12, మార్చి 2021, శుక్రవారం

మొగలిచెర్ల ప్రార్ధన..ఫలితం..*

 *ప్రార్ధన..ఫలితం..*


"అయ్యా..దత్తాత్రేయ స్వామి పుట్టినరోజు ఎప్పుడూ?.." అని దత్తజయంతికి నెల రోజుల ముందునుంచే..మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చే భక్తులలో చాలామంది అడిగే ప్రశ్న..దత్తజయంతి తాలూకు తేదీ ని వాళ్లకు చెపుతూ ఉంటాము.."ఆరోజుకు వస్తామయ్యా..స్వామిని దర్శించుకొని..ఇక్కడ ప్రసాదం తీసుకొని వెళతాము.." అని చెపుతుంటారు..మరికొందరు దత్తజయంతి రోజున అన్నదానానికి మేము కూడా సహకరిస్తాము..మాకూ అవకాశం ఇవ్వండి అని అడుగుతుంటారు..మొగిలిచెర్ల చుట్టుప్రక్కల గ్రామాల్లో కానీ..స్వామివారి మందిరాన్ని తరుచూ దర్శించుకునే వారి మదిలో కానీ..దత్తజయంతికి ఒక ప్రత్యేక స్థానం ఉంది..ఆరోజు మొగిలిచెర్ల స్వామివారి మందిరం ఒక పండుగ శోభను సంతరించుకుంటుంది..దత్తజయంతి అనేది మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయుడి పుట్టిన రోజుగా భావించేవారూ వున్నారు..ఆరోజు స్వామివారి పుట్టినరోజు అని చాక్లెట్ లు తీసుకొచ్చి మందిరం వద్ద భక్తులకు పంచడం కూడా ఒక ఆనవాయితీగా వస్తోంది..


మరి ఈ ఆచారాన్ని ఎవరు ప్రారంభించారో నావరకూ అవగాహన లేదు..నేను మందిర నిర్వహణ బాధ్యతలు తీసుకున్న తొలి సంవత్సరం (2004) లో కుతూహలం పట్టలేక ఒక భక్తుడిని అడిగాను.."చాక్లెట్ లు తీసుకొచ్చి ప్రసాదంగా ఇచ్చే అలవాటు ఎలా వచ్చింది..?" అని.."ఏమో స్వామీ..అందరూ తీసుకొస్తున్నారు..నేనూ తీసుకొచ్చి..మందిరం వద్ద పంచుతున్నాను.." అన్నాడు..అప్పటికీ సంతృప్తి చెందక..మా అమ్మగారిని అడిగాను.."అమ్మా..స్వామివారి మందిరం వద్ద దత్తజయంతి రోజు చాలామంది చాక్లెట్ లు తీసుకొచ్చి పందేరం చేస్తున్నారు కదా..ఈ పద్ధతి ఎలా వచ్చింది.. ?" అని..ఆవిడ పెద్దగా నవ్వి.."ఒకరు చెప్పింది కాదురా..ఏదో దత్తక్షేత్రం లో ఇలా పంచుతారని కొందరు అన్నారు..అదే పద్ధతి ఇక్కడ కూడా పాటిద్దామనుకొని..ఓ పది పన్నెండేళ్ల క్రితం కొందరు ఒక పాకెట్ చాక్లెట్ లు తీసుకొచ్చి..ఇక్కడున్న నలుగురికీ ఇచ్చారు..వాళ్ళను చూసి..మరికొందరు పంచారు..మరుసటి ఏటి కల్లా..ఆ పద్ధతి ఆచారమై పోయింది..సరేలే..వాళ్ళ ఉత్సాహాన్ని మనం ఎందుకు కాదనాలి అని మేము కూడా ఆ విషయమై పెద్దగా పట్టించుకోకుండా వదిలేసాము..అంతే తప్ప..ఇలా ఖచ్చితంగా చాక్లెట్ లు తీసుకురావాలి అని నియమం లేదు.." అన్నది..ఇక అంతటితో ఆ విషయం వదిలేసాను..


2005వ సంవత్సరం దత్తజయంతికి మధ్యాహ్నం పూట భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాను..అప్పటికి స్వామివారి మందిరం వద్ద అన్నదాన కార్యక్రమం మొదలుకాలేదు..ఆరోజుల్లో దత్తజయంతికి దూరప్రాంతాల నుంచి సుమారు ఐదారు వందలమంది భక్తులు వచ్చేవారు..స్వామివారి సమాధి దర్శించుకొని..తిరిగి వెళ్లిపోతూ ఉండేవారు..స్వామివారి మందిరం వద్ద భోజన ఏర్పాటు లేని కారణంగా ఇబ్బంది పడేవారు..ఈ పద్ధతి మార్చాలని అనిపించి..ముందుగా మా తల్లిదండ్రుల సలహా తీసుకున్నాను.."వనరు ఉంటే..ఏర్పాటు చెయ్యి..ముందుగా స్వామివారి సమాధి వద్దకు మీ దంపతులు వెళ్లి..మీ మనసులోని కోరికను తెలపుకోండి..ఆయన ఆశీర్వాదం ఉంటే..నీకు ఏ శ్రమా లేకుండా అన్నీ సమకూరుతాయి.." అని అమ్మ చెప్పింది..సరే అన్నాను..దత్తజయంతి అప్పటికి వారం రోజులు ఉన్నది..ప్రక్కరోజు ఉదయం స్వామివారి సమాధి వద్ద మేమిద్దరం నమస్కారం చేసుకొని.."స్వామీ..ఒక్క దత్తజయంతి నాడే కాకుండా..ఇక్కడ ప్రతి వేడుకకూ అన్నదానం జరిగేటట్టు మాకు అవకాశం కల్పించు తండ్రీ.." అని మొక్కుకున్నాము..


ఆరోజు సాయంత్రం ఐదు గంటల వేళ..ఒక భక్తుడు నూటాయాభై కిలోల బియ్యాన్ని తీసుకొచ్చి.."అయ్యా..స్వామికి ఇద్దామనుకున్నాను..తీసుకోండి.." అని మందిరం లో ఉంచి వెళ్ళిపోయాడు..ఆ బియ్యం తో ఆ సంవత్సరం దత్తజయంతికి అన్నదానం భేషుగ్గా జరపొచ్చు..ఆ ప్రక్కరోజే మరికొంతమంది భక్తులు..ఎవరో పిలిచినట్టు వచ్చి..కొంత నగదు రూపంలో..మరికొంత వస్తురూపం లో విరాళంగా ఇచ్చారు..రెండు మూడు రోజుల్లోనే..మా అంచనాలను మించి సరుకులూ..నగదూ సమకూరాయి..ఆ దత్తజయంతి రోజు ఏ ఇబ్బందీ లేకుండా..మధ్యాహ్నం మాత్రమే కాదు..ఆరాత్రికి స్వామివారి మందిరం వద్దకు వచ్చిన భక్తులకు కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేసాము..ఆసంవత్సరం నుంచీ..నేటిదాకా..ప్రతి దత్తజయంతికి అన్నదానం ఏలోటూ లేకుండా జరుగుతున్నది..భక్తుల రాకపోకలు కూడా గణనీయంగా పెరిగాయి..అలాగే సహకరించేవారూ వస్తున్నారు.. గత పది సంవత్సరాలుగా..దత్తజయంతి రోజు రాత్రికి..మొగిలిచెర్ల గ్రామ యువకులు స్వామివారి మందిరం వద్ద అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు..దత్తజయంతి రోజు అన్నదాన కార్యక్రమం లో తాము కూడా ఏదో ఒక విధంగా పాలుపంచుకుంటే..తమకు మేలు జరుగుతుంది అనే ఒక విశ్వాసం ఏర్పడిపోయింది..మీకూ ఆసక్తి ఉంటే..మీరూ సహకరించవచ్చు..


ఆనాడు మా అమ్మగారు చెప్పిన మాట.."స్వామివారి ఆశీర్వాదం ఉంటే..నీకు ఏ శ్రమా లేకుండా అన్నీ సమకూరుతాయి.." ఇప్పటికీ మా దంపతులకు గుర్తు ఉన్నది..అది అక్షరసత్యం కూడా..అలా దత్తజయంతి పండుగ కోసం మేము చేసిన ప్రార్ధన ను స్వామివారు ఆలకించి..ఫలితాన్ని ప్రసాదించారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: