16, జనవరి 2021, శనివారం

అన్నమాచార్య చరితము

 🌹అన్నమాచార్య చరితము🌹


ప్రథమ ప్రాయమైన బాల్యంబు నుండియు 

యమిత ప్రజ్ఞుడైన యన్నమయ్య 

తల్లి దండ్రి వలన సంగీత పాండిత్య 

కళల నెల్ల నేర్చి  ఘనత గాంచె 


నారాయణ సూరంతట 

పారాయణ జేయుటకును బహువిధ నీతుల్ 

యూరిలొ గురుకుల మందున 

చేరిచె శ్రీ యన్నమయను స్థిర విద్య లకున్ 


అంత గురుకుల మందున యన్నమయ్య 

వేంకటేశ్వరు కృపవల్ల విమల మదితొ 

యనతికాలంబు నందునె యఖిలమైన 

వేదశాస్త్రంబులను నేర్చి విజ్ఞుడయ్యె 


         అన్నమయ్య  తిరుమల దర్శనము 


అన్నమయ్య తనదు యష్టమవయసులో 

కాలినడక తోడ కదలి వెడలి 

చేరె పట్టుదలతొ తిరుపతి పురముకు 

తాళ్లపాకనుండి తన్మయమున 


తిరుపతి గంగమ్మ దివ్యదర్శన మొంది 

              ప్రణతుల నర్పించె భక్తి తోడ 

కాలిద్రోవను బట్టి కనుమలు దాటుచూ 

              చేరగా సాగెను తిరుమలకును 

దుర్గమంబైనట్టి మార్గంబు నందున 

               యాగక నడువగా యలసటొచ్చె 

తడియారె గొంతుక దాహంబు గల్గగా 

               యత్యంత బడలికన్ యాకలయ్యె 

కనులు దిరుగుచుండ కాయంబువణుకగా 

యడుగు ముందుకేయ నలవిగాక 

నడువ శక్తిలేని తడబడు స్థితియందు 

యవనిపైన బడెను యన్నమయ్య



✍️గోపాలుని మధుసూదనరావు 🙏

కామెంట్‌లు లేవు: