగుతున్నాయి. ఇష్టం లేనిది దూరం పోతే సంతోషం, అది దగ్గరికి వస్తే భాధ కలుగుతుంది. "యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానతః" ఒకటే అందరికీ ఆధారం అని తెలిస్తే, ఇది వరకు మోహము, శోకము కలిగాయి కానీ ఈనాడు అందరి యందు "ఏకత్వమనుపశ్యతః" ఏకత్వ భావన కలిగితే కనిపించే వాటి యందు జాలి కలుగుతుంది తప్ప ద్వేషం కాదు. కాలిలో ముల్లు దిగితే చేయి అలా ఊరికే కూర్చుంటుందా ? వెళ్ళి తీసే ప్రయత్నం చేస్తుంది. అట్లానే ఒకడు శోకిస్తుంటే నీవూ వెళ్ళి వాడి శోకాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తావు. ఒకడికి కలిగిన ఆనందానికి నీవూ ఆనందించగలుగుతావు. ప్రత్యేకించి ఒక్కడి యందు కాదు, విశ్వం అందరి యందు కలిగినా ఆ భావం ఏర్పడుతుంది. వాల్మీకికి కౌంచపక్షికి భాణం కుచ్చుకుంటే ఏడుపు వచ్చింది. విశ్వం అంతా అట్లాంటి భావన ఉండాలి.


ఈ ప్రపంచంలో కనిపించేవన్నీ వాడివి అని గుర్తించినప్పుడు, వాడు నీ వాడైనప్పుడు ఇక నీవు కోల్పోయేది అంటూ ఏమి ఉండనే ఉండదు. ఇక మోహం ఎక్కడిది, శోకం ఎక్కడిది. ఈ భావన లేని నాడు మోహ శోకాలకు తావు ఉంది. పరమాత్మను గుర్తించిన నాడు అవి వాటంతట అవే దూరం అవుతాయి.


జనకుడు మిథిలానగరి రాజ కుమారుడు, యాజ్ఞవల్క్యుడి వద్ద విద్యాభ్యాసం చేస్తున్నాడు. గురువుగారికి జనకుడంటే ప్రియం. రాకుమారుడని అట్లా జనకులవారిపై ఇష్టం చూపిస్తున్నారని మిగతా శిష్యులు అనుకునేవారు. గురువు గారు వారి కళ్ళు తెరిపిద్దాం అని అనుకున్నారు. వారికున్న యోగిక శక్తిచే అక్కడ కుటీరంలో మంటలు కనిపించేట్టు మాయను చేసారు. అది చూసి శిష్యులంతా లేచి వాళ్ళ వాళ్ళ వస్తువులను కాపాడుకోవడానికి వెళ్ళారు, అసలు వారికి ఉన్న వస్తువులు అంటూ ఏమీ లేవు పెద్దగా. జనకుల వారు అక్కడే కూర్చొని ఉన్నారు. కాసేపటికి మిథిలానగరం తగలబడుతున్నట్టు కనిపించింది. అయినా జనకుల వారు అక్కడే ఉన్నారు, పెద్దగా పట్టించుకోలేదు. అసలు ప్రమాదం ఏమీ జరగలేదు అని శిష్యులంతా వచ్చి కూర్చున్నారు. గురువుగారు జనకుడిని అడిగాడు, మీ నగరం తగలబడుతుంటే  ఏమీ చేయడం లేదేమిటని. నావద్ద అగ్నికి కాలనిది, నీటికి తడవనిది, గాలికి చెదరనిది ఉంటుంటే ఏదో తగలబడుతుంటే నాకెందుకు అని అన్నాడు. బాహ్యమైన వస్తువుల యందు వారికి ఎట్లాంటి మోహం ఉండేదే కాదు. తనలో పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మే అంతటా ఉన్నాడు అని గుర్తించాడు.  ఈ విషయం గుర్తించడానికి జనకులవారు మనకు ఆదర్శం.

కామెంట్‌లు లేవు: